Jansena Bhimavaram meetingJansena Bhimavaram meeting

వైసీపీ పాలనలో రాష్ట్ర పంటగా గంజాయి-రాష్ట్ర ఆయుధంగా గొడ్డలి
‘మై ఎక్స్ టార్షన్స్ ఇన్ ఏపీ స్టేట్’ పేరుతో సీఎం ఆత్మకథ
జాబ్ క్యాలెండర్ అని చెప్పి వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చారు.
ఆయనేమైనా పుచ్చలపల్లి సుందరయ్యా? కొండపల్లి సీతారామయ్యా?
జగన్… మీ వ్యక్తిగత చిట్టా విప్పితే చెవుల్లోంచి రక్తం వస్తుంది.
మద్య నిషేధం అని చెప్పి రూ. లక్ష కోట్ల మద్యం అమ్మిన ఘనత జగన్ రెడ్డిదే
శ్రీవాణి ట్రస్టు నిధులపై అబద్దం ఆడితే నాశనం అవుతారు
వారాహి విజయయాత్ర భీమవరం సభలో పవన్ కళ్యాణ్

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో (Bhimavaram) జరిగిన సభలో వైసీపీని (YCP) ఉతికి ఆరేశారు. జగన్ రెడ్డి (Jagan Reddy) నీ వ్యక్తిగత చరిత్ర చెప్పడం మొదలు పెడితే చెవుల్లోంచి రక్తం వస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరిక జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలు బలంగా నమ్మి 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది పార్లమెంటు సభ్యలను వైసీపీకి ఇచ్చారు. కానీ వీరు చేసిందేమిటంటే.. రాష్ట్ర పంటగా గంజాయిని చేశారు. రాష్ట్ర ఆయుధంగా గొడ్డలిని మార్చారు. ఇదీ వైసీపీ విశిష్ట పాలన. ఇదే వైసీపీ చేసిన ఆంధ్రా అభివృద్ధి. పార్టీ పేరులో యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ గా పెట్టుకున్న వైసీపీ యువజనులకు ఉద్యోగాలను దూరం చేసింది. శ్రామికులకు ఉపాధి లేకుండా చేసింది. రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంది. పార్టీ పేరులోని వర్గాలనే వైసీపీ దగా చేసింది. అలానే వైసీపీ రాష్ట్రంలోని అన్ని వర్గాల బతుకులను నాశనం చేసింద’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.

వారాహి విజయయాత్రలో భాగంగా శుక్రవారం భీమవరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పలు కీలక ఆరోపణలు చేసారు. సభ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. సేనాని ఒకపక్కన వైసీపీని విమర్శిస్తూ మరొక పక్కన జనసేన అధికారంలోకి వస్తే ఏమి చేస్తుంది అనేది చెప్పడం కొనసాగించారు.

“గాంధీ గారు తన జీవిత చరిత్ర రాసిన మై ఎక్స్ పెర్మెంట్స్ విత్ ట్రూత్ (సత్యశోధన) అనే పుస్తకం మాదిరిగా ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సైతం మై ఎక్స్ టార్సన్స్ ఇన్ ఏపీ స్టేట్ (అస్యతశోధన) పేరుతో పుస్తకం రాయొచ్చు. పూటకో అబద్ధం… రోజుకో నేరం అన్నట్లు సాగుతున్న వైసీపీ పాలనకు ఇది సరిగ్గా సరిపోతుంది. తాత ఒడిలో ఆడుకుంటూ, యుక్త వయసులోనే సబ్ ఇన్స్పెక్టర్ ప్రకాశ్ బాబును పోలీస్ స్టేషన్లోనే కొట్టి, లాకప్ లో వేసిన నేర చరిత ఈ ముఖ్యమంత్రికి ఉంది. అలంటి సీఎంకి సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలీస్ స్టేషన్లో చితక కొట్టించడం పెద్ద పని కాదు. దానికి ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. పోలీసు వ్యవస్థపై పూర్తి నమ్మకం, గౌరవం లేని వ్యక్తికి ఈ రోజు ఆ శాఖ అధికారులు సెల్యూట్ చేస్తున్నారు. ఇలాంటి రాష్ట్రంలో నేను పుట్టినందుకు నిజంగా సిగ్గు అనిపిస్తోంది.

యువతను నిరాశలోకి నెట్టేస్తున్నారు?

కలల ఖనిజాలతో, ఆకాశమంత ఆశయాన్ని నింపుకొని, పట్టం కట్టే ప్రతిభే దారి చూపుతుందని భావించిన యువతకు ఈ వైసీపీ ప్రభుత్వం రూ.5 వేల గౌరవ వేతనాన్ని ఇచ్చే వాలంటీరు ఉద్యోగాలను ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఏటా జాబ్ క్యాలెండరు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన పెద్దమనిషి, తర్వాత వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేసి మమ అనిపించారు. ఓ వైపు వయసు మీరుతూ, మరోవైపు సమర్ధత తగ్గుతూ నిరాశలోకి జారిపోతున్న యువతకు వైసీపీ ప్రభుత్వం మొండిచేయి చూపింది. పరిశ్రమలు తీసుకొస్తామని, వాటిలో 70 శాతం ఉద్యోగాలు యువతకు ఇస్తామని చెప్పిన వైసీపీ నాయకుడు ఉన్న పరిశ్రమలనే బయటకు పంపేశాడు.

ఐటీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేకపోయారు. ఇక వైసీపీ పార్టీలో రెండో అక్షరం అయిన శ్రామికులకు వైసీపీ అధికారంలోకి రాగానే కష్టాలు మొదలయ్యాయి. ఇసుక కొరత దెబ్బకు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. సుమారు 32 మంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక, ఇల్లు గడవక ఆత్మహత్యలు చేసుకున్నారు. 50 వేల మంది కార్మికులకు ఉపాధి చూపే ఇసుక కాంట్రాక్టును కేవలం 3 కంపెనీలకు కట్టబెట్టి వారి ఉసురుపోసుకున్నారు.

ఇక వైసీపీ పార్టీలోని రైతు అనే పదానికి పూర్తిగా అన్యాయం చేశారు. లాభసాటి ధర దేవుడెరుగు.. గిట్టుబాటు ధర కూడా రాక క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న వేదన అంతాఇంతా కాదు. కోనసీమ లాంటి ప్రాంతంలోనూ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే స్థాయికి వచ్చారు. అసలు రైతు భరోసా కేంద్రాలు దిష్టిబొమ్మల్లా తయారయ్యాయి. అక్కడ సిబ్బంది ఉండరు.. ఉన్నా వారితో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం ఉండటం లేదు.

ఆక్వాపై జె ట్యాక్స్ ఎఫెక్ట్

ఇక ఆక్వా రైతులకు ఫీడ్ ధరలు గుదిబండలా మారాయి. కొత్తగా జే టాక్స్ పేరుతో వైసీపీ నాయకుల ఆక్వా ఫీడులో వసూళ్లకు తెరలేపడంతో ఫీడ్ ధర టన్నుకు రూ.16 వేలు పెరిగింది. ఆక్వా రైతులకు రూ.1.50 పైసలకే విద్యుత్ ఇస్తానన్న హామీని వైసీపీ నాయకులు వదిలేశాడు. సెరీ కల్చర్ రైతుకు ప్రోత్సాహాలు లేవు. ప్రతి దానికి పవన్ కళ్యాణ్ వచ్చి అడిగితే గాని వైసీపీ ప్రభుత్వం స్పందించదా..? రైతులకు రావల్సిన డబ్బులు వేయదా..? పార్టీలోని మూడు అక్షరాలకు ప్రతిరూపమైన వర్గాలనే కాదు.. సమాజంలోని అన్ని వర్గాలను విచ్ఛిన్నం చేసేలా వైసీపీ పాలన సాగుతోంది.

యువతను ఎంటర్ ప్రెన్యూర్స్ గా చూడాలి

యువతలో రాష్ట్ర ‘అద్భుతమైన నైపుణ్యాలున్నాయి. ఎక్కడికో వెళ్లి వాటిని ఇతర కంపెనీల కోసం వాడుతున్నారు. తెలివితేటలు, సత్తా, శక్తి బాధపడితే అది సమాజానికి కూడా మంచిది కాదు. నేను ఎంత నడిచినా గమ్యం చేరలేను అని యువత భావిస్తే వారి ఆలోచన నిర్వీర్యం అవుతుంది. జనసేన ప్రభుత్వంలో యువతను ఓ ఎలన్ మాస్క్, ఓ సత్య నాదెళ్ల, ఓ సుందర్ పిచాయ్ వంటి గొప్ప స్థానాల్లో చూసేలా విధానాలు ఉంటాయి. వారిలో ఉన్న కొత్త ఆలోచనలు బయటకు తీసి, వారిని గొప్ప ఎంటర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దుతాం. దామాషా పద్ధతి ప్రకారం ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతను ఎంపిక చేసి, వారిలోని ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసి పదిమందికి ఉపయోగపడేలా చూస్తాం.

వైసీపీ ప్రభుత్వం మాదిరి రూ.5 వేల గౌరవ వేతనం ఉద్యగం ఇచ్చి, గొప్పలు చెప్పుకోవడం కాదు… యువత రాష్ట్రం పేరును ఖండాంతరాలకు విస్తరించేలా వారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. సంపద అందరిదీ. మనం కట్టే పన్నులతో ఇస్తున్న పథకాలకు ఎవరి సొంత పేర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తాం. తైవాన్ లాంటి చిన్నదేశంలో సెమీ కండక్టర్స్ విస్తృతంగా తయారవుతాయి. ప్రపంచానికి అక్కడి నుంచి వెళ్తాయి. రాష్ట్రంలో ఇంజినీరింగ్, టెక్నికల్ నైపుణ్యం ఉన్న యువతకు కొదవ లేదు. కచ్చితంగా కొత్త ఆలోచనతో వచ్చే వారికి తగిన ప్రోత్సాహకం ఉండేలా విధానం తయారు చేస్తాం.

పాలకులను ప్రశ్నించకపోతే వ్యవస్థ కుళ్లిపోతుంది

ప్రముఖ రైటర్ జీకే చెస్టర్టన్ చెప్పినట్లు ఇష్టానికి పాలకుడు వ్యవస్థను తన కోసం నడుపుతుంటే, దాన్ని ప్రజలు తేలికగా తీసుకుంటే చివరకు వ్యవస్థ లేకుండా పోతుంది అంటారు. రాష్ట్రంలోని పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఓ అధికారపార్టీ శాసనమండలి సభ్యుడు ఓ దళితుడ్ని హత్య చేసి, బాడీని డోర్ డెలివరీ చేస్తే ప్రజల నుంచి స్పందన లేదు. ఓ 13 ఏళ్ల బాలుడు తన అక్కను వేధించిన వారిని ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి ఆ బాలుడిని తగులబెడితే ప్రజల నుంచి అడిగేవారు ఉండరు. మద్యపాన నిషేధం అని చెప్పి రూ.లక్ష కోట్లకు పైగా అమ్మకాలు జరిపితే ఎదురు తిరిగి ప్రశ్నించేవారు కనిపించరు.

2.32 లక్షల ఉద్యోగాలు అని చెప్పి నిలువునా మోసం చేసిన వ్యక్తి కనిపిస్తే నిలదీసేవారు లేరు. 30 వేల మంది ఆడబిడ్డలు కనిపించకుండా పోతే ఇదేంటని గొంతెత్తే ప్రజలు కరువే. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తుంటే ప్రజలు ఎదురు తిరగకపోతే వ్యవస్థలు నాశనం అవుతాయి. వీటిని జనసేన ప్రశ్నించింది. ప్రజల తరఫున గొంతెత్తాం. ప్రశ్నించాం. పోరాడాం. ప్రజల మద్దతు కావాలని కోరుతున్నాం.

యువత కులాలను దాటి ఆలోచించాలి

వైసీపీ పాలకులు కులాల మధ్య చిచ్చు రేపి చలి కాచుకోవాలని చూస్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నది అదే. యువత కులాలను దాటి ఆలోచించాలి. దివ్యాంగుల్లో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారు. తన చక్రాల కుర్చీ సాయంతోనే బ్లాక్ హోల్స్ గురించి విశ్వ రహస్యాలు గురించి చెప్పిన స్వీఫెన్ హ్యాకింగ్స్ తరహాలో దివ్యాంగులకు మనో నేత్రపు ప్రతిభ అద్భుతంగా ఉంటుంది. వారిని గొప్పవారిగా తీర్చిదిద్దాలి. మనలో ఎంత ప్రతిభ ఉన్నా, దానికి సరైన దిశానిర్దేశం లేకుండా అది ముందుకు సాగదు. అలాగే మనలోని నైపుణ్యం బయటకు రావాలంటే పాలకుల విధానాలు గొప్పగా ఉండాలి. అప్పుడే రాష్ట్ర బాగుపడుతుంది.

జగన్ కి క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత లేదు

తన జీవితమంతా పేద వర్గాల కోసమే గడిపిన నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి అనే గొప్ప వ్యక్తి రెడ్డి అనే పదం తనకు వద్దని, అది కుల అహంకారానికి చిహ్నమని భావించి తన పేరును పుచ్చలపల్లి సుందరయ్యగా మార్చుకొని ప్రజా పోరాటాలు చేశారు. కనీసం తన పేరులోని ఆ చివరి పదాన్ని కూడా తొలగించుకోవడానికి ఇష్టపడని ఈ ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడుతుంటే నిజంగా నవ్వొస్తోంది. ఈయన ఏమైనా శ్రీ కొండపల్లి సీతారామయ్య లేక శ్రీ తరిమెల నాగిరెడ్డి అనుకుంటున్నారా? సొంత తండ్రి చనిపోయినపుడు 122 మంది గుండె ఆగిపోయి చనిపోయారని, ప్రతి ఇంటికి వెళ్లి ఓదార్పు యాత్ర చేసిన జగన్ రెడ్డి, ఇసుక కొరత వల్ల 32 మంది బతుకు సాగదని భావించి బలవన్మరణాలకు పాల్పడితే ఎందుకు ఓదార్పు యాత్ర చేయలేదు. వారి కుటుంబాలను పలకరించలేదు. అసలు క్లాస్ వార్ అనే పదం ఉచ్ఛరించడానికి కూడా ఈ సీఎంకు అర్హత లేదు.

నిజంగానే నేను ప్రసంగంలో ఊగిపోతాను.. ఆవేశపడతాను. ఎందుకంటే పేదోడి కష్టం నా కష్టం అనుకుంటాను. నిత్యం వేలాది మంది చెప్పే బతుకు కథలు నన్ను దహించి వేస్తాను. పాలకుల దాష్టీకాలు, వారు చేస్తున్న వికృత చేష్టలు నన్ను కుదురుగా ఉంచవు. ప్రజల కన్నీళ్లు నా కుటుంబం పెట్టే కన్నీళ్లుగా భావిస్తాను. అందుకే అన్యాయం జరిగిన వేదన నుంచి నా ఆవేశం వస్తుంది. ఈ వ్యవస్థలు పేదలను, బాధితులను ఎందుకు పట్టించుకవడం లేదు అన్న ఆలోచన నుంచి మాటలు వస్తాయి. నిత్యం నువ్వు రాజ్యం పెడుతున్న క్షోభకు బాధితుడివి అయితే నీ గుండె రగిలి, ఆ మంటల కాగడాల నుంచి అక్షరాలు పుడతాయి.

ఆడబిడ్డల పుస్తెలు తెంపేస్తున్నాడు

సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన జగన్ రెడ్డి తన పాలనలో మద్యం ఆదాయంలో రికార్డు కొట్టారు. రూ.లక్ష కోట్ల మద్యం ఆదాయం అర్జించడం సాధారణ విషయం కాదు. కల్తీ మద్యం అమ్ముతూ, ధరలను విపరీతంగా పెంచి మధ్య తరగతి, పేదలను దోచుకుంటున్నారు. రోజువారి కూలిలో సగం పైగా మద్యం కోసం వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. గతంలో రూ.70, రూ.80 ఉన్న మద్యం ధరలు ఒక్కసారిగా రూ.200, రూ.250లకు చేశారు. పోని నాణ్యమైన మద్యం అమ్ముతున్నారా అంటే అదీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్ముతున్న కల్తీ మద్యం అత్యంత హానికరం. లివర్, కిడ్నీ, బ్రాంకైటీస్ వంటి వ్యాధులకు మూలం అవుతోంది. దీన్ని తాగితే తక్కువ రోజుల్లోనే మరణం అంచులకు వెళ్తున్నారు. ఆడబిడ్డల పసుపుకుంకుమలతో జగన్ రెడ్డి వ్యాపారం చేస్తున్నాడు. పుస్తెలు తెంపేస్తున్నాడు.

గౌడ సామాజిక వర్గానికి చెందిన వారి కడుపుకొట్టి, కల్లును నిషేధించి మరీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విషం బహిరంగంగా అమ్ము తున్నాడు. ప్రజల పొట్ట కొట్టి, మళ్లీ పథకాల రూపంలో మన డబ్బును మళ్లీ మనకే అందిస్తున్నారు. అదేదో వారి గొప్పతనంగా చెప్పుకుంటున్నారు. జనసేన మొదటి నుంచి సంపూర్ణ మద్య నిషేధం సాధ్యం కాదని చెబుతోంది. ఆడపడుచులు తమ ప్రాంతాల్లో మద్యం దుకాణం వద్దని చెబితే, కచ్చితంగా దాన్ని పరిగణనలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో మద్య నిషేధం చేస్తాం. అలాగే జనసేన ప్రభుత్వంలో పాత ధరలకే మద్యం అమ్ముతాం. గీత సొసైటీలకు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో తగిన వాటాను కల్పిస్తాం.
దేశంలో 3,200 కులాలున్నాయి.

రాష్ట్రంలో కీలకమైన 190 నామినేటెడ్ పోస్టులను ఒకే కులానికి కట్టబెట్టారు. రాష్ట్రంలో దళితుడు, బీసీ కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న అనేక కులాలున్నాయి. వారందరికీ సమాన అవకాశాలు రావాలని జనసేన పార్టీ భావిస్తోంది. మేం ఏ కులానికి వ్యతిరేకం కాదు. కానీ ఒకే కులానికి చెందిన వ్యక్తులతో కీలకమైన పదవులను నింపేయడం వల్ల సమతూల్యత దెబ్బతిని, కొత్త సమస్యలు వస్తాయి. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి.

నేను మీ వాడిని.. నాకు అన్ని సమస్యలు తెలుసు

భీమవరం గురించి నాకేం తెలుసు అని కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఏ నాయకులు వెళ్లని భీమవరం డంపింగ్ యార్డును స్వయంగా పరిశీలించాను. నాపై గెలిచిన నాయకులు ఆ సమస్యను ఇంతవరకు పరిష్కరించలేకపోయారు. భీమవరం 100 పడకల ఆస్పత్రికి నాబార్డు నుంచి రూ.10 కోట్లు విడుదల అయినా దాన్ని సరిగా వినియోగించుకోలేకపోయారు. జగనన్న ఇళ్ల కాలనీలకు 80 ఎకరాల స్థలం తీసుకొని, ప్రతి ఎకరాలోనూ రూ.20 లక్షలు మిగిలించుకున్నారు. రూ.1400 కోట్లతో గోదావరి పైపులైను పనులు చేస్తామని చెప్పి ఇప్పటికీ దానికి అతిగతి లేదు.

భీమవరానికి పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా రెండు పైవంతెనలు అవసరం. వాటిని కూడా నేటి పాలకులు పట్టించుకోలేదు. వైసీపీ పెద్దలకు నేను చెబుతున్నదొక్కటే. నేను అన్నిటికీ తెగించి రాజకీయాల్లోకి వచ్చాను. నిండా మునిగిన వాడికి చలి ఏంటి..? మీరు ఎన్ని కుట్రలు చేసినా, అదిలించినా, బెదిరించినా వెనక్కు తగ్గే వాడిని కాదు. ఏం మాట్లాడతారో, ఏ చేస్తారో చేసుకోండి.

ఆక్వా పరిశ్రమ వల్ల రాష్ట్రానికి ఆదాయం

ఆక్వా పరిశ్రమ వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తోంది. అదేవిధంగా కాలుష్యం కూడా పెరుగుతోంది. కాలుష్యం తగ్గిస్తూ ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని నేను చాలా ఏళ్లుగా మాట్లాడుతున్నాను. దీనిపై గత ప్రభుత్వంతోను పోరాటం చేశాను. తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల చుట్టు పక్కల గ్రామాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్ను విషవాయువుల వల్ల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్… ప్రభుత్వం వచ్చాక ఫుడ్పార్క్్న బంగాళాఖాతంలో కలిపేస్తామని, బాధిత గ్రామాల ప్రజలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఆ హామీలు నెరవేర్చలేదు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే బాధిత గ్రామాల ప్రజలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తాం. ధాన్యం అమ్మకాల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. తరుగు పేరుతో బస్తాకు 8 కేజీలు దోచేస్తున్నారు. దానిపై ప్రశ్నించినడానికి గ్రామ సచివాలయంకు వెళ్లిన 16 మంది రైతులపై కేసులు పెట్టారు. చిన్నపాటి వర్షానికే వీరవాసరం మండలం ముంపుకు గురవుతోంది. దీనిపై ధర్నా చేసినా జనసేన నాయకులు, స్థానికులపై కేసులు పెట్టారు. దళితులను బెదిరించారు. గరకపర్రులో పేదలకు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చేశారు. ముఖ్యమంత్రి నిజంగా పేదల పక్షాన నిలబడే వ్యక్తే అయితే ఇలా నిర్ధాక్షణంగా ఇళ్లను కూలుస్తారా?

క్లాస్ వార్ పేరుతో పోస్టర్లు వేస్తే దానికి సమాధానంగా పోస్టర్ వేయాలని ప్రయత్నిస్తే మా జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి చినబాబు, ఇతర నాయకులపై కేసులు కట్టారు. తాడేరు వంతెన కోసం పాదయాత్ర చేసినా కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ‘అందుకే ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపిస్తారనే నమ్మకం

రాష్ట్రం కోసం 25 ఏళ్లు కూలీగా పని చేయడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలి. జనసేన పార్టీ అసెంబ్లీలో సత్తా చాటాలి. బీసీలకు సంపూర్ణ రాజ్యాధికారం రావాలి. దళితులు పది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక వేత్తలుగా మారాలి. అగ్రకుల పేదలకు పెట్టుబడి సాయం అందాలి. యువతలో దాగి ఉన్న ప్రతిభాపాటవాలు బయటకు రావాలి. వైసీపీలా ఒక్క సామాజికవర్గం కోసం కాదు సమస్త మానవజాతి కోసం జనసేన పనిచేస్తుంది. సామాజికవర్గాల వారిగా, హీరోలా అభిమానుల వారిగా యువతను విడదీయడం ఇష్టముండదు. అందుకే నేనెప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ అని పెట్టలేదు. నాకు జనం కావాలి… అందుకే నా పార్టీకి జనసేన అని పెట్టాను. ఒక్క పదేళ్లు కులవైషమ్యాలను వదిలేద్దాం. రాష్ట్ర అభివృద్ధి కోసంపాటుపడదాం.

మిస్టర్ జగన్ … నీ పర్సనల్ లైఫ్ చాలా డీటెల్డ్ గా తెలుసు

జనసేన పార్టీ ప్రభుత్వ పాలసీల మీద మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఒకటే చెబుతున్నా… నేను ఎక్కడో లండన్ లో పెరగలేదు. న్యూయార్క్ లో చదువుకోలేదు. మీలాగా హైదరాబాద్ లో పెరిగాను. హైదరాబాద్ లో మీరు ఏం ఏం చేశారో నాకు బాగా తెలుసు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ పర్సనల్ జీవితం, నీ మంత్రుల వ్యక్తిగత జీవితాలు చాలా డీటెల్డ్ గా తెలుసు. మీ బాగోతాలు బయటపెట్టలేక కాదు సంస్కారం అడొచ్చి ఆగుతున్నా. నీకు డౌట్ ఉంటే మీ మనిషిని పంపించు. నేను చెప్పే మాటలకు చెవుల నుంచి రక్తాలు వస్తాయి. మీకు ఎవడైతే వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడండి అని చిల్లర సలహాలు ఇస్తున్నాడో వాళ్లకు ఒకటే చెబుతున్నాను… ఇలాంటి కథలు చిన్నప్పుడే చదివేశాను.

మీరు ఎంత చిల్లరగా మాట్లాడినా ఫరక్ పడదు. జగన్ గుర్తు పెట్టుకో ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్, క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్నాయని ఎగిరిపడుతున్నారేమో.. విప్లవాన్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన వ్యక్తిని నేను. పోరాటం చాలా గట్టిగా ఉంటుంది. ఇంకో సారి చిల్లరగా మాట్లాడితే ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు.

గంజాయి సాగుపై కేంద్ర హోంశాఖ వద్ద రిపోర్టు ఉంది

ఇటీవల ప్రధాన మంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు నన్ను పిలిచారు. నేను మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశాను. ఆ సందర్భంగా వైసీపీ అరాచక పాలనపై 32 పేజీల రిపోర్టు ఇద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో ఇవ్వాలి అనిపించలేదు. నా నేల కోసం నేను
పోరాటం చేయాలి అనుకుని ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేయలేదు. రాష్ట్రంలో గంజాయి సాగుపై, కాకినాడ క్రిమినల్స్ పై కేంద్ర హోంశాఖ దగ్గర డీటెల్డ్ రిపోర్టు ఉంది. జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున గుర్తుపెట్టుకోండి గంజాయి రాకెట్ లో ఎవరెవరికి సంబంధం ఉందో వారందరి బండారం బయట పెడతాం.

భగవంతుడి సొమ్ముతో ఆటలొద్దు… తరాలు లేచిపోతాయి

టీటీడీ శ్రీవాణి ట్రస్టు గురించి అకారణంగా మాట్లాడుతున్నానని కొంతమంది పెద్దలు అంటున్నారు. మాకున్న సమాచారం ప్రకారం రూ. 10 వేలు కట్టించుకొని రూ. 500 కే బిల్లు ఇస్తున్నారు. ట్రస్టు ద్వారా వచ్చిన డబ్బులతో ఆలయాలు నిర్మిస్తున్నామని చెబుతున్నారు. ఆలయాలు నిర్మించే కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? ఆలయాలు నిర్మిస్తున్న మూడు కాంట్రాక్ట్ కంపెనీలు ఎవరివి? ఇందులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి సంబంధించిన కంపెనీ ఉందా? లేదా చెప్పాలి. భగవంతుడి సొమ్మును దుర్వినియోగం చేస్తే తరాలు నాశనం అయిపోతాయి గుర్తించుకోండి” అని హెచ్చరించారు.

ముందు మీ నోటికి సైలెన్సర్లు బిగించండి

భీమవరంలో ఒక నాయకుడు తన ఇంటి చుట్టూ జనసైనికులు సైలెన్సర్లు లేని బైకులతో తిరిగి వేధిస్తున్నారని బాధపడుతున్నాడు. ఇలాంటి పనులు నేను కూడా హర్షించను. 2014 నుంచి 2023 వరకు చూడండి.. బైకుల సైలెన్సర్ల సౌండ్ బాగా తగ్గింది. జనసైనికులు చాలా క్రమశిక్షణగా ఉంటున్నారు. ముందు మీరు మీ నోటికి సైలెన్సర్ బిగించుకుంటే… ఆటోమెటిక్ గా జనసైనికులు బైకులకు సైలెన్సర్లు బిగించుకుంటారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడతారు. ఇష్టానుసారం బూతులు తిడతారు. అడ్డగోలుగా మాట్లాడే వైసీపీ నాయకులకు ఇది నా విన్నపం అనుకోండి. ఇంకేదైనా అనుకోండి ముందు మీ నోటికి సైలెన్సర్లు బిగించుకోండి. తరువాత జనసైనికుల బైక్ సైలెన్సర్లు గురించి మాట్లాడండి.

రాష్ట్రానికి అప్పుంటే నాకేంటి సంబంధం అనుకోకండి

రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్రానికి అప్పు ఉంటే నాకేంటి సంబంధం అనుకోకండి. అప్పులు భారీగా పెరిగిపోవడం వల్ల… రాష్ట్రానికి వచ్చే ఆదాయం సగం వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. దీంతో అభివృద్ధి కార్యక్రమాలు కుంటిపడుతున్నాయి. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకే భీమవరంలో రెండు ఫ్లైఓవర్లు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రావడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదు.

సీపీఎస్ రద్దు హామీ అటకెక్కించారు. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. అప్పులు చేసి అభివృద్ధి అనుకుంటే మన జీవితాలు ఎప్పటికీ మారవు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామికవేత్తలు రావాలి… పరిశ్రమలు స్థాపించాలి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి. ఇవ్వన్ని జరగాలి అంటే ప్రతి గ్రామంలో బలమైన నాయకత్వం ముందుకు రావాలి.

విద్యా, వైద్యం, ఉపాధికి పెద్ద పీట వేస్తాం

జనసేన పార్టీ అధికారంలోకి వస్తే విద్యా, వైద్యం, ఉపాధికి పెద్దపీట వేస్తాం. వైసీపీ అమలు చేస్తున్న అమ్మఒడి పథకం కొత్త పథకం కాదు. రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తాం. ప్రభుత్వ స్కూల్స్, కళాశాలను బలోపేతం చేసి, విజ్ఞానం కలిగిన టీచింగ్ స్టాప్ ను నియమిస్తాం. ఆరోగ్యశ్రీకి మించి పథకం తీసుకొస్తాం. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల హెల్త్ ఇన్సురెన్స్ చేయిస్తాం. దీనికి ప్రీమియం ప్రభుత్వం కట్టేలా ఆలోచన చేస్తున్నాం. అలాగే ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమా చేయిస్తాం. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే ప్రణాళికలు రూపొందిస్తున్నాం” అన్నారు.

రాజ్యాధికార సాధన జనసేనతోనే సాధ్యం: నరసాపురంలో జనసేనాని

Spread the love