Pawan Kalyan with Party Mandal PresidentsPawan Kalyan with Party Mandal Presidents

వైసీపీని మరోసారి అధికారంలోకి రానివ్వకుండా చేయడమే లక్ష్యం
వైసీపీని గద్దె దించేందుకు పొత్తులు అవసరం
పారదర్శకంగా పొత్తు ఒప్పందాలు చేసుకుంటాం
ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం
వచ్చే ఎన్నికల్లో ఓడిపోయేందుకు సిద్ధంగా లేము
జనసేన బలం గణనీయంగా పెరిగింది. దీనిని మరింత పెంచాలి
ప్రజలు పచ్చగా ఉన్నా… ప్రకృతి పచ్చగా ఉన్నా జగన్ ఓర్చుకోలేరు
జనసేన పార్టీ మండల/డివిజన్ అధ్యక్షుల సమావేశంలో పవన్ కళ్యాణ్

జనసేనపార్టీని (Janasena Party) అధికారంలోకి తేవడమే ధ్యేయంగా పొత్తులు (Alliances) ఉంటాయి. గెలిచిన సీట్లను బట్టి ఏపీ సీఎం (AP CM) ఎవరనేది నిర్ణయిస్తాం అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేసారు. ‘ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి శత్రువు… వచ్చే ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి శత్రువు వైసీపీ. కచ్చితంగా వచ్చే ఎన్నికలు పొత్తులతోనే వెళ్తాం. తెలుగుదేశం, జనసేన బీజేపీ, కలిసి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడాలి అనేది జనసేన పార్టీ ఉద్దేశం. ఉమ్మడి శత్రువుని ఎదుర్కొనేందుకు అంతా కలిసి ప్రయాణించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ వివరించారు.

జనసేన పార్టీ బలం పెరిగింది

జనసేన పార్టీ బలం రాష్ట్రంలో సగటున 18 శాతం మేర పెరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఉత్తరాంధ్ర వరకు ఆ బలం సుమారుగా 30 నుంచి 35 శాతం ఉంటుందని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి ఎవరు అనేది ఎన్నికలు అయిన తర్వాత నిర్ణయించాల్సిన విషయం. ఇప్పుడే దీని గురించి మాట్లాడకుండా ముందుగా జనసేన పార్టీని ఎన్నికల్లో ఎంత బలంగా నిలబెట్టగలం అనేది ముఖ్యమ’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. శుక్రవారం మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మండల, డివిజన్, వార్డు అధ్యక్షుల సమావేశంలో జనసేనాని మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. “గత ఎన్నికల్లో 7 శాతం ఓట్లు పడ్డాయి అని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు జనసేన పార్టీ బలం గణనీయంగా పెరిగింది. కృష్ణా జిల్లా నుంచి ఉత్తరాంధ్ర వరకు సుమారుగా జనసేన పార్టీ ఓట్ల శాతం 30 నుంచి 35 శాతం ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో కాస్త అటు ఇటుగా 18 శాతం వరకు ఉంటుంది. ఇదే బలంతో మనం అధికారంలోకి రాగలమా..? లేక మరోసారి ఇలాగే మిగిలిపోదామా అనేది ఆలోచించుకోవాలి.

ఈసారి త్రిముఖ పోటీలో జనసేన బలి కావడానికి సిద్ధంగా లేదు. శత్రువుతో కలిసే కంటే, శత్రువును వ్యతిరేకించే వారితో కలవడం మేలు. సగౌరవంగా.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేస్తాం. ఎన్నికల తర్వాత బలాబలాల ఆధారంగా ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయం ఉంటుంది. ముందుగా జనసేన పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఉన్నత స్థానాల్లో నిలిపితే కచ్చితంగా ముఖ్యమంత్రి పదవి అదే వస్తుంది. దీని కోసం నానా రకాల చర్చలు, ఆవేశాలకు పోవద్దు. ప్రజాశక్తిని ఓట్ల రూపంగా మార్చాలి అంటే ప్రతీ నాయకుడు నా అంత బలవంతులు కావాలి. నన్ను చూసి ఓట్లు వస్తాయి అనేలే కాదు. మిమ్మల్ని చూసి కూడా ఓట్లు వేసేలా ప్రజల్ని మార్చాలి.. మలచాలి అని జనసేనాని తెలిపారు.

బలమైన నాయకుడికి మెత్తగా అనుకూలంగా తగ్గే పరిణతి ఉంటే, రెండో వైపు బలమైన పోరాట పంథా ఉండాలి. నినాదాలతో సీఎం కాలేం. వ్యక్తిగత అభిమానం, ఆరాధనను ఓట్లుగా మలచాలి. రాజకీయాల్లో అజాతశత్రువుగా మారడానికి రాజకీయం చేస్తాను. ఒక నిశ్చితాభిప్రాయం చెప్పినప్పుడు కచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. మెజారిటీ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా, ఆంధ్రప్రదేశ్ సమున్నత అభివృద్ధి కోసం కొందరికి శత్రువుగా నేను మారినా బాధపడనని పవన్ కళ్యాణ్ అన్నారు.

వ్యూహం ప్రకారమే రాజకీయం

నాకు ఉచిత సలహాలు ఇచ్చే నాయకులు.. ముఖ్యమంత్రి పదవి దక్కితేనే పొత్తులతో వెళ్ళమని చెబుతున్నారు. ఎంఐఎం పార్టీ హైదరాబాదులోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలుచుకుని ఇప్పుడు ఇతర రాష్ట్రాల రాజకీయాల్లోనూ దూకుడుగా ఉన్నారు. పది నిమిషాలు మీరు కళ్లు మూసుకోండి ఏం చేస్తామో చేసి చూపిస్తాం.. అని పోలీసులను బెదిరిస్తారు. ఏడు సీట్లతో వారు ఏదైనా మాట్లాడగలిగేలా తయారయ్యారు. జనసేన పార్టీకి ఇంతటి జనాదరణ, అభిమాన గణం ఉండి ఏం చేశాం? అని సేనాని ప్రశ్నించారు.

నాకు సలహాలు ఇచ్చే కాపు నాయకులు ఎంఐఎం గెలిచినట్లుగా కనీసం ఏడు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీని గెలిపించలేదు. ముందు మనం ఒకటి డిమాండ్ చేయాలి అంటే మనం బలంగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో ఆ బలం పుంజుకుని అప్పుడు కచ్చితంగా ముఖ్యమంత్రి కోసం అడుగుదాం. రాజకీయాల్లో విద్వేషాలు, శత్రుత్వాలు ఉండవు. వ్యూహం మాత్రమే ఉంటుంది. జనసేన పార్టీకి గౌరవం తెచ్చే వ్యూహం నేను చూసుకుంటాను. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి మెరుగైన ఫలితాలు తెచ్చే వ్యూహం నాయకులుగా మీరు చూసుకోండి. గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు వేయండి. 100 ఓట్లు తెలిస్తే అందులో 50 ఓట్లు ఖచ్చితంగా మనకు తీసుకువచ్చే నాయకత్వాన్ని తయారు చేయండి అని పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలను కోరారు.

ఆ వ్యక్తిపై ఏమీ మాట్లాడరుగానీ…

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 134 స్థానాల్లో పోటీ చేసింది. ఎన్ని స్థానాల్లో మన బలం చూపాం. అప్పట్లోనే మనం 40, 45 స్థానాల్లో గెలిచి ఉంటే మన బలం చూపించి ముఖ్యమంత్రి స్థానం గురించి మాట్లాడగలిగేవాళ్లం. ఏ పార్టీ కూడా మరో పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయడానికి ఇష్టపడదు. 2009లో 18 స్థానాలను గెలుచుకున్నాం. 2019లో అదీ లేదు. నిజాయతీగా రాజకీయాలు చేస్తే వచ్చే పరాభవాన్ని సగర్వంగా స్వీకరిస్తాను. దానికి నేనెప్పుడూ సిగ్గుపడను. కాలానుగుణంగా ఉన్న పరిస్థితికి అనుగుణంగానే ఓ వ్యూహం ప్రకారం మాత్రమే రాజకీయం జరుగుతుంది.

నేను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేను అని 2019లో బలంగా చెప్పిన వారినే కాపులు నమ్మారు. నేను సర్వస్వం వదిలేసి రాజకీయాల్లోకి వస్తే నన్ను వదిలేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పిన వ్యక్తిపై కాపు నాయకులు ఏమీ మాట్లాడరు. ఎలాంటి అధికారంగాని పదవి గాని లేని నన్ను మాత్రం తూలనాడుతారు. నేను ఓ కులానికి నాయకుడిని కాను. పుట్టిన కులాన్ని ఎంత గౌరవిస్తానో అన్ని కులాలను అంతే గౌరవిస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నారు·

ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టించిన సర్కార్ ఇది

2014లో ఒక వ్యూహం ప్రకారమే ఎలాంటి పదవి ఆశించకుండా మద్దతు ఇచ్చాం. సమున్నత రాజకీయాలు చేయాలనే ఆశయంతో నైతికతకు పెద్దపీట వేసి అప్పట్లో ఏ పదవి తీసుకోలేదు. అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అండగా నిలిచినా కార్యాలయానికి సైతం ఉచితంగా భూమి తీసుకోలేదు. పిల్లలకు దాచిన డబ్బుతోనే పార్టీ కార్యాలయం కట్టాను. ఒకరిని దేహి అని అడిగే పరిస్థితి నా దగ్గర ఎప్పుడూ ఉండదు. ఏదైనా పారదర్శకంగా నిర్ణయం తీసుకుంటాను. మీ కోసం నేను ఏం చేయను అన్న వాడిని గెలిపించారు. ఎస్సీలు అంటే ప్రేమ అనే చెప్పే వ్యక్తి ఎస్సీలకు అవసరమైన పథకాలు తీసేశాడు. ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన సర్కార్ ఇది. ఇలాంటి పాలకులను నమ్మడంపై ముందు ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు రావాలి అని సేనాని కోరారు.

బాధ్యతగా రాజకీయాలు చేసే నాకు వ్యూహం వదిలేయండి. జనసేన పార్టీకి ముఖ్యమంత్రి దక్కాలి అనే గొప్ప కలలకు అద్భుతమైన పునాదులను నిర్మించండి. ఆశయ సౌధాలు నిర్మించి అద్భుతమైన పాలన అందిద్దాం.

సకల కళాకోవిదుడు ఆ వైసీపీ నాయకుడు

ఆ వైసీపీ నాయకుడు సకల కళాకోవిదుడు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మళ్ళీ తామే రావాలి అంటూ ఏవేవో చెప్తున్నాడు. నేనేదో తాకట్టు పెట్టేశాను అంటున్నాడు. నన్ను తిట్టడానికి చిన్న చిన్న బుడతలను పంపిస్తూ బూతులు తిట్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ బుడతల్లో ఎవరినో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించండి. అప్పుడు మాట్లాడదాం. జనసేన పార్టీ రాజకీయానికి పనికిరాదు అని వైసీపీ నాయకులు ఇష్టానుసారం కూస్తూ ఉంటారు. మరీ అలాంటి మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు. మేం ఏం చేసినా ఎందుకు అడ్డుపడతారు..? మా రాజకీయాలు మేం చేసుకుంటాం. జనసేన పార్టీ నిజాయతీ అంటే వైసీపీకి గుండెల్లో భయం. తెలుగుదేశం పార్టీని అయినా తిట్టకుండా ఉంటారు కానీ జనసేన పార్టీని వైసీపీ నాయకులు వదలరు అని వైసీపీపై ఛలోక్తులు విసిరారు.

టి.ఆర్.ఎస్. ప్రస్థానం ఒక ఉదాహరణ

పొత్తులు అనేవి కచ్చితంగా ఒక పార్టీ నిర్మాణానికి, అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగ పడతాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానమే దానికి ఉదాహరణ. మొదట రెండు, నాలుగు స్థానాలతో మొదలుపెట్టిన ప్రయాణం ఒకానొక దశలో 2019లో మనతోను కలవాలని భావించింది. తర్వాత ఆ పార్టీ ఎలా ఎదిగిందో గమనించవచ్చు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా మారేలా ముందుకు సాగుతోంది. పొత్తులతో ఒక పార్టీ ఎదుగుతుంది తప్ప మరేమి కాదు. ఇది గుర్తించాలి. డిసెంబర్లో ముందస్తు ఎన్నికలకు వెళితే జూన్ నుంచి నేను క్షేత్రస్థాయిలో తిరిగేందుకు, అందుబాటులో ఉండేందుకు సిద్ధమవుతున్నాను. దీనికి తగినట్లుగా పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కూడా ఓ ప్రణాళిక ప్రకారం జనసేన పార్టీ గెలుపునకు సమష్టిగా పని చేయాలి.

శ్రీమతి భువనేశ్వరి’ని కించపరిస్తే ఎందుకు స్పందించాం అంటే?

ప్రస్తుత కాలంలో రాజకీయాలు దిగజారిపోయాయి. రాజకీయాలలో కచ్చితంగా విలువలు ఉండాలి. ఇంట్లోని మహిళల జోలికి, పిల్లల జోలికి వెళ్లే రాజకీయాలు చాలా ప్రమాదకరం. శ్రీమతి నారా భువనేశ్వరిని వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే నేను స్పందించాను. ఒక విలువలతో రాజకీయం చేసే వ్యక్తిగా ఒక మహిళపై వైసీపీ వాళ్ళు కించపరిచే వ్యాఖ్యలు చేస్తే స్పందించాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న నాయకుడి ఇంట్లోవాళ్లనే అలా అంటే మనం ఏదైనా వైసీపీ వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే మన ఇంట్లోని చిన్నారులను రేప్ చేస్తామని బెదిరిస్తారు. రేపు పొద్దున్న ఎన్నికల్లో ఓటు వేయని వారి ఇంట్లో ఉన్న ఆడపిల్లలను రేప్ చేస్తామని బెదిరిస్తే ఏం చేస్తారు..?

వైసీపీ వాళ్ల నైజం, తీరు అలాంటిదే. నేను ఇలాంటి బెదిరింపులకు భయపడే వాడిని అసలు కాదు. ఇలాంటి బెదిరింపులు ఎవరికి వచ్చినా ఊరుకునే వాడిని అసలే కాదు. వైసీపీ నాకు వర్గ శత్రువు కాదు. వారి పాలన తీరు అత్యంత దుర్మార్గంగా సాగుతోంది. దీనికి మాత్రమే నేను వ్యతిరేకం. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైన ఇష్టాలు, ప్రేమలు ఉండవు. జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించడానికి కచ్చితంగా ప్రణాళికలు ఉండాలి. వచ్చే ఎన్నికల్లో నేను మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా లేను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

హెలీకాప్టర్లో వెళ్తే భూమ్మీద చెట్లు నరికిస్తారు

పచ్చటి చెట్లు కనిపించినా, ప్రజలు పచ్చగా ఉన్నా తట్టుకోలేని నైజం వైసీపీ నాయకుడిది. హెలికాప్టర్లో పర్యటనకు వెళ్తే భూమి మీద ఉన్న చెట్లు ఏం చేశాయి..? పచ్చని చెట్లను కొట్టే సంస్కృతి గతంలో రాయలసీమ ప్రాంతంలో ఉండేది. ఇప్పుడు దానిని రాష్ట్రమంతా పాకించారు. రోడ్లు వేయలేని వ్యక్తి, పోలవరం కట్టలేని వ్యక్తి, మహిళలను కాపాడలేని వ్యక్తి, ఉద్యోగాలు ఇవ్వలేని వ్యక్తి, ప్రత్యేక హోదా గాలికి వదిలేసిన వ్యక్తిని మనం ఏమి అనలేం. అతనికి వత్తాసు పలుకుతాం. కక్ష కట్టి ప్రజల ఉపాధిని తీస్తున్న ఈ పాలన మీద ద్వేషం తప్ప ఏముంటుంది. ఆంధ్రప్రదేశ్ ను అధోగతిపాలు చేసిన ఈ వైసీపీ పాలనపై, రైతులను గాలికి వదిలేసిన తీరుపై, రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేస్తున్న వైసీపీ పాలనపైనే నా కోపం అని జనసేనాని తెలిపారు.

ఉద్యోగులను, యువతను, ఉపాధ్యాయులను ఇలా అన్ని రంగాల వారిని నిలువునా మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఏ కులానికి, వర్గానికి న్యాయం చేయలేని ఈ వ్యక్తిని ప్రజాస్వామ్యంలో కచ్చితంగా అధికారం నుంచి తప్పించాల్సిందే. అదే ప్రజాస్వామ్య లక్షణం. అధికారంతో కోట్ల రూపాయలను సంపాదించి, ఆ డబ్బుతో గుండాలను దించి ప్రజల్లో అరాచకం సృష్టిస్తున్న వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి అని జనసేనాని పిలుపు నిచ్చారు.

దాపరికాలుండవు … పొత్తులో భాగంగా రాష్ట్రానికి ఏం చేస్తామో చెబుతాం

వైసీపీ వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి. గౌరవ ప్రదమైన పొత్తులతో ముందుకు వెళ్తాం. పొత్తులు కుదిరితే దీనిలో దాపరికాలు ఏమి ఉండవు. దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక ఒప్పందాలు ఎంత పారదర్శకంగా ఉంటాయో అదే మాదిరి పొత్తులు ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తామో స్పష్టంగా చెబుతాం. ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక కూడా అదే రీతిన ఉంటుంది. కార్యకర్తలు ప్రతి అంశానికి ఆవేశంతో ఊగిపోకండి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేయించడానికి అన్ని రకాల ప్రణాళికలు రచిస్తోంది. దీనిని క్షేత్రస్థాయిలో బలంగా తిప్పి కొట్టాలి. కేవలం నా వ్యక్తిగత ఆలోచనలతోనే రాజకీయ వ్యూహాలు ఉండవు. అన్ని రకాల ప్రజలను, మేధావులను, నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన నిర్ణయం ఉంటుందని సేనాని వివరించారు.

అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై క్రమశిక్షణ చర్యలు

ప్రతికూల పరిస్థితుల్లో నాకు పెద్దన్నయ్యలా… వెన్నెముకగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అండగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా పనిచేసిన వ్యక్తి. రాజకీయాల్లో సమున్నత మార్పు కోరుకునే వ్యక్తి. పార్టీ కార్యకర్తలుగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఇష్టానుసారం ఆయనను తులనాడే వారిపై కచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పాపాల భైరవుడిలా ప్రతి విషయాన్ని ఆయన భుజంపై మోస్తున్నారు. నా అనుకూల శత్రువులను నేను ఎప్పుడు క్షమించను. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం.

అలాగే మన పార్టీలో మహిళలను గౌరవించుకునేలా నాయకులు, కార్యకర్తలు మాట్లాడాలి. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు చాలా బలంగా ఉంటాయి. పార్టీ కోసం పని చేసే మహిళలకు సముచిత స్థానం కల్పించాలి. అవినీతి రహిత, అభివృద్ధికారక ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే జనసేన పార్టీ లక్ష్యం” అని జనసేనాని అన్నారు.

జనసేన అధికారంలోకి వస్తే సమరయోధుల స్ఫూర్తిని కొనసాగిస్తుంది: జనసేనాని

Spread the love