క్రమశిక్షణ లేమితో రెవిన్యూ లోటు పెరుగుదల: కాగ్?
వాస్తవిక ఆదాయాన్ని అంచనా వేయడంలో ఏపీ ప్రభుత్వం (AP Government) విఫలం అవుతోంది అని కేంద్ర ఆర్థికమంత్రి (Central Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) పేర్కొన్నారు. 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కాగ్ (CAG) ఇచ్చిన నివేదికలో ఉన్న ఆశక్తికర విషయాలు ఆధారంగా కేంద్ర ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. రెవెన్యూ వ్యయాన్ని (Revenue Expenditure) నియంత్రించలేకపోవడంతో 14వ ఆర్థిక సంఘంలోను (Finance Commission), 15వ ఆర్థిక సంఘం పరిధిలోని 2020-21లో రెవెన్యూ లోటు (Revenue Deficit) గ్రాంటు మంజూరు చేయడం జరిగింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రెవెన్యూ లోటులో పెరుగుదల కనిపించినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.
రాజ్యసభలో (Rajya Sabha) భాజపా (BJP) ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. 2015-16తో పోలిస్తే 2016-17లో రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం మార్గదర్శకాల ప్రకారం డిస్కంల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందుకు ఖర్చు చేయడమేనని ఆమె అన్నారు. 2019-20లో బడ్జెట్‌లో పేర్కొన్న రూ.1,779 కోట్లకు మించి రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, ఉచిత విద్యుత్తు లాంటి సంక్షేమ పథకాలేనని కేంద్ర ఆర్ధికమంత్రి అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కూ వివిధ రూపాల్లో ఆర్థిక వనరులు అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. రాష్ట్ర విభజన (AP Division) తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు గత ఎనిమిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల వాటా కింద మొత్తం రూ.4,40,985 కోట్ల ఆర్థిక వనరులు అందించినట్లు ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ వివరించారు.