విజయోస్తూ.. అంటూ దీవించిన పిఠాపురం ప్రజలు
సమధికోత్సాహంతో వేలాదిగా తరలి వచ్చిన ప్రజానీకం
జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళల పరవశం
హారతులు, పూల వర్షంతో మురిసిన పిఠాపురం
అంగరంగ వైభవంగా సాగిన పవన్ కళ్యాణ్ నామినేషన్ ఊరేగింపు
హనుమజ్జయంతి రోజున ఇష్ట దైవం ఆశీస్సులతో నామినేషన్ (Pawan Kalyan Nomination) వేసేందుకు జనసేన అధ్యక్షులు (Janasena President) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానుల కోలాహలం నడుమ ర్యాలీగా వెళ్లారు. పిఠాపురం (Pitapuram) ప్రజానీకం స్వచ్ఛందంగా ఆయన వెంట తరలిరాగా హనుమాన్ జెండా చేతబూని ఎన్నికల సంగ్రామానికి బయలు దేరారు. ఆ మహాద్భుత ఘట్టం మంగళవారం పిఠాపురం నియోజకవర్గంలో ఆవిష్కృతమైంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి వేలాదిగా ప్రజానీకం మద్దతుగా తరలివచ్చింది.
ఎక్కడ చూసినా జనంతో కిక్కిరిసిన రహదారులు, పూల వర్షంతో తడిసి ముద్దయిన పురవీధులు, వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాల ర్యాలీలు, జనసేనతో పాటు జాతీయ జెండాలు, టీడీపీ, బీజేపీ జెండాల రెపరెపలు మంగళవారం పిఠాపురాన్ని ముంచెత్తాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ దాఖలు ఘట్టానికి మద్దతుగా తరలివచ్చి విజయోస్తూ అంటూ ఆయన్ని ఆశీర్వదించారు.
హారతి పట్టి, వీరతిలకం దిద్దిన వర్మ దంపతులు
ఉదయం 9.30 గంటలకు చేబ్రోలులోని ఆయన నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వీర మహిళలు గుమ్మడి కాయలతో హారతులు పట్టి దిష్టి తీయగా పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు. నియోజకవర్గ పెద్దలు భారీ మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తామంటూ ఈ సందర్భంగా ప్రతినబూనారు. అప్పటికే వేలాదిగా తరలివచ్చిన జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు జయజయధ్వానాల మధ్య గోకుల్ గ్రాండ్ హోటల్ కి చేరుకున్నారు. అక్కడ నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మ గారు, ఆయన సతీమణి హారతులు పట్టి వీర తిలకం దిద్ది సాగనంపగా, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి ఆశీర్వచనాలు స్వీకరించారు.
వేద పండితులు దిగ్విజయోస్తూ అంటూ దీవెనలు అందించారు. శ్రీమతి మణి చౌదరి క్రైస్తవ మత ప్రార్థనలు చేసి దీవెనలు ఇచ్చారు. అక్కడి నుంచి కిక్కిరిసిన జన సందోహం మధ్య ర్యాలీగా బయలుదేరి గొల్లప్రోలు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రచార రథం మీదకు ఎక్కి పవన్ కళ్యాణ్ ర్యాలీగా బయలుదేరగా స్థానిక మహిళలు దారి పొడుగునా హారతుల స్వాగతం పలికారు. ప్రతి హారతిని స్వీకరిస్తూ, ఆడపడుచులు, జనసైనికులకు కరచాలనాలు చేస్తూ ముందుకు సాగారు. ఆడపడుచులు హారతులతో వచ్చిన ప్రతి చోటా ఆగి హారతులు స్వీకరించి మరీ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు.
మండుడెండలోనూ దిక్కులు పిక్కటిల్లేలా…
గొల్లప్రోలు ఎమ్మార్వో ఆఫీస్, బస్టాండ్ సెంటర్, పిఠాపురం దూళ్ల సంత, చర్చ్ రోడ్డు మీదుగా ర్యాలీ సాగింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా పిఠాపురం ప్రజానీకం మొత్తం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కు కదలిరాగా, జనసేనాని కూడా అదే ఉత్సాహంతో సుమారు మూడు గంటలపాటు రోడ్ షోలో పాల్గొన్నారు. శ్రమ శక్తిని గౌరవిస్తూ ఎర్రటి తలపాగా ధరించి, కూటమి పక్షాలకు గౌరవం ఇస్తూ టీడీపీ, బీజేపీ కండువాలను మెడన ధరించి ర్యాలీ ఆద్యంతం ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచార రథం జాతీయ జెండాతో ముందుకు సాగింది. దూళ్ల సంత ప్రాంతంలో రెల్లి సోదరులు అఖండ మెజారిటీతో జనసేనానిని గెలిపిస్తామంటూ ప్రదర్శించిన బోర్డులు స్వీకరించి ఉత్సాహపరిచారు. ఈ సెంటర్ లో ఎస్సీ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీకి మద్దతు తెలిపారు.
మా భవిష్యత్తు నువ్వే పవనన్నా….
నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన పిఠాపురం యువత మా భవిష్యత్తు నువ్వే పవనన్నా అంటూ నినదించారు. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే విజయం తధ్యం అంటూ మరికొంత మంది యువత ప్లకార్డులు ప్రదర్శించారు. పిఠాపురం కోర్టు సెంటర్ లో ర్యాలీకి మద్దతుగా న్యాయవాదులు సైతం బయటకు వచ్చి మేమంతా మీ వెంటే అంటూ నినదించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ పత్రాలతో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రవేశించారు.
రోడ్ షోలో పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు, కాకినాడ పార్లమెంటు జనసేన అభ్యర్ధి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, బీజేపీ ఇంఛార్జ్ కృష్ణంరాజు, మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పవన్ కళ్యాణ్ తో ఉన్నారు.