నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఉదయం తొమ్మిదిన్నరకు సీఎల్పీ సమావేశం
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ బృందం
తెలంగాణ రాష్ట్రంలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సోమవారం కొలువుదీరనున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీప్రతినిధి బృందం గవర్నర్ (Telangana Governor) తమిళిసైని ఆదివారం రాత్రి కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించ వలసిందిగా కోరింది. సోమవారం ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం తర్వాత అధిష్ఠానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది గవర్నర్‌కు తెలియజయనున్నారు. పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం అన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తున్నది. పార్టీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు ఈ పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతనే అధికారికంగా సీఎం అభ్యర్థి పేరు వెలువడే అవకాశం ఉంది.
ఆదివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ కి 64 మిత్ర పక్షం సిపిఐ కి 1 వచ్చాయి. దీనితో సీపీఐతో కలిసి 65 స్థానాలను గెలుచుకొన్న కాంగ్రెస్, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించింది. డిసెంబరు 9న ఎల్.బి.స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని రేవంత్ గతంలో ప్రకటించినప్పటికీ అంతవరకు ఆగకుండా సోమవారమే ప్రమాణం చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌లో మకాం వేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపాదాస్‌మున్షీ, ఇన్‌ఛార్జి ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి తదితరులు ఆదివారం రాత్రికే ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే ఎమ్మెల్యేలందరూ చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో సోమవారం ఉదయం తొమ్మిదిన్నరకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశానికి డీకే శివకుమార్, బోసురాజు, అజయ్‌కుమార్, జార్జ్, దీపాదాస్‌మున్షీలు పరిశీలకులుగా హాజరవుతారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత సీఎల్పీ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్‌ను కలిసి అందచేసే అవకాశం ఉంది.
మరోవైపు ఎన్నికల సంఘం సీఈవో సోమవారం గవర్నర్‌ను కలిసి గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను సమర్పించేది ఉంది. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ కార్యక్రమం ఉంటుంది. సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇంకెవరైనా మంత్రులుగా కూడా ఉంటారా అనేది సోమవారం తేలనుంది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది.