తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) రాజకీయాల్లో తోట త్రిమూర్తులు (Thota Trimurthulu) పాగా వేయగలుగుతారా అనేది సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు పంతం (Pantham), తోట కుటుంబాల చుట్టూనే తిరిగేవి. ఆ తరువాత తెలుగుదేశం (Telugudesam) వచ్చిన తరువాత యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu), ఎస్ఆర్ఎంటీ చౌదరిల హవా నడిచింది.
వారి హవా ముందు ముద్రగడ (Mudragada), జ్యోతుల నెహ్రు(Jyothula Nehru), లేదా తోట త్రిమూర్తులు (Thota Trimurthulu) గాని ఎదగడానికి అవకాశం రాలేదు.
ముద్రగడ పద్మనాభం తరువాత అంత స్థాయిలో నోరు ఉన్న, ఫాలోయింగ్ ఉన్న నాయకుల్లో తోట త్రిమూర్తులు కూడా ముఖ్యులు అని చెప్పవచ్చు.
అయితే తూర్పు గోదావరి జిల్లా వర్గ రాజకీయాల్లో ఎదిగే అవకాశం తోట త్రిమూర్తులకు నేటి వరకు రాలేదు. అయినప్పటికీ తట్టుకొని నేటికి తోట నిలబడగలిగారు. దానికి కారణం తోట త్రిమూర్తులలో నాయకత్వ పటిమ, తనని నమ్మిన కార్యకర్తల వెనుక ఉండే మొండితనం అని చెప్పవచ్చు. అయితే త్రిమూర్తులకు నేడు ఎమ్మెల్సీ ఇస్తున్నారు అనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయన ఆ మంత్రి పదవికి అన్నివిధాలుగా అర్హుడనే చెప్పాలి. తోటకి మంత్రి పదవి (Ministry) ఇస్తే పార్టీ మరింత పటిష్టం అవ్వడానికి అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు.
అపజయాలు నుండి విజయం వైపుకు
త్రిమూర్తులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ అపజయాలు నుండి విజయం వైపుకు అడుగు వేశారు. ఆయన మండపేటలో వైస్సార్’సిపికి జీవం పోసి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. తద్వారా పార్టీలో తనదైన శైలిని ఏర్పరుచుకునాడు. తోట మండపేట మునిసిపాలిటీ చరిత్రను తిరగరాసి టిడిపి కంచుకోటను బద్దల కొట్ట గలిగారు. వైకాపా జెండా ఎగిరేటట్లు చేశారు. దీని ఫలితంగా కోఆర్డినేటర్’గా బాధ్యతలను తోట చేపట్టారు. తోట ప్రతిభని గుర్తించే పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా (MLC) ఎంపిక చేసింది. నేడో రేపు అధికారికంగా ప్రకటన వెలువడనుంది.
తోట రాజకీయ ప్రస్తానం:
త్రిమూర్తుల రాజకీయ ప్రస్తానం మొదటి నుండీ సంచలనమే. సమస్యలను అవకాశాలుగా మలుచుకొని ఎదగగలిగిన ఏకైక నేత తోట. ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీలో కీలక నేతగా తోట ఎదగడం ఆయన ప్రత్యేకత. జిల్లా వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో పార్టీలకతీతంగా అత్యధిక అనుచరగణం, అభిమానులు ఉన్న నాయకుడుగా తోట ఎదుగుతున్నారు.
కోనసీమ, డెల్టా, మెట్ట ,ఏజెన్సీ లాంటి ప్రాంతాలు అన్నింటిలోనూ తోట అభిమానులు వేల సంఖ్యలో ఉంటారనేది వాస్తవం. పక్క రాష్ట్రమైన యానాంలో సైతం తోట హవా నడుస్తోంది. ముఖ్యంగా అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పట్టున్న నేతగా తోట ఎదుగుతున్నారు.
స్వతంత్ర అభ్యర్థిగా ప్రారంభం!
తోట త్రిమూర్తులు రాజకీయ ప్రస్థానం స్వతంత్ర అభ్యర్థిగా ఆరంభమైంది .1994లో రామచంద్రపురం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం టిడిపిలో చేరారు. తిరిగి 1999లో అదే నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా రెండవసారి గెలుపొందారు. 2012లో జరిగిన రామచంద్రపురం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2004లో టిడిపి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కాంగ్రెస్’లో చేరి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం తిరిగి టిడిపిలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు జిల్లాలో అన్ని పార్టీ లు ఆయన కోసం ఎదురుచేసేలా తన హవా కొనసాగించారు. చివరివరకూ ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేదానిపై కూడా అప్పట్లో పెద్ద చర్చ నడిచేది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేశారు.
జనసేన ప్రభావంతో తోట ఓటమి?
జనసేన (Janasena) క్రాస్ ఓటింగ్ తో ఓటమి చెందారని విశ్లేషకులు చెబుతుంటారు. కొద్ది నెలలకే అధికార వైస్సార్ సిపిలో (YSRCP) చేరారు. సరిగ్గా అదే సమయంలో రామచంద్రపురం (Ramachadrapuram) నియోజకవర్గంలో ముగ్గురు విభిన్న ధ్రువాలైన నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. దానితో మండపేటలో పోటీ చేసి ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్’కు రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయించారు. అప్పుడు మండపేట నియోజకవర్గ పరిస్థితులను చక్కదిద్దడానికిగాను కో ఆర్డినేటెర్ బాధ్యతను పార్టీ తోట త్రిమూర్తులకు అప్పగించింది.
పార్టీలో చేరిన వెంటనే అమలాపురం (Amalapuram) పార్లమెంటరీ కన్వీనర్’గా తోట పగ్గాలు చేపట్టారు. కాగా 2020 డిసెంబర్ నుండి పూర్తిగా నియోజకవర్గంపై దృష్టి సారించారు.అప్పటికి మండపేటలో పార్టీ పరిస్థితి మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా ఉండేది. దీంతో తోట త్రిమూర్తులు రాకతో అన్ని వర్గాలను ఏకం చేసే పనిని ప్రారంభించారు. రాష్ట్రమంతా ఓవైపు వైకాపా గాలి వీస్తుంటే మండపేట నియోజవర్గం మరోలా స్థితి ఉండేది.
మండపేట ఇంఛార్జిగా చక్రం తిప్పిన తోట!
అటువంటి పరిస్థితి లో క్లిష్టసమయంలో తోట వైకాపా పునర్వైభవానికి నడుం బిగించారు. తెలుగు దేశం కంచుకోటగా ఉన్న మండపేటలో (Mandapeta) వైసీపీ (YCP) జెండా ఎగురవేయగలిగారు. దానికి తోట త్రిమూర్తులు పన్నిన, వేసిన ఎత్తులే కారణాలు.
తనదైన ముద్ర తో నిజమైన కార్యకర్తలు అందర్నీ ఏకతాటిపైకి తీసుకు వచ్చారు.వివిద కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్న వారిని చేర తీశారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఏకంగా 32 ఏళ్ల పాటు మండపేట మున్సిపాలిటీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న టీడీపీ కంచుకోటను తన రాజకీయ చతురతతో బద్దలు కొట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో సైతం తోట మార్క్ కనిపించింది.
పార్టీలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు?
తాను చేరిన వైసీపీ పార్టీలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తోట త్రిమూర్తులు వెన్ను చూపలేదు. భయపడకుండా పార్టీ పటిష్ఠతకు నిరంతరం కృషి చేశారు. అటువంటి కృషికి గుర్తిపుగా పార్టీ అధిష్టానం ఒక్క ఎమ్మెల్సీ ఇచ్చి సరిపెట్టుకొంటుంది అని చెప్పలేము.
ఎందుకంటే తోట త్రిమూర్తులలో ఉన్న అనుభవం, నాయకత్వ పటిమ, అనుచర గణం, మొండి తనాన్ని పార్టీ అధిష్టానం గుర్తించింది. తోటకి మంత్రిపదవి లాంటి మంచి పదవిని ఇస్తే జిల్లాలో పార్టీ మరింత బలపడుతుంది అని పార్టీ క్యాడర్ కూడా భావిస్తున్నది.
అయితే తూర్పు గోదావరి జిల్లాలోని వైసీపీ పార్టీలో ఉన్న “తీన్ మూర్తుల” ఆధిపత్యాన్ని
త్రిమూర్తులు ఎంత వరకు తట్టుకొని నిలబడగలరు? సహచర పోటీదారుల పోటీని తట్టుకొని జిల్లా రాజకీయాల్లో తోట ఎలా పాగా వేయగలరో వేచి చూడాలి. అలానే తనని నమ్మిన వర్గాలకు ఎంత వరకు తోట అండగా ఉండగలరో వేచి చుడాలి.
–Akshara Satyam