ఆత్మగౌరవం, అణగారిన వర్గాల అస్తిత్వం కోసం తెలంగాణ పోరాడింది
నీళ్లు, నిధులు, నియామకాల కోసం నిష్టగా సాగిన పోరాటం తెలంగాణ ఉద్యమం
బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడమే బీజేపీ ఎజెండా
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ సహకారం
దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్న నరేంద్ర మోదీకి అండగా నిలవాలి
మోదీ కేవలం ఎన్నికల కోసమే పని చేసే వ్యక్తి కాదు
విజన్ 2047 కోసం అంతా ఏకమవ్వాలి
హైదరాబాద్ – బీసీ ఆత్మగౌరవ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
తెలంగాణలో (Telangana) బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా (BC CM) చేస్తాను అన్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిలుపు నిచ్చారు. దేశంలో బీసీ జనాభా అధికం. కానీ బీసీల అభ్యున్నతి అనుకున్నంతగా జరగలేదు. అణగారిన వర్గాలను ముఖ్యమంత్రిని చేస్తాం. అని నోటితో చెప్పడం తేలిక. నాలుకతో ప్రేమించడం ఇంకా తేలిక. కానీ నరేంద్ర మోదీ (Narendra Modi) ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ బీసీలను నోటితో ప్రేమించలేదు. సీట్లతో ప్రేమించింది. వారికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించడమే ప్రధాన ఎజెండాగా ప్రకటించింది. వారిని నాలుకతో ప్రేమించలేదు. బీసీలకు వెన్నుదన్నుగా నిలిచి వారిని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తామని ప్రతిన బూనింది అని (BC Garjana) పవన్ కళ్యాణ్ అన్నారు.
మాటలు చెప్పి బీసీలను ప్రేమిస్తున్నామని చెప్పడం తేలిక… బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనే మాటకు కట్టుబడి ముందుకు వెళ్లడమే కష్టం. తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. పోరాటం అంతిమ లక్ష్యం శాంతి, అభివృద్ధి, ఆశయ సాధన మాత్రమే. పోరాటం అంటే చావడం కాదు.. గెలవడం, అనుకున్నది సాధించడం’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కలిసి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
కల ఇప్పటికీ ఓ ప్రశ్నగానే మిగిలిపోయింది
ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘సకల జనులు సమరం చేసి… నాలుగు కోట్ల మంది కొట్లాడితే తెలంగాణ వచ్చింది. జల్.. జంగిల్.. జమీన్ అంటూ సాయుధ పోరాటం చేపట్టిన కొమురుం భీం ఆశయ ప్రతిరూపంగా తెలంగాణ సాక్షత్కారమయింది. వెట్టి చాకిరీ, దోపిడీని ప్రతిఘటిస్తూ… ఆత్మగౌరవం, అణగారిన వర్గాల అస్తిత్వం కోసం తెలంగాణ కలిసి కొట్లాడింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం నిష్టగా సాగిన గొప్ప పోరాటం తెలంగాణ ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర సాధనలో విజయం సాధించాం కానీ… తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి సాధించామా లేదా అన్నది ఇప్పటికీ ఓ ప్రశ్నగానే మిగిలిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ చేరాయా అనేదే అసలు ప్రశ్న.
రెండు రాష్ట్రాల్లో నిత్యం ఎన్నికల వాతావరణమేనా?
తెలంగాణ ఏర్పడిన దశాబ్ద కాలం తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. రాజకీయ వాతావరణమే అభివృద్ధికి విఘాతంగా మారుతోంది. అయిదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అన్నట్లు ఉండాలి తప్ప… అయిదేళ్లూ ఎన్నికలే అన్నట్లు వాతావరణం ఉండకూడదు. ఇలాంటి వాతావరణంలో ఘర్షణ, అవినీతి పెరిగిపోతాయి తప్ప, ప్రజలకు మేలు జరగదు. అభివృద్ధి జరగదు. దేశానికి ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారి పాలన దక్షత దేశానికి దశాదిశను చూపింది. దేశం కోసం నిత్యం ఆలోచించే శ్రీ మోదీ గారి లాంటి నాయకులతో తెలంగాణ, ఆంధ్రా ప్రాంత నాయకులు ఎంతగా సయోధ్య కుదుర్చుకొని, రెండు తెలుగు రాష్ట్రాలను మరింతగా ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో ఆలోచించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏనాడూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పని చేసే వ్యక్తి కాదు. అలా ఎన్నికల కోసమే ఆయన ఆలోచించి ఉంటే ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదు. నోట్ల రద్దు జరిగేది కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం దక్కేది కాదు. ట్రిపుల్ తలాక్ రద్దు అయ్యేది కాదు. రామమందిరం నిర్మాణం అయ్యేది కాదు. దేశ ప్రయోజనాలే శ్రీ మోదీ గారిని నిర్దేశిస్తాయి తప్ప… మరే రాజకీయ, ఎన్నికల అంశమూ ఆయనను ప్రభావితం చేయవు.
నాలాంటి కోట్ల మంది కలలుగన్న నాయకుడు
చాలామంది నన్ను అడుగుతుంటారు శ్రీ నరేంద్ర మోదీ గారంటే ఎందుకు మీకు అంత అభిమానం అని… 2004 నుంచి 2014 మధ్యలో దేశంలో జరిగిన ఎన్నో తీవ్రవాదుల మారణహోమాలు, వేలాది మందిని బలి తీసుకున్న ఘటనలు కళ్ల ముందు కదలాడు తుంటాయి. హైదరాబాద్ లో జరిగిన గోకుల్ ఛాట్, లుంబినీ పార్కు పేలుళ్ల దగ్గర నుంచి ముంబయి మహా నగరాన్ని తీవ్రవాద మూకలు చుట్టముట్టి అమాయకులైన దేశ ప్రజల ప్రాణాలు తీసిన విషాద ఘటనల నుంచి దేశాన్ని కాపాడే ఓ బలమైన నాయకుడు రావాలని చాలామందితో పాటు నేను బలంగా అనుకున్నాను. భారతీయులకు ఆత్మగౌరవాన్ని నింపి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే నాయకుడు రావాలని బలంగా అనుకున్నాను. నా లాంటి కోట్లాది మంది భారతీయులు కన్న కలల నుంచి పుట్టిన నాయకుడు నరేంద్ర మోదీ . ఓ దేశం అభివృద్ధి కావాలంటే కచ్చితంగా ఆ దేశ అంతర్గత భద్రత అనేది చాలా ప్రధానం. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశ అంతర్గత భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, తీవ్రవాద మూకలను ఎలా కట్టడి చేశారో దేశ ప్రజలకు తెలుసు. శత్రుదేశాలు మన దేశం మీద ఏ విధంగా దాడులకు వచ్చినా, మేం కచ్చితంగా మీ దేశం మీద అంతే బలంగా దాడి చేస్తాం అనేలా హెచ్చరికలు పంపిన గొప్ప నాయకత్వం దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసింది.
మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కూడా పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. జల్ జీవన్ మిషన్, గరీబ్ కళ్యాణ్ యోజన, భారత్ ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు భారతీయుల జీవన ప్రమాణ స్థాయిని పెంచాయి. కరోనా క్లిష్ట సమయంలో దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా టీకాలు పంపిణీ చేసిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాన్ని గుర్తించింది. మహిళా సాధికారత విషయంలోనూ కేంద్రం తీసుకొచ్చిన మార్పులు అమూల్యం. ఇతర దేశాలతో స్నేహ పూర్వక సంబంధాలు నెలకొల్పే విషయంలో కానీ, దౌత్య సంబంధాలు మెరుగుపర్చుకునే విషయంలో, ఫారన్ పాలసీని అద్భుతంగా తీర్చిదిద్దుకునే విషయంలో కానీ మోదీ నాయకత్వంలో దేశం అద్భుతమైన ముందడుగు వేసింది.
అంతరిక్ష ప్రగతిలో భారత్ సాధించిన గొప్ప విజయాలు మైలురాయిగా నిలుస్తాయి. చంద్రయాన్ – 2 విఫలం అయినపుడు శ్రీ మోదీ గారిలోని నిజమైన నాయకుడు ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలిచారు. ఇస్రో కార్యాలయానికి వెళ్లి శాస్త్రవేత్తల భుజం తట్టి, నేనున్నానని ఇచ్చిన భరోసా చంద్రయాన్ – 3 విజయవంతంలో పని చేసింది. దేశానికి మూడు దశాబ్దాలపాటు రావాల్సిన ప్రగతిని మోదీ నాయకత్వంలో ఒక దశాబ్దంలోనే తీసుకురావడం సాధారణ విషయం కాదు. దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ ప్రపంచంలోనే దేశాన్ని తొలి స్థానంలో నిలబెట్టారు. ఎకానమీలో 2014లో 10వ స్థానంలో నిలిచిన భారతదేశాన్ని 2023 నాటికి ఏకంగా 5వ అతి పెద్ద ఎకానమీ కలిగిన దేశంగా మార్చడం వెనుక మోదీ ఆర్థిక విధానాల విజయం దాగి ఉంది.
ఔర్ ఏక్ బార్ మోదీజీ
తెలంగాణ… భాగవతం పుట్టిన నేల. భాగవతం పుట్టిన నెలలో బతుకు భారం కాకూడదు. మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో బీసీ నాయకత్వం రావాలి. సామాజికంగా తెలంగాణ నిలదొక్కుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పోరాటంలో భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ సంపూర్ణంగా మద్దతుగా నిలుస్తుంది. మోదీ గారి విజన్ 2047 నిజం కావాలంటే, మళ్లీ భారతదేశం వెలిగిపోవాలంటే మూడోసారి మోదీ గారి నాయకత్వం దేశానికి అవసరం అని భావిస్తున్నాను. అందుకే ‘‘ఔర్ ఏక్ బార్ మోదీ జీ’’ అంటూ నినదిస్తున్నాను’’ అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వేదికపై నరేంద్ర మోదీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ ఘట్టం యావత్ సభికులను ప్రత్యేకంగా ఆకర్షించింది.