Bandi Sanjay and Kishan reddyBandi Sanjay and Kishan reddy

బండి సంజయ్’కి ఉద్వాసన ఎవరి కోసం?
కిషన్‌రెడ్డికి మరోసారి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు
సంజయ్‌కు సముచిత స్థానంపై దృష్టి

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అధినాయకత్వం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధినేతను మార్చింది. బండి సంజయ్‌ స్థానంలో భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి, పార్టీ మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని నియమించింది. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను నియమించింది.

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పజెప్పింది. ఇందులో కిషన్‌రెడ్డి తప్ప మిగతా వారంతా వేర్వేరు పార్టీల నుంచి భాజపాలోకి వచ్చినవారే ఉండడం గమనార్హం.

తెలంగాణలో బండి సంజయ్‌ నేతృత్వంలోనే భాజపా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటుందని జాతీయ నాయకులు పదే పదే ప్రకటించారు. దేనితో పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండదని అంతా భావించారు. ఆయన పదవీకాలం ముగిసినా కొనసాగిస్తారని అందరూ భావించారు.

ప్రధానంగా బండి సంజయ్‌ పార్టీ ముఖ్యనేతల్ని విస్మరిస్తున్నారని.. అందరినీ కలుపుకొని వెళ్లడంలేదని కొందరు ముఖ్యనేతలు అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇతర పార్టీలనుంచి చేరిన నేతలకు తగిన ప్రాధాన్యం లభించడంలేదనే విమర్శలు వచ్చాయి. కొత్త, పాత నేతల మధ్య అంతరం కొనసాగుతూ వచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాష్ట్ర పార్టీపై పరోక్ష ప్రభావం చూపాయి. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారుతోందని గుర్తించిన భాజపా జాతీయ నాయకత్వం ఇటీవల ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో చర్చించింది.

అనంతరం బండి సంజయ్‌తోనూ మాట్లాడింది అని తెలిసిందే. ఈ పరిణామాల మధ్య రాష్ట్ర బీజేపీ అధినేతను మార్చాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

సమన్వయమే ధ్యేయంగా మార్పులు

బీజేపీలో సీనియర్‌ నేతగా ఉంటూ అనూహ్య పరిస్థితుల్లో భాజపాలో చేరిన ఈటల రాజేందర్‌ సేవల్ని పార్టీ ఉపయోగించుకునే అంశంలో కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావించారు. దిల్లీ నేతలు రాష్ట్ర భాజపాలో తొలిసారిగా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటలను ప్రకటించారు.

బండి సంజయ్‌ నాయకత్వంపై బీజేపీ అధినాయకత్వానికి సందేహాలు అయితే లేవు. కానీ పార్టీ నేతలందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే కిషన్‌రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో కీలక సమయంలో పార్టీకి సేవలు అందించి, బలోపేతం చేసిన సంజయ్‌కు సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సిఉంది. లేనిఎడల పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన జాతీయ నాయకులు బండి సంజయ్ కి సముచిత స్థానం కల్పిస్తారని సమాచారం.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి

Spread the love