Nadendla Manohar in TenaliNadendla Manohar in Tenali

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే చావావారిపాలెం రోడ్డు నిర్మిస్తాం
ప్రజాగ్రహం గ్రహించే ఎమ్మెల్యేలు గడప గడపకు తిరగడం లేదు
మద్యం దుకాణాలలో నెలకో కొత్త బ్రాండ్ దించుతున్నారు
తెనాలి నియోజకవర్గం చావావారిపాలెం సమావేశంలో నాదెండ్ల మనోహర్

తెనాలి (Tenali) మండలం చావావారిపాలెంలో (Tenali janasena) జనసేన (Janasena) జెండాను నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆవిష్కరించారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ‘రాజకీయం అంటే ఇసుక దందాలు, లిక్కర్ మాఫియాలు కాదు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడి అభివృద్ధి సాధించడమ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగున్నరేళ్లు అవుతున్నా… గుంతలు పడ్డ రోడ్డుపై తట్టెడు మట్టి వేసిన పాపాన పోలేదని వ్యాఖ్యానించారు.

తెనాలి శాసనసభ్యుడిగా ఎన్నికైన మూడు నెలల్లోనే నందివెలుగు నుంచి చావావారిపాలెం వరకు అద్భుతమైన రోడ్డును నిర్మిస్తామని, విజయవాడ, గుంటూరు నగరాలకు దీటుగా తెనాలిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం తెనాలి మండలం చావావారిపాలెంలో జనసేన జెండాను శ్రీ మనోహర్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వీరందరికి నాదెండ్ల మనోహర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన పార్టీ సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలనే సదుద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి, నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. అంగలకుదురు నుంచి చావావారిపాలెంకు వచ్చే రోడ్డు ఎంతో అధ్వాన్నంగా ఉంది. అడుగుకో గుంత కనిపించింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ఇదే పరిస్థితి ఉందని యువత చెబుతున్నారు.

రూ.9.6 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం సాధించారు?

151 మంది శాసనసభ్యులు ఉన్నారు. రూ.9.6 లక్షల కోట్లు అప్పులు చేశారు. చిన్న గ్రామ సమస్యను తీర్చలేకపోయారు. ప్రజాసమస్యలు తీర్చలేనప్పుడు దేనికోసం పదవులు? 2004లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రక్షిత మంచినీటి పథకం కోసం రూ. 100 కోట్ల నిధులతో ప్రకాశం బ్యారేజీ నుంచి పైపు లైన్ వేయించాం. గ్రామాల్లో సిమెంటు రోడ్లు వేశాం. అర్హులైన వృద్ధులకు పెన్షన్లు అందించాం. ఇప్పటి నాయకులు కనీసం అంగలకుదురు వంతెన కూడా నిర్మించలేకపోయారు.

మెగా డీఎస్సీ పేరుతో మోసం

జగనన్న కాలనీల పేరుతో నిరుపేదలను మోసం చేశారు. ఇళ్లు కట్టకపోతే ఇంటి పట్టాలు వెనక్కి లాక్కుంటామని వైసీపీ నాయకులు బెదిరించడంతో రూ.5 లక్షల అప్పులు తీసుకొచ్చి పేదలు ఇళ్లు నిర్మిస్తున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. మెగా డీఎస్సీ అంటూ యువతను మోసం చేశారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల విలువైన సమయాన్ని వైసీపీ నాయకులు వృధా చేశారు. లక్షల కోట్లు అప్పులు చేశారు తప్ప ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు. వీళ్ల బెదిరింపులు భరించలేక చాలా వరకు పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. గతంలో తెనాలిలో ఆటోనగర్ ను ఎలా అభివృద్ది చేశామో అందరికీ తెలుసు. ఇప్పుడు వేలాది మందికి ఉపాధి దానివల్ల లభిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలే జరగకూడదని ఈ ముఖ్యమంత్రి భావించాడు. అన్ని చోట్ల ఏకగ్రీవాలు చేయాలని ఆదేశించాడు. కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు మహిళలు అద్భుతంగా స్పందించారు. ప్రతి చోట నామినేషన్ వేసి పోరాటం చేశారు.

మద్యం దోపిడీ రూ.36 వేల కోట్లు

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసివచ్చిన పార్టీలతో ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ గారు రెండేళ్ల ముందే ప్రకటించారు. దాంట్లో భాగంగానే జనసేన, తెలుగుదేశం పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ప్రజలకు న్యాయం జరగాలని ఏ స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ పొత్తు నిర్ణయం తీసుకున్నారు. పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిన రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి అంటే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని ప్రజలు ఆశీర్వదించాలి. సంపూర్ణ మద్యపానం నిషేధం అని చెప్పి ఒక్క మద్యం అమ్మకాల్లోనే వైసీపీ అధినాయకుడు రూ. 36వేల కోట్లు దోచుకున్నాడు. తాగేవారికి ఏం తాగుతున్నారో పేర్లు కూడా తెలియడం లేదు. నెలకోసారి పేర్లు మార్చేస్తున్నారు.

రాజ్యాంగ విరుద్ధమైన వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి సర్పంచ్ వ్యవస్థను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పంట కాలువలకు సకాలంలో పూడికలు కూడా తీయడం లేదు. తాగు, సాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గడప గడప కార్యక్రమం అని చెప్పి ఏ గడపకు వెళ్లాలో ఏ గడపకు వెళ్లకూడదో ముందే నిర్ణయించుకొని వస్తున్నారు. పోలీసులు లేనిదే ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరగలేకపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం రాక ముందు సంక్షేమమే లేనట్లు అధికార పార్టీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. గతంలో పెన్షన్లు ప్రతీ నెల ఇచ్చేవారు. ఇప్పుడు నెలల తరబడి నిరీక్షించినా పెన్షన్ ఇవ్వడం లేదు. రైతులకు సబ్సిడీలపై రుణాలు, వ్యవసాయ పరికరాలు అందించాం. ముఖ్యంగా ఎస్సీ రైతులకు 75 శాతం సబ్సిడీతో పరికాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా రైతులకు వ్యవసాయ పరికరాలు ఇస్తున్నారా? ఇచ్చినా వైసీపీ సానుభూతిపరులకు మాత్రమే ఇస్తున్నారు. వచ్చేది కచ్చితంగా జనసేన, తెలుగుదేశం ప్రభుత్వమే” అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, జనసేన నాయకులు జాకీర్ హుస్సేన్, హరిదాసు గౌరీ శంకర్, పసుపులేటి మురళీకృష్ణ, శ్రీమతి పసుపులేటి వెంకట నరసమ్మ, దివ్వెల మధుబాబు, బొమ్మిశెట్టి వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

జనప్రభంజనం మధ్య ముదినేపల్లిలో జనసేనాని సింహ గర్జన