Pawan Kalyan with Veera MahilasPawan Kalyan with Veera Mahilas

సగటు మహిళకు సాంత్వన చేకూర్చలేని అధికారం ఎందుకు..?
రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను పాటించని సీఎం
మహిళలకు రాజ్యాధికారంలో మూడో వంతు భాగం
మహిళలు అదృశ్యంపై సమీక్షకు సీఎంకి తీరిక లేదు
జగన్ పాలన చూసి భయపడి పారిపోవద్దు… పోరాడదాం
ప్రజాధనాన్ని అత్యంత పారదర్శకంగా ఖర్చు చేస్తాం
కొత్త పథకాలకు జాతి నాయకుల పేర్లు పెడతాం
అక్రమాలపై సమాచారం ఇచ్చే వారికి ప్రభుత్వ ప్రోత్సాహకం
వైసీపీ నాయకుల అన్యాయాలపై జనసేన ప్రజాకోర్టు
స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో వీర మహిళల సమావేశంలో పవన్ కళ్యాణ్

‘వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి (Jagan Reddy) ఓడిపోతే సంక్షేమ పథకాలు (Welfare Schemes) ఆగిపోతాయేమో… సంక్షేమం నిలిచిపోతుందేమో అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు ఉంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదు అని జనసేన అధినేత (Janasena party President) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేసారు. జాతి నాయకుల (National Leaders) పేర్లతో సరికొత్త పథకాలను అమలు చేస్తాం’ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వీర మహిళల (Janasena Veera Mahila) సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గామాట్లాడుతూ ” విశాఖ పర్యటనలో ఉండగా ఓ 60 ఏళ్ల ఒంటరి మహిళ ఓ కాగితం పట్టుకొని నా దగ్గరకు వచ్చారు. తాను రెల్లి సామాజిక వర్గానికి చెందిన మహిళని అని… ఇంటికి దిక్కుగా ఉన్న కొడుకును అన్యాయంగా హత్య చేశారంటూ కొన్ని చిత్రాలను చూపించారు. దీనిపై పోలీసులు పట్టించుకోవడం లేదని, మరోపక్క స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా జిల్లా అధికారులు ఎవరూ స్పందించలేదని చెప్పింది. కేసు విచారణ చేయకుండా, నిందితులను పట్టుకోవడం లేదని విలపించారు.

ఓ తల్లి వేదన వినలేప్పుడు అధికారం ఎందుకు?.. దండగ

ఓ తల్లి వేదన తీర్చలేని అధికారం ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే అనిపిచింది. మీకు 151 సీట్లు, 22 ఎంపీ స్థానాలు ప్రజలు ఇచ్చినా ఓ తల్లి గుండె ఘోష విననపుడు అధికారం ఉండి ఎందుకు దండగ అనిపించింది. ఇటీవల తిరుపతి ఎస్పీని కలిసినపుడు మీకు సమాచారం ఎలా వస్తుంది..? మీరు చెప్పే సమాచారం ఎంత వరకు నిజం అని అడిగారు. ఆ ఎస్పీ గారికి చెబుతున్నా…

నాకు అధికారం లేకున్నా ప్రజల బాధలు, వారి వేదనలు వినే మనసుంది. అందుకే బాధిత వర్గాలు నా దగ్గరకు వచ్చి… తమ సమస్యలు చెప్పుకుంటాయి. వారి కన్నీటి బాధను వింటానని, న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వారు వస్తారు. నాకు ప్రజలే సమాచార వారధులు. ఈ ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చెప్పే సారథులు వారే. వారి కన్నీటి నుంచి, అంతులేని నరక యాతన నుంచి వచ్చే ప్రతి మాట నాకు పోరాట స్ఫూర్తిని, ప్రశ్నించే గొంతును ఇస్తుంది.

ఎక్కడికి వెళ్ళినా జగన్ లాంటివాళ్ళు ఉంటారు

కవి శ్రీ కేశవరెడ్డి గారి కథలో రాము రాముడుండాడు… రాజ్యముండాది అన్నట్లుగా దేశంలో ఎక్కడికి వెళ్లినా జగన్ లాంటి మనుషులు కనిపిస్తూనే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ వస్తే మేం ఇక్కడి నుంచి పారిపోతాం… ఉండలేం అని నాకు చెప్పుకొని బాధపడేవారే ఎక్కువ కనిపిస్తారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు… ఇలా భిన్న వర్గాల వారు జగన్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, బతకడానికి భయపడే పరిస్థితులు వచ్చేస్తాయని మధనపడుతుంటారు. అందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఎక్కడికి వెళ్లినా జగన్ వంటి వ్యక్తులు, అతడి కంటే క్రూరమైన వారు కనిపిస్తూనే ఉంటారు. ఓ నది ఈ నేల విడిచి ఎలా పారిపోలేదో మనం కూడా ఈ నేలను విడిచి పారిపోవాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల వారు జగన్ పాలన చూసి భయపడుతున్నారు. కానీ సమష్టిగా, ఉమ్మడిగా పోరాడి జగన్ లాంటి వారిని తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధం ఉపయోగించి జగన్ వంటి వ్యక్తులను తరిమికొడదాం. ఈ నేల మనది రాజ్యం మనది.. రాముడు మన వాడు. ఎక్కడికి పారిపోకుండానే జన రాజ్యం తెచ్చుకుందాం.

ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతంలోనే క్రైం రేటు ఎక్కు వ

ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నేరాల రేటు ఎక్కువగా ఉంది. సీఎం నివాసానికి కూత వేటు దూరంలో ఓ అంధురాలిపై వేధింపులకు దిగి హత్య చేస్తే ఈ ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి స్పందన ఉండదు. నన్ను తిట్టడానికి లేచే నోర్లు అప్పుడు మూతపడిపోతాయి. రేపల్లెలో తన సోదరిని వేధించిన వారిని ప్రశ్నించిన అమర్నాథ్ అనే బాలుడిని పెట్రోలు పోసి తగులబెట్టి హత్య చేస్తే, ఈ వైసీపీ నాయకులు రాజీ చేయడానికి వెళ్తారు. ప్రభుత్వ విధానాలపై ధైర్యంగా మాట్లాడే జనసేన అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తన మీద వైసీపీ ప్రతినిధులు అనుచితంగా మాట్లాడతారు. ఎలా ఉండాలి..? ఏం చేయాలి..? అనేది నిర్ణయించడానికి వైసీపీ నాయకులకు ఏం అధికారం ఉంది. మహిళలకు న్యాయం చేయలేని, వారిని గౌరవించలేదని మనసుతో మీరు ఎన్ని చట్టాలు చేసినా వృథా. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయిపోయారని నేను చెబితే.. తప్పుడు సమాచారం అని అన్నారు. సాక్షాత్తూ పార్లమెంటులోనే అది నిర్ధారణ అయ్యాక అయినా, కనీసం సమీక్ష పెట్టలేదు. మహిళలు, చిన్నారులు అక్రమ రవాణా అవుతుంటే కనీసం దానిపైనా ఓ సమావేశం పెట్టలేని నిర్లక్ష్యం.. అది పెద్ద సమస్య కాదు అనే భావన ముఖ్యమంత్రిది. శాంతిభద్రతల రక్షణకు జనసేన ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం ఉంటుంది. మహిళల భద్రతను మేం అనునిత్యం కాపాడేందుకు వ్యవస్థలను పనిచేసేలా చేస్తాం.

రౌడీయిజానికి పన్ను వేస్తే…

ప్రజలపై లేనిపోని పన్నులు, వడ్డింపులు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసింది. రాష్ట్రంలో రౌడీయిజం చేసే వారిపై పన్నులు వస్తే… ప్రజలను పట్టి పీడిస్తూ రౌడీయిజం, గూండాగిరీని నమ్ముకున్న వైసీపీ నాయకులు చెల్లించే పన్నులతోనే ప్రభుత్వ ఖజానా నిండిపోతుంది. ప్రభుత్వ రెవెన్యూ లోటు తీరిపోతుంది. అంతటి దారుణాలను వైసీపీ నేతలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకుల దాష్టీకాలను, దుర్మార్గాలను చూసి ప్రజల్లో విపరీతమైన కోపం ఉంది. అది కచ్చితంగా వైసీపీ నాయకులకు నామరూపల్లేకుండా వచ్చే ఎన్నికల్లో చేస్తుంది.

గతంలో వీపీ సింగ్ ప్రభుత్వంలో పన్ను ఎగవేతలను, నల్లధనాన్ని బయట పెట్టడానికి ఓ వినూత్న ప్రయత్నం జరిగింది. నల్లడబ్బు ఉన్న వారి వివరాలు, పన్నులు కట్టని వారి వివరాలను రహస్యంగా ప్రభుత్వానికి అందజేసిన వ్యక్తులకు బయటపెట్టిన ఆస్తిలో 5 శాతం ప్రోత్సాహక బహుమతి కింద అందజేసేవారు. జనసేన ప్రభుత్వంలోనూ అలాంటి ప్రయత్నం చేస్తాం. క్షేత్రస్థాయిలో జరిగే అక్రమాలను, అవినీతి తతంగాలను బయటపెట్టేవారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందించేలా ఏర్పాటు చేస్తాం. వనరుల దోపిడీ, సంపదను కొల్లగొట్టేవారిని నిలువరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రజల నుంచే సమాచారం సేకరించి, ప్రజల ఆస్తులను కొల్లగొట్టే వారి పని పడతాం. పార్టీలతో, వర్గాలతో సంబంధం లేకుండా ప్రజల ఆస్తులను దోపిడీ చేసేవారికి కచ్చితంగా జనసేన ప్రభుత్వంలో తగిన శిక్షలు ఉంటాయి.

జనసేన ప్రజా కోర్టులో నిలబెడతాం

ప్రజాస్వామ్య దేశంలో బలమైన చట్టాలు, న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ నేటి పరిస్థితుల్లో ప్రతి చిన్న అంశానికి సామాన్యుడు కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితి ఉంది. జనసేన త్వరలోనే వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలు, దోపిడీలపై ప్రజాకోర్టు నిర్వహిస్తుంది. దీనిని ఎలా ప్రజలకు చేరువ చేయాలనేది నిర్ణయిస్తాం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పులకు న్యాయస్థానాలు అయితే ఎలాంటి శిక్షలు వేస్తాయి..? అసలు వైసీపీ నాయకుల తప్పులకు న్యాయపరంగా ఎలా స్పందించాలి అనే విషయాలను ప్రజాకోర్టులో తేలుస్తాం. వైసీపీ నాయకుల తప్పులకుప్పలు ఎక్కడికి వెళ్లినా అంతు లేకుండా కనిపిస్తున్నాయి. వారిని కచ్చితంగా ప్రజాకోర్టులో నిలబెడతాం. వారు చేస్తున్న తప్పులు రాజ్యాంగానికి ఎంత విరుద్ధమైనవో తెలియజేస్తాం.

డబ్బు ఒకరి వద్దనే పేరుకుపోతోంది

దొడ్డి దారిలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులు అయిన తర్వాత అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న ప్రజా ప్రతినిధులు వద్ద డబ్బు ఉండిపోతోంది. ఒకరి వద్దనే డబ్బు పేరుకుపోవడం వల్ల వారిలో ఓ రకమైన నియంత భావన వచ్చేస్తోంది. ప్రజలను చులకనగా చూడటం మొదలుపెడుతున్నారు. కాంట్రాక్టర్లు బహిరంగంగా 8 శాతం కమీషన్ ఇచ్చామని, పేర్లతో సహా బయటపెడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి వ్యవస్థలో ఉంది. మరో ప్రకృతి వనరులను ఇష్టానుసారం దోచేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఏ మూలకు వెళ్లినా సహజసిద్ధ సంపద అన్యాక్రాంతం కావడం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రను డంపింగ్ యార్డుగా మార్చేశారు. 2030 కల్లా 50 శాతం మందికి మంచి నీరు దొరకని పరిస్థితులు వస్తాయని నివేదికలు చెబుతున్నాయి. తాగునీరు దొరకని దుర్భర పరిస్థితులు మనం చూడబోతున్నాం. భూగర్భం కలుషితం అయిపోతోంది. ఓ వైపు ప్రకృతి విధ్వంసం, మరోవైపు దోపిడీ వెరసి భవిష్యత్తు తరాలకు మనం ఏమి మిగిల్చే పరిస్థితి లేదు. ఇది పెను ఉత్పాతానికి దారి తీస్తుంది.

చుట్టూ కేసులున్న జగన్… న్యాయస్థానాలను నిందిస్తున్నాడు

రాజ్యంగం చెప్పిన ఏ ఒక్క అంశాన్ని జగన్ పట్టించుకోడు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే కాదు.. రాష్ట్రాలు నిర్వర్తించాల్సిన అంశాలపై రాజ్యాంగంలో పొందుపరిచిన వాటిని సైతం ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఆర్థిక అవకతవకలు చేసి 38 కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి రాజ్యాంగ పరిరక్షణ చేసే న్యాయస్థానాలపై నిందలు వేసే స్థాయికి వెళ్లాడు. ఈయన నిర్ణయాలను ఎన్నిసార్లు కోర్టులు తప్పు పట్టినా, మొట్టికాయలు వేసినా వినడు. పర్యావరణాన్ని కాపాడాల్సిన పెద్ద మనిషి, విధ్వంసం చేస్తాడు. భారతదేశం వేరే దేశాలతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాల్సిన స్థానంలో ఉండి.. ఆ ఒప్పందాలను పట్టించుకోడు. రాష్ట్ర ఆదేశిక సూత్రాలను పాటించడు. మోసపూరితమైన మాటలు నమ్మి ఓ వ్యక్తికి ఓటు వేస్తే, 5 సంవత్సరాల విలువైన కాలం ఏమైపోయిందో ప్రజలు అర్ధం చేసుకోవాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఓ వ్యక్తిని లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే వారి కోసం నిలబడండి. మన కోసం నిలబడతాడా లేదా అని ఆలోచించిన తర్వాతే మీ మద్దతు ఇవ్వండి.

మహిళలు సర్వసత్తాకులుగా ఎదగాలి

మహిళలు ఆర్థికంగా, సామాజికంగానే కాదు. రాజకీయంగా కూడా సర్వసత్తాకులుగా ఎదగాలి. దీనికి జనసేన కట్టుబడి ఉంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఆలోచన జనసేన చేస్తుంది. అలాగే వారి మాన, ప్రాణ రక్షణకు, భద్రతకు జనసేన పెద్దపీట వేస్తుంది. రాజ్యాధికారంలోనూ మహిళలకు మూడో వంతు భాగం ఉండాలి. గొప్పగా పోరాడే శక్తి ఉన్నవారు మహిళలే. మీ పిల్లలకు ధైర్యం నేర్పించాల్సింది స్త్రీమూర్తులే. నా తల్లి నాలో ఇంతటి ధైర్యం నేర్పింది కనుకే మీ కోసం పోరాడేందుకు నేను ఇక్కడ ఉన్నాను. సమాజంలో జరిగే ప్రతి అన్యాయం, అక్రమం మీద బిడ్డలకు పోరాడే శక్తినివ్వండి. సమాజంలో జరిగే అన్యాయం రేపు మన వరకు రాదు అనే గ్యారెంటీ లేదు. రాజ్యాంగం మనకు బతికే హక్కు… పనిచేసుకునే హక్కును కల్పించింది.

సమాజంలో మహిళలను ఇంకా తక్కువ స్థాయిలో చూసే విధానం, వారిపై జరుగుతున్న ఆకృత్యాలను జనసేన పూర్తిగా ఖండిస్తుంది. ఇటీవల మణిపూర్ లో ఓ మహిళను నగ్నంగా నిలబెట్టిన సంఘటనే కాదు.. రాష్ట్రంలో ఓ మహిళపై వైసీపీ గుండాలు చేసిన దాడి సైతం అత్యంత హేయం. మహిళలపై ఎక్కడ దాడి జరిగినా, అన్యాయం జరిగినా జనసేన కచ్చితంగా ఖండిస్తుంది. రాజ్యంగ రచనలో, స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహిళల త్యాగాలు ఉన్నాయి. సమాజంలో బలమైన మార్పు తీసుకొని రాగల ధైర్యం మహిళలకు మాత్రమే ఉంది. ఆ బాధ్యతను రాష్ట్రంలోని మహిళా మూర్తులంతా తీసుకోవాలి” అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఆంధ్రాకి పట్టిన దెయ్యాన్ని వదలగొట్టాలంటే…: పవన్ కళ్యాణ్

Spread the love