ప్రజల సమస్యలను వినే నాధుడే కరువు
భయపడుతూ బటన్లు నొక్కుతూ కాలం గడిపే ముఖ్యమంత్రి
మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం కూడా లేదు
మత్స్యకారులకు అండగా జనసేన ఉంటుంది
ఉద్దానం సమస్యను ప్రపంచానికి తెలియజెప్పింది పవన్ కళ్యాణ్
డి.మత్స్యలేశం గ్రామంలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్
‘బటన్ నొక్కుతూ బ్రహ్మాండం చేశానని భ్రమపడుతూ… ప్రజల్లోకి రావడానికి నిత్యం భయపడుతూ మన ముఖ్యమంత్రి (CM Jagan) పాలన చేస్తున్నారు. అటువంటి ఈ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలోకి వస్తే ప్రజలు పడుతున్న బాధలు అర్ధమవుతాయి అని నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విమర్శించారు.
ముఖ్యమంత్రి ప్రజల్లోకి రావడానికి ఎందుకు భయపడుతున్నారు.. ఎవరిని చూసి భయపడుతున్నారు..? ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించండి అని జనసేన (Janasena) కోరుతున్నది. ప్రజా వేదికలపై విపక్ష నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈ ముఖ్యమంత్రి ఆనంద పడుతున్నారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామాన్ని గురువారం సాయంత్రం మనోహర్ సందర్శించారు. మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మనోహర్ మాట్లాడారు.
వలసల ఉత్తరాంధ్ర…
“ఉత్తరాంధ్ర (Uttarandhra) యువత ఉపాధి (Employment) లేక ఊర్లు ఖాళీ చేసి వలసలు పోతున్నారు. బాగా చదువుకున్నా… సరైన ఉద్యోగాలు లేక సొంత ఊరు వదిలి సుదూర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ యువతను ప్రజలను ఆదుకోవాల్సిన పాలకులు మూడు రాజధానులు పేరుతో మోసం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా చాలామంది యువతతో నేను మాట్లాడినప్పుడు మూడు రాజధానులు కాదు… మాకు ఉపాధి కల్పించండి, వలసలు నిరోధించండి అని అడుగుతున్నారు. దానిని ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ఏమైనా అంటే వ్యక్తిగత విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు తప్పితే ప్రజా సమస్యల మీద దృష్టి సారించడం మర్చిపోయారు. యువతలో కట్టలు తెంచుకుంటున్న ఆవేశం, మహిళల్లో అంతులేని ఆవేదన ఈ ప్రాంతంలో చూశాను. ప్రభుత్వ చర్యలు వారికి ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. కచ్చితంగా వారి ఆగ్రహానికి ఈ ముఖ్యమంత్రి బలి కాక తప్పదు అని నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
రాయితీలు ఏవి..? సాయం ఎక్కడ?
మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడంతోనే ప్రభుత్వం పని అయిపోదు. మత్స్యకారులను కేవలం ఓట్ బ్యాంకుగా చూసే రాజకీయాలు ఈ ప్రభుత్వానికి తగవు. కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన నేషనల్ ఫెషరీస్ డిపార్ట్మెంట్ అందించే రాయితీ సొమ్మును మత్స్యకారులకు అందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం ప్రభుత్వం ఉంది. ఆయిల్ రాయితీలు సరిగా అందడం లేదు. ఇతర రాష్ట్రాలకు పని కోసం ఇక్కడి స్థానిక యువత వెళ్ళిపోవడం బాధాకరం. మత్స్యకారులు వేటకు వెళ్లి, తప్పిపోయి ఒక్కోసారి పక్క దేశాలకు వెళ్లిపోయి దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి అని నాదెండ్ల అన్నారు.
అలాంటి వారికి కనీసం ఈ ప్రభుత్వం ఓ దారి చూపడం లేదు. మత్స్యకారులకు ఇస్తాను అని చెప్పిన పదివేల రూపాయల సహాయం కూడా పూర్తిస్థాయిలో అందడం లేదు. వేరే దేశాలకు వెళ్లి తప్పిపోయిన మత్స్యకారుల జాడను కనిపెట్టలేకపోతున్నారు. మత్స్యకార ఒంటరి మహిళలకు పింఛను సరిగా అందడం లేదు. సంక్షేమం పేరుతో నిధులన్నీ ఖాళీ చేసి, ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే ఏ పని ఈ ముఖ్యమంత్రి చేయడం లేదు. కచ్చితంగా మత్స్యకార గ్రామాల్లో చదువుకున్న యువతకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది. వారికోసం ఒక ఇన్స్టిట్యూట్ ను అనుసంధానం చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేసే దిశగా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది. వారికి ఉపాధి కల్పించేలా జనసేన పార్టీ చొరవ తీసుకుంటుంది అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానమే గంగమ్మ దీవెన నుంచే మొదలైంది. పాలన చేతగాని వ్యక్తికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే ఎలా ఉంటుందో స్వయంగా రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి భయపడకుండా పోలీసుల సహాయం లేకుండా, బారికేడ్లు పెట్టుకోకుండా జనంలోకి వెళితే వారి సమస్యలు అర్థమవుతాయి. వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది అని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేసారు.
ఉద్దానం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రి కి తెలుసా?
ఉద్దానం కిడ్నీ సమస్య గురించి రాజకీయాలకు అతీతంగా పోరాడిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఇక్కడి ప్రజల ఆరోగ్య సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లి అంతర్జాతీయ వైద్య నిపుణులను ఈ ప్రాంతానికి తీసుకు రాగలిగాం. గత ప్రభుత్వంలో కదలిక తీసుకురాగలిగాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉద్దానం గురించి ఏమి చేయలేదు. కనీసం ఈ ముఖ్యమంత్రి కి ఉద్దానం సమస్య ఏమిటో అక్కడ ప్రజలు దీని గురించి ఇబ్బంది పడుతున్నారో కూడా తెలియదు. ఇలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఉద్దానం సమస్య మీద నిజాయితీగా జనసేన పార్టీ పోరాటం చేసింది అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
మీడియాతో మాట్లాడలేని ముఖ్యమంత్రి
వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు మీడియాతో స్వయంగా మాట్లాడలేని ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడతాం. ఉత్తరాంధ్రలోని ఆస్తులు తాకట్టు పెట్టి, ఇక్కడ వనరులను పూర్తిస్థాయిలో దోచుకోవడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఒక మంత్రి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే, మరో మంత్రి ఉత్తరాంధ్రలోనే పూర్తిస్థాయి రాజధాని ఉంటుందని అంటారు. ముఖ్యమంత్రి మాటలకైతే అర్ధమే ఉండదు. ఉత్తరాంధ్ర మీద వైసీపీ చేస్తున్న నాటకం ప్రజలకు అర్థమైంది. మూడు రాజధానులు కాదు.. మాకు మంచి జీవితం కావాలని ప్రజలు కోరుకుంటున్న పట్టించుకునే వారే లేరు” అని నాదెండ్ల మనోహర్ వివరించారు.
క్రియాశీల కార్యకర్త కుటుంబానికి చెక్కు అందజేత
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో జనసేన పార్టీ కోసం కష్టపడిన పార్టీ క్రియాశీలక కార్యకర్త గుంటు శ్రీనివాస్ అనే మత్స్యకారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ నుంచి రూ. 5 లక్షల బీమా చెక్కును పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు గురువారం సాయంత్రం శ్రీనివాస్ భార్య శ్రీమతి గీతకు అందజేశారు. పిల్లల చదువు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం శ్రీను ఎంతగానో కష్టపడేవారని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు శ్రీనివాస్ ఎంతో తపించే వారని కుటుంబ సభ్యులు మనోహర్’కి తెలియజేశారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, పిల్లల చదువు బాధ్యతను చూసుకుంటామని నాదెండ్ల మనోహర్ వారికి హామీ ఇచ్చారు.