అధికార పార్టీ నాయకులు కోట్లు దోచుకున్నారు
ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడానికే జనసేన సోషల్ ఆడిట్
‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో కార్యక్రమం
#JaganannaMosam హ్యాష్ ట్యాగ్’తో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయండి
ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చూపిద్దాం
హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్
రాష్ట్ర ప్రభుత్వం (AP Government) పేదలకు ఇళ్ల పేరుతో చేపడుతున్న జగనన్న కాలనీలు (Jagananna Colonies) అతి పెద్ద స్కాం అని జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పేర్కొన్నారు. భూమి కొనుగోలు, మౌలిక వసతులు పేరిట వేల కోట్లు అవినీతి చేశారన్నారు. జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఉంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 12, 13, 14 తేదీల్లో జనసేన సోషల్ ఆడిట్ జరుగుతుంది. ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ అనే మంచి కార్యక్రమానికి (Janasena Social audit) జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తీసిన ఫోటోలు, వీడియోలను #Jagananna Mosam హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో (Social Media) పోస్టుచేసి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కోరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఒక చోట ఈ కార్యక్రమంలో పాల్గొని జగనన్న కాలనీలను పరిశీలిస్తారని తెలిపారు. బుధవారం హైదరాబాద్ పార్టీ కార్యాలయం నుంచి వీడియో విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పలు అఃక్షికరమైన విషయాలను వెల్లడించారు. “పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల 30వేల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హామీ ఇచ్చారు.
అందులో భాగంగా తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారు.
ఆయన చెప్పిన గడువు ముగిసి ఐదు నెలలు కావొస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవు అని నాదెండ్ల మనోహర్ జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
భూ సేకరణలో దోపిడీ
జగనన్న కాలనీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 68,677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ.10 నుంచి రూ.20 లక్షలు విలువ చేసే ఎకరా భూమిని రూ. 70 లక్షలు నుంచి కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సుమారు రూ.23,500 కోట్లు వెచ్చించి ఈ భూములు కొన్నారు. ఇందులో వందల కోట్లు చేతులు మారాయి.
అలాగే మౌలిక సదుపాయాలు కోసం మరో రూ.34 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా జగనన్న కాలనీల్లో తాగునీరు, రోడ్లు వంటి కనీసం మౌలిక సదుపాయాలు లేవు. గృహ నిర్మాణ పథకానికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవే. ఈ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇసుకను మాత్రమే ఉచితంగా అందిస్తోంది. అది కూడా ఇసుక రవాణాకు అయ్యే ఖర్చు లబ్దిదారుడే భరించాలని కండీషన్ పెట్టింది. ఇస్తున్న ఇసుక కూడా ఎక్కడ నుంచి తెచ్చుకోవాలో స్పష్టత ఇవ్వడం లేదని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
2022 జూన్ నాటికి 18,63,552 గృహాలు నిర్మిస్తామని చెప్పిన నాయకులు… ఇప్పటి వరకు కేవలం లక్ష 52వేల ఇళ్లను మాత్రమే నిర్మించారు. ఇంత దయనీయ పరిస్థితి ఎందుకొచ్చింది? పేదలను ఎందుకింత దగా చేశారు? దేనికి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీగా ఆ బాధ్యత జనసేనపై ఉంది
జగనన్న ఇళ్లు పేరిట గత మూడున్నరేళ్లుగా జరుగుతున్న దోపిడీని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జనసేనపై ఉంది. 2020లో పులివెందుల, కాకినాడ, విజయనగరంలో జగనన్న కాలనీలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. పైలాన్ వేశారు. జూన్ 2022 కల్లా తొలి విడత ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పారు. గడువు దాటినా దీని గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం లేదని మనోహర్ అన్నారు.
ఈ నెల 12, 13 తేదీల్లో స్థానికంగా ఉన్న జగనన్న కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించాలి. 14వ తేదీన పథకం లబ్ధిదారుల జాబితా, వారికి ఏ మేరకు నిధులు విడుదల చేశారు, మౌలిక సదుపాయాల కల్పన ఖర్చులు లాంటి అంశాలపై సోషల్ ఆడిట్ చేస్తారని నాదెండ్ల చెప్పారు.
గతంలో రహదారుల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్’తో సోషల్ మీడియాలో ఏ విధంగా ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేశామో చూసారు… అదే విధంగా #Jagananna Mosam అనే హ్యాష్ ట్యాగ్’తో ఇళ్ల దుస్థితి, కాలనీల పరిస్థితి, గృహనిర్మాణ లబ్దిదారుల బాధలను తెలియజేసే ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలని జనసేన శ్రేణులకు, అందరికీ నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేసారు.
స్థానిక నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ మోసాలను ఎండగట్టాల”ని నాదెండ్ల మనోహర్ ఇచ్చిన వీడియో సందేశంలో కోరారు.