ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవన్ కళ్యాణ్ అనుష్టుప్ యాత్రకు నాంది
లోక రక్షణ… ధర్మ పరిరక్షణ కోసం దుష్ట సంహారం చేసే స్వామిగా శ్రీ నారసింహ స్వామి ప్రసిద్ధి. అటువంటి ఉగ్ర నరసింహ స్వామివారి అనుగ్రహం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 32 నారసింహ క్షేత్రాల సందర్శన యాత్రను చేపట్టారు. ఈ యాత్రలో భాగం అయిన అనుష్టుప్ నారసింహ యాత్ర ఒక్కటి.
అనుష్టుప్ నారసింహ సందర్శన యాత్రను గోదావరి తీరాన ఉన్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
ఆలయ సందర్శన సమయంలో సంప్రదాయ వస్త్రాలు ధరించి, కాషాయం కండువా మెడలో వేసుకుని స్వామి వారి దర్శనం కోసం వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మొదట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ధ్వజ స్థంభం వద్ద మొక్కి పవన్ కళ్యాణ్ ఆలయ ప్రవేశం చేశారు.
అనంతరం ఆలయంలో పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపారు. సంకల్పం చెప్పుకొన్నారు. అనుష్టుప్ నారసింహ యాత్రలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను త్వరలోనే సందర్శించే శక్తి భగవంతుడు కలగజేయాలని జనసేనాని వేడుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రార్థించారు.
ప్రసిద్ధ క్షేత్రంలో విశేష పూజలు
యోగాసీనుడైన శ్రీ లక్ష్మీ సమేత నృసింహ స్వామి స్యయంభూ సాలగ్రామం విగ్రహంలో పద్మాసనుడై కోర మీసాలతో ప్రసన్న వదనంతో ధర్మపురి క్షేత్రంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఇక్కడే వున్న మరో ఆలయంలో ఉగ్ర రూపుడైన మరో నృసింహస్వామి వారి విగ్రహం ఉంది. ఇక్కడ శ్రీ రామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం కలిగిన శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది.
అనుష్టుప్ యాత్ర ప్రారంభ సందర్భంగా పవన్ కళ్యాణ్ క్షేత్రంలోని మిగిలిన ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు జనసేనాని పవన్ కళ్యాణ్’కి ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాలను అందించారు.
రాక్షస పాలన అరికట్టడమే నీ ధ్యేయమైనప్పుడు ఆ లక్ష్మి నారసింహుడి అండతో పాటు, ముక్కోటి దేవతల ఆశీస్సులు కూడా ఈ అంజనీపుత్రుడికి ఎప్పుడూ ఉంటాయి. శుభం భూయాత్.
జనసేనాని! రాక్షస సంహార శక్తి సిద్ధిరస్తు. అనుష్టుప్ యాత్రా ఫల సిద్ధిరస్తు!