S V Ranga RaoS V Ranga Rao

విశ్వనట చక్రవర్తి ఎస్ వి రంగారావు (S V Ranga Rao) గొప్పనటుడు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడు (International Best Actor) అవార్డు పొందిన వ్యక్తి. దక్షిణ భారత సినీ చరిత్రలో (South Indian Film History) చిరస్థాయిగా ఉండే వ్యక్తి.

అది 1964 మే 5 రాత్రి 9 గంటల సమయం. అతి ముఖ్య అతిథి కోసం మద్రాసు మీనంబాకం విమానాశ్రయం వెలుపల అసంఖ్యాకమైన జనసందోహం వేచి చూస్తున్నారు. వారికి స్వాగతం చెప్పటానికి నటరత్న ఎన్టీఆర్‌, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ప్రభృతులు విమానాశ్రయం ముఖద్వారం వెలుపల పూలమాలలు పుచ్చుకుని నిలబడి ఉన్నారు. లెక్కకు మిక్కిలిగా జనం వచ్చి పడటంతో ఇంకా చాలామంది సినీనటులు ముఖద్వారం దాకా రాగలిగే పరిస్థితి లేక దూరంగానే ఆగిపోవాల్సి వచ్చింది.

ఎట్టకేలకు రావలసిన అతిథి విమానాశ్రయంలో దూరంగా కనిపించారు. అతిథి అంటే మామూలు అతిథి కాదు, భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి. నర్తనశాల (Narthanashala) సినిమాకుగాను రంగారావుకి అంతర్జాతీయ ఉత్తమనటుడి పురస్కారం వచ్చింది. అప్పటి ఇండోనేషియా (Indonesia) అధ్యక్షుడు సుకర్ణో చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుని తిరిగి వస్తున్న నట యశస్వి ఎస్‌.వి. రంగారావు విమానాశ్రయం ముఖద్వారం దగ్గరకు రాగానే జనకోలాహలంతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. జేజేలు పలుకుతున్న గొంతుల్లో తెలుగువారికన్నా తమిళ గొంతులే ఎక్కువగా వినిపించాయంటే, ఎస్వీ రంగారావు తమిళ భాషలో కూడా ఎంతటి ప్రశస్తిపొందారో అర్థం అవుతుంది. ముందుగా ఎన్‌.టి. రామారావు (N T Rama Rao) పూలమాలవేసి రంగారావుని ఆలింగనం చేసుకున్నారు.

అంతర్జాతీయ ఉత్తమ నటుడి బహుమతి

భారతదేశం (India) నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడి (Best Actor) బహుమతి పొందిన వ్యక్తిగా ఎస్వీఆర్ గుర్తింపు పొందారు. ఒక మహానటుడికి దక్కిన ఈ అరుదైన గౌరవానికి దేశం యావత్తూ గర్వించింది. ఆ మహానటుడు తెలుగువాడు కావటంతో తెలుగు హృదయం మరింత ఉప్పొంగింది.

ఈ సందర్భంగా 1964 మే 12న మద్రాసులో (Madras) జరిగిన అభినందన సభలో ప్రముఖ నాటక రచయిత, విమర్శకులు మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డా. పి. వి. రాజమన్నారు ప్రసంగిస్తూ, రంగారావు చార్లెస్ లాటన్ కోవకు చెందిన మహానటుడని కీర్తించారు. ప్రపంచంలోని అత్యుత్తమ కేరెక్టర్ నటుల్లో ఒకరని ప్రశంసించారు. హిందీ చిత్రసీమలో పృధ్వీరాజ్ కపూర్, అశోక్ కుమార్, ఓం ప్రకాశ్, ప్రాణ్ మహానటులుగా పేరున్నవాళ్లు. ఆ నలుగురు నటుల్ని కలబోస్తే ఎస్వీఆర్ అవుతారని ప్రముఖులు చెప్తుంటారు. ఇది అతిశయోక్తి కాదు. ఆయన తెలుగువాడు కాకపోయిఉంటే ఆ నలుగురినీ మించిన నటుడిగా అంతర్జాతీయంగా వాసికెక్కి ఉండేవాడు కూడా! ‘రంగారావు తెలుగువాడు కావటం తెలుగువారి అదృష్టం. కానీ, ఆయనకు మాత్రం దురదృష్టమే!’ అని గుమ్మడి వ్యాఖ్యానించారు.

వైవిధ్యమైన పాత్రల్లో ఎస్వీఆర్

దుర్యోధనుడు, కీచకుడు, రావణుడు, మైరావణుడు, ఘటోత్కచుడు, కంసుడు, భీష్ముడు ఎలా ఉంటారో మన పూర్వులకు తెలీదు. ఎస్.వి. రంగారావు వాళ్లు ఎలా వుంటారో మన తరానికి కళ్లకుకట్టేలా చూపించారు. ఆంధ్ర విష్ణువు కథలో నిశుంభుడిపాత్రని చూసినప్పుడు, ఆర్యులు దక్షిణాదిన మన తెలుగు నేల మీదకు ఇంకా రాకమునుపే పౌరుషవంతులు, శక్తిమంతులతో కూడిన జాతులు ఇక్కడ నివసించాయన్న నిజం మనకు అర్థం అయ్యేలా నటించి చూపించారు ఎస్వీఆర్. మూడు దశాబ్దాలపాటు మూడొందలకు పైగా చిత్రాల్లో అద్భుతంగా నటించి, తాను నటించిన పాత్రలకు సజీవత్వాన్ని సాధించారు ఎస్వీఆర్. ‘లక్ష్మీ నివాసం’ సినిమాలో ‘కొండలైన కరగిపోవు కూర్చుని తింటే’ అంటూ ఘంటసాల పాడిన ఆరుద్ర పాటకు ఆయన చేసిన అభినయం డబ్బు దుబారా చేస్తున్న ప్రతీ వ్యక్తికీ గుర్తుకు వచ్చేలా ఉంటుంది.

నూజివీడులో జన్మించిన రంగారావు

1918జూలై 3న నూజివీడులో జన్మించిన సామర్ల వెంకట రంగారావు స్కూలు విద్యార్థి దశలో మాంత్రికుడి సహాయకుడిగా నటించి బహుమతి పొందాడు. బిఎస్సీ పట్టా పొందాక కాకినాడ యంగ్‌మెన్స్ హ్యపీ క్లబ్ సహకారంతో ‘ఖిల్జీ రాజ్యపతనం’, ‘పీష్వానారాయణరావు’ లాంటి నాటకాలు వేసి పేరు తెచ్చుకున్నారు. అగ్నిమాపక శాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్‌స్పియర్ ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించారు.

ఆరోజుల్లో షైలాక్ పాత్ర పోషణ అనుభవం భవిష్యత్తులో పాతాళ భైరవి మాంత్రికుడిగా నటించటానికి తనకెంతో ఉపయోగపడిందని ఆయనే చాలా సార్లు చెప్పుకున్నారు. బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన ‘వరూధిని’ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా ఎస్వీఆర్ తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యారు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ సినీ ప్రపంచంలోకి ఎస్వీఆర్ అనే ఒక దిగ్గజం అడుగుపెట్టడానికి దోహదకారి అయ్యింది. ఆయన ప్రథమంగా ‘వరూధిని’ సినిమాలో నటించినప్పుడు నటుడిగా ఆయన గురించి చర్చించినవారే లేరు. ‘పల్లెటూరిపిల్ల’లో ఒక వృద్ధుడిపాత్ర వేసినప్పుడు బాగానే వేశాడే ఈ నటుడెవరో.. అనుకున్నారంతా! ‘షావుకారు’ సినిమాలో రంగడు పాత్రలో ఆయన నటన చూసి ఓ మంచి నటుడు తెలుగు తెరకు దొరికాడని పత్రికలు వ్యాఖ్యానించాయి. ‘పాతళభైరవి’లో మాంత్రికుడి పాత్ర చూశాక జనం నీరాజనాలర్పించారు. ఈ పాత్రకు ఆయన తప్ప సరిపోయే మరో నటుడే లేడని ప్రతీ ఒక్కరూ భావించారు.

ప్రతీ సినిమా ఒక కళాఖండమే

‘దీపావళి’, ‘అనార్కలి’, ‘మహాకవి కాళిదాసు’, ‘భట్టివిక్రమార్క’, ‘బొబ్బిలియుద్ధం’, ‘చరణదాసి’, ‘లక్ష్మీ నివాసం’, ‘జయభేరి’ ఇలా ఒక పాత్రకు మరో పాత్రకూ సంబంధం లేకుండా జీవితంలో ఎన్ని పార్శ్వాలున్నాయో, ఎన్ని కోణాలున్నాయో, ఎన్ని ఉదత్తానుదాత్త స్వరాలున్నాయో అన్నింటినీ తన అభినయంలో ప్రదర్శిస్తూ, తన గొంతులో ధ్వనింపచేసిన నటవిరాట్టు రంగారావు.

ఆయన కదిలితే నటన, పలికితే డైలాగ్ అన్నట్టుగా ఉండేది ఆ రోజుల్లో! పింగళి, సముద్రాల.. ఇంకా అనేకమంది గొప్ప రచయితలు ఆయనలోని నట విరాట్ రూపాన్ని ఆవిష్కరింపచేశారు. ‘ఘూట్లే’, ‘డోంగ్రే’, ‘కత్తుల రత్తయ్యని-పచ్చి రక్తం తాగుతా’ లాంటి డైలాగులు ఇప్పటికీ లోకవ్యాప్తిని పొందుతూనే ఉన్నాయి. పాతాళభైరవి సినిమాలో ‘మహాజనానికి మరదలు పిల్ల’, ‘శృంగారం శాయవే బుల్‌బుల్’, ‘సాహసం శాయరా డింభకా’.. ఇలా ఆయన నోట పలికిన ప్రతీ మాటా ప్రసిద్ధమే! నటసార్వభౌమ, నటసింహ, విశ్వనటచక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ‘భక్తప్రహ్లాద’, ‘చెంచులక్ష్మి’, ‘దీపావళి’.. ఇలా ఒకటేమిటి ఆయన నటించిన ప్రతీ చిత్రమూ ఒక మహాద్భుత రససాగరమే! ఆయన స్వయంగా దర్శకత్వం వహించిన ‘చదరంగం’, ‘బాంధవ్యాలు’ చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ బహుమతులు లభించాయి.

కీచకుడి పాత్రలో రంగారావు నటన

‘నర్తనశాల’లో అద్దం ముందు తనను తాను చూసుకుంటూ తన సోయగానికి తానే మురిసిపోయే కీచకుడి పాత్రలో రంగారావు నటన అద్భుతం. ‘పెళ్లిచేసి చూడు’లో ధూపాటి వియ్యన్నపాత్ర, ‘చదరంగం’లో అంధుడైన ఒక మాజీ సైనికాధికారి పాత్ర, ‘తోడికోడళ్లు’లో మతిమరుపు లాయరు కుటుంబరావు పాత్ర, ‘కత్తుల రత్తయ్య’లో రౌడీపాత్ర, ‘అనార్కలి’లో అక్బర్ పాత్ర, ‘పాండవ వనవాసం’లో దుర్యోధనుడిపాత్ర… ఒకటేమిటి… తెలుగువారి మనసుల్లో కలకాలం నిలిచిపోయే పాత్రలెన్నో ఆయన నటించినవి ఆయన ఙ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి. ‘ఆఁ! బానిస! బానిసకింత అహంభావమా?’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ నిజంగా అనితరసాధ్యమైనదే! భావస్ఫోరకమైన విరుపు, అందమైన, అర్థవంతమైన ఉచ్చారణ, అందుకు తగ్గ ఆంగికాభినయాలు ఆయన స్వంతం.

ప్రజలకు సినిమా పాటలు గుర్తుంటాయి. వాటితోపాటుగా ఎస్వీఆర్ డైలాగులూ నేటికీ ప్రజల మనసుల్లో నిలిచి ఉండటమే ఒక అద్భుతం. ‘డబ్బుకులోకం దాసోహం’ లాంటి సినిమాల్లో ఆయన నటించిన కఠినాత్ముడి పాత్రలు తరువాతి తరం విలన్లకు పాఠ్య గ్రంథాలుగా ఉపయోగపడతాయి. ‘గుండమ్మకథ’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘దసరాబుల్లోడు’ సినిమాల్లో ఆయన నటన అనితరసాధ్యం అనిపిస్తుంది. 150 తెలుగు సినిమాలలోనూ, 87 తమిళ సినిమాలలోనూ, 2 కన్నడ సినిమాలలోనూ, 3 మళయాళ సినిమాలలోనూ, 3 హిందీ సినిమాలలోనూ ఆయన నటించారు. ఆయన ఎంతటి నటుడో అంతటి కథారచయిత కూడా! వారి కథలు ఆంధ్ర సచిత్ర వారపత్రిక, యువ, వెండితెర తదితర పత్రికల్లో అచ్చయ్యాయి.

అవనిగడ్డలో ఘనసన్మానం

1960 దశకంలో రంగారావుకి అవనిగడ్డలో ఘనసన్మానం జరిగింది. అవనిగడ్డలోని వయోవృద్ధులు ఇప్పటికీ రంగారావుకు జరిగిన ఘన సన్మానం గురించి మాట్లాడుతూ ఉంటారు. సినీ దర్శకుడు కె. వి. నందన రావుది మా దివిసీమకు చెందిన వేకనూరు గ్రామం. అవనిగడ్డకు రంగారావుని తీసుకు రావటానికి నందనరావే కారకుడు. రంగారావు కుమారుడు కోటేశ్వరరావుని కూడా నాకు పరిచయంచేశారు. రంగారావు భార్య లీలావతి. మామ బడేటి వెంకట రామనాయుడు. బడేటి వారి కుటుంబంలో మూడవ తరానికి చెందిన బడేటి కోటరామారావు ప్రస్తుత ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు. వారి పూనికతో యస్వీ రంగారావుగారి శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆ మహానట యశస్వి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించటం ముదావహం.

ఎస్వీఆర్ ప్రతిభకి దక్కని గుర్తింపు

రంగారావు రచ్చగెలిచిన మనిషి. కానీ, ఇంట ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదనేది ఎక్కువమంది అభిప్రాయం. కనీసం పద్మశ్రీ గౌరవం ఆయనకు దక్కకపోవటం బాధాకరం. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించవలసి ఉంది. ఎస్వీఆర్‌ 1974 జూలై 18న ఆయన మరణించారు. జనం గుండెల్లో మాత్రం సజీవంగా నిలిచి ఉన్నారు.

డా. మండలి బుద్ధప్రసాద్
మాజీ ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(నేడు ఎస్‌.వి. రంగారావు జయంతి సందర్భంగా అంతర్జాలం నుండి సేకరణ)