ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో (West Godavari District) పవన్ కౌలురైతు భరోసా యాత్ర (Kaulu Rythu Bharosa Yatra) ప్రారంభం కాబోతున్నది. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 23వ తేదీన జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు.
జనసేన (Janasena) కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు బైపాస్ మీదుగా చింతలపూడికి వెళతారు. ఆత్మహత్య చేసుకున్న కొంతమంది కౌలు రైతు కుటుంబాల ఇళ్లకు వెళ్లి మార్గం మధ్యలో పరామర్శిస్తారు. జనసేన పార్టీ తరఫున రూ. లక్ష పరిహారం అందిస్తారు. అనంతరం చింతలపూడిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.
బలవన్మరణాలకు పాల్పడిన మరికొంత మంది రైతు కుటుంబాలకు ఈ సందర్భంగా చింతలపూడిలో రూ. లక్ష చెక్కులు అందచేస్తారు.
అనంతపురం జిల్లాలో జరిగిన మొదటి విడత కౌలు రైతు భరోసా యాత్రలో 31 మంది కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించిన విషయం అందరికీ తెలిసిందే.