Pawan Kalyan on ProsecutionPawan Kalyan on Prosecution

జగన్ఎ న్ని విచారణలైనా చేస్కో.నేను ప్రశ్నిస్తూనే ఉంటా!
జైలుకెళ్లడానికైనా… దెబ్బలు తినడానికైనా సిద్ధం
అరెస్టు చేసుకోండి.. చిత్రహింసలు పెట్టుకోండి- తప్పులుంటే ఎత్తి చూపుతాం
జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
జగన్ పోవాలి… ఎన్డీఏ ప్రభుత్వం రావాలి
నేను ఢిల్లీ వెళ్లింది కేసుల మాఫీ కోసమో… అప్పుల కోసమో కాదు
ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి సత్ఫలితాలను ఇస్తుంది
రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసమే సేన పోరాటం

జనసేనానిని (Janasenani) అరెస్ట్ చేయడానికే ప్రాసిక్యూషన్ (Prosecution) పేరిట వైసీపీ ప్రభుత్వం (YCP Government) జీఓ జారీచేసింది అన్నదానిపై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర ఉద్వేగంతో మాట్లాడారు. ‘జగన్.. నీ ఇష్టం… సై అంటే సై తేల్చుకుందాం. దేనికైనా నేను రెడీ. వాలంటీర్ (Volunteers system) అనే జగన్ సమాంతర వ్యవస్థపై నేను సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా – విచారణకు సిద్ధంగా ఉండాలని ప్రత్యేక జీవో ఇచ్చావ్. ఇదే నీ ప్రభుత్వ పతనానికి మొదటి మెట్టు.. ఈ ప్రభుత్వాన్ని కిందకు లాగేది ఇదేనని గుర్తుంచుకోవాల’ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ని హెచ్చరించారు.

నేను ఏదైనా విషయం గురించి మాట్లాడితే ఎలాంటి సమాచారం లేకుండా మాట్లాడను.. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే మాట్లాడతాను అన్నారు. ఎటు వైపు నుంచైనా రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడే ప్రజల ముందు నిజాలు బయటపెడతానని చెప్పారు. జైలుకెళ్లడానికైనా… దెబ్బలు తినడానికైనా సిద్ధమని ప్రకటించారు. అరెస్టు చేసుకోండి.. చిత్రహింసలు పెట్టుకోండి – తప్పు జరిగితే కచ్చితంగా ఎత్తి చూపుతామని సవాల్ విసిరారు. కేసులకు, విచారణలకు భయపడేవాడిని కాదు. అది ఎవరి గురించి అయినా, ఏ సమాంతర వ్యవస్థ గురించి అయినా నేను చెప్పాలనుకున్నది చెబుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

విశాఖపట్నం జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసారు.

“నేను ప్రజా పోరాటంలో జైలుకు వెళ్లడానికి అయినా, దెబ్బతినడానికి అయినా సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. జగన్ గుర్తు పెట్టుకో… నీకు నీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. నా దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అభ్యున్నతి మీదనే ఉంటుంది. 21వ శతాబ్దంలో ప్రజల వ్యక్తిగత సమాచారం అనేది అత్యంత కీలకమని బ్రిటీషు సాంకేతిక నిపుణుడు హంబీ అంటారు. ప్రజల డేటా అనేది క్రూడాయిల్ కంటే విలువైనదని చెబుతారు అని అన్నారు.

హత్యలు చేసినవారిని కాపాడుతున్నారు

వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు అనే సమాంతర వ్యవస్థను నడుపుతూ ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి ఏం చేస్తోంది..? ఎవరికి ఇస్తోంది..? అనేదే నా ప్రాథమిక ప్రశ్న. ఆ డేటా పక్కదారి పడితే ఏ జరుగుతుంది అనేది నా ఆవేదన. వాలంటీర్ల పేరుతో సమాంతర వ్యవస్థ నడుపుతున్న వ్యక్తి నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, నన్ను విచారణ చేయడానికి నోటీసులు, జీవోలు పంపితే బెదిరిపోయేవాడిని కాదు. మరిన్ని ప్రశ్నలు ఎదుర్కోవడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. ఇక నుంచి ఇంకా బలమైన ప్రశ్నలు మీకు ఎదురుకాబోతున్నాయి. మీ అక్రమ మైనింగ్ మీద, మీ దోపిడీల మీద, మీ విధానాల మీద నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. తప్పు ఎక్కడ జరిగిందో ఎత్తి చూపుతూనే ఉంటాను. న్యాయం కోసం మాట్లాడితే నోటీసులు వస్తున్నాయి. హత్యలు చేసిన వారిని ఎలా కాపాడుతున్నారో చూస్తూనే ఉన్నాం.

వాలంటీరు వ్యవస్థకు జవాబుదారీ ఎవరు..?

ఎనిమిదేళ్ళ పసిపాపపై అత్యాచారం చేసిన వాలంటీరు దుశ్చర్యను ఎవరికి చెప్పుకోవాలి..? ఇంట్లోనే నాటు సారా కాసే వాలంటీరు నేరాన్ని ఎవరితో మొరపెట్టుకోవాలి..? ఏ వ్యవస్థకు అయినా జవాబుదారీతనం ఉంటుంది. ఈ వాలంటీరు వ్యవస్థకు జవాబుదారీ ఎవరు..? వాలంటీర్లు చేసే తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా లేక ఎమ్మెల్యేలా? వైసీపీ నాయకులు బాధ్యత వహిస్తారా అనేది ప్రజలకు వివరించాలి. అసలు జవాబుదారీతనం లేని వ్యవస్థను ఎందుకు తయారు చేశారో వివరించాలి. రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద సంస్థకు, లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలందించే సంస్థకే భారత రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు అధ్యక్షులుగా ఉంటారు. మరి ఇంటింటికీ వచ్చి కీలకమైన వ్యక్తిగత డేటాను తీసుకెళ్తున్న వాలంటీర్లకు ఎవరు జవాబుదారీ అని నేను అడిగాను..? దానిలో తప్పేముంది..? దీనికి సమాధానం చెప్పాలి.

అధికారికంగా కొంత… అనధికారికంగా అంతా చౌర్యమే

వాలంటీర్లు సేకరిస్తున్న 23 అంశాల ప్రాతిపదికల మాత్రమే సమాచారం బయటకు వెళ్తుందనుకుంటే పొరపాటే. అధికారికంగా 23 అంశాల వారీగా వాలంటీర్లు సమాచారం సేకరిస్తుంటే, అనధికారికంగా ప్రజల వ్యక్తిగత విషయాలన్నీ వారు తెలుసుకుంటున్నారు. వారి పరిధిలోని ఇళ్లలోకి చాలా డీప్ గా వెళ్తున్నారు..? ఏం చేస్తున్నారు..? వారి కుటుంబ పరిస్థితులు ఏంటి అన్న ప్రతి విషయాన్ని అనధికారికంగా తెలుసుకుంటున్నారు. అలా తెలుసుకుంటున్న, తీసుకుంటున్న డేటా ఎక్కడికి, ఎవరి వద్దకు వెళ్తేందన్నదే అసలైన ప్రమాదానికి కారణం.

హైదరబాద్ నానక్ రాంగూడలోని ఎఫ్ఎఏ కంపెనీకి ఎందుకు ఈ డేటా వెళ్తుంది..? గత నాలుగున్నర ఏళ్లలో వాలంటీర్లు సేకరించిన డేటాను మూడు ప్రైవేటు కంపెనీలకు మార్చారు. దాని వెనుక ఉన్న వైసీపీ నాయకులు… ప్రజాప్రతినిధులు ఎవరు అనేది ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజల డేటాను తీసుకుంటున్నారు కాబట్టి.. పూర్తి వివరాలను ప్రజలకే తెలియజేయాలి. దీనిపై కేంద్ర హోంమత్రి శ్రీ అమిత్ షా గారితోనూ చర్చించాం. డేటా చౌర్యం గురించి ఆయన ఆందోళన చెందారు. అది ఎంత పెద్ద నేరమో వివరించారు.

చేయకూడని పనులు వాలంటీర్లతో చేయిస్తున్నారు

వాలంటీర్లకు తెలిసోతెలియకో ప్రభుత్వం చేయిస్తున్న నేరంలో ఇరుక్కుపోతున్నారు. డేటా చౌర్యం కేసులో చిక్కుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ జరిగిన తప్పుల్లో సైతం- మా వెనక పెద్ద వ్యక్తి మద్దతు ఉందని అప్పటి సివిల్ సర్వీసు అధికారులు తప్పులు చేశారు. ఆ అధికారులను ఆ తప్పులు తర్వాత వెంటాడాయి. తప్పులు చేస్తే వ్యక్తిగత మద్దతు ఉన్నా తప్పించుకోవడం కుదరదు. ప్రజాస్వామ్యంలో వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది. చుట్టరికం కన్నా, చట్టాలు గొప్పవి. ఇప్పుడు కూడా వాలంటీర్లతో వైసీపీ ప్రభుత్వం చేయకూడని తప్పులు చేయిస్తోంది.

కేవలం రూ.5 వేల వేతనం ఇచ్చి నేరంలోకి లాగుతోంది. తెలిసో తెలియకో వాలంటీర్లు ఇరుక్కుపోతే కనీసం వారిని వైసీపీ నాయకులు తర్వాత పట్టించుకోరు. అసలు ప్రతి నెలా రూ.5 వేల గౌరవవేతనం ఇస్తున్న వాలంటీర్లు ఎలా స్వచ్ఛంద సేవకులు అవుతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

అమిత్ షా తో సమావేశం.. రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శనం

రెండు రోజుల ఢిల్లీ పర్యటన అద్భుతంగా సాగింది. పెద్దలు శ్రీ అమిత్ షా గారితో సమావేశం చక్కగా సాగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, పూర్తిస్థాయిలో రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించాం. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం బలమైన నిర్ణయం త్వరలోనే ఉంటుంది. దీనిపై ఓ స్పష్టమైన విధాన నిర్ణయం వస్తుంది. ఇది కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు అన్నివిధాలా మేలు చేసేలా ఉంటుంది. ప్రతిసారీ నేను ఢిల్లీ వెళ్లేటపుడు నాకు అపాయింట్ మెంట్ రాలేదని, ఎవరూ కలవలేదని చెప్పినా నేను పెద్దగా పట్టించుకోను. నాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఉన్న భావజాల సంబంధం రాజకీయాలకు అతీతమైంది. ౧

40 కోట్ల మంది భారతీయుల బాగు కోసం నిరంతరం ఆలోచించాల్సిన ప్రధానమంత్రి గారు అవసరం అయితే నన్ను పిలిపించుకొని మాట్లాడతారు.. ఆయనకు ఆ హక్కు, స్వేచ్ఛ ఉన్నాయి. అంతేగాని ప్రతి విషయాన్ని నేను ప్రధానమంత్రి వద్దకు వెళ్లి ప్రస్తావించి, ఆయన విలువైన సమాయాన్ని నా కోసం వెచ్చించేలా చేయాలని అనుకోను. నాకు బీజేపీ జాతీయ నాయకులతోనూ, ప్రధాని శ్రీ మోదీ గారితో ఉన్న సంత్సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయి. వారికి శ్రీ పవన్ కళ్యాణ్ దేనికోసం ఆలోచిస్తాడనేది తెలుసు. నా ఆలోచన ఎప్పుడూ రాష్ట్రం, దేశం కోసం ఉంటుందని వారికి నమ్మకం. గతంలోనూ వైజాగ్ లో ప్రధాని శ్రీ మోదీ గారు పిలిచినపుడు కూడా రాష్ట్ర అంశాల మీదనే చర్చ జరిగింది. నేను కేంద్ర పెద్దలను కలిసినపుడు రాష్ట్రం, దేశ ప్రయోజనం గురించి మాట్లాడతానే తప్ప… కేసులు మాఫీ కోసమో, అప్పులు కోసమో కాదు.

జగన్ పోవాలి.. ఎన్డీఏ ప్రభుత్వం రావాలి

నన్ను ఢిల్లీలోనూ విలేకరులు సీఎం అభ్యర్థి మీరేనా అని అడిగారు. నేను చెప్పేదొక్కటే. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, అప్పులు లేని ఆంధ్రను సాధించేందుకు నేను శక్తివంచన లేకుండా పనిచేస్తాను. ఎన్నికల్లో పూర్తిస్థాయిలో కష్టించి పనిచేసిన తర్వాత వచ్చిన స్థానాలు, సత్తాను బట్టి ముఖ్యమంత్రి ఎవరూ అనేది నిర్ణయం ఉంటుంది. పరివర్తన తీసుకొచ్చే రాజకీయాలు నేను చేస్తాను. ప్రజలను చైతన్యవంతం చేసే రాజకీయాలు నా లక్ష్యం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే నిర్ణయాలు మా వైపు నుంచి ఉంటాయి. మహిళల రక్షణకు అభయమిచ్చే అధికారం… అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసే అధికారం… యువతకు ఉపాధి మార్గం చూపే అధికారం… ప్రజలకు అండగా ఉండే అధికారం కోసం జనసేన పార్టీ పనిచేస్తుంది.

వ్యక్తిగత ప్రయోజనాలు, అంశాల కోసం జనసేన పాలన ఉండదు. జగన్ ను ఇంటికి పంపించే రోజు దగ్గర్లోనే ఉంది. కుదిరితే ఇంటికి పంపిద్దాం లేదూ చర్లపల్లి జైలుకు పంపిద్దాం. రాబోయే ప్రభుత్వంలో కచ్చితంగా జనసేన పార్టీ ముద్ర బలంగా ఉంటుంది.

జగన్ పాములాంటివాడు… జాగ్రత్త

వాలంటీర్లు తీసుకుంటున్న సమాచారం అంతా డేటా చౌర్యం కిందకు వస్తుంది. మనం ఇచ్చే వ్యక్తిగత సమాచారం కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఇవ్వాలి. ప్రభుత్వంలోనూ ఒక శాఖ తీసుకున్న వ్యక్తిగత డేటాను మరో శాఖ తీసుకోవాలంటే దానికి రాతకోతలు జరగాలి. ఉన్నతాధికారుల ఆమోదం ఉండాలి. అలాంటివేమీ జరగకుండానే కనీసం వాలంటీర్లు వ్యక్తిగత డేటా తీసుకోవాలని ప్రభుత్వం ఏ మాత్రం జీవో కూడా విడుదల చేయకుండానే అనధికారికంగా ప్రజల సమాచారం సేకరిస్తున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన డేటా ప్రైవేటు వ్యక్తుల వద్దకు ఎలా.. ఎందుకు వెళ్తుంది..? దీనికి సమాధానం చెప్పాలి. నేను చెప్పింది తప్పయితే నన్ను విచారణ చేయాలి. నేను కేసులకు, బెదిరింపులకు భయపడి పారిపోను. విదుర నీతి ప్రకారం… ఈ రాష్ట్రం కోసం నా ప్రాణం పణంగా పెట్టడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను.

ఇటీవల తిరుపతి ఎస్పీ గారిని కలిసినపుడు వాలంటీర్ల గురించి చర్చ వచ్చింది. ఓ మహిళా సీఐ రాజ్యాంగం ప్రసాదించిన మానవహక్కులను హరించినపుడు మేం ఎస్పీ గారిని కలిశాం. మరి ఓ వాలంటీరు రాజ్యాంగ హక్కుల పరిధి దాటితే మేం ఎవరికి ఫిర్యాదు చేయాలి..? ఎవరికి చెప్పుకోవాలని అని అడుగుతున్నాం. ఓ వాలంటీరు కన్నీటి గాధ కారణంగానే జనవాణి కార్యక్రమం మొదలైంది. రాష్ట్రంలోని ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చాయి. జగన్ పాము లాంటి వాడు. అవసరం అయితే తన పిల్లలను తానే తినే అనకొండ అనేది వాలంటీర్లు గుర్తుంచుకోవాలి. ఆపత్కాలంలో వెంట ఉంటాడని అమాయకంగా అనుకోవద్దు. నా రాష్ట్ర యువత, అభివృద్ధి, ఉపాధి, వ్యవసాయ ఉన్నతి మీదనే నా దృష్టి ఉంటుంది” అని అన్నారు.

రాష్ట్రానికి పట్టిన గ్రహణం వైసీపీ : నాదెండ్ల మనోహర్

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో కేంద్ర నాయకత్వం, బీజేపీ పెద్దలను కలసి అనేక అంశాలపై పవన్ కళ్యాణ్ సుధీర్ఘంగా చర్చించారు. పంచకర్ల రమేష్ బాబుని పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం కోసం అక్కడ ఉన్న కార్యక్రమాలను కుదించుకుని హుటాహుటిన మంగళగిరి చేరుకున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వైసీపీ. అలాంటి వైసీపీ నుంచి విముక్తి చెందే ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయండి. ప్రజల కోసం, రాష్ట్రం కోసం అంకితమవడానికి జనసేన పార్టీలోకి వచ్చిన శ్రీ పంచకర్ల రమేష్ బాబుకి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం.

రమేష్ బాబు శాసనసభకు ఎన్నికైన రెండు దఫాలు నియోజకవర్గానికి, రాష్ట్రానికి మేలు చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏ మాత్రం స్వార్థచింతన లేకుండా తన ప్రాంతానికి మంచి చేయాలన్న తపనతో పని చేసిన వ్యక్తి ఆయన. ఓ కుటుంబ సభ్యుడిగా విలువలతో కూడిన జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కృషి చేయాల”ని ఆకాంక్షించారు.

నిస్వార్ధ రాజకీయాలకు కేరాఫ్ పవన్ కళ్యాణ్: పంచకర్ల రమేష్ బాబు

పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ.. “నిస్వార్ధ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎంత మంది ఎన్ని తిట్టినా ప్రజల కోసం అన్నింటినీ దీవెనలుగా స్వీకరించి ముందుకు వెళ్తున్న వ్యక్తి. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను దారిలో పెట్టడానికి మనందరి కోసం అత్యున్నత జీవితాన్ని వదులుకుని వచ్చి మరీ మాటలు పడుతున్నారు. భావితరాల భవిష్యత్తు కోసం శ్రమించే వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కలసి పని చేయడానికి జనసేన పార్టీలో చేరాను. ఆయనతో కలసి పని చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం పని చేస్తా”నని అన్నారు. కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, పార్టీ నేతలు అంగ దుర్గా ప్రశాంతి, పీవీఎస్ఎన్ రాజు, నయుబ్ కమల్, గాదె వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

పొత్తుల ఉచ్చులో జనసేన? – జగయ్య ఆలోచనాత్మక విశ్లేషణ