Pawan kalyanPawan kalyan

మోసపోయాను అని ఎవరన్నా అంటే అతను తెలివిగా ఆలోచించలేదు అని ఇతరులు అంటారు ! పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఎదో ఒక రోజుననేను మోసపోయాను అనే మాట అని తీరుతాడు !

మొదటి నుండి జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్’ది (Pawan Kalyan) దారి తెన్ను లేని ప్రయాణంలా కనిపిస్తుంటాది. అందులోనూ రాజకీయ రంగ ప్రవేశం (Political Entry) చేసిన తరువాత అది మరింత స్పష్టంగా తెలిసిపోతూ వస్తున్నది ! ఇప్పటికీ ….

అసలు రాజకీయం అంటే ఏమిటో తెలుసా (Political Knowledge in Pawan Kalyan)

రాజకీయం అంటే అబద్ధాలు చెప్పడం ! చేయలేనిది చేస్తాను అని చెప్పాలి ! అసలు జరగనిది జరిగేట్లు చేస్తానని వాగ్దానం ఇవ్వాలి ! కొండని ఎత్తుతాను అనాలి ! తీరా కొండ ఎత్తమని డిమాండ్ చేస్తే మీరంతా ఎత్తి నా భుజాల మీద పెడితే మోస్తాను అని బొంకాలి !
ఇవేవీ కాకుండా నేను మేధావులతో చర్చిస్తూ దేశం, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించే మార్గం సూచిస్తాను అంటే ఎవరూ పట్టించుకోరు ! అలా అని ఎవరూ పట్టించుకోరు పూర్తిగా అనుకోవక్కరలేదు. పట్టించుకుని భుజాల కెత్తుకొని సంతోషించే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ వల్ల టీవి డిబెట్లలలో ప్రసంశలు వస్తాయి కానీ గెలవడానికి ఉపయోగపడే వోట్లు మాత్రం రాలవు.

రాజకీయాలలో ఉండాల్సింది ఓర్పు, సహనం, లౌక్యం! ఎదుటి వాళ్ళు రెచ్చకొట్టేట్లుగా మాట్లాడతారు కానీ చాలా ఓపిగ్గా విని వదిలేయాలి. నీ సమయం వచ్చినప్పుడు బాకీ తీర్చేయాలి ! ఆ బాకీ కూడా నువ్వు తీరుస్తున్నట్లుగా బయటికి కనపడకూడదు! ఎవరో దయ తలచి బాకీ తీరుస్తున్నట్లుగా ఉండాలి.

పవన్’లో అసలు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవు ! మార్పు తెస్తాను అంటే ఎవరూ ఒప్పుకోరు ! ఆ మార్పు వోటర్లకి అస్సలు ఇష్టం ఉండదు ! ఇక ప్రభుత్వ అధికారులకి అయితే అది చాలా కష్టంగా ఉంటుంది ! ఇప్పుడంతా సిస్టమ్ అనేది ఒకటి ఉంది దానిని ఫాలో అవ్వాలి లేకపోతే వోట్లు పడవు ! అదే సిస్టమ్’ని ఫాలో అయితేనే ఉద్యోగులు సహకరిస్తారు లేదా అధికారం నుండి కిందకి తోస్తారు!

పవన్ తనకే అర్ధంకాని ఒక ఆస్పష్టమయిన వ్యక్తి! (Clarity in Pawan Kalyan)

మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ తరువాత రెండు మూడు సినిమాలు ఎవరేజీ గా ఆడినా ‘తొలిప్రేమ‘తో బంపర్ హిట్ సాధించాడు. తెలుగు సినిమా పరిశ్రమకి ఒక కొత్త తరహా కధానాయకుడు దొరికాడనిపించింది! హీరో వెనక మందలు మందలుగా కలర్ దుస్తులు వేసుకొని డాన్స్ చేయడాలు తొలిప్రేమలో లాంటివి ఏవీ లేవు ! పోరాట దృశ్యాలు కూడా చాల సహజంగా ఉన్నాయి ఆఫ్కోర్స్ ఫైట్స్ లేని సినిమా అది. అలాగే ఏమాత్రం ఆహానికి పోకుండా దర్శకుడు చెప్పినట్లు విని సహజంగా పవన్ నటించాడు! తొలిప్రేమలో అసలు యుగళ గీతాలు లేవు [డ్యూయేట్స్ ]. ఆ సినిమాలో లేడీ సింగర్ పాడిన పాట ఒక్కటీ లేదు అన్నీ SPB పాడాడు ! చాలా సాఫ్ట్ స్టోరీ! అందరూ న్యాయం చేశారు. ఆ తరువాత తమ్ముడు, బద్రి, ఖుషీ వరకు దర్శకుల చేత దర్శకత్వం చేయనిచ్చాడు పవన్ ! ఖుషీ తరువాత వచ్చిన అన్ని సినిమాలు మునపటిలాగా లేవు కానీ తొలిప్రేమతో తనకంటూ ఒక బలమయిన ఇమేజ్’ని పవన్ కళ్యాణ్ సృష్టించుకున్నాడు ! అదే ఇప్పటివరకు కాపాడుతూ వచ్చింది ! ఖుషీ తరువాత, ప్రేక్షకులు తన నుండి ఏమి కోరుకుంటున్నారో వాటిని ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ అయితే విఫలం అయ్యాడు. ! OK ! అది సినిమా ! అక్కడ తన మాట చెల్లుబాటు అయ్యింది!

కానీ రాజకీయాలలో సినిమాలలో జరగదు ! కుళ్ళు,కుట్ర,కుతంత్రంతో పాటు నిత్యం అబద్ధాలు,మోసాలు చేయడాలు ఉంటాయి [సినిమా పరిశ్రమలో రాజకీయాల కంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి అనుకోండి]. సినిమా పరిశ్రమలో మెగా ఫామిలీ విషయంలో అలాంటివి ఏవీ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే వాటికి అందనంత ఎత్తులో ఉండి పోయారు కాబట్టి ఆ కుళ్ళు, కుట్ర,కుతంత్రం ఎలా ఉంటాయో అటు చిరంజీవికి కానీ పవన్ కళ్యాణ్’కి కానీ అనుభవలోకి రాలేదు కాబట్టి అక్కడ వీళ్ళు సేఫ్ !

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రచారం చేసినప్పుడు మొదటి సారిగా సినిమా ఆవేశం పవన్ కళ్యాణ్’లో మనం చూశాం! పంచలు ఊడదీసి కొట్టండి అనే పద ప్రయోగం పవన్ నోటి వెంట వచ్చినప్పుడు అది రాజకీయ నాయకుడి లక్షణం కాదని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది ! సరే ! చిరంజీవి కదా ముఖ్యమంత్రి అభ్యర్ధి అని సరి పెట్టుకున్నారు. ప్రజా రాజ్యం ఎపిసోడ్ ముగిసిన తరువాత ‘జనసేన ‘ పార్టీని ప్రకటించిన వేళ జరిగిన సభలో అదే ఆవేశపూరిత ప్రసంగం పవన్ కళ్యాణ్ చేసారు.

పిడికిలి బిగించడం అనేది రాజకీయ లక్షణం ఎంతమాత్రం కాదు ! ఎవరండీ ఆ చేగువేర ? ఆ చేగువేర బ్రతికి ఉన్నప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా వ్యత్యాసం ఉంది సామాజికంగా, ఆర్ధికంగా, సాంస్కృతికంగా ! అలాంటి ఎక్కడో లాటిన్ అమెరికా కమ్యూనిస్ట్ నాయకుడి జెండాని పట్టుకొని ఆవేశపూరిత ప్రసంగాలు అవసరమా? ఉడుకు రక్తం ఉన్న కుర్రాళ్ళు ఊగిపొతారేమో కానీ ఆలోచనా పరులు ఇలాంటి ధోరణిని అసలు ఇష్టపడరు. పక్కన కమ్యూనిస్టులని కూర్చోపెట్టుకొని చేగువేరా టీ షర్ట్’లతో అభిమానులు సహజంగానే ఊగిపోయారు. కానీ అవేవీ వోట్లు రాల్చలేదు సరి కదా పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు!

కనీసం తాను ఎందుకు ఒడిపోయానో అనే ఆత్మవిమర్శ చేసుకొని ఉంటారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి? బుర్ర నిండా ఆవేశం ఉన్నప్పుడు ఆలోచన ఎలా వస్తుంది ? పంధా మార్చుకొని సరి అయిన దారిలో మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టడంలో ఎలాంటి తప్పు లేదు ఉండబోదు ! ఒక వేళ తన రాజకీయ తప్పిదాలు ఏమిటో విమర్శ చేసుకొని వాటిని సరి చేసుకుంటూ మళ్ళీ ప్రయాణం మొదలుపెడితే ప్రజలు హర్షిస్తారు ! పవన్ లాంటి నిజాయితీ పరుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఉంది. [పాకేజీ స్టార్ అనే ఊకదంపుడు ట్రోలింగ్ చేసేవాళ్ళు జగన్,చంద్ర బాబులు ఏమన్నా పత్తిత్తులా అని ఆత్మవిమర్శ చేసుకుంటే ఆ ట్రోలింగ్ చేయరు.]

ఆ మాటకొస్తే పవన్’లో ఉన్న మంచితనం అటు జగన్’లో కానీ ఇటు చంద్రబాబులో కానీ బూతద్దం పెట్టి వెతికినా కనపడదు. ఇక్కడ మంచితనం అంటే ప్రభుత్వ [ప్రజల] సొమ్ముని తేరగా పంచడం కాదు. వాళ్ళ స్వార్జితంని గుప్తంగా దానం చేయడం! మొదటి నుండి ఇప్పటి వరకు కూడా అది పవన్ చేస్తూనే ఉన్నాడు! అలా అని ఆ మంచితనం వోట్లని రాలుస్తుంది అనుకుంటే భ్రమే !

మంచికో చెడుకో ఎవరయినా సరే ఒక సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తే ఇవాళ కాకపోయినా రేపయినా ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఒక సిద్ధాంతము వోట్లు రాల్చలేదని మారుస్తూ పోతూ ఉంటే ఎప్పటికీ పూర్తి ఫలితాలని పొందలేరు. పవన్ ముందు కమ్యూనిజంని నెత్తిన పెట్టుకొని ప్రజలలోకి వెళ్ళాడు. అది వర్క్ అవుట్ కాలేదని కమ్యూనిస్టులని వదిలేశాడు. బిజేపితో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినా అదే బిజేపి పెద్దలు తనని అడగాలని భీష్మించుకున్నాడు! బాబూ పవనా ఇది రాజకీయ రంగం అంతే కానీ సినిమా రంగం కాదు !

ఒక సభలో రాజమౌళిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజమౌళి తనని సంప్రదిస్తే సినిమా చేద్దాం అన్నాడు. దానికి రాజమౌళి నవ్వుతూ ఉన్నాడు తప్పితే ఎలాంటి హామీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. రాజమౌళికి తన కధలో వెలుపెట్టే హీరోలకి దూరంగా ఉంటాడు ! అలాంటిది బిజేపి నిన్ను సంప్రదించాలి అని అనుకోవడం భ్రమనే అవుతుంది! రాజకీయాలలో మనుగడ సాగించాలి అంటే ఒక్కోసారి గడప ఎక్కాలి, ఆడగాల్సి వస్తుంది ! నీ దగ్గరికి రావడానికి బిజేపి నీ సినిమా నిర్మాతో,దర్శకుడో కాదు అని గ్రహించాలి!

రాజకీయాలలో ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవడం సహజం. కానీ ఒక్కోసారి పొత్తు పెట్టుకున్న వాళ్ళ బలాలు, బలహీనతలు కూడా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది లేక పోతే మనుగడ కష్టం అవుతుంది! కానీ అది మీరు చేయలేదు ! ఒకరు కాకపోతే ఇంకొకరు ఇలా ఎన్నాళ్ళు ఒక దారీ తెన్ను లేకుండా తిరుగుతూ ఉంటారు?

గత కొంత కాలంగా ఎవరికీ చెందకుండా న్యూట్రల్’గా ఉంటూ వచ్చావు ! జనాలలో కొద్దో గొప్పో ఆశలు చిగురించాయి నీ మీద ! కానీ ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు అని పోయి మళ్ళీ చంద్రబాబుతో కలవడం అన్నది ఆత్మహత్యతో సమానం అయిపోయి నట్లయింది !

మంచికో చెడుకో ఒక్కడివే ఒంటరి పోరాటం చేస్తూ పోతే ఇంకో పదేళ్ళ తరువాత అయినా ప్రజలు నిన్ను నమ్మి వోట్లు వేసి ముఖ్యమంత్రిగా నిలబెట్టేవాళ్ళు! కానీ ysrcp వేసిన ఉచ్చులో అడ్డంగా ఇరుక్కున్నావేమో ఆలోచించాలి! జగన్, చంద్రబాబులు తిట్టుకుంటారో కొట్టుకుంటారో వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి నువ్వు ఒక్కడివే ఒంటరి పోరాటం చేసినట్లయితే బాగుండేది ! ఆకుకి అందక పోకకి పొందక అనేట్లుగా తామరాకు మీద నీటి బొట్టులాగా ఒక్కడివే పోరాటం చేసినట్లయితే బాగుండేది ! నువ్వు తప్పితే చంద్ర బాబుని ఎవరు నమ్ముతారు? అధికారానికి దూరంగా ఉన్నప్పుడల్లా నేను మారి పోయాను అనే పదాన్ని వాడుతూనే వచ్చాడు. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాగానే షరా మామూలు! చంద్ర బాబు తాను ఎదగడు తనతో ఉన్నవాళ్ళని ఎదగనివ్వడు!

అసలు ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ చంద్రబాబుని ఇంతవాడిని చేసిన వాళ్ళ స్వంత మీడియా అధిపతులవి ! వాళ్ళు నిన్ను ముఖ్యమంత్రిగా చూడడానికి ఒప్పుకుంటారా ? అలా అని హామీ ఇస్తే అంతే సంగతులు ! ఏది ఏమయినా గత మూడు సంవత్సరాలుగా ఒక్కడివే పోరాడుతూ వచ్చావు అలాగే ఉంటే సరిపోయేది. కనీసం వచ్చే ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు గెలిచి ఉండేవారు! జనసేనాని ఒక్క పొరపాటుతో వల్ల మళ్ళీ మొదటికి వచ్చేసారు!

పవన్ జనసేనకి ఉన్న అనుకూలతలు

1. బహిరంగ సభ పెట్టాలి అంటే వేదిక ఎక్కడో చెపితే చాలు. అభిమానులు వాళ్ళ స్వంత ఖర్చుతో వచ్చేస్తారు! తెలుగు రాష్ట్రాలలో వేరే ఏ నాయకుడికి ఈ సౌలభ్యం లేదు అంటే అతిశయోక్తి కాదు.

2. బీరు,బిర్యానీ పొట్లం ఇవ్వక్కరలేదు. లారీలు,బస్సులని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు.

3. రాజకీయంగా విఫలం అయినా అభిమానులలో ఎలాంటి మార్పు లేదు. వాళ్ళు అలానే మునపటిలాగానే పవన్ వెంట నడుస్తున్నారు.

పవన్ జనసేనకి ఉన్న అననుకూలతలు:

1.జనసేన కార్యకర్తలకి క్రమశిక్షణ లేదు. ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ.

2. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆలోచన లేకుండా ఆవేశంతో కామెంట్స్ చేస్తున్నారు.

3. క్షేత్ర స్థాయిలో జనసేన కార్యకర్తల దూకుడు బాగానే ఉన్నా ఒక్కో సారి అది చెడు చేస్తున్నది.

జనసేనానికి కొన్ని సూచనలు

1. నా సిద్ధాంతం ఇదీ అని అది ఎప్పటికీ మారదనే భరోసా వోటర్లకి కలిగించాలి.

2. పోలో మంటూ వచ్చే అభిమానులని తనకి వోటు వేయాల్సిందిగా అభ్యర్ధిస్తూ తన సభలకి వచ్చే వాళ్ళని తన వోటు బ్యాంకుగా ఎలా మార్చుకోవాలో బాగా కసరత్తు చేయాలి.

3. రాజకీయ సభ అంటే సినిమా కాదు అనే భ్రమలో నుండి బయటికి రావాలి! తోటి రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతున్నారో చూసి తనకంటూ ఒక ప్రత్యేక శైలి అదీ ఆవేశంగా కాకుండా, ప్రతి దానికి పిడికిలి బిగించి భావవేశానికి లోను కాకుండా సమస్యల మీద స్పష్టంగా మాట్లాడగలగాలి.

4. రాజకీయాలు సెంటిమెంట్లు రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. రాజకీయాలలో ఉండే సెంటిమెంట్ల గురుంచి ఒక పుస్తకం వ్రాయవచ్చు. పేకాట,క్రికెట్ లలో ఉండే సెంటిమెంట్ల కంటే రాజకీయాలలో ఎక్కువ సెంటిమెంట్లు ఉంటాయి. ప్రజా రాజ్యం, జన సేన ఇలా రెండు పార్టీలు పెట్టినప్పుడు మీ అన్నయ్య నాగేంద్ర బాబు ప్రతి వూరు తిరిగి సమన్వయం చేశారు చాలా కష్టపడి ! కానీ ఎందుకో నాగేంద్ర బాబు సమన్వయ పాత్ర రెండు సార్లు కలిసి రాలేదు గమనించారా ? అలా అని నాగేంద్ర బాబు కష్టాన్ని తక్కువ చేయలేము. కానీ సెంటిమెంట్ అనేది పని చేయలేదు అని మాత్రం చెబుతున్నాం?

5. పవన్ కళ్యాణ్ అనే రాజకీయ నాయకుడు మొహమాటం వదిలేయాలి ! పారిశ్రామిక వేత్తలని పార్టీ కోసం విరాళాలు ఇవ్వమని స్వయంగా వెళ్ళి అడగాలి. ఇదేమీ తప్పు కాదు అన్ని రాజకీయ పార్టీలు పారిశ్రామిక వేత్తలు ఇచ్చే విరాళాలమీద మనుగడ సాగిస్తున్నాయి కదా ? అడగడం లో తప్పు ఏముంది ? పార్టీని నడపడానికి సినిమాలో నటిస్తున్నాను అనే ప్రకటన చేయాల్సిరావడం దురదృష్టకరం ! విరాళాలు స్వీకరిస్తే సినిమాలు వదిలేసి పూర్తి సమయం రాజకీయాలకి కేటాయించవచ్చు!

6. ఎవరన్నా ఏదన్నా ఆరోపణ కానీ రెచ్చకొట్టే విధంగా మాట్లాడడం చేస్తే దాని వెనుక నిగూఢంగా ఏదన్నా రాజకీయ కోణం ఉందేమో అని ఆలోచించి ప్రతిస్పందించండీ ! ఆలోచన చేయకుండా ఆవేశపడి తీసుకునే నిర్ణయాలు చివరికి మీకే చేటు చేస్తాయి.

7. నరేంద్ర మోడీని రక్త పిపాసి అని కొందరు అన్నారు కానీ ఆయన ప్రతిస్పందించలేదు ! కానీ ఎవరిని ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలో చేసుకుంటూ వెళ్లిపోయారు తప్పితే ఒక్క మాట తిరిగి అనలేదు.

8. అమిత్ షా కారు మీద రాళ్ళు వేయించిన చంద్రబాబుని అమిత్ షా ఒక్కమాట మాట్లాడలేదు. కానీ ఈ రోజున అపోయింట్మెంట్ కోసం ఎదురుచూసేలా చేశారు కదా?
చివరిగా ఇప్పటి కయినా మించిపోయింది లేదు. న్యూట్రల్’గా ఉండండి ! మీరు ఎవరితో కలిసినా సరే వాళ్ళు మీ వల్ల బాగుపడతారే గాని మీకు మాత్రం మంచి జరిగే అవకాశమే ఉండబోదు.

ప్రజలని ఆకట్టుకునే విధంగా ఆహ్లాదకరంగా ఎలా మాట్లాడాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే కానీ ఆవేశంగా మాట్లాడడంపై కాదు.

పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్ధ, కమిటెడ్ నాయకుడు నేటి సమాజానికి కావాలి. ఆలోచనతో కూడిన రాజకీయాలు పవన్ కళ్యాణ్ చేయాలి. అప్పుడే రాజ్యాధికారంలో మార్పు సాధ్యం అవుతుంది. అప్పుడే అణగారిన వర్గాల్లో మీరు దేవుడు అవుతారు. ఆలోచించండి. ఆలోచించండి. జై హింద్

Source : Collected from Social media

చెప్పు పెట్టిన చిచ్చు! వైసీపీలో ఆందోళన – టీడీపీలో ఖుషీ

మద్ది ఆంజనేయ ఆలయానికి రూ. 28,24 లక్షల ఆదాయం
వివరాలు వెల్లడించిన ఆంజనేయ ఆలయ ఈవో