రైతులు, నిరుద్యోగులు, దళితులకు అన్యాయం..
ఉపాధిహామీ, విద్య, వైద్యం కేటాయింపుల్లో కోత
యూరియా సబ్సిడీల తగ్గింపుతో రైతులపై భారం
15 లక్షల ఉద్యోగాల భర్తీ వదిలి తెలంగాణలో ధర్నానా!
దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి: కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై (Budget) తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తీవ్రంగా విరుచుకు పడ్డారు. బడ్జెట్ ద్వారా తెలంగాణ (Telangana) సాధించింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. ఇది పసలేని, పనికిమాలిన బడ్జెట్ అని, ఏ వర్గానికీ మేలు చేయని బడ్జెట్ అని కెసిఆర్ అన్నారు. డొల్ల ప్రచారం, గోల్‌మాల్ గోవిందం తప్ప బడ్జెట్’లో ఏమీ లేదని, బడ్జెట్ అంతా గుండు సున్నా అని అయన ఆరోపించారు. రైతులను (Farmers), నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలూ కేంద్రం తీసుకోలేదని, దళితులను చిన్నచూపు చూసిందని, పన్ను చెల్లింపుదారుల ఆశలపై నీళ్లు చల్లిందని కెసిఆర్ (KCR) ఆరోపించారు. కరోనా కాలంలో వైద్యరంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలనే సోయి కూడా లేకపోయిందని కెసిఆర్ విచారం వ్యక్తం చేశారు.
కేంద్రంలో మెదడులేని ప్రభుత్వం ఉండటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. యువత మేల్కొనాలని, పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న బీజేపీపై తెరాస పోరాడుతుందని అన్నారు. ప్రస్తుత రాజ్యాంగంతో ప్రజలు ఆశించిన విధంగా పాలన సాగడం లేదని… దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని కెసిఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఇది చాలా దారుణమైన బడ్జెట్. అత్యంత బాధాకరం
పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం (Central Government) తీరును తప్పు బడుతూ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇది చాలా దారుణమైన బడ్జెట్. అత్యంత బాధాకరం, దురదృష్టకరం ఏమంటే మహాభారతంలోని శాంతిపర్వం శ్లోకాన్ని ఆర్థికమంత్రి (Finance Minister) ప్రస్తావించడం. పాలకులకు స్ఫూర్తిగా నిలిచిన ధర్మ మార్గం శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ఆర్థికమంత్రి పార్లమెంటు సాక్షిగా అధర్మంగా ప్రవర్తించారు. ఆమె తనకు తాను ఆత్మ వంచన చేసుకుంటూ.. దేశ ప్రజలనూ చాలా ఘోరంగా, దారుణంగా వంచించారు. బడ్జెట్లో గుండు సున్నా, కల్ల డొల్ల ప్రచారం.. గోల్‌మాల్ గోవిందం తప్ప.. ఎవరికీ ఏమీ లేదు. పేద ప్రజలకు దక్కింది గుండుసున్నా’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ చేసిన విమర్శలలో ముఖ్యంశాలు:
దేశంలో దాదాపు 40 కోట్లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్ కేవలం రూ.12,800 కోట్లు. చిన్న రాష్ట్రమైనా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ కింద మా ప్రభుత్వమే రూ.33,611 కోట్లు ఖర్చు చేస్తోంది. దళితుల పట్ల కేంద్ర ప్రభుత్వం దృక్పథం ఏమిటో ఈ కేటాయింపులు (Budget allocations) ద్వారా తెలుస్తున్నది.
ఏడాదిపాటు సాగిన ఉద్యమంలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోతే బడ్జెట్‌లో మాత్రం అసలు వారి ప్రస్తావనే లేదు.
ఎలాంటి ఉద్దీపనలు ఇవ్వకపోగా రూ.34,900 కోట్లుగా ఉన్న యూరియా సబ్సిడీని రూ.22,192 కోట్లకు తగ్గించారు. యూరియా సబ్సిడీ రూ.12,708 కోట్లు తగ్గించడం విచారం
కరోనాతో దేశంలో నిరుద్యోగం పెరిగింది. అనేకమంది ఉపాధి కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే ఉపాధిహామీ పథకానికీ కేటాయింపులు రూ.93 వేల కోట్ల నుంచి రూ.73 వేల కోట్లకు తగ్గించడం చేసారు.
ఆహార సబ్సిడీలను రూ.2.11 లక్షల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు తగ్గించారు.
కరోనా కాలంలో గంగానదిలో శవాలు తేలాయి. వైద్యం అందక వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, కేంద్రం ఆరోగ్యం రంగంపై ఒక్క పైసా పెంచకపోగా ఇంకా తగ్గించి శ్లోకాలు వల్లిస్తున్నారు.
బ్యాంకులను మోసగించిన వారికి వేల కోట్లు సబ్సిడీలు ఇస్తరు. బీజేపీ పాలన అంటే దేశాన్ని అమ్ముడు, మతపిచ్చి లేపుడు.. మంది మీద పడి ఏడ్చుడు.
అమెరికా కంపెనీలకు బ్రోకర్‌గా.. వరల్డ్ హంగర్ ఇండెక్స్‌లో మనదేశం నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే అధ్వాన్నంగా ఉంది. మొత్తం 116 దేశాలకు ర్యాంకులు ఇస్తే మనం 101వ స్థానంలో ఉన్నాం. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన ఘనత.
అద్భుతమైన ఎల్‌ఐసీని (LIC) అమ్మేస్తామని బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తున్నాం.
2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ధరలు పెంచి రైతుల పెట్టుబడులు రెట్టింపు చేశారు. మీరు మంచి చేస్తే రైతులు ఏడాది వరకు ఆందోళన ఎందుకు చేస్తరు?
నదుల అనుసంధానం
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం (Integration of rivers) చేస్తామని ఏ అధికారంతో చెప్తారు? ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం.. తెలంగాణ, ఏపీలో ప్రవేశించే గోదావరి నది ప్రతి నీటి చుక్కపై హక్కు ఉందని బచావత్ ట్రైబ్యునల్ పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పునకు సమానమైన ఈ నిర్ణయాన్ని కాదని ఏ చట్టం ప్రకారం ఈ నదుల నీళ్లను కలుపుతారు? దేశంలో 65 వేల టీఎంసీల నీళ్లున్నాయి. కేంద్రం వాటర్ పాలసీనే సరైంది కాదు. జల్‌శక్తి మిషన్ అంట.. తాగునీళ్లందించేందుకు దేశం మొత్తానికి రూ.60 వేల కోట్లు ఏమి సరిపోతాయి. తెలంగాణలో 4 కోట్ల జనాభాకు మిషన్ భగీరథకు 40 వేల కోట్లు ఖర్చు చేశాం. వాళ్లిచ్చే రూ.60 వేల కోట్లు దేశం మొత్తానికి ఏం సరిపోతయి? అంటూ కెసిఆర్ విరుచుకు పడ్డారు.
ఆర్బిట్రేషన్ సెంటర్ తరలింపు
ఆర్బిట్రేషన్ సెంటర్ (Arbitration Center) తరలిస్తున్నారు.. ఐటీ సంస్థలు, పెట్టుబడిదారుల మధ్య గొడవలు పరిష్కరించుకునేందుకు విదేశాల్లోని ఆర్బిట్రేషన్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు (Supreme Court) చీఫ్ జస్టిస్ (Chief Justice) ఎన్.వి.రమణ సహకారంతో హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను అద్దె భవనంలో ఏర్పాటు చేశాం. దీనికి ప్రభుత్వం తరఫున రూ.300 కోట్లు విలువ చేసే స్థలం, భవనం నిర్మాణానికి రూ.50 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రధాని మోదీ కురుస బుద్ధి చూపిస్తూ.. హైదరాబాద్‌లో ఎందుకు? అహ్మదాబాద్‌లో పెట్టాలంటున్నారు. బడ్జెట్లో కూడా గిఫ్ట్ సిటీలో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారా?
కొత్త రాజ్యాంగం కావాల్సిందే
దేశానికి కొత్త రాజ్యాంగం (Constitution) కావాలి. చాలా దేశాలు మార్పులకు అనుగుణంగా వాటి రాజ్యాంగాలను సవరించుకొంటున్నాయి. కొత్త రాజ్యాంగంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగితీరాల్సిందే. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ప్రజలు ఆశించినట్లు పాలన జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త రాజ్యాంగం కావాల్సిందే అంటూ కెసిఆర్ విరుచుకు పడ్డారు.