Praja gayakudu GaddarPraja gayakudu Gaddar

ప్రజాగాయకుడు గద్దర్ అన్న మరణ వార్త కలచి వేసింది
తెలంగాణ రాష్ట్ర సాధనలోను శ్రీ గద్దర్ గారి సేవలు అమూల్యం
ప్రజా గాయకుడు శ్రీ గద్దర్ గారి భౌతికకాయానికి నివాళులర్పించిన పవన్ కళ్యాణ్

పోరాటాలకు శ్రీ గద్దర్ అన్న (Gaddar) గొంతు ఒక ప్రేరణ బాట. జనసేన పార్టీ పెట్టడానికి కూడా ఆ యోధుడి గొంతు నుంచి వచ్చిన ఎన్నో పాటలు నాలో స్ఫూర్తి రగిలించాయి. కళ ద్వారా కోట్లాదిమందిని కదిలించవచ్చని నిరూపించారు. శ్రీ గద్దర్ అన్న మరణం ఊహించనిది అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా గాయకుడు శ్రీ గద్దర్ గారి మరణవార్త తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం గద్దర్ గారి భౌతికకాయాన్ని సందర్శించి, ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” చాలాసార్లు మృత్యువుతో సైతం యుద్ధం చేసి, గెలిచిన గొప్ప గాయకుడు గద్దర్. ఈసారి కూడా ఎంతో ఆరోగ్యంగా తిరిగి వస్తారని భావించాను. ఇటీవల ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అని తెలిసిన వెంటనే హైదరాబాదులోని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించాను. ఆరోగ్యం బాగా లేని సమయంలో కూడా ఆయన ప్రజల బాగు కోసం ఆలోచించారు. ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఎన్నో విషయాలను బలంగా తట్టుకునే నాకు ఈ సమయంలో దుఃఖం ఆపుకోవడం సాధ్యం కావడం లేదు.

ఆపరేషన్ సమయంలో కూడా నాకు ప్రత్యేకంగా ఆయన వాయిస్ మెసేజ్ పంపారు. పీడిత ప్రజల పక్షాన పోరాడే వారు అంటే గద్దర్ అన్నకు ప్రాణం. అలాంటి వారితోనే ఆయన ఎక్కువ గడిపారు. చివరి శ్వాస వరకు ఆయన మనసులో వివిధ వర్గాల ప్రజలకు మేలు చేయాలని గట్టి సంకల్పం నాకు కనిపించింది. పరిపూర్ణ పోరాటం అంటే పీడిత ప్రజలకు కచ్చితంగా మేలు చేసేది అయి ఉండాలి అని శ్రీ గద్దర్ అన్న నమ్ముతారు. దానిని తుది శ్వాస వరకు ఆయన వీడలేదు. సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి వస్తారని గట్టిగా నమ్మాను.

చివరిసారి నా పాటకు గాయం అయింది అని ఆయన చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది. పీడిత ప్రజల పక్షాన తన పాటతో ఎన్నో చైతన్య కాంతులు నింపిన శ్రీ గద్దర్ అన్న చివరకు పీడిత ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు జరగలేదు అని, తన పాటకు గాయం అయిందని నాకు లెటర్ లో మధనపడ్డారు. గాయపడ్డ పాట అని శ్రీ గద్దర్ అన్న రాసినపుడు నాకు ఎంతో ఆవేదన కలిగింది.

మీరు ఎప్పుడు ఆ మాట అనకండి… మేమంతా మీ స్ఫూర్తిని బతికించేలా పనిచేస్తామని గుండెలకు హత్తుకొని మరి చెప్పాలని భావించాను. అయితే అది తీరకుండానే శ్రీ గద్దర్ అన్న పాట అమరత్వం పొందింది. అజ్ఞాత సమయంలో శ్రీ గద్దర్ అన్న పొందిన భావాలు, ఉద్వేగ క్షణాల నుంచి పుట్టిన పాటలు మీద ఎన్నో గంటలు చర్చించేవాళ్ళం. ఆయన చెప్పే ప్రతి అంశం కూడా ఎంతో విలువైనది. చిన్న వయసు నుంచి నాలో స్ఫూర్తి నింపి ఎంతో ప్రేరణ కల్పించిన వ్యక్తిని కోల్పోయాను అన్న బాధ నాలో అణువణువునా ఇప్పుడు ఉంది. మహాకవి శ్రీశ్రీ తర్వాత నాలో ఎన్నో విప్లవ భావాలు రగిలించిన వ్యక్తిని ఇప్పుడు కోల్పోవడం నాకు ఆవేదన కలిగిస్తోంది. 60వ దశకం వరకు యువతలో శ్రీశ్రీ స్ఫూర్తిని రగిలిస్తే, ఆ తర్వాత కాలంలో శ్రీ గద్దర్ అన్న ఆ బాధ్యతను తన భుజానికి ఎత్తుకున్నారు. భుజాన కంబలి వేసుకొని, చేతిలో కర్ర పట్టుకొని లయబద్ధంగా ఆయన ఆడుతూ పాట పాడుతూ ఉంటే యువతరంలో రక్తం లావాలా మరిగేది. శ్రీ గద్దర్ అన్న భౌతికంగా లేకపోయినా ఆయన పాట అజరామరం. ఎంతోమందికి ఆ పాటలు కచ్చితంగా ప్రేరణగా నిలుస్తాయి. తెలంగాణ పోరాట సమయంలో కూడా తెలంగాణ ఉద్యమానికి శ్రీ గద్దర్ అన్న మద్దతు తెలిపినప్పుడు నేను మనస్ఫూర్తిగా స్వాగతించాను. నిజాం కాలంలో రజకార్ల దాష్టికాలకు బలై ఉద్యమ బాట తొక్కిన తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి అవసరమని శ్రీ గద్దర్ అన్న భావించినప్పుడు, మీరు ఏ నిర్ణయం తీసుకున్న ప్రజా అభీష్టం మేరకు తీసుకుంటారని ఆయనకు చెప్పాను. దానిని ఆహ్వానించాను. తెలంగాణ రాష్ట్ర అవతరణకు శ్రీ గద్దర్ అన్న చేసిన కృషి అమోఘం.

పాతబస్తీ దగ్గర నుంచి భద్రాచలం వరకు ఆయన పాట ద్వారా నింపిన ఎన్నో స్ఫూర్తి బాటలు ఉద్యమ కాలంలో ఉపయోగపడ్డాయి. సరిగ్గా శ్రీ గద్దర్ అన్నను కలిసి వారం రోజులు కూడా కాలేదు. ఆయన చివరి సందేశంలోనూ రాజకీయం ఒక పద్మవ్యూహం అని అవసరం అయిన సమయంలో ముందడుగు వేయాలని ఒక్కోసారి వెనకడుగు తప్పదని చెప్పారు. రాజకీయంలో అన్నిటికీ తెగించి పోరాడాలని ప్రజా సంక్షేమమే చివరి అజెండా కావాలని ఆయన చెప్పారు. భారతదేశానికి యువతే పెద్ద ఆస్తి అని, ఆస్తి బావి భారతాన్ని సృష్టించేలా పని చేయాలని ఆయన కోరారు. దానికి యువతను సంసిద్ధం చేసేలా బాధ్యత తీసుకోవాలని నాకు చెప్పడం నాకింకా చెవుల్లో మోగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సైతం శ్రీ గద్దర్ అన్నకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుందని భావిస్తున్నాను. తెలుగు పాట ఉన్నంతకాలం తెలుగు భాష ఉన్నంత కాలం శ్రీ గద్దర్ అన్న బతికే ఉంటారు. ఆయన పాట సజీవం” అన్నారు.

జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి  నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు  రాధారం రాజలింగం, పార్టీ నేతలు వంగ లక్ష్మణ్ గౌడ్,  సంపత్ నాయక్,  సురేష్ రెడ్డి,  రవీందర్ రెడ్డి శ్రీ గద్దర్ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

రాజ్యాంగేతర శక్తిగా వాలంటీర్ల పాలన: సర్పంచుల చర్చా గోష్ఠి

Spread the love