Amit Shah and Mamatha

మమతా (Mamatha) దీదీ భాజపాకు (BJP) తగిన గుణపాఠం చెప్పింది. తాను పంతం బడితే పోరాడి విజయం సాధించి తీరుతానని మరోసారి రుజువు చేసింది. ఆమె గాయపడిన ప్రతిసారి మరింత బలంతో రాజకీయాల్లో ఎదుగుతారనే మాటను నిలబెట్టుకొంది.

పడి లేచిన బెంగాల్‌ టైగరై వైనం ఎట్టిదనిన

కాంగ్రెస్‌ పార్టీలో (Congress) యువనాయకురాలిగా మమత (Mamatha) కెరీర్‌ మొదలు పెట్టింది. ఆ తరువాత ఇందిరా కాంగ్రెస్ జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. 1984లో కమ్యూనిస్టు దిగ్గజం సోమ్‌నాథ్‌ ఛటర్జీని (Somnath Chatterjee) జాదవ్‌పూర్‌లో ఓడించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

2000 సంవత్సరంలో కాంగ్రెస్‌ నుంచి వేరుపడి సొంతంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ను (Trunamul Congress) ఏర్పాటు చేసిన దీదీ ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలో నందిగ్రామ్‌ (Nandigram) ఉద్యమ సమయంలో 2006,2007లో పలు మార్లు ఆమెపై దాడులు జరిగాయి.

2010లో ఆమె రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆమె కాన్వాయ్‌ను ఓ ట్రక్కు ఢీకొంది. ఇది కూడా ఆమెపై జరిగిన హత్యాయత్నమనే అనుమానాలు ఉన్నాయి.

2021 ఎన్నికల ప్రచార సమయంలో మరోసారి తనపై దాడి జరిగిందని మమత ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె కాలికి గాయం కావడంతో కట్టుకట్టుకొనే ప్రచారంలోకి దిగారు. ప్రతిపక్షాలు ఆమెది ఓ ఎమోషనల్‌ డ్రామాగా ఎద్దేవా చేసినా మమతా పట్టించు కోలేదు. బెంగాల్‌ను గెలుస్తానని సవాల్‌ విసిరి, చేసి చూపించారు.

నేటి ఫలితాలను గత ఎన్నికలతో పోల్చి చూస్తే!

భాజపా 2019 ఫలితాలను అతిగా ఊహించుకొని అబాసు పాలు అయ్యింది. నిజానికి ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటేస్తున్నామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొంటారనే అంశాన్ని బీజేపీ పెద్దలు విస్మరించారు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీని ప్రధానిగా చూడాలనుకొని భాజపాకు ఓటువేశారు అనేది గమనించాలి. ఆ అంశాన్ని పశ్చిమబెంగాల్‌లో మార్పు కోరుకొంటున్నట్లు భాజపా అతిగా ఊహించుకొంది.

2009 పార్లమెంట్‌ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని టీఎంసీ- కాంగ్రెస్‌ బృందం భారీగా సీట్లు సాధించింది. అదే ఊపును 2011 శాసన సభ ఎన్నికల్లో మమత అంది పుచ్చుకొని ౧౮౪ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి తమకు కూడా అలానే అవుతుందని భాజపా ఆశపడింది. కానీ, పశ్చిమ బెంగాల్‌ ప్రజలు వేరేలా భావించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కంటే తక్కువ శాతం ఓట్లు బీజేపీకి దక్కాయి. కాకాపోతే ప్రధాన ప్రతిపక్షాల నుంచి హిందూ ఓట్లు, టీఎంసీ నుంచి కొన్ని ఓట్లు దక్కించుకొని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించడం ఒక్కటే బీజేపీకి ఊరటనిచ్చింది అని చెప్పాలి