Kaikala SatyanarayanaKaikala Satyanarayana

పురస్కారం అనేది కళాకారులకు గొప్ప గౌరవమే కాదు. రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లడానికి ఓ ఆయుధం. ఎనలేని ఎనర్జీని నింపే ఔషదం. అందుకే కళాకారులకు ఓ చిన్న పురస్కారం వచ్చినా కష్టానికి తగిన ప్రతిఫలం అనీ, నటనకు చక్కని గుర్తింపు అని ఆనందిస్తుంటారు.

తెలుగుతెరపై (telugu film industry) అద్భుతమైన నటన కనబర్చి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎందరో నటులు ఉన్నారు. అందులో కొందరు ప్రతిభ కొద్దీ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు (Film Awards) అందుకున్నారు. ప్రతిభ, గుర్తింపు ఉండీ ఎలాంటి పురస్కారాలకు నోచుకోనివారు కూడా ఉన్నారు. పలు సిఫార్సుల మేరకు కొందరు అవార్డులు అందుకున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అలానే అర్హత లేని వారికి కూడా అవార్డులు వస్తున్నాయనే నిరాధార విమర్శ కూడా ఉంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ ఎదురవుతూనే ఉన్నది. అలాంటి విమర్శే ఈ ఏడాది పద్మ పురస్కారాలు ప్రకటించినప్పుడు కూడా ఎదురైంది అని చెప్పాలి.

ఇవి నిరాధార విమర్శలే కావచ్చు. కైకాల (Kaikala Satyanarayana) లాంటి గొప్ప నటుడికి గుర్తింపు రావడంలేదు అనే ఆవేదనతో చేస్తున్న ఆరోపణలే కావచ్చు. కానీ సోషల్ మీడియాలో (Social Media) నేడు ఇదే చర్చ నడుస్తున్నది.

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) సినీ కెరీర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 60 ఏళ్లకుపైగా సినీ జీవితం… 750కు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు, ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపో గల ప్రతిభ… ఎలాంటి డైలాగ్‌నైనా అనర్గళంగా చెప్పగలిగే గళం, నవరస నటనాసార్వభౌముడు అని ముద్దుగా పిలిపించుకున్న కళామతల్లి ముద్దు బిడ్డ.. ఇన్ని అర్హతలు ఉన్న నటుడు పద్మ అవార్డుకు అర్హులు కారా? ఇదే ప్రస్తుత చర్చ నడుస్తున్నది.

సగటు తెలుగు ప్రేక్షకుడి ఆవేదన, రెండు రోజులుగా ప్రభుత్వాలను నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలివి. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన కైకాల సత్యనారాయణను పద్మ అవార్డుకు (Padma award) అర్హులు కారా? రాష్ట్ర విభజనకు ముందుగానీ, తరువాత కానీ ఆయన పేరును పద్మ అవార్డుకు ప్రభుత్వాలు ఎందుకు సిఫార్సు చేయలేకపోయాయి? ప్రతిభకు పట్టం కడితేనే కదా సినీ పరిశ్రమ మరింత కలర్‌ఫుల్‌గా ఉంటుంది అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం కొందరు ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. అంతే కాదు కైకాల లాంటి ఎంతోమంది సీనియర్లు ప్రతిభ ఉండి కూడా సరైన గుర్తింపునకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దీనిపైనే అనేక చర్చలు జరుగుతున్నాయి.

సోర్స్: సోషల్ మీడియా వాల్ నుండి

రాయచోటి వద్దు రాజంపేట ముద్దు
జిల్లా కేంద్రంపై నినదిస్తున్న జనసేన