Nadendla Press meet at IppatamNadendla Press meet at Ippatam

విధ్వంసమే వైసీపీ అసలు నైజం
రూ.150 కూలి చేసుకునే పేదల ఇళ్లను కక్షగట్టి కూల్చేస్తున్నారు.
ఇప్పటం ప్రజలను ఈ ప్రభుత్వం వేధిస్తోంది
రోజుకో మార్కింగ్ వేసి ఇళ్లన్నీ కూల్చేశారు.
ఇప్పటం గ్రామ ఇళ్ల కూల్చివేతలపై నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్

‘విధ్వంసం మాత్రమే తెలిసిన వైసీపీ ప్రభుత్వం ఇది. పేదవాడు ఏడిస్తే ఆనందించే వికృత మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి ఉండడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. కక్షపూరితంగా, కేవలం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భూములు ఇచ్చారనే కారణంతో ఇప్పటం గ్రామంపై కక్షగట్టారు. ఈ ముఖ్యమంత్రి త్వరలోనే ప్రజలకు సమాధానం చెప్పే రోజు వస్తుంద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతల వల్ల బాధితులైన వారిని మనోహర్ ఆదివారం సాయంత్రం స్వయంగా వెళ్లి పరామర్శించారు. పాలకులు చేసిన విధ్వంసకాండ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి బాధితులతో మాట్లాడి వారి వేదన విన్నారు. జనసేన పార్టీ కచ్చితంగా అండగా నిలబడుతుందని, పేదలను ఇల్లు లేని వారిగా మిగిల్చిన ఈ ముఖ్యమంత్రి కచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర్లోనే ఉందని బాధితులకు నాదెండ్ల మనోహర్ చెప్పారు.

అనంతరం నాదెండ్ల మనోహర్ అక్కడ మీడియాతో మాట్లాడారు. మా గత ఏడాది జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం సుమారు నాలుగు గ్రామాలు పరిశీలించాం. మొదట్లో భూములు ఇస్తామన్న రైతులు చివరిలో వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి భూములు ఇవ్వడానికి ముందుకు రాలేదు. అయితే ఇప్పటం గ్రామ రైతులు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి జనసేన సభ నిర్వహించుకోవడానికి అనుమతి నిచ్చారు. అనుమతి ఇవ్వడమే కాకుండా, సభ దగ్గర ఏర్పాట్లను చూశారు. అప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యేతో పాటు, వైసీపీ నాయకత్వానికి ఆ గ్రామం మీద కక్ష తీర్చుకోవాలన్న పగ పెరిగింది. ఇప్పటికే ఒకసారి మార్కింగ్లు వేసి కేవలం ప్రహరీల వరకు కూల్చుతామన్న పెద్ద మనుషులు, ఇప్పుడు ఏకంగా మార్కింగ్ ను లోపలి వరకు వేసి ఇళ్లను సైతం పూర్తిస్థాయిలో కూల్చివేయడం అత్యంత దారుణం. కూలి పనులు చేసుకునే పేదల ఇళ్లను ఏ మాత్రం మానవత్వం లేకుండా పెకిలిస్తున్నారు అంటూ నాదెండ్ల మనోహర్ అన్నారు.

శుభకార్యం ఉన్న ఇంటిని కూల్చి వేసేందుకు డ్రిల్లింగ్ చేయడం రాక్షసత్వమే

ఓ ఇంట్లో ఓ ఆడబిడ్డ పెళ్లి లగ్న పత్రిక పెట్టుకున్న సమయంలో ఇంటిపైన డ్రిల్లింగ్ చేయడం ఎంత పైశాచికమో, రాక్షసత్వమో అర్ధం చేసుకోవాలి. కనీసం నడవలేని ఓ పేషెంట్ ఇంట్లో ఉండగా ఆ ఇంటిని కొట్టేయడం శోచనీయం. పేదలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను వారి కళ్ళ ముందే కొట్టేస్తుంటే వారి వేదన కదిలించింది. ఇప్పటం గ్రామంలో గతంలో ఇళ్లను కొట్టేసిన మార్కింగులను చెరిపేసి మళ్ళీ కొత్త మార్కింగ్లు వేస్తున్నారు. కేవలం ప్రతిపక్షాల సభకు భూములు ఇచ్చారు అన్న కోపంతో ఈ తతంగం నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్లు 175 సీట్లు గెలుచుకోవడం అంటే పూర్తిగా ప్రతిపక్షాలు లేకుండా, పోటీ అనేది లేకుండా చేసి సీట్లు గెల్చుకుంటారా? అందుకే వై నాట్ 175 అంటున్నారా? అని నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.

పాలన చేతకాక పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు

151 సీట్లు ఇచ్చి ప్రజారంజక పాలన అందించమని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కోరుకుంటే మీరు మాత్రం ఆ పాలన చేతకాక పిచ్చెక్కినట్లు పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు. పేదల ఇళ్లను కూల్చివేసిన ఈ ముఖ్యమంత్రి కచ్చితంగా దీనికి సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది. కూల్చివేతలతో మొదలైన ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో పేదలకు మేలు చేసింది ఏమీ లేదు. స్థానిక ఎమ్మెల్యేకు సిగ్గుండాలి. ఎవరి పైశాచిక ఆనందం కోసం ఇది దగ్గరుండి చేపిస్తున్నారో ప్రజలకు చెప్పాలి. తాడేపల్లి ప్యాలస్ నుంచి ఇప్పటం గ్రామానికి ఎంత దూరం..? కచ్చితంగా ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఇప్పటం గ్రామంలో జరుగుతుంది ఏమిటో చూడాలని మనోహర్ తెలిపారు.

వైసీపీ నాయకులంతా ఒకసారి ఇప్పటం గ్రామాన్ని పరిశీలించాలి. ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం మచిలీపట్నంలో 34 ఎకరాలు ఇచ్చిన రైతులను మరోసారి భయపెట్టడానికి ఇలాంటి చర్యలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు.. విపక్షాలు అసలు ఉండకూడదు అన్నదే ఈ ముఖ్యమంత్రి సిద్ధాంతం. రూ.30 ల కూలి పనికి వెళ్లి రూపాయి రూపాయి దాచుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వారి కూలీ రూ. 130 అయింది. నీ బటన్లు నొక్కడం వల్ల వాళ్ల జీవితాలు ఏ మాత్రం మారలేదు. కష్టం చేసి కట్టుకున్న ఇల్లు మాత్రం పీకేశావు అని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

మరోసారి వస్తే ఊరుకునేది లేదు

మాకు అండగా నిలబడిన ఇప్పటం గ్రామస్థులకు అండగా నిలబడడం మా కర్తవ్యం. మరోసారి మార్కింగ్ పేరుతో, ఇల్లు కూల్చివేతల పేరుతో అధికారులు గ్రామంలోకి వస్తే ఊరుకునేది లేదు. ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించారు. బాధితులతో మాట్లాడి భరోసా నింపారు. మరోసారి అధికారులు దృశ్చర్యలకు పాల్పడితే రాష్ట్రంలోని జన సైనికులంతా ఇప్పటం గ్రామస్థులకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని నాదెండ్ల అన్నారు.

పిచ్చిపిచ్చి పనులు మానుకోండి. ప్రజలకు అవసరం అయిన మౌలిక సదుపాయాలు సౌకర్యాల కల్పన మీద దృష్టి పెట్టండి” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస యాదవ్, గాదె వెంకటేశ్వర రావు, చిల్లపల్లి శ్రీనివాస్, పోతిన మహేష్, అమ్మిసెట్టి వాసు, నేరెళ్ల సురేష్, అక్కల గాంధీ, నయుబ్ కమల్, బేతపూడి విజయ్ శేఖర్, బండారు రవికాంత్, రావి సౌజన్య, పోతిరెడ్డి అనిత, తిరుమలశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ పెట్టుబడుల సదస్సు అంకెల గారడీ: జనసేనాని

Spread the love