ప్రముఖ సంఘసంస్కర్త, బ్రహ్మర్షిగా పేరు గడించిన శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు మచిలీపట్నంలో 160 సంవత్సరాల క్రితం అక్టోబర్ 01 న జన్మించారు.
వీరు ఎం.ఏ. పూర్తి కాగానే మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఇంగ్లీషు ఆచార్యునిగా పనిచేసారు. 1904లో కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాల (పి.ఆర్.కళాశాల) ప్రిన్సిపాలుగా ప్రమాణస్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగారు. 1911లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యారు. 1925లో మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేసారు. 1924లో బ్రిటిష్ ప్రభుత్వంచే నైట్ హుడ్ పురస్కారాన్ని పొందాడు. 1927లో పరిషత్తు మొదటి స్నాతకోత్సవంలో నాయుడును గౌరవ డాక్టరేటుతో రఘుపతి వెంకటరత్నం నాయుడుని సత్కరించింది.
కులవ్యవస్థ నిర్మూలన’కు రఘుపతి వెంకటరత్నం నాయుడు కృషి
మహిళా విద్యావ్యాప్తికై నాయుడు విశేష కృషిచేసారు. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించారు. అంతే కాక వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసారు. బ్రహ్మసమాజంలో చేరి, కాకినాడలో ఉపాసనా కేంద్రాన్ని నిర్మించారు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన ‘కులవ్యవస్థ నిర్మూలన’కు రఘుపతి వెంకటరత్నం నాయుడు కృషిచేసారు. మద్యనిషేధం కొరకు శ్రమించారు.
1923లో మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు మద్యనిషేధం బిల్లు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడి చేసారు. వేశ్యావృత్తి నిర్మూలనకు అవిరళ కృషిచేసారు. శుభకార్యాలలో భోగం మేళాల సంప్రదాయాన్ని వ్యతిరేకించారు. పీపుల్స్ ఫ్రెండ్, ఫెలో వర్కర్స్ అనే పత్రికలకు రఘుపతి వెంకటరత్నం నాయుడు సంపాదకత్వం నిర్వహించారు.
అయన చేసిన పలు సంఘ సంస్కరణలో ముఖ్యమైనవి వితంతు వివాహం, మహిళలకు విద్య, దేవదాసి దురాచార రూపుమాపటానికి ప్రయత్నం చేయటం, కులాల ఐక్యత, దళితుల శ్రేయస్సు కోసం పోరాటం, అనాథ బాలబాలికల కోసం కాకినాడలో ఒక అనాథాశ్రయ నిర్మాణం లాంటివి ఎన్నో ఉన్నాయి.
రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మ సమాజంలో చేరి పలు సంఘసంస్కరణలకు తెలుగు నేలపైన శ్రీకారం చుట్టిన మొట్టమొదటి వ్యక్తి. ఆ తరువాత రఘుపతి వెంకటరత్నం నాయుడు చేసిన కార్యక్రమాలను ముందుకు తీసుకోని వెళ్ళిన వారిలో ప్రముఖులు కందుకూరు వీరేశలింగం పంతులు.
బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు
వీరు సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా బ్రహ్మ సమాజం బ్రహ్మర్షి అనే బిరుదుతో రఘుపతి వెంకటరత్నం నాయుడుని సత్కరించింది. అలాగే వీరికి వచ్చిన మరిన్ని బిరుదులు శ్వేతాంబర ఋషి, అపర సోక్రటీసు, కులపతి, దివాన్ బహూద్దూర్, సర్ మరియు కైజర్-ఇ-హింద్.
వీరి సోదరుడు రఘుపతి వెంకయ్యనాయుడు కూడా తెలుగు నేలపైన చలన చిత్ర రంగం వెళ్ళూనుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేయటం జరిగింది. నేడు తెలుగు రాష్ట్రాలలో అయన సోదరుని పేరుతో ఉత్తమ చిత్రానికి ఇచ్చే బహుమతికి అయన పేరు పెట్టటం జరిగింది.
ఇలా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసి, తెలుగు నేలపైన పలు సంఘసంస్కరణలకు శ్రీకారం చుట్టిన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి 161 జయంతి సంథర్భంగా అయనను తలుచుకోవటం జనసేన పార్టీగా మేము గర్విస్తాం. ఇటువంటి వ్యక్తులే మా పార్టీకి అరాధ్యులు, అనుసరణీయులు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం.
–Shanti Prasad Singaluri, High Court Advocate, Janasena Legal