Nadendla Manohar at NellimarlaNadendla Manohar at Nellimarla

రూ.3,359 కోట్ల నిధులు పక్క దారి
రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచిన ప్రభుత్వం
వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి బురద
ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో
వైసీపీ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది
వచ్చే జనసేన – తెలుగుదేశం ప్రభుత్వ స్థాపన కోసం కష్టపడి పని చేయాలి
నెల్లిమర్ల నియోజకవర్గ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వం  (YCP Government) పంచాయతీ వ్యవస్థను (Panchayat Raj System) నిర్వీర్యం చేసింది అని జనసేన పార్టీ (Janasena Party) పొలిటికల్ అఫైర్స్ కమిటి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు. ‘ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పంచాయతీలకు సంబంధించిన రూ. 3,359 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం తన ఇష్టానికి వాడేసుకుంది. స్థానిక పరిస్థితులు, సమస్యలను అనుసరించి గ్రామాల్లో ఖర్చు పెట్టాల్సిన నిధులను సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లకు తెలియకుండానే దారి మళ్లించి పంచాయతీల పొట్ట కొట్టింది. అదే నిధులు గ్రామాలకు ఖర్చు పెడితే ఈ రోజున గ్రామాల్లో ఎన్నో మౌలిక వసతులు, సౌకర్యాలు ఉండేవి. గ్రామ పంచాయతీలను వైసీపీ ప్రభుత్వం నిలువునా పాతర వేసింది’ అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా సమన్వయకర్త, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ అశేష జనావళి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గం కార్యాలయం ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసారు.

“రాష్ట్రంలో రాజ్యాంగాన్ని గౌరవించని పరిపాలన సాగుతోంది. మహనీయుడు శ్రీ అంబేద్కర్ రాసిన అద్భుతమైన రాజ్యాంగ విలువలకు వైసీపీ ప్రభుత్వం పాతర వేసింది. ఇష్టం వచ్చినట్లు పాలన సాగించడం తప్ప రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సొంత రాజ్యాంగాన్ని, నిర్ణయాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చేస్తున్న పాలనతో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా గ్రామ మొదటి పౌరుడిగా గెలిచిన సర్పంచ్ అధికారాలకు సైతం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కత్తెర వేసింది. వారి ఖాతాల్లో ఉండాల్సిన నిధులను వారికి తెలియకుండానే ప్రభుత్వం దారి మళ్లించడం అంటే కచ్చితంగా పంచాయితీలను మోసం చేయడం కిందకే వస్తుంది. వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీల పీక నొక్కి పాలన చేస్తున్నారు.

భోగాపురం పంచాయతీలో కాగ్ తనిఖీలు

కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను కూడా వారికి ఇవ్వకుండా చేయడం వెనుక ఈ ప్రభుత్వ అసలు నైజం దాగి ఉంది. ఆర్థిక సంఘం నిధులు రూ. 3,359 కోట్లు విడతల వారీగా వైసీపీ ప్రభుత్వం దారి మళ్ళించి ఇష్టారీతిన వాడుకోవడం దుర్మార్గం. కాగ్ వంటి కీలకమైన సంస్థలు సైతం ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టినా ఏమాత్రం బెదరకుండా ముందుకు వెళ్తున్న వైసీపీ కచ్చితంగా ప్రజా కోర్టులో సమాధానం చెప్పి తీరాలి. రాష్ట్రంలో సుమారు ఐదు పంచాయతీల్లో కాగ్ లెక్కలను పరిశీలిస్తే విజయనగరం జిల్లా భోగాపురం పంచాయతీలో కూడా కాగ్ పరిశీలన, తనిఖీలు చేసిన వాటిలో ఉంది. పంచాయతీల తనిఖీల్లో కూడా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. వాటిని కూడా ప్రభుత్వం మరుగున పడేలా చేసింది. సర్పంచులు చేయాల్సిన పనులకు కూడా నిధులు లేకుండా వారి చేతులు కట్టేసి ప్రభుత్వం ఆటలాడుతోంది.

ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేక ప్రణాళిక

అపారమైన వనరులు, విశేషమైన మానవ సంపద కలగలిపిన నేల ఉత్తరాంధ్ర. ఇక్కడ దొరకని సహజ సంపద లేదు. శ్రమించి పనిచేసే అద్భుతమైన మానవ శక్తి మరెక్కడా కనిపించదు. అలాంటి ఉత్తరాంధ్రలో దశాబ్దాలుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయిన నాయకులు ఈ ప్రాంతానికి వెలగబెట్టింది ఏమీ లేదు. ఈ ప్రాంతంలోని అన్ని వనరులు దోచుకొని వారు పెద్దవారు అయ్యారు తప్పితే ఇక్కడి ప్రజల జీవనస్థితిగతుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఉత్తరాంధ్ర ఉజ్వల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ప్రత్యేకంగా ప్రణాళిక వేస్తుంది. ఉత్తరాంధ్ర కోసం పార్టీ తరఫున ప్రత్యేకంగా మేనిఫెస్టోను తయారు చేసి, అమలు చేసే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసి చూపుతాం. కాలుష్యరహిత పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిచ్చి ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించే బాధ్యతను తీసుకుంటాం. ఎంతో చరిత్ర కలిగిన విజయనగరం నేలలో జనసేన ప్రస్థానాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించేలా పని చేస్తాం. వెనుకబాటుతనం, వలసలు లేని సరికొత్త ఉత్తరాంధ్రను ఆవిష్కరింప చేస్తాం. పరిపాలన మేమే సాగించాలి అనే నియంత ధోరణితో ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని పట్టిపీడిస్తున్న వారిపై బలమైన పోరాటాలు చేస్తాం.

అన్నింట్లోనూ అవినీతి

వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏ పథకం చూసినా అవినీతితో నిండిపోయింది. విద్యా శాఖ విషయంలోనూ జరిగిన అవినీతి పనుల్ని ఇప్పటికే జనసేన పార్టీ తరఫున బయట పెట్టాం. జగనన్న విద్యా కానుకలో ఇచ్చిన నాసిరకపు విద్యా వస్తువుల ద్వారా ఎంత మొత్తం కొల్లగొట్టారు అన్నది కూడా ఇప్పటికే వివరించాం. ఈడీ చేసిన దాడుల్లో రూ. 120 కోట్ల మేర అవినీతి లెక్కలు జగనన్న విద్యా కానుకలో బయటపడడం ప్రాథమిక అవినీతిలో భాగం మాత్రమే. టోఫెల్ పేరిట మూడో తరగతి పిల్లలకు పరీక్షలు పెడుతూ, దానికి సంబంధించి భారీగా అవినీతి జరిగిన విషయాన్ని కూడా ప్రజల ముందు ఉంచాం. ఇక జగనన్న ఇళ్ల విషయంలో జరిగిన అవినీతికి అంతే లేదు. ఇళ్ల స్థలాల సేకరణ పేరుతో వైసీపీ నాయకులు సుమారు రూ.34,500 కోట్ల ప్రజాధనాన్ని జేబులో వేసుకున్నారు. ఎక్కడో ఉన్న భూములను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలు పేరిట ఇచ్చి దానికి భారీ స్థాయిలో పరిహారం పొందారు. దీని కోసమే జగనన్న ఇళ్ల పథకం పనికి వచ్చింది. రూ.1,75,000 కోట్ల తో జగనన్న కాలనీలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడా కనీసం ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. కనీస సౌకర్యం కల్పించలేదు. అయినా అంత డబ్బు ఖర్చు చేశారు అంటే అది ఎవరి జేబులోకి వెళ్ళిందో ప్రజలు గమనించాలి. ఇక జగనన్న పాలవెల్లువ.. పాపాల వెల్లువ ఎలా అయిందో కూడా వివరించాం. 3.84 లక్షల గేదెలను కొనుగోలు చేశామని చెప్పిన ప్రభుత్వం, క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే కేవలం ఎనిమిది వేల గేదెలను మాత్రమే కొనుగోలు చేసి దొంగలెక్కలు చెప్పింది. రూ.2,783 కోట్లు పాల వెల్లువలో అవినీతి జరిగింది. మహిళా సాధికారత పేరుతో పాలవెల్లువ పథకాన్ని పూర్తిగా అవినీతిమయం చేశారు. పంటల బీమా పథకంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 6 మంది రైతులకు మాత్రమే ప్రయోజనం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో అవి ఇవి కాదు ఏ పథకం చూసినా అది వైసీపీ నాయకుల అవినీతి కోసం మాత్రమే ఉపయోగపడింది. ఇలాంటి అసమర్థ దుర్మార్గమైన పరిపాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కష్టపడి పని చేద్దాం

బలమైన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి జనసేన – తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి. మరోసారి ఈ దుష్ట పాలకుడికి అవకాశం ఇవ్వకూడదని బలంగా భావించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు పొత్తుకు నిర్ణయం తీసుకున్నారు. కలిసి పని చేస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సులభంగా విజయం సాధించగలం. యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలకు తగిన విధంగా న్యాయం చేసేందుకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ముఖ్యంగా యువ శక్తిని మరింత విస్తరిస్తాం. ఉత్తరాంధ్ర యువత మీద బలమైన నమ్మకంతోనే యువశక్తి లాంటి కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు రణస్థలంలో నిర్వహించారు. ఇక్కడ ఉన్న ఆ యువశక్తికి ఒక దశా దిశా చూపించేలా కృషి చేస్తాం. యువతను స్వయం ఉపాధి చోదకులుగా తయారుచేసి ప్రతి వ్యక్తికి రూ.10 లక్షలు ఇచ్చేలా ప్రత్యేక పథకాన్ని తీసుకువస్తాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయ పోరాటం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన చోట ఎంత బలంగా జనసైనికులు, వీర మహిళలు పని చేస్తారో… పొత్తులోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిలబడిన చోట కూడా అంతే అంకితభావంతో పని చేయాలి. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగితే కచ్చితంగా భారీ మెజారిటీతో గెలుపు సాధ్యం. విజయనగరం జిల్లాకు చరిత్ర ఉంది. ఇక్కడ ప్రజల ఆలోచన విధానం గొప్పగా ఉంటుంది. ఈ ప్రాంతం జనసేన పార్టీకి అడ్డాగా మారాలి. ప్రతి ఒక్కరూ దీని కోసం బలంగా పనిచేయాలి. సోషల్ మీడియాలో ప్రత్యర్ధులు చేసే విష ప్రచారాన్ని నమ్మకండి. సోషల్ మీడియాను మంచికి మాత్రమే ఉపయోగించండి. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటలే శిరోధార్యంగా భావించి ముందుకు వెళ్ళండి. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే లేనిపోని ఈగోలకు పోకుండా వాటిని సరిదిద్దుకొని ముందుకు కదిలితే కచ్చితంగా గెలుపు నల్లేరు మీద నడక అవుతుంది.” అన్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన బీసీ నాయకులు శ్రీ గొర్లె తిరుపతి రావు జనసేన పార్టీలో చేరారు. ఆయనకి శ్రీ మనోహర్ గారు పార్టీ కండువా కప్పి సోదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, నియోజక వర్గాల బాధ్యులు, మండలాధ్యక్షులు పాల్గొన్నారు.

బీమా చెక్కులు అందజేత

ఇటీవల వేరువేరు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శనివారం సాయంత్రం ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. విజయనగరం జిల్లాకు చెందిన జనసేన క్రియాశీల సభ్యులు ఇటీవల వివిధ ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. వారికి పార్టీ నుంచి రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులు మనోహర్ గారు అందజేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన పొట్నూరి రాజేష్, ఎస్. కోట నియోజకవర్గానికి చెందిన సేనాపతి గణేష్, వాకా స్వామి నాయుడు, నెలిమర్ల నియోజకవర్గానికి చెందిన సిల్లా సోమశేఖర్ లు ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి చెక్కులు అందించారు. నెలిమర్ల నియోజకవర్గానికి చెందిన క్రియాశీలక కార్యకర్త కోలా శ్రీనుకు ప్రమాదంలో అంగ వైకల్యం కావడంతో రూ.3 లక్షల మెడి క్లెయిమ్ చెక్కు అందజేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజయ రహస్యాలు…

Spread the love