Pawan Kalyan in Jubilant moodPawan Kalyan in Jubilant mood

వైసీపీకి మరో ఆరు నెలలే సమయం
పిచ్చోడి చేతిలోని ఆంధ్ర ప్రదేశ్ ని రక్షించాలనేదే లక్ష్యం
జగన్ మానసిక స్థితిపై సందేహాలున్నాయి
జగన్… నువ్వెంత.. నీ స్థాయి ఎంత? నీ బతుకెంత?
2009లో అనుకున్న లక్ష్యాన్ని 2024లో సాకారం చేద్దాం.
బీజేపీ ఆశీస్సులతో ఆంధ్రాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
ఢిల్లీ వెళ్లి రాష్ట్ర పరిస్థితులు, పొత్తు ప్రకటనపై బీజేపీ పెద్దలకు వివరిస్తా
పొత్తు ప్రకటన తర్వాత తటస్థ ఓటర్ల ఆమోదం లభించింది
అధికారులు రాజ్యాంగానికి లోబడి పని చేయాలి
తెలుగుదేశం పార్టీ నేతలతో అనవసర ఈగోలకు పోవద్దు
కలసి పనిచేస్తేనే వైసీపీ తరిమికొట్టగలం
తెలుగుదేశంతో సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్

పవర్ షేరింగ్ (Power sharing between TDP and Janasena) ద్వారా జనసేన పార్టీ (Janasena Party) అధికారంలోకి వస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అణగారిన వర్గాల రాజ్యాధికారం అనే కోరిక (Rajyadhikaram) నెరవేరబోతోందని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేసారు. మరో ఆరు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం (AP Government) మారబోతోంది. బీజేపీ ఆశీస్సులతో జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ పాలనకు చరమాకం పాడాలి… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ చెర నుంచి విముక్తి చేయాలనే బలమైన సంకల్పంతో రాజమండ్రిలో ప్రత్యేక పరిస్థితుల్లో పొత్తుల నిర్ణయం తీసుకున్నానని జనసేనాని తెలిపారు.

నా నిర్ణయానికి పార్టీ నాయకులు మద్దతు తెలపడం చాలా ఆనందం కలిగించిందని చెప్పారు. స్వార్ధానికి పోకుండా, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకున్న నిర్ణయం చాలా ఆనందం కలిగించిందని తటస్థ ఓటర్లు మెసెజ్ లు చేయడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ

“మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయంటే అది సంతోషించే విషయం కాదు. కుత్సితమైన మనస్తత్వం ఉన్న వాళ్లు మాత్రమే ఆనందపడతారు. ప్రత్యర్థి పార్టీ బలహీనపడితే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. అయితే అది మనకు మేలు చేస్తుంది.. తర్వాత మనమే అధికారంలోకి వస్తామని గ్యారెంటీ ఏంటి? మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం, ప్రజలు భరించగలరా? వైసీపీ, జగన్ బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. దాని బలం దానికుంది. పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగతంగా బలం ఉంది. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లిన లక్షలాది జనాలు తరలివస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అది ఎన్నికల్లో గెలవడానికి సరిపోదు. జనసేనకు బలమైన నాయకత్వపు సమూహాలు కావాలి. ఆ ప్రయత్నంలోనే మనం ఉన్నాం.

తెలంగాణలో బీఆర్ఎస్ ఈ రోజు అధికారంలోకి ఉంది. ఆ పార్టీ టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు తొలినాళ్లలో మన మద్దతు కోరింది. ఈ రోజు తెలంగాణలో బలమైన పార్టీగా అవతరించింది. సుదీర్ఘకాలం ఏ పార్టీనైనా నిలబెట్టడం అంత తేలికైన విషయం కాదు. కొన్నిసార్లు ఇతర పార్టీల ఆసరా తీసుకోవాలి. ఇంకొన్ని సార్లు ఇతర పార్టీలకు సహకారం అందించాలి. మరి కొన్నిసార్లు ఒంటరిగా పోటీ చేయాల్సి ఉంటుంది. మనకు లక్షలాది మంది జనం వస్తున్నారని పొత్తులో ఉన్న ఇతర పార్టీలను చులకనగా చూడటం సరికాదు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడినంత మాత్రాన మనకు కొమ్ములు రావు. పొత్తులకు తూట్లు పొడిచేలా ఎవరూ మాట్లాడొద్దు. తెలుగుదేశం బలం దానికి ఉంది. జనసేనకు పోరాట స్ఫూర్తిగల యువత, వీరమహిళలు ఉన్నారు. రెండు సమష్టిగా కలిసి పని చేస్తేనే నియంత లాంటి వైసీపీని ఎదుర్కొగలం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈగోలను పక్కన పెట్టి పనిచేద్దాం.

జగన్ మానసిక స్థితి సరిగా లేదు

జగన్ కు మానసిక స్థితి సరిగ్గా ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతుంది. రోడ్డు మీద పర్యటిస్తే చెట్లు కొట్టిస్తాడు. పరదాలు కట్టిస్తాడు. ప్రాణాప్రాయం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే మామూలుగా పర్యటిస్తే. ఈయన మాత్రం ఏదో ప్రమాదం ఉన్నట్లు పరదాలు కట్టుకొని తిరుగుతాడు. చిన్నపాటి పిచ్చ ఉంటేనే ఇలాంటి పనులు చేస్తారు. కరెంటు కొనుగోళ్ల ఒప్పందాలు రద్దు చేసి జపనీస్ ప్రభుత్వాన్ని కూడా ఇరిటేట్ చేసిన మహానుభావుడు జగన్. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాడు. ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. నన్ను తిట్టాలి అన్నా చూసి చదవుతాడు.

మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులే ఇలా ప్రవర్తిస్తారు. జగన్ ను ఎవరికైనా మానసిక నిపుణులకు చూపిస్తే కచ్చితంగా మానసిక స్థితి సరిగా లేదని చెబుతారు. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులను తీసుకొచ్చి ఈయన్ను చెక్ చేయాలని కేంద్రాన్ని చాలాసార్లు అడగాలి అనిపించింది. నియంతలైన గడాఫీ, సద్దాం హుస్సేస్ వంటివారు ఇలానే ప్రవర్తించేవారు. మానసిక స్థితి సరిగా లేని జగన్ చేతిలో రాష్ట్రం పెట్టడం సరికాదు. జగన్ దాష్టీకం, అరాచకాలు భరించలేకే వరంగల్ లో తన్ని తరిమేశారు. జగన్ మానసిక పరిస్థితి గురించి ఆయన సన్నిహితులు చాలా మంది నాకు చెప్పారు. ఆయన క్రూరుడు, విపరీతమైన దురాశ ఉన్న వ్యక్తి అని చెప్పారు.

వైసీపీ రాష్ట్రానికి పట్టిన చీడ.. పీడ

విజన్ 2020 అని చంద్రబాబు గారు చెబితే అప్పుడు నాకు సరిగా అర్ధం కాలేదు. ఇప్పుడు సైబరాబాద్ వైపు వెళ్తే అప్పుడు ఆయన చెప్పిన మాటలకు అర్ధం తెలుస్తుంది. రాళ్లు రప్పలతో ఉన్న హైదరాబాద్ సిటీని ఐటీకి కేరాఫ్ గా మార్చారు. ఈ రోజు ఆయన జైల్లో ఉన్నపుడు, చేయి కింద ఉంది అని తక్కువ అంచనా వేయకూడదు. ఒకప్పుడు జగన్ కూడా జైల్లో ఉండి వచ్చి ఇప్పుడు రాష్ట్రానికి ఏకు మేకయ్యాడు. ఒక వ్యక్తిని ఏ అనుభవం ఎలా మారుస్తుందో ఎవరికీ తెలియదు. రాహుల్ గాంధీని దేశం అంతా పప్పు పప్పు అని పిలిచింది. ఈ రోజు ఆయన కాశ్మీర్ టూ కన్యాకుమారి పాదయాత్ర చేశాడు. ఎవరి సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈ రోజు మనం ఎన్డీఏలో ఉన్నామని కొత్తగా ఏర్పాటైన ప్రతిపక్షాల కూటమిని తక్కువ అంచనా వేయకూడదు. అలాగే వైసీపీని తక్కువ అంచనా వేయకూడదు. రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ ఆ పార్టీ. మనందరం కలిసి ఆ చీడను తొలగించాలి.

బలంగా అసెంబ్లీలో అడుగుపెడతాం

ఇసుక కొరత సృష్టించి 46 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయేలా చేశారు. 35 లక్షల మంది అనుబంధ కార్మికులు కకావికలం అయిపోయారు. మద్యపాన నిషేధమని చెప్పి వేల కోట్లు దోచుకున్నారు. రాష్ట్ర యువతకు పిరికితనం, ఉదాసీనత అవహించింది. జనసేన పార్టీ చాలా బలమైన స్థానాలతో అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. ఒక్కసారి జనసేన అసెంబ్లీలో అడుగుపెడితే రాష్ట్రం దశదిశ మర్చేస్తాం. రాజకీయ స్థిరత్వం, లా అండ్ అర్డర్ సక్రమంగా అమలయ్యేలా చూస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించేలా అడుగుతాం. ఉత్తరాంధ్ర వలసలు నిరోధిస్తాం. పోర్టులు ఏర్పాటు చేసి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తాం. కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. వైసీపీని ఆంధ్ర నుంచి తరిమేసిన తర్వాత అప్పుడు రాజు ఎవరు? మంత్రి ఎవరు అన్నదానిపై ఆలోచిస్తాం.

నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన కమిటీ

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన మిత్రపక్ష సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీలో బీజేపీ నాయకులను, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను సమన్వయపరుస్తారు. ఇందులో ఎవరూ ఎక్కువ కాదు… తక్కువ కాదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం అందరం కలిసి పనిచేద్దాం. 2009లో సాధించాలి అనుకున్నది. 2024లో సాధిద్దాం. వైసీపీ నాయకులు ఎంత రెచ్చగొట్టినా పట్టించుకోవద్దు. తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పనిచేయాలో లేదో అన్నది భవిష్యత్తులో మాట్లాడదాం.

ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తాను

భారతీయ జనతాపార్టీతో పొత్తులో ఉన్నప్పుడు చాలా విలువైన సమయం ఉండేది. రకరకాల కారణాల వల్ల ఆ సమయాన్ని వినియోగించుకోలే కపోయాం. జగన్ పిచ్చి వేషాలు వేయకుండా నిలువరించగలిగేవాళ్లం. రాజమండ్రిలో పొత్తు నిర్ణయం తీసుకోవడానికిగల కారణాలను ఢిల్లీ వెళ్లి శ్రీ అమిత్ షా, శ్రీ నడ్డా గారికి వివరిస్తాను. దేశంలో కీలకమైన జీ-20 సదస్సు జరుగుతున్న సమయంలో అరాచకాలు సృష్టించడానికి వైసీపీ పూనుకుంది. నన్ను రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంది. చంద్రబాబు గారిని 1 అరెస్టు రాజకీయ కక్షతోనే చంద్రబాబు గారి అరెస్టు చేశారని బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. ఇవన్ని వాళ్లకు వివరిస్తాను.

నరేంద్ర మోదీ బలమైన నాయకత్వాన్ని జనసేన కోరుకుంటోంది. జనసేన ఎన్డీఏ పక్షంలోనే ఉంది. ఎన్డీఏతోనే ప్రయాణం చేస్తాం. ఈ దేశ సమగ్ర సుస్థిరాభివృద్ధికి మరోసారి శ్రీ మోడీ ప్రధాని కావాలని బలంగా కోరుకుంటున్నాం. ఈసారి రాష్ట్రంలో కూడా బలమైన సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం, శ్రీ మోదీ గారి నాయకత్వం మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి రాష్ట్ర అభివృద్ధి వైపు దృష్టి సారించాలి. రాష్ట్ర పరిస్థితులను మార్చేందుకు బీజేపీ సైతం అండగా నిలవాలి.

దశాబ్ద కాలంలో మీరిచ్చిన తోడ్పాటు అమూల్యం

వచ్చే మార్చి నాటికి పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి కాబోతోంది. అందరి సహాయ సహకారాలు, మద్దతు మరవలేనిది. 150 మందితో ప్రారంభించిన పార్టీ ఈ రోజున ఆరు లక్షల పైచిలుకు క్రియాశీలక సభ్యులతో ముందుకు వెళ్లడం వచ్చినప్పుడే మనిషి తాలూక నిజమైన సత్తా బయటపడుతుంది. ఒక్కడు ధైర్యంగా నిలుచుంటే లక్షలాది మంది వెన్నెముకలుగా నిల్చుంటారని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడిని నేను. నాలుగు దశాబ్దాలున్న పార్టీ కూడా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటుందో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఎందుకు బలంగా నిలబడుతుందంటే.. నేను రాజ్యాంగాన్ని నమ్ముతాను. అంత బలంగా పాటిస్తాను. రాజ్యాంగం అనే రూల్ బుక్ భారతదేశ అత్యున్నత గ్రంథం. దానిలోని విషయాలను ఎవరూ మర్చిపోకూడదు.

రాజకీయ నాయకులే ద్వంద్వ విధానం అలవాటు చేశారు

ఈ మధ్య దేశానికి పేరు ఇండియానా.. భారత్ నా అన్న చర్చ మొదలయ్యింది. నేను సైరా ఫంక్షన్ లో మాట్లాడినప్పుడు భారత్ అనే పేరుండాలని ఊహించి మాట్లాడలేదు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి ప్రతిజ్ఞ లో భారతదేశం నా మాతృభూమి అంటే… అదే ఆంగ్లంలో ఇండియా ఈజ్ మై కంట్రీ అంటున్నాం. నాకు అది అర్ధం అయ్యేది కాదు. క్రికెట్ లోనూ అలాగే మాట్లాడేవారు. రాజకీయ నాయకులు ఈ ద్వంద్వ విధానాన్ని అలవాటు చేశారు. బ్రిటీష్ వాళ్లకి నోరు తిరగక వాళ్లు పెట్టుకున్న పేరు ఇండియా. జీ-20 సదస్సుకు ప్రధాని శ్రీ మోదీ గారు భారత్ అని వ్యవహృంచడం చాలా నచ్చింది. ఒక్కోసారి సోషలిస్టులా.. ఒక్కోసారి కమ్యునిస్టులా.. ఒక్కోసారి సనాతనవాదిలా మాట్లాడుతానంటారు. నా మటుకు నేను ఒక భారతీయుడిలా మాట్లాడుతా. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండడానికి కారణం సనాతన ధర్మమే. కాలాన్ని, పరిస్థితులను, అవసరాన్ని బట్టి అది మారుతూ వస్తోంది.

మన రాజ్యాంగం అపూర్వమైనది

భారత దేశంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకత్వంతో కూడిన దేశం మనది. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నానంటే ఒక మతానికి వ్యతిరేకం అని కాదు. రాజ్యాంగంలోని పలు పేజీల్లో వివిధ మతాలు, వాటి ధర్మాల గురించిన చిత్రాలు మన రాజ్యాగంలోని విశిష్టతను తెలియజేస్తాయి. భవిష్యత్తులో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండాలని, దాని కోసం జీవితం అంతా కృషి చేస్తానని చెప్పే ప్రయత్నమే జనసేన పార్టీ స్థాపనకు కారణం. అతి తెలివి, క్రూరత్వంతో రాజకీయాన్ని వ్యాపారంగా భావించే వారికి అర్ధం కావాలని ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నా. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అంటే కుదరదు. ఆదేశిక సూత్రాలు పాటించాల్సిన అవసరం లేదు. సంక్షేమ పథకాలన్నీ నేను పెట్టిస్తున్నా అన్న భ్రమ ప్రస్తుత నాయకుల్లో ఉంది. ఇవన్నీ ఆదేశిక సూత్రాల్లో ఉంటాయి. ఇది జగన్ పెట్టింది కాదు. ఇవన్నీ మర్చిపోయి వీళ్లదో ఇచ్చేవాళ్లం.. ప్రజలంతా తీసుకునే వాళ్లు అన్న ఆలోచనా విధానం మారాలి.

అధికారులూ… మీరంతా రాజ్యాంగ ప్రతినిధులని గుర్తుంచుకోండి

అడ్డగోలుగా చేసిన రాష్ట్ర విభజనతో వేదన వచ్చింది. కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో నినాదం వెనుక నాకు కాంగ్రెస్ మీద వ్యక్తిగత ద్వేషం లేదు. వైసీపీకి అండగా ఉన్న అధికార యంత్రాంగానికి కనువిప్పు కలిగించడానికే రాజ్యాంగం గురించి వివరించాం. వైసీపీకి కొమ్ము కాస్తున్న అధికారులంతా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలనలోకి వచ్చారని గుర్తుంచుకోవాలి. మీరు కులాలకీ, పార్టీలకీ కొమ్ము కాయడానికి అధికారంలో ఉన్నారా? మేము రోడ్డు మీదకు వస్తామంటే ఆపుతారేంటి? మీరు ఏమైనా దిగివచ్చామనుకుంటున్నారా?
తలలు ఎగరేస్తే వీరభద్రుడు దక్షుడి తల తీసి విసిరికొట్టినట్టు విసిరికొట్టగలం గుర్తు పెట్టుకోండి. అహంకారంతో ఎగిరికొట్టుకుంటే ఆ అహంకారాన్ని తీసి వినమ్రతతో ఉండే తలలు పెట్టగలం గుర్తుంచుకోండి. ప్రజలు తలచుకుంటే ఒక్కొక్కరు ఒక్కో వీరభద్రుడు కాగలరు.

జాతిని జాగృతం చేయడానికి నా ప్రయత్నం

2014లో అన్నింటికీ సిద్ధపడి పార్టీ పెట్టాను. ఈ రోజు ఒక సత్యాన్ని ఆవిష్కరింప చేస్తాను. ఆ క్రమంలో నన్ను చంపేసినా సిద్ధం. చైతన్యం లేకుండా ఉన్న తెలుగు జాతిని కుదిపి లేపడానికి అంత తెగింపు చేయాల్సి వచ్చింది. ఆ పవన్ కళ్యాణ్ ఇంకా బతికే ఉన్నాడు. ఎప్పుడూ చావడానికి సిద్ధంగానే ఉంటాడు. నా ప్రశాంతత నా చేతకానితనం కాదు. మీరు యుద్ధమే కావాలంటే కురుక్షేత్రం ఇస్తా. ఎవరు రాజు ఎవరు మంత్రో తేలిపోతుంది. తగ్గి మాట్లాడుతాం. బతిమలాడతాం. వైసీపీని చాలా మర్యాదగా మాట్లాడా.. ముఖ్యమంత్రిని సర్ అంటే.. ఆయన హా పవన్ అన్నా సరే నేను తగ్గే ఉన్నాను. అమ్మా ఆలి బూతులు తిట్టినా భరించా. ఇష్టారాజ్యంగా నెలల తరబడి తిట్టినా భరించా. ఇప్పుడు చూస్తే రోడ్డు మీదకు రానివ్వరు. హోటల్ లో ఉండనివ్వరు. నా నేలకు నేను వస్తానంటే రానివ్వరు.. ఒకప్పుడు నంద్యాలలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఎన్నికల సభలో మాట్లాడుతూ.. తెలంగాణ వెళ్లాలంటే పాస్ పోర్టు, వీసా అడుగుతారని చెప్పాడు. తెలంగాణ రాజకీయ నాయకులు అలా చేయలేదు గాని వాళ్లబ్బాయి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటే పాస్ పోర్టు, చేసేలా రూల్స్ పెట్టాడు. మీ నాన్న గారి కలలు అలా నెరవేర్చావ్ జగన్.

పోలీసులు మీరు అర్ధం చేసుకోండి

ఒక దేశ భక్తుడు సర్వస్వం అర్పించుకుపోవడానికి, దహించుకుపోవడానికి ఎలా ఉంటాడో అదే నేను సాధన చేశా. అది జగన్ అతనికి వత్తాసు పలికే పోలీస్ అధికారులు అర్ధం చేసుకోవాలి. మీరు చేస్తుంది సబబే అనిపిస్తుందా? మా నాయకుల మీద ఎన్ని కేసులు పెడతారు. భయపడిపోతామనుకుంటున్నారా. మేము భయపడం. అది మీరు అర్ధం చేసుకోండి. నేను ముఖ్యమంత్రిని ఏమైనా చేయగలను అనుకోవద్దు. నువ్వు ప్రజల ఆస్తులకి పర్యవేక్షకుడివి మాత్రమే. అది నీ సొంత ఆస్తి అనుకోవద్దు. ప్రజలకి కోపం వస్తే కొట్టి కొట్టి చంపేస్తారు. ప్రజల తాలూకు ఆగ్రహం నేను మొన్న చూశాను. తెలంగాణ బోర్డర్ లో నన్ను ఆపి వెనక్కి వెళ్లమన్నారు. నేనెందుకు వెళ్లాలని అడిగా? మీరు మర్డర్లు, దోపిడీలు చేస్తే నేనెందుకు వెనక్కి వెళ్లాలి? అమెరికా రాజ్యాంగం వాళ్ల అధ్యక్షుడిని మగ్ షాట్ తీయగలదు. ముఖ్యమంత్రిగా ఉంటే కొమ్ములు వచ్చేస్తాయా? మిగతావారి హక్కులు పోతాయా? ఖచ్చితంగా ఆయన చేసే డ్యూటీకి ప్రాముఖ్యత భద్రత ఇస్తాం. అలా అని మమ్మల్ని చావగొట్టమని చెప్పలేదు.

లండన్ నుంచి ఆదేశం వస్తే అరెస్టు చేస్తారా..?

శాంతియుతంగా రాష్ట్రంలోకి వాహనంలో వస్తే మమ్మల్ని అరెస్టు చేస్తామంటారు. జాతీయ రహదారిపై 87 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. దానికి జగన్ బాధ్యత వహించాలి. గాడ్ ఫాదర్ సినిమాలో మాఫియా లీడర్ మాదిరి జగన్ లండన్ వెళ్లి అక్కడి నుంచి వీళ్లని ఇబ్బంది పెట్టండి.. వాళ్లని జూ లో పెట్టమని చెబుతూ కలలుగంటున్నాడు. ఓడలు బళ్లవుతాయి. జగన్ నువ్వెంత? ప్యాలెస్ లో ఉన్న వారిని కిందికి లాగేందుకు ఎంతోసేపు పట్టదు. నువ్వేమైనా పైనుంచి దిగి వచ్చావా? నువ్వెంత? నీ బతుకెంత? నీ స్థాయెంత? 30 వేల కోట్ల రూపాయిలు కేవలం మద్యం మీద సంపాదించాడు. ఇసుక మాఫియా, మడ అడవులు నరికేశాడు. దివీస్ ల్యాబ్ ని బంగాళాఖాతంలో కలిపేస్తానన్న వ్యక్తి అరబిందో ఫార్మాకి అనుమతులు ఇచ్చేశాడు. అడ్డగోలుగా అడవులు నరికేశాడు. విశాఖ కాలుష్యం మీద ఆడిట్ ఉండదు. గంజాయి సాగు లో రాష్ట్రం అగ్రగామి అయింది. 4.92 లక్షల కేజీల గంజాయి వైసీపీ పాలనలో దొరికింది. దొరకనిది దానికి పది రెట్లు ఉంటుంది. నేను ఎన్డీఏతో ఉన్నాను. 70 శాతం బీజేపీ నిర్ణయాలతో ఏకీభవిస్తాను. దీన్ని ఆబ్జెక్టివ్ గా చూస్తాను.

మాదకద్రవ్యాలు ఉన్నాయిని షారుఖ్ ఖాన్ కొడుకు మీద కేసు పెట్టారు. విజయవాడ సత్యనారాయణపురంలో ఆషి ట్రేడింగ్ కంపెనీ, మాచవరం సుధాకర్ అనే వ్యక్తి పేరు మీద రూ.22 వేల కోట్ల విలువ చేసే హెరాయిన్ గుజరాత్ లో దొరికితే దాని గురించి ఎవరూ మాట్లాడరు. అది న్యూస్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యవస్థలు పని చేయనప్పుడు ప్రజలే పని చేయాలి. జగన్ అనే వ్యక్తి నరరూప రాక్షసుడు అని ఎందుకు అనుకోవాలి. అతను మనలాగే రక్త మాంసాలున్న వ్యక్తే. వాళ్లకి ఎందుకు భయపడుతున్నాం…? ధైర్యంగా నిలబడి వైసీపీని సమష్టిగా ఇంటికి పంపే బాధ్యతలను తీసుకుందాం” అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తున్న జనసేన, తెలుగుదేశంల పొత్తు

Spread the love