రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తారా?
బీజేపీ జాతీయ కార్యదర్శి ‘పై దాడి గర్హనీయం
బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్’పై (Y Satya Kumar) వైసీపీ శ్రేణులు (YCP Cadre) దాడికి పాల్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) కోసం భూములు ఇచ్చిన రైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన బీజేపీ నాయకులపై (BJP Leaders) వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయం. అధికారంలో ఉన్న వైసీపీ దాదాగిరీ పరాకాష్టకు చేరిందనే వాస్తవం ఈ దాడితో మరోమారు తేటతెల్లమయింది. ఈ దాడిని ప్రతి ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలి అని జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిలుపు నిచ్చారు.
రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తామని రాష్ట్ర పాలకులు సందేశం ఇస్తున్నారా? ఇదే వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధానం అయితే మేము కచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం ఇస్తాం. ‘ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారు’ అని వైసీపీ ఎంపీ ప్రకటించారు అంటూ సత్య కుమార్ చెప్పిన మాటలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.
రాజధాని ప్రాంతంలో వైసీపీ శ్రేణులు చేసిన ఈ దాడి ఘటనను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలి. మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ముఖ్యమంత్రినీ, ఆయన పార్టీనీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పట్టభద్రులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరస్కరించారని జనసేనాని తెలిపారు.
క్షోభపడుతున్న రాజధాని రైతులకు అండగా నిలుస్తున్న రాజకీయ పక్షాలను, సంఘాలను వైసీపీ ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు వర్గ శత్రువులుగా చూస్తున్నారు. రాష్ట్ర పాలకులు సామాన్య ప్రజలపైనా, ప్రశ్నించిన వారిపైనా ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నది. ప్రతిపక్ష నాయకులను వేధిస్తూ, వారిపై దాడులకు పాల్పడుతున్నది. వీటిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి జనసేన పార్టీ తీసుకువెళ్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.