ఉత్పాదక వ్యయం కన్నా అనుత్పాదక వ్యయం ఎక్కువ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh అప్పుల ఊబిలోకి (Debt Trap) జారిపోబోతున్నది అనే విశ్లేషకుల వాదన. ఆ చేస్తున్న అప్పులు కూడా అనుత్పాదక వ్యయంపైనే (Non-Productive expenditure) ఖర్చు చేస్తున్నారు. అప్పులలో ఉన్న వృద్ధి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (Gross Domestic Production) కనపడటం లేదు. అప్పుల వృద్ధి ఈ వైసీపీ ప్రభుత్వం (YCP Government) హయాంలో 37.5 శాతంగా ఉంది. కానీ ఆ మేరకు రాష్ట్ర స్థూల ఆదాయం మాత్రం పెరగడం లేదు. 1956 నుంచి 2019 వరకు 60 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పు సుమారు 2.57 లక్షల కోట్ల రూపాయిలు.
కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం (Jagan Reddy Government) ఈ మూడున్నరేళ్లలో ఏడులక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసింది. రాష్ట్ర రెవెన్యూ లోటు అంచనాలకు మించిపోవడం ఆందోళనకరం. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నాటికే రెవెన్యూ లోటు (Revenue Deficit) రూ.46వేల కోట్లకు చేరినట్లు తెలుస్తున్నది.
2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రెవెన్యూ లోటు రూ.17వేల కోట్లు మాత్రమే ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో చెప్పింది. కానీ ఏకంగా 46,000 కోట్లకు ఎగబాకినట్లు తెలుస్తున్నది. అంటే దాదాపు 270 శాతం రెవెన్యూ లోటు పెరిగింది అన్న మాట.
దూసుకెళుతున్న రెవెన్యూ లోటు
రాకెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్న రెవెన్యూ లోటు త్వరలో ద్రవ్యలోటును (Fiscal Deficit) కూడా దాటిపోతుంది. బడ్జెట్‌లో ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.48,724 కోట్లు అప్పు తీసుకురానున్నామని చెప్పారు. కానీ మొదటి ఏడు నెలల్లోనే అన్ని రుణాలు కలిపి రూ.53 వేల కోట్ల అప్పులు ఏపీ ప్రభుత్వం తెచ్చినట్లు సమాచారం అందుతున్నది.
ఈ ఆర్థిక సంవత్సరం మరో అయిదు నెలల కాలం మిగిలి ఉండగానే బడ్జెట్‌లో చెప్పిన దానికి మించి అప్పు తెచ్చారు. ఆస్తులు పెంచే మార్గం ఒక్కటీ లేదు. అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజువారీ నిర్వహణకు, ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు నిధులు లేని పరిస్థితి ఉందంటే ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది.
ఇప్పటికే మూడున్నరేళ్లలో రూ.7లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చినా కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేని దుస్థితి ఆంధ్రాలో ఉన్నది. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదు. తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయో అర్థం కావడం లేదు. ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జగన్‌రెడ్డి ప్రభుత్వంపై ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
జగన్‌రెడ్డి ప్రభుత్వం కాలపరిమితి ముగిసే నాటికీ రాష్ట్ర అప్పు దాదాపు రూ.11 లక్షల కోట్లకు చేరనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి తెచ్చిన అప్పులకు అసలు, వడ్డీ కలుపుకుని ఏడాదికి లక్ష కోట్లు వరకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆంధ్రలో పెరుగుతున్న అప్పులపై అలానే ఉత్పాదక వ్యయం పెరగకుండా అనుత్పాదక వ్యయం మాత్రమే పెరగడంపై ఏపీ ప్రభుత్వం తక్షణమే అవసరమైన చర్యలు తీసికోవాలి.
— టి వి గోవిందరావు, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్