మూడు ముక్కలాట ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తాడు
పొద్దున పథకమని డబ్బిస్తాడు.. సాయంత్రం సారాయితో పట్టుకు పోతాడు.
కడశ్వాస వరకు రాజకీయాలు ప్రజల్నీ వదలను
గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే ఓకే.. లేదంటే ఒంటిరిగానే
సరైన రాజు లేకపోతే సగం రాజ్యం నాశనం అవుతుంది
జనసేననే మెరుగైన పాలన అందిస్తుంది.
వలసల రాజధానిని ఆర్థిక రాజధాని చేస్తాం
గిరిజన యువతకు గంజాయి సాగు కష్టాన్ని తప్పిస్తాం
రణస్థలం యువశక్తి సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగ పాఠం యధాతధంగా:-
మూడు ముక్కల ముఖ్యమంత్రికి ఆటీన్ రాజులు డైమండ్ రాణీలు బాగా తెలుసు.. అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని కుట్ర చేస్తున్నారు. గాంబ్లింగ్ మీద ఈ ముఖ్యమంత్రికి మంచి పట్టు ఉన్నది. అందుకే ఆ ముక్కల పద్దతి వదలడం లేదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శించారు. పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారాయి కింద పట్టుకుపోతాననే ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రిని నమ్మొద్దన్నారు. జనసేన పార్టీ ప్రభుత్వం వస్తే ఈ ముఖ్యమంత్రి కంటే గొప్పగా పథకాలు అందచేస్తాం. ఒక్క పథకం కూడా తీసేయం అని జనసేనాని అన్నారు.
ఉత్తరాంధ్రను వలసల రాజధాని కాదు. ఆర్థిక రాజధానిగా చేస్తామని పవన్ తెలిపారు. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వివేకానంద వికాస వేదిక నుంచి సభకు లక్షలాదిగా హాజరైన యువతను ఉద్దేశించి సుధీర్ఘ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై జగన్ పాలన తీరుపై నిప్పును చెరిగారు.
మీ బంగారు భవిష్యత్తు నా బాధ్యత
మనల్ని ఎవడ్రా ఆపేది. యువతరానికి ఏం సంపద వదిలిపెట్టాం. యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప. గాయాలు, బాధలు, వేధనలు తప్ప. కలలు తప్ప.. పిరికితనం మోసం తప్ప. ఒక దేశపు సంపద నదులు కాదు. అరణ్యాలు కాదు. ఖనిజాలు కాదు. కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువతకు స్వామి వివేకానంద జయంతి రోజున హృదయ పూర్వక నమస్కారాలు. మీ బంగారు భవిష్యత్తు కోసం బాధ్యతగా పని చేస్తామని తెలియచేస్తూ సభను పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
నాకు ఓనమాలు నేర్పిన నేల ఉత్తరాంధ్ర
చేతికి చేతి కర్ర కావాల్సిన రోజు వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంది. ఒక తరం పెరుగుతూ వయసు వచ్చేస్తుంటే భావితరం తాలూకు విలువ తెలుస్తుంది. ఇప్పుడున్న నాయకులు వారి బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు. మీ తరం కోసం మీ బిడ్డల కోసం ఆలోచించడం లేదు. నేను ఇన్ని కోట్ల మందికి తెలిసి ఉండొచ్చు. అయినా నేను సగటు మధ్య తరగతి వ్యక్తినే. సామాన్యుడినే.
నాకు ఉత్తరాంధ్రకు సంబంధం ఉంది. నటనలో ఓనమాలు నేర్పింది ఉత్తరాంద్రే. ఆట, పాట, కవిత, కళ, నాకు నటన నేర్పిన గురువు ఉత్తరాంధ్ర. ఏం పిల్లడో ఎల్ద మొస్తవా అన్న వంగపండు స్ఫూర్తితో నటన నేర్చుకుంటున్న సందర్భంలో నాకు రాజకీయ సామాజిక చైతన్యం నేర్పిన నేల ఇది. ఆ చైతన్యం ఉత్తరాంధ్రలో వచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న స్టీల్ ప్లాంట్ లో పని చేసే ఉద్యోగులు చాలా మంది నటన నేర్చుకునే సమయంలో నాకు అండగా ఉండే వారు అని సేనాని అన్నారు.
నాకున్నది సగటు మనిషి ఆలోచనే
నేను తిట్టడానికి మీటెంట్ పెట్ట లేదు. నాకున్నది సగటు మనిషి ఆలోచన. కొంత మంది ఎందుకో ప్రత్యేక పరిస్థితుల్లో పుడతారు. విద్య, వైద్యం, ఉపాధి కొంత మందికే ఎందుకు దొరుకుతాయి? కష్టం వస్తే ఈ శాఖలు సాయం ఎందుకు చేయవు. దేశం ఎందుకు సాయం చేయదు. అన్న కోపం ప్రతి సగటు మనిషిలో ఉంటుంది. నేనూ అలాంటి సగటు మనిషినే. మన దేశం మహనీయుల త్యాగాలు నాలో బాధ్యత పెంచాయి. దేశ భక్తిని పెంచాయి. కష్టజీవులకు అండగా ఉండమని చెప్పాయి.
సినిమాల్లోకి వెళ్లినా అనుక్షణం నా మనసు కష్టాల్లో ఉన్న ప్రజల గురించి, ఉద్యోగం ఉపాధి లేని యువత గురించే ఆలోచించింది. నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. నేను తొలిప్రేమ నుంచి ఖషీ వరకు సమాజం గురించే మాత్రమే ఆలోచించాను. నాకు కోరికలు లేవు. ఖుషీ తర్వాత ఇంకా పెద్ద స్టార్ అవ్వొచ్చేమో, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెళ్లొచ్చేమో అనుకున్నాను. నా మనసు మాత్రం ఎప్పుడూ బాధల్లో ఉన్న వాళ్ల గురించే ఆలోచించేది. అది నన్ను ఆనందంగా ఉండనివ్వలేదు. నేను ఈ రోజున ప్రతి ఎదవ చేత, సన్నాసి చేత, మాటలు అనిపించుకుంటున్నా నాకు బాధ లేదు. నేను ఇటువంటి ఎదవలు, సన్నాసుల చేత మాటలు అనిపించుకోకుండా గడిపేయగలను.
ఇటువంటి సన్నాసులు రాజకీయాల్లోకి రాకముందు నా పక్కన నిల్చుని ఫోటోలు కూడా తీయించు కున్నారు. మీకోసం పోరాటం చేసి అలాంటి ఎదవలతో తిట్టించుకోవడాన్ని విజయంగానే భావిస్తాను. నేను నా కోసం కంటే సాటి మనిషి కోసం జీవించడానికే ఇష్టపడతా. అధికారం రాగానే బానిసల్లా చూస్తారు. దేశభక్తి రాజ్యాంగం దేశానికి సంబంధించిన విధులు. సామాజిక బాధ్యతలు అంటూ పుస్తకాల్లో చెప్పిన రాజకీయ నాయకులు బయటికి వచ్చి బాధ్యత లేకుండా మాట్లాడతారు. అధికారంలో కూర్చోగానే మనం వారి బానిసల్లాగా చూసే వ్యక్తిత్వాలు నాకు చిరాకు కలిగించాయి. సినిమాల్లో రెండున్నర గంటల్లో సమస్యలు తీర్చేయొచ్చు.
ఉద్దానం సమస్య ఇప్పటికీ తీర్చలేదు
నిజ జీవితంలో ఉద్దానం సమస్య ఇప్పటికీ తీర్చలేదు. రాష్ట్ర విభజన జరిగిన తీరు చూసి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నాదగ్గర ఎవరూ లేదు. ఇంత సమూహం నా వెంట ఉంటారని తెలియదు. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అందరిలాగా మెటికలు విరుస్తూ కూర్చోవాలా? నా దేశం కోసం సమాజం కోసం ముందుకు రావాలా? అని ఆలోచించి నప్పుడు మహా అయితే నా ప్రాణం పోతుంది. కానీ ఒక సత్యాన్ని బలంగా మాట్లాడిన వాడినవుతాను అనిపించింది.
నాకు పిరికితనం చిరాకు. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? అన్న సిద్ధాంతాన్ని పాటించే వాడిని. మొన్న టిడ్కో ఇళ్ల గురించి విజయనగరం వస్తే యువత మాట్లాడేందుకు భపడుతున్నారు. కోపం ఉంది కానీ భయం ఉంది. ఈ రాజకీయ నాయకులు ఏమైనా దిగి వచ్చారా? మనలా వారికి రక్తమాంసాలే ఉన్నాయి. మనం ఒక దెబ్బ కొడితే వారికి తగులుతుంది.
ఇది కళింగాంధ్ర కాదు కలియబడే ఆంధ్ర
ఈ దేశంలో మనల్ని నిందించే రాజకీయ నాయకుడికి ఎంత హక్కు ఉందో వారిని మించిన హక్కు మనకీ ఉంది. ఇది ఉత్తరాంధ్ర పోరాట గడ్డ. ఇది కళింగాంధ్రకాదు కలియబడే ఆంధ్ర. తిరగబడే ఆంధ్రకు చెందిన మీరే కామ్ గా ఉంటే ఎలా? ఉపాధి అవకాశాలు లేనప్పుడు నాయకుల్ని నిలదీయకపోతే ఎలా? వలసలు వెళ్లిపోయే మీరు నాయకుల్ని అడగకపోతే ఎలా? నాకు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జీవితం ధైర్యం నేర్పింది. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో శ్రీ శ్రీ గారి మహాప్రస్తానం నేర్పింది. ఒక రావి శాస్త్రి, ఒక చాసో ఇలాంటి ఎందరో మహానుభవుల్ని చదివాను. శ్రీకాకుళం నేల ఎంత గొప్పదో గిడుగు రామ్మూర్తి గారి జీవితమే ఉదాహరణ.
శ్రీ గిడుగు రామ్మూర్తి గారు గిరిజనుల కోసం, సవరల కోసం చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. వినలేనితనంతో తెలుగు భాష ఉద్యమం కోసం పాటుపడిన మహానుభావుడు. చివరి దశలో ఒక రచయిత అయి ఉండి పలాస రాజు గారితో గొడవ పెట్టుకుని వీధి పోరాటాలు చేశారు. అలాంటి ఆయనకు మోకరిల్లి నమస్కరిస్తున్నా. రాజకీయాల్లోకి రావడానికి ఇలాంటి మహానుభావులే కారణం.
పోరాటయాత్ర నాకు ఉత్తరాంధ్ర కష్టాలు చూపింది
స్వామి వివేకానంద గారు 30 ఏళ్ల వయసులో చనిపోయారు. శ్రీ భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులో ప్రాణత్యాగం చేశారు. శ్రీ ఆజాద్ 25 సంవంత్సరాలకు చనిపోయారు. వీరు మన కోసం రక్తం చిందిస్తే మనం ఏం చేస్తున్నాం? నేను డబ్బులు, పేరు సంపాదించి అందరిలాగే ఉంటే ఎలా అన్న ఆలోచనే నాతో పార్టీ పెట్టించింది. నాకు తెలిసిందల్లా పోరాటం చేయడమే. ఎదవల్ని బాగా ఎదుర్కోవడం తెలుసు. గుండా గాళ్లని ఎలా తన్నాలో తెలుసు. భాష, యాస, కులం, గోత్రం, మతం, ప్రాంతం ఇవన్నీ మనం కోరుకుంటే దక్కినవి కాదు.
శ్రీ జాషువా విశ్వనరుడి వైపు పయనించే వ్యక్తిని నేను. పార్టీ స్థాపించినప్పుడు గాని, ఉత్తరాంధ్రలో పోరాటయాత్ర చేసినప్పుడు గాని డబ్బులు లేవు. నా అకౌంట్ లో రూ.13 లక్షలే ఉన్నాయి. పోరాటయాత్రకు బయలుదేరినప్పుడు అకౌంట్ లో అదే రూ.13 లక్షలే ఉన్నాయి. కళ్యాణ మండపాల్లో పడుకుందాం. లేదంటే రోడ్ల మీద పడుకుందామన్నాను. నేను సిద్ధంగా ఉన్నా మా నాయకులు కొంత మంది అప్పటికి సిద్ధంగా లేరు. నేను ఎక్కువ సుఖాలు చూసినా ఈ క్షణాన వదిలేయగలను.
రోడ్ల మీద పడుకున్న వ్యక్తుల్ని, ఉద్దానంలో కిడ్నీలు కోల్పోయిన వారిని చూశాను. వారి కోసం ముందు ప్రయాణం చేద్దాం. నాతో నిలబడిన వాళ్లే నిలబడతారు. లేదంటే నడుచుకుంటూ వెళ్లామని మొదలుపెట్టిన పోరాట యాత్ర నాకు ఉత్తరాంధ్ర కష్టాలు చూపింది. అరకు గిరిజనుల సమస్యలు చూపించింది. ఉపాధి అవకాశాలు లేక గంజాయి సాగులో యువత ఎలా నలిగిపోతున్నారో చూపింది. వీరందరికీ ఏదైనా చేద్దామంటే సభలకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. మార్పు వస్తుందని కలలు కన్నాను, ఓట్లు వేసేప్పుడు నన్ను వదిలేశారు. నేను బాధపడలేదు. నాకు అవమానాలు, పరువులు లేవు. ఆశయం ఉన్న వాడికి ముందడుగే ఉంటుంది.
వ్యాపారాలు చేస్తూ పూర్తి స్థాయి రాజకీయ నాయకులెలా అవుతారు
ఎంత కాలం శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతం అనిపించుకుంటాం. 50 శాతం వలసలు ఎంత కాలం వెళ్లిపోతారు. రాజకీయ నాయకులెవరూ దీని గురించి మాట్లాడరు. నేను నిలబడదాం అంటే నాకు తోడుగా ఎవరూ నిలబడలేదు. బలంగా ఒక శాతం మాత్రమే నిలబడ్డారు. కానీ అది చట్ట సభల్లో ఎదిరించి నిలబడేంత సత్తా ఇవ్వలేదు. అయినా నేను నీరసపడిపోలేదు. అవమానపడలేదు. రెండు చోట్ల ఓడావని కించపరుస్తుంటే యుద్ధం తాలూకు గాయాలుగా తీసుకున్నాను.
రణస్థలంలో మాటిస్తున్నా నా కడశ్వాస వరకు నేను రాజకీయాల్ని వదలను. మిమ్మల్ని వదలను. దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు ఎవరున్నారు. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అంటే అతన్ని పార్టీ బాగా చూసుకోవాలి. లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తులన్నా ఉండాలి. వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తూ మేము పూర్తి స్థాయి రాజకీయ నాయకులంటే ఎలా? శ్రీ కపిల్ సిబల్, శ్రీ చిదంబరం లాంటి వాళ్లు లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తూ రాజకీయం చేస్తారు. నేను సినిమాలు చేయాలి.
నాకు వేరే దారిలేదు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్లి కాంట్రాక్టులు చేయలేను. కాంట్రాక్టులు చేస్తే పర్లేదు గాని… సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తే కుదరదు అంటే ఎలా? నా పని నేను చేసుకుంటూ నావంతు సమాజానికి నేనిచ్చే సమయం ఇది. డబ్బు అవసరం లేని రోజు వస్తే సినిమాలు వదిలేస్తా.
మీ నాన్న రాజశేఖరరెడ్డినే ఎదుర్కొన్న వాడిని..
ఉత్తరాంధ్రలో సమస్యలు ఏమున్నాయి? వెనుకబాటుతనం ఏంటి? మన భవిష్యత్తుని ఎలా చూడాలి? భవిష్యత్తుని కాలరాస్తున్న శత్రువులు ఎవరు? మన కర్తవ్యం ఏంటి? ఒక పార్టీగా నేను చేయాల్సినవి ఏంటి? మా నాయకులు ఏం చేయాలి? అని చూస్తే రాష్ట్ర విభజన నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనలు అందరికీ తెలుసు. 2014 నుంచి సమీక్ష చేసుకుంటే.. విడిపోయిన రాష్ట్రం.. కూలిపోయిన ఆశలు… పూర్తి చేయని పోలవరం.. నిరుద్యోగులకు దక్కని ఉద్యోగాలు.. ఉద్యోగులకి రాని జీతాలు.. రైతులకు అందని గిట్టుబాటు.. వృద్దులకు అందని పింఛన్లు.. విద్యార్ధులకు చెల్లించని ఫీజు బకాయిలు..
ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంది ఇది. వీళ్లు చేసిన అభివృద్ధి గుంతల మధ్యలో రోడ్లు.. వైసీపీ రంగులు వేసుకున్న ప్రభుత్వ కార్యాలయాలు.. బూతులు తిట్టే మంత్రులు.. బెదిరించే గూండాలు.. మన ఆస్తులు, పొలాల ఆక్రమణలు.. రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేద్దామన్న కుతంత్రాలు.. ఈ మూడు ముక్కల ఆలోచనలు వైసీపీకి చాలా ఎక్కువ. ఇదో మూడు ముక్కల ప్రభుత్వం.. ఈయనో మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఏదైనా మాట్లాడితే దత్తపుత్రుడంటాడు. నోటిదాకా నాకు చాలా మాటలు వస్తాయి. తిట్టాలనిపిస్తుంది. మూడు ముక్కల ముఖ్యమంత్రికి రణస్థలం నుంచి చెబుతున్నా..
మీ నాన్న రాజశేఖరరెడ్డిన ఎదుర్కొన్న వాడిని గుర్తు పెట్టుకో. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పంచెలూడేలా తరిమికొట్టండని పిలుపునిచ్చా. అది సరదాగా చెప్పలేదు. ఆ తర్వాత నా మీద దాడులు. భయపెట్టడాలు. స్టేజీలు కూల్చేయడాలు. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు. అవన్నీ పడి వచ్చా. నేను వీటికి భయపడను.
నేను యుద్ధం చేస్తావంటే చేస్తా…
మాట్లాడితే మూడు పెళ్లిళ్లంటావు. ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రి నేను మూడుసార్లు విడకాలు ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆ కాయ్ రాజా కాయ్ బ్యాచ్ ఉంటుంది. ఆటీన్ రాజాలు డైమండ్ రాణీలు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి ఓ ఢంకా పలాసు సలహాదారు. ఇలాంటి సన్నాసి చేతకాని మూడుముక్కల ప్రభుత్వం. వారి ప్రతినిధులు నన్నంటుంటే నేను అన్నింటికీ తెగించిన వాడిని. నేను నా దేశం. నా సమాజం అనుకున్నా.
నేను సున్నితమైన వ్యక్తిననుకుంటున్నారేమో. నాకలాంటి భయాలు లేవు. చాలా చిన్న వయసులో తీవ్రవాద ఉద్యమాల వైపు వెళ్తేనే న్యాయం జరుగుద్దని మదనం చేసి వెళ్లకుండా ఆగిపోయా. నా తెగింపు ఇప్పుడూ అలాగే ఉంది. అన్యాయం జరిగితే చిరాకు. మాట్లాడితే ప్యాకేజీ అంటారు.
పిచ్చి కూతలు ఆపేసి పని చూడండి
మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడుతా.. లేదంటే చెప్పులు తీసి కొడతానని చెప్పా ఒక్కసారి. రణస్థలం నుంచి మళ్లీ చెబుతున్నా.. నా చేతికి అందుబాటులో వచ్చి నువ్వు ప్యాకేజీ అను నేను ఏం చేస్తానో చెబుతా. మా జనసైనికుడి చెప్పు. మా వీర మహిళ చెప్పు తీసుకుని కొడతా. నాకు పోలీసు కేసులు, జైళ్లు పని చేయవు. సంబరాల రాంబాబు ఉంటాడు. చాలా తెలివిగా సర్వస్వం తెలిసినట్టు మాట్లాడుతాడు. ఈ పిచ్చి కూతలు ఆపేసి పని చూడండి.
నేను యద్దం చేస్తానంటే చేస్తా. సరదాగా చెప్పను. నేను రెడీ.. నేను పారిపోను. బతికున్నంత వరకు యుద్ధం చేస్తాను. మాట్లాడే ఎవర్నీ నేను మర్చిపోను. మీరు సంస్కారవంతంగా మాట్లాడితే నా అంత సంస్కారవంతుడు ఉండడు. మీరిలాంటి వెధవ వేషాలేస్తే ఎలా అడ్డుకట్టవేయాలో కూడా నాకు తెలుసు.
కులాల మధ్య చిచ్చుపెట్టి గెలవను
మట్టిపాత్రలో అన్నం పెడితే తింటా. అన్నం లేకపోతే పస్తులుంటా. సినిమాలు లేకపోతే మూసుకు కూర్చుంటా. విజయాలు వస్తే పొంగిపోయి అపజయాలు వస్తే కుంగిపోను. నేను నా నేల కోసం వచ్చా. మాట్లాడితే కాపులు నన్ను నమ్మకూడదంటున్నారు. నేను కులనాయుకుడ్ని కాదు. నేను ఒక కులం కోసం వచ్చిన వాడిని కాదు. నా అంధ్రప్రదేశ్.. నా తెలంగాణ.. నా దేశం.. నా తెలుగు ప్రజల బాగు కోసం వచ్చా. నా కాపు కులం మాత్రమే బాగుండాలని కోరుకోలేదు. అందరూ బాగుండాలని కోరుకున్నా.
ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజల గురించి మాట్లాడతాను తప్ప ఏ రోజు కుల ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. కులాల ఐక్యత అన్నానంటే ఒక కులాన్ని పెంచడానికి కాదు. వైసీపీ వాళ్లు ఒక్క కులానికే చేసుకుంటున్నారు. ఒక్క కులంతో పదవులన్నీ నింపేసుకుంటున్నారు. నా వరకు నేను నా కులం నా పక్కన నిలబడకపోతే ఓటమికి సిద్ధం తప్ప కులాల మధ్య చిచ్చుపెట్టి గెలవను.
ఆయనకు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ అంటే ఇష్టం
పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా.. సాయంత్రం సారాయి కింద పట్టుకుపోతా.. అలాంటి ప్రభుత్వం కావాలా. నవరత్రాలన్నాడు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఆయన గారికి ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ఇష్టమంట. శ్రీ లాబ్ బహదూర్ శాస్త్రి, లోక్ నాయక్ శ్రీ జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులు. శ్రీ నేతాజీ లాంటి వ్యక్తులు నేను చేసింది తప్పు అంటే భరిస్తా.. జైలుకి వెళ్లి వచ్చిన ఖైదీ నంబర్ 6093 కూడా నా గురించి మాట్లాడితే ఎలా? డీజీపీ గారు మీరు శాల్యట్ కొడుతుంది ఖైదీ నెంబర్ 6093కి, ముఖ్యమంత్రికి కాదు.
నా మీద ఇంటిలిజెన్స్ పెట్టకండి డబ్బులు వృధా. మీ గురించి ఏమనుకుంటున్నానో సభలోనే చెబుతా. మీ ఇంటిలిజెన్స్ ఐజీ గారికి వ్యక్తిగతంగా తెలుసు. ఆయన్ని అడగండి. నేను అన్నింటికీ తెగించిన వాడిని గుర్తుపెట్టుకోండి. మేము ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని తీసేస్తాం.. వలసలు ఆపుతాం.. అభివృద్ధి చేస్తాం.. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.. పరిశ్రమలు వచ్చేలా చేస్తాం.. మత్స్యకారులు గుజరాత్, చెన్నై తీరాలకు వెళ్లకుండా ఇక్కడే జెట్టీలు నిర్మిస్తాం. పాకిస్థానీ జైళ్లలో మగ్గకుండా అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చూస్తాం.
సలహాలు ఇచ్చేవాడు సజ్జల అయితే సర్వం నాశనమే
నేను మీ కోసం తిట్లు తింటున్నా.. మీ బిడ్డల భవిష్యత్తు కోసం తిట్లు తింటున్నా. కోట్లాది రూపాయిల టాక్సులు కడుతున్న నన్ను డబ్బులు తీసుకున్నానని ఈ వెధవలు మాట్లాడితే ఈ సారి మీ చెప్పులతో కొట్టండి. ఉత్తరాంధ్రలో సగటు జీవన ప్రమాణం 60 సంవత్సరాలు. 95 శాతం మందికి రక్తహీనత ఉంటుంది. ఉద్దానం ప్రాంతంలో మంచినీటి కాలుష్యం.. పారిశ్రామిక కాలుష్యం ఉంది. దాని గురించి మాట్లాడేవారు లేరు. మీరు జనసేనను నమ్మి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. అధికారం కంటే మీ జీవితాలు బాగుండాలని నిలబడే వాడిని నేను.
శిక్షపడేలా చేస్తానని మాటిస్తున్నా
అధికారం లేకపోయినా ఉద్దానం కోసం నిలబడ్డాం. బోస్టన్ నుంచి డాక్టర్ జోని తీసుకువచ్చాం. 396 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న నేల ఇక్కడ ఎన్ని జెట్టీలు నిర్మించొచ్చు. ఎందుకు చేయరో ఆలోచించండి. రణస్థలంలో 18 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్ధిని చంపేశారు. 2021లో జనవరి 7న అనుమానాస్పద రీతిలో చనిపోతే ఇప్పటి వరకు పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదు. రాజీ కోసం బేరాలు మాట్లాడుతున్నారు. ఆ విద్యార్ధి తల్లికి దోషులకు శిక్షపడేలా చేస్తానని మాటిస్తున్నా.
మా ప్రభుత్వాన్ని తీసుకురండి. ఈ కేసు విషయమై మంత్రి దగ్గరకు వెళ్తే మూడు బస్తాలు బియ్యం ఇస్తా తీసుకెళ్లమన్నాడు. ఇది కడుపు మండే విషయం కాదా? ఇలాంటి వాళ్లని ఇంకోసారి గెలిపిస్తారా? సరైన రాజు లేకపోతే సగం రాజ్యం నాశనం అవుతుంది. సలహాలు ఇచ్చేవాడు సజ్జల అయితే సంపూర్తిగా నాశనం అయిపోతుంది.
ఉత్తరాంధ్ర ఆస్తులు తాకట్టు పెడుతుంటే ఎందుకు మాట్లాడరు
వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య కంటకులు. మేమే ఉండాలని ఆలోచన చేసేవాళ్లు. ఇది ఒక కులం సొంతం కాదు. వైసీపీ సొంతం అంతకంటే కాదు. మూడు ముక్కల ముఖ్యమంత్రి సొంతం కాదు. మనం మేల్కోకపోతే.. మన హక్కుల్ని పరిరక్షించుకోకపోతే మీ జీవితాలు ఇలాగే ఉంటాయి. మీకు ఉపాధి అవకాశాలు రావు. మీ కోసమే చెబుతున్నా. మీకోసం నేను ప్రాణత్యాగానికి సిద్ధం..
ప్రత్యేక రాష్ట్రం ఉత్తరాంధ్ర మా డిమాండ్ అని వైసీపీ నాయకులు అంటున్నారు. ప్రతి నాయకుడు మీ ఊరిని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించేసుకోండి. ఎవరూ అడగరు. 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా ప్రకటించేసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు పాలించేసుకోండి. ప్రజలంతా మీకు బానిసలుగా బతుకుతారు. విభజన సమయంలో స్టీల్ ప్లాంట్ కోసం గనులు ఎందుకు అడగలేదు. మీకు పదవులు లేకపోతే రాష్ట్రాన్ని దేశాన్ని ముక్కలు చేసేస్తారా? మీరు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? రాష్ట్రాలను, దేశాలను ముక్కలు చేస్తామంటే మిమ్మల్ని ముక్కలుగా కొడతాం.
ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే
ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే 1280. 70 ఎకరాలు విస్తీర్ణం ఉన్న ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తే ఆ రోజు మీ ప్రేమ ఏమైంది. శ్రీ ధర్మాన ప్రసాదు గారు రూ.2954 కోట్ల విలువైన ఆస్తిని తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పు చేసినప్పుడు ఏమైంది ఉత్తరాంధ్ర మీద ప్రేమ. ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది సరిహద్దుల్లో యుద్ధాలు చేస్తారు. వారికి ప్రభుత్వ స్థలం ఇస్తే ఆ స్థలాలను కాజేసిన మహానుభావులు. మీరు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇస్తే అప్పడంలా.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి మీ చరిత్రంతా తెలుసు
ఆంధ్రప్రదేశ్, విశాఖ పేరు ఈ మధ్య అరకు గంజాయికి ఫేమస్ అయ్యింది. శీలావతి అనే క్వాలిటీ గంజాయి దొరుకుతుంది. చాలా మత్తుగా ఉంటుంది నోటికి వచ్చింది మాట్లాడ వచ్చు మన సంబరాల రాంబాబు లాగా అని చెప్పుకుంటున్నారు. మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా విమర్శిస్తారు. నేను వ్యక్తిగతంగా విమర్శించాలంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నప్పటి నుంచి మీ చరిత్ర నాకు తెలుసు. ఆయన సన్నిహతులు కూడా నాకు తెలుసు. ఈ మహానుభావుడి వ్యవహారాలు మొత్తం వినేవాడిని. వ్యక్తిగత జీవితాలు మాట్లాడాలంటే నేను మీకంటే మహానుభావుడ్ని. మీరంతా నా గురించి మాట్లాడితే రణస్థలం నుంచి చెబుతున్నా మీకు యుద్ధమే. ఉంటే ఉంటాం పోతే పోతాం. గెలిస్తే గెలుస్తాం.. ఓడిపోతే ఇంకోసారి ఓడిపోతాం.
ఉద్యోగం కోసం మీరు జీవితాంతం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందా? మీకివ్వని ఉద్యోగాల కోసం వాళ్లు జీతాలు తీసుకుంటున్నారు. సంబరాల రాంబాబు, ఐటీ మంత్రి పేరు గుర్తు లేదు. పరీక్షల పేరిట నిరుద్యోగుల్ని నిలువుదోపిడి చేయడం మానాలని ఉత్తరాంధ్ర యువత కోరారు. నిరుద్యోగుల దోపిడీని కుంభకోణంగా భావించాలని మెమొరాండం ఇచ్చారు. వెనుకబడిన విద్యార్ధుల భవిష్యత్తుపై భయాన్ని తొలగించాలి.
మట్టిలో మాణిక్యాల్ని భారతరత్నాలుగా
గ్రామాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాల్ని భారతరత్నాలుగా మార్చే ప్రణాళిక రూపొందించాలి. ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు బ్లైండ్ క్రికెట్ ఆడారు. మీరు కొదమ సింహాలు. గ్రామ సింహాలు మిమ్మల్ని పాలిస్తున్నాయి. ఊరకుక్కలు మాట్లాడుతుంటే మౌనంగా ఉంటే ఎలా? మీరు ధైర్యంగా నిలబడితే బంధించి ఉంచిన జైలు గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే చాలదు… మీరు రోడ్ల మీదకు వచ్చి కార్మికులకు అండగా నిలబడండి. మీ గొంతును నేను ప్రధాన మంత్రి గారి దగ్గరకు, శ్రీ అమిత్ షా గారి దగ్గరకు తీసుకువెళ్తా. రాష్ట్రాన్ని బాగు చేయమని కోరతా.
మీరు పట్టుమని పది మందిని గెలిపించి ఉంటే మీకోసం బలంగా సభల్లో పోరాడే వాడిని. ఇవ్వలేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నాను. రెండు చోట్ల ఓడిపోయినోడని డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతుంది. యువత కోసం డైమండ్ రాణీతో కూడా తిట్టించుకోవడానికి సిద్ధం. ఉత్తరాంధ్ర నేతలు మట్టి, ఇసుక కూడా తినేశారు. మీరు మీ నాయకులకు భయపడకండి. కేసులుకు భయపడవద్దు. భరించండి. తిడుతున్నా నేను మీ కోసమే భరిస్తున్నా..
బాంబులేస్తామంటే మేము చూస్తూ కూర్చుంటామా?
బీమ్లానాయక్ సినిమా ఆపితే రూ. 30 కోట్లు నష్టం వస్తే నేను భరించలా? స్వాతంత్రం నా జన్మహక్కు. ప్రజాస్వామ్యం నాది. నేను ఈ దేశంలో పౌరుడ్ని . నువ్వు ముఖ్యమంత్రివైతే నేను సామాన్యుడిని. నోటికి వచ్చిందల్లా వాగకు బాధ్యతగా మాట్లాడు. ముందు పేపర్లు చూసి చదవడం మానేయండి. మేము ఫ్యాక్షన్ లీడర్లం బాంబులేస్తామంటే మేము చూస్తూ కూర్చుంటామా? పోలీసుల్ని పెట్టి తన్నించేస్తే తన్నించుకుంటామా? కేసులు ఎంత మంది మీద పెడతావు. పులివెందుల నుంచి కిరాయి సైన్యాన్ని తెస్తామంటే తీసుకురా? మెరిసే మెరుపు కూడా రెండో క్షణంలో ఉండదు.
సద్దాం హుస్సేన్ నుంచి గడాఫీ వరకు చరిత్రలో ఎంత మందిని చూశాం. ప్రజా సంకల్పానికి వ్యతిరేకంగా వెళ్లిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా పరాజయం పాలయ్యారు. ఆవిడ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఇలాంటి సైకో పాత్ ల మాటలు ఎలా వింటున్నారో తెలియదు. అసందర్భంగా నవ్వుతాడు అది సైకో పాత్ లక్షణం.
చంద్రబాబు నాయుడుతో ఏం మాట్లాడానంటే…
గత ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో 6.95 శాతం ఓట్లు వచ్చాయి. అవన్నీ ఒక్క చోటే వచ్చి ఉంటే ఈ రోజు జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండే వారు. ఇచ్చాపురం గెలిపిస్తే జనసేన ఎమ్మెల్యే ఉండే వారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే.. ఓటు చీలడం వల్లే ఆ పార్టీ టెక్నికల్ గా గెలిచింది. శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే బేరాలు కుదిరిపోయాయని పిచ్చి కూతలు కూస్తున్నారు. నేనలాంటి వాడిని కాదు. రూ.25 కోట్ల టాక్సు కట్టే సత్తా ఉన్న వాడిని. విశాఖలో ఆపినప్పుడు మన కోసం వచ్చారు. సానుభూతి తెలపడం మా బాధ్యత. మాట్లాడితే రెండున్నర గంటలు ఏం మాట్లాడారు అని అడుగుతున్నారు. మొదటి పది నిమిషాలు బాగున్నారా అంటే బాగున్నారా అని పలుకరించుకున్నాం.
11వ నిమిషం నుంచి పోలవరాన్ని చేసే ఇరిగేషన్ మంత్రి సంబరాల రాంబాబు గురించి 23 నిమిషాల రెండు సెకన్లు మాట్లాడుకున్నాం. తర్వాత సన్నాసి ఐటీ మంత్రి రాష్ట్రాన్ని 15వ స్థానంలో పెట్టేశాడు ఏంటని 18 నిమిషాలు మాట్లాడుకున్నాం. శాంతి భద్రతల గురించి 35 నిమిషాలు మాట్లాడుకున్నాం. మళ్లీ టీ ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి. అనేది మాట్లాడుకున్నాం.
చివరిగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని చెప్పా. వైసీపీ అద్భుతంగా పాలిస్తుంటే నేను గొంతెత్తేవాడిని కాదు. బాగా పాలిస్తుంటే చప్పట్లు కొట్టే వాడిని. ప్రజల్ని బాధిస్తుంటే ఎదురుతిరుగుతాం. గతంలో టీడీపీని తిట్టావుగా అంటే ఇంకా ఏం విధానాలు మిగిలి ఉన్నాయి. సర్దుకుపోక తప్పదు.
పంచాయితీల నిధులు రావడం లేదు
వేదిక మీద వైసీపీ ఎంపీటీసీ జనసేనలో చేరారు. పంచాయితీల నిధులు రావడం లేదు అని చెప్పారు. మీరు పోరాటం చేయకపోతే ఎలా వస్తాయి? మీరు జనసేన స్టాండ్ తీసుకున్న రోజున మీ నిధులు దారిమళ్లించం. జనసేన ప్రభుత్వం పూర్తి స్థాయిలో వచ్చినా మిశ్రమ ప్రభుత్వం వచ్చినా పంచాయితీలకు అండగా నిలబడతాం. కోస్టల్ కారిడార్ నిధులు దారిమళ్లించం. నాకు ఆర్ధిక అవసరాలు లేవు. ఇంతకాలం అవినీతి పరుల పాలన చూశారు. నిజాయితీపరుల పాలన ఒక్కసారి చూడండి.
ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు. సొంత డబ్బునే వదిలేసుకున్నా. రైతు భరోసా కోసం ఎవరైనా డబ్బు ఇస్తే దాన్ని వేరే అకౌంట్ లో వేస్తున్నాం. ఒక్కసారి నమ్మక తప్పదు. నమ్మకపోతే మార్పు రాదు. వారాహితో వస్తాం. వాహనం సిద్ధంగా ఉంది. ఎవడాపుతాడో నేనూ చూస్తా. 151 మంది వచ్చినా భయపడం. ఈ దేశంలో మీకు ఎంత హక్కు ఉందో అంతకు మించి హక్కు మాకుంది.
ఒంటరిగా వెళ్లి వీర మరణాలు అవసరం లేదు
వచ్చే ఎన్నికలకు ఓటు చీలకూడదు. అలా అని నేను సీట్ల గురించి మాట్లాడలేదు. మాట్లాడను కూడా. వ్యూహం ఉండాలి. ఒంటిరిగా వెళ్లి వీర మరణాలు అవసరం లేదు. ఒంటరిగా వెళ్తే గెలిపిస్తామని గ్యారెంటీ ఇస్తారా? మీరంతా నా కుటుంబం అనుకున్నాను. నా కుటుంబమే నిలబడకపోతే నేను మాత్రం ఏం చేయను. నేను చాలా పకడ్బందీగా ఆలోచించే చెబుతున్నా. ఒంటరిగా వెళ్లడానికి ఇబ్బంది లేదు. భయపడే వ్యక్తిని కాదు.
రాజకీయం నాకు బాధ్యత. కొన్ని కులాలను వర్గశత్రువులుగా ప్రకటించి, మతాల మధ్య చిచ్చు పెడితే కుదరదు. దేవాలయాల్ని అపవిత్రం చేసిన వారిని శిక్షించకుండా వదిలేయడం కుదరదు. ఒంటిరిగా వెళ్లే స్థాయిలో మీరు నాకు నమ్మకం కలిగిస్తే నేను అప్పుడు నిలబడతా. అందర్నీ హింసించే వాడిని ఎదుర్కోవాలి. అలా అని గౌరవం తగ్గకుండా లొంగిపోకుండా కుదిరితే చేస్తాం. లేదా ఒంటరిగానే వెళ్తాం. ఎక్కడా తగ్గం. నేను ధామాషా పద్ధతి అని చెప్పాను.
రాజకీయం అంతా మూడు కులాల చుట్టూతే తిరగడమేంటి? రెడ్డి, కమ్మ, కాపు అంటారేంటి? మిగిలిన కులాలు లేవా? ఇది మారాలని నేను కోరుకుంటున్నా. రూలింగ్ కాస్ట్ కాన్సెప్ట్ కి నేను వ్యతిరేకం. మనమంతా సమానం అన్ని కులాలు సమానం. కొన్ని కులాలు సమానత్వానికి పెద్దన్న పాత్ర పోషిస్తానంటే మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం.
మీరు మారకుంటే మరో ఐదేళ్లు ఎగిరిపోతాయి
మీరు నిలబడకపోతే మార్పు రాదు. మన కోసం ఒక తరం త్యాగం చేస్తే ఆత్యాగాల ఫలితాల కారణంగా ఉన్నాం. స్వతంత్రం కావాలంటే చిన్నపాటి కష్టాలు తప్పవు. మీరు అది కూడా చేయలేమంట నేనేం చేయలేను. నన్ను చంపడానికి సుపారీ ఇచ్చారు. మేము రాకపోతే చంపేస్తామంటే ఇటువంటి పనికిమాలిన వెదవలకి భయపడను. ఉత్తరాంధ్ర వలసలు నివారించడానికి.. మీకు జెట్టీలు నిర్మించడానికి నేను సిద్ధాం ఉన్నను. మీరు అల్లూరి స్ఫూర్తితో బయటకు రావాలి.
పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా.. సాయంత్రం సారాయి కింద పట్టుకుపోతా అనే ప్రభుత్వం కావాలా? నవరత్రాలు అన్నాడు. పథకాలు ఇస్తున్నాడు. జనసేన ప్రభుత్వం వస్తే నేను మా ప్రభుత్వం మీకు వచ్చే పథకాలు ఇంకా మంచిగా ఇస్తాం తప్ప తీసేయం. అమ్మఒడి పథకానికి రూ. 15 వేలు రోజుకి 35 రూపాయిలు. ఆటో సోదరులకు ఇచ్చేది రూ. 10 వేలు. రోజుకి రూ. 27 వైఎస్ఆర్ చేయూత కింద రోజుకి 51 రూపాయిలు, నేతన్న నేస్తానికి 65 రూపాయిలు రోజుకి. ఆ డబ్బుకి అమ్ముడు పోకండి. మీకు మేము భవిష్యత్తు ఇస్తాం.
అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తాం. పరిశ్రమలు లేకుండా సంక్షేమ పథకాలు ఎలా సాధ్యం? పరిశ్రమలు పెట్టాలంటే వాటాలు అడిగితే ఆంధ్రప్రదేశ్ కి ఎవరొస్తాడు. ఉత్తరాంధ్రలో జీడి తోటలు ఉన్నాయి క్యాషూ బోర్డు పెట్టారా? పలాసలో కొబ్బరి తోటలు ఉన్నాయి. కోకోనట్ బోర్డు పెట్టారా? మేము పెట్టిస్తాం. జెట్టీలు కట్టిస్తాం. జీవో 217ని ఇలా చించేశాం. మేము నిలబడతాం. పారిపోము.
మీరు నిలబడాలి. ఈ సారి కూడా మీరు మారకుంటే మరో ఐదేళ్లు జీవితం ఎగిరిపోతుంది. ఇంత ఊడిగం చేసే పోలీసులకు ఒక్కో ఉద్యోగికి టీఏ, డీఏ, సరండర్ లీవ్ డబ్బు కలిపి లక్షా 45 వేలు ఇవ్వాలి. పోలీసు ఉద్యాలకు వయో పరిమితి పెంచాలి. నోటిఫికేషన్ ఇవ్వకుండా. మూడేళ్లు వయోపరిమితి మాత్రమే పెంచుతామంటే కుదరదు. మీరు చేసిన తప్పుకి తెలంగాణ మాదిరి 5 ఏళ్లు వయోపరిమితి పెంచాల్సిందే.
కోటి కంటే నాకు కోట్లాది జీవితాలే ముఖ్యం
జనసేన పాలనలో ఉత్తరాంధ్ర వలసలు ఆపుతాం. విశాఖ పారిశ్రామికవాడల్లో సెఫ్టీ ఆడిట్ చేయిస్తాం. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు నిర్మిస్తాం. అక్రమ మైనింగ్ చేస్తే శిక్షిస్తాం. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి తీసుకు వస్తాం. వలసల రాజధానిని ఆర్ధిక రాజధానిని చేస్తాం. నాగవళి, వంశధార మినీ ప్రాజెక్టుల పనులన్నీ చేయిస్తాం. మత్స్యకారులు పాకిస్థాన్ వెళ్లే పని లేకుండా చేస్తాం. యువతకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. గిరిజన యువత ఇష్టం లేకున్నా గంజాయి సాగు చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకువస్తాం.
విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఆలస్యం కాకుండా చూస్తాం. ఆంధ్రా యూనివర్శిటీ ప్రక్షాళన చేస్తాం. శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి స్థాయిలో చేస్తాం. వైసీపీ కార్యాలయంగా మార్చిన ప్రతి వ్యక్తిని దోషులుగా పరిగణిస్తున్నాం. మీకు శిక్షలు పడతాయి. మీకు విన్నపం. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీరు మమ్మల్ని నమ్మాలి. మీ కోసం రోడ్ల మీదకు వస్తాను. మీ ఒంటి మీద దెబ్బ పడితే నా ఒంటి మీద పడినట్టే.
పవన్ కళ్యాణ్ అనే నేను ముఖ్యమంత్రి అనేది మీరు చెప్పాలి. మీ కోసం పదేళ్లు నిలబడ్డాను. ఏడాదికి రూ.250 కోట్లు సంపాదించగల సామర్ధ్యం శక్తి ఉండి రోజుకు కోటి వదులుకుని కోటి మంది అన్నదమ్ముల కోసం వస్తున్నా. నాకు కోటి కంటే కోట్లాది జీవితాలు ముఖ్యం. అడ్డదారులు తొక్కడం ఇష్టంలేకే సినిమాలు చేస్తున్నా. పార్టీ కోసం ఇచ్చే విరాళాలకు టీ ఖర్చులు సహా లెక్కలు చెబుతా. నేను మిమ్మల్ని మోసం చేయను. ఓ కులానికి కొమ్ము కాయను. నా కులానికి ఇచ్చిన గౌరవమే అన్ని కులాలకి ఇస్తాను. ఉత్తరాంధ్రకి ఇస్తాను అని జనసేనాని పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.