S V Subba reddy -exhibitionS V Subba reddy -exhibition

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనశాలలను టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. తిరుప‌తి జెఈవో వీర‌బ్ర‌హ్మం, సివిఎస్‌వో న‌ర‌సింహ కిషోర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌, ఇటీవ‌ల చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల ఫ్లెక్సీల ప్ర‌ద‌ర్శ‌న‌, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు, ప్రచురణల ప్రదర్శన, విక్రయం ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. అదేవిధంగా, టిటిడి అట‌వీ విభాగం ఆధ్వ‌ర్యంలో శేషాచ‌లం న‌మూనా, న‌క్ష‌త్ర‌వ‌నంలోని వివిధ మొక్క‌లు, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిల్పకళా ప్రదర్శనలు చ‌క్క‌గా ఉన్నాయ‌ని చెప్పారు.

ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో వివిధ రంగుల, జాతుల పుష్పాల‌తో ఏర్పాటుచేసిన ప్రదర్శన ర‌మ‌ణీయంగా ఉంద‌న్నారు. త్రిలోక ద‌ర్శ‌నం, వివిధ పౌరాణిక ఘ‌ట్టాల సెట్టింగులు ఆక‌ట్టుకుంటున్నాయ‌ని చెప్పారు. మైసూరుకు చెందిన క‌ళాకారిణి ఎంఎన్‌.గౌరి రూపొందించిన శ్రీ‌కృష్ణుని విశ్వ‌రూప ద‌ర్శ‌నం సైక‌త శిల్పం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంద‌న్నారు. ఈసారి వినూత్నంగా ప్రదర్శనలు ఏర్పాటుచేశామని, భక్తులు తిలకించి తరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రదర్శనశాలలను ఏర్పాటుచేసిన ఆయా విభాగాల అధికారులను ఛైర్మ‌న్‌ అభినందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌ఇ-2 జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ‌నివాసులు, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీనివాసులు, ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో శరన్నవరాత్రి పూజలు