Nadendla on scan in Jagananna KanukaNadendla on scan in Jagananna Kanuka

జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్ల అవినీతి
విద్యార్థులకు బూట్లు, బ్యాగులు సరఫరా చేసిన కంపెనీలపై ఈడీ దాడులు
ఢిల్లీలో తీగ లాగితే ఆంధ్ర ప్రదేశ్ లో డొంక కదులుతోంది ప్రభుత్వ పాఠశాలల్లో
35 లక్షల మంది విద్యార్థులు… పర్చేజ్ ఆర్డర్ 42 లక్షల మంది విద్యార్థులకు
పిల్లలకు నాణ్యత లేని బూట్లు, బ్యాగులు ఇచ్చి మోసం చేసిన జగన్ మామయ్య
ఈడీ సమగ్ర విచారణలో మరింత అవినీతి బయటకు వచ్చే అవకాశం
ఉత్తరాంధ్ర నుంచి తాడేపల్లి వరకూ అందరి కథ ఈడీ దగ్గర ఉంది
నాడు-నేడుపై ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు
నాడు-నేడు కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారు
ప్రభుత్వ పెద్దల తగాదాలో ఆగిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐ.ఎఫ్.పి.) పంపిణీ
పేద విద్యార్థుల ముసుగులో భారీగా అవినీతి
‘రోజుకో వైసీపీ స్కామ్ బహిర్గతం’లో భాగంగా తొలి రోజు విద్యా శాఖలో అవినీతిపై ప్రెస్ మీట్
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

జగనన్న కానుకలు పేరుతో ఏపీ విద్య రంగంలో జరుగుతున్న అవినీతిపై నాదెండ్ల మనోహర్ తీవ్రమైన ఆరోపణలు చేసారు. పేదల పేరు చెప్పి… విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ అనే మాయ మాటలు చెప్పి వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అంతా ఇంతా కాదు. పైకి అంతా పారదర్శకం అంటూ ప్రచారం చేసుకొంటున్నారు. కానీ లోలోపల మాత్రం వేల కోట్లను వైసీపీ నాయకులు జేబులో వేసుకుంటున్నార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏ శాఖలో చూసినా వేల కోట్ల ప్రజా ధనాన్ని పోటీపడి మరీ వైసీపీ నాయకులు ఎలా కాజేస్తున్నారో జనసేన లెక్కలు, ఆధారాలతో సహా బయట పెడుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

ముందుగా చెప్పినట్లుగా నవంబరు 14వ తేదీ, నేటి నుంచి ప్రతి రోజూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పాపాలను మీడియా సమక్షంలో ప్రజల ముందు బయటపెడతాం. మొదటిగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో జరిగిన భారీ అవినీతి దోపిడీను బయటపెడుతున్నాం అని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పేద పిల్లలకు జగనన్న విద్యా కానుక పేరుతో ప్రతి ఏడాది పాఠశాలల ఆరంభ సమయంలో బూట్లు, యూనిఫాం, బ్యాగు తదితర వస్తువులతో కూడిన ఓ కిట్ ను ఇస్తున్నామని స్కీమ్ మొదలుపెట్టారు. దీని వల్ల పిల్లలు క్రమం తప్పకుండా స్కూలుకు వస్తారని, ప్రైవేటు స్కూళ్లకు దీటుగా విద్యా కానుక వస్తువులు ఉపయోగపడతాయని చెప్పారు. తీరా ఆ పథకంలో ప్రాథమిక అంచనా మేరకు రూ.120 కోట్లు స్కామ్ చేశారు.

యూపీ, ఢిల్లీల్లో ఈడీ దాడులతో…

తాజాగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ పథకానికి సంబంధించి బూట్లు, బ్యాగులు సరఫరా చేస్తున్న 5 కంపెనీలపై ఇటీవల ఎన్ఫోర్సుమెంటు డైరెక్టరేట్ ఢిల్లీతో సహా ఇతర చోట్ల దాడులు చేసింది. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.120 కోట్ల మేర అవకతవకలు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి, ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీలో తీగ లాగితే ఆంధ్రలో దాని డొంక కదలింది. ఉత్తరాంధ్ర నుంచి తాడేపల్లి వరకు ఆ డొంకలో ఉన్నవారి జాబితా ఈడీ వద్ద ఉంది. పిల్లలకు నాసిరకం బూట్లు, చిరిగిపోయిన బ్యాగులు సరఫరా చేయడమే కాకుండా, కమీషన్ల కక్కుర్తితో నాసిరకం సామగ్రిని పేద విద్యార్థులకు అందించారు. పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా మారుస్తామని చెబుతున్న జగన్ మామయ్య పేద విద్యార్థుల ముసుగులో వందలాది కోట్లు ఎలా కొల్లగొడుతున్నాడో బయటపడింది. ఎడమ కాలుకి మూడో నెంబర్, కుడి కాలుకి అయిదో నెంబర్ బూట్లు ఇచ్చారు. ఇదీ జగన్ చిత్తశుద్ధి.

5 కంపెనీలు… రూ.2400 కోట్లు

వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అమలు చేసిన జగనన్న విద్యాకానుక టెండర్లలో 5 కంపెనీలు మాత్రమే ఎప్పుడూ పాల్గొనేవి. ఈ 5 కంపెనీలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన కంపెనీలు. మొత్తం 4 ఏళ్ల పాలనలో రూ.2400 కోట్ల టెండర్లను ఈ 5 కంపెనీలు సిండికేట గా మారి కొట్టేశాయి. ఇంకెవరు టెండరు ప్రక్రియలోకి రాకుండా వీరు చూసుకునేవారు. దీనికి ప్రభుత్వం వత్తాసు పలికింది. ఇప్పుడు ఈ కంపెనీలపైనే ఈడీ దాడులు చేసింది. రూ.120 కోట్లు దారి మళ్లినట్లు గుర్తించింది. మొత్తం రూ. 2400 కోట్లను వస్తువుల కొనుగోళ్ల కోసం ఖర్చు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది విద్యార్థుల కోసం కొనుగోళ్ల ఆర్డరు ఇచ్చారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది 35 లక్షల మంది విద్యార్థులే. మరి మిగిలిన ఆర్డర్లు ఎవరి కోసం పెట్టినట్లు అనేది ప్రశ్నార్ధకం. క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్వాలిటీ వాల్ అని ఏర్పాటు చేశాం అని అధికారులు చెబుతున్నారు. అసలు ఏమిటీ క్వాలిటీ వాల్ అని ఆరా తీస్తే… కొత్తగా తీసుకొచ్చిన విద్యా కానుక వస్తువులను ఓ గోడపై ఉంచి నాణ్యత చూసిస్తారట. దీనివల్ల అన్నీ వస్తువులు బాగున్నాయి అని విద్యార్థులు అనుకోవాలి. గోడపైన ఉన్న సామగ్రి చూపించి విద్యార్థులను మోసం చేశారు.

పేద విద్యార్థుల పేరుతో దోచేయడమేనా క్లాస్ వార్

వైసీపీ ప్రభుత్వంలో ఇసుకలో, మద్యంలో అంతులేని అవినీతి జరుగుతోంది అని అంతా అనుకుంటున్నారు. అవి పైపైకి కనిపించే అవినీతి విషయాలే. దాదాపు అన్నీ పథకాల్లోనూ, శాఖల్లోనూ అవినీతి అధికం అయిపోయింది. చెప్పలేనంత దారుణంగా అవినీతి జరుగుతోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి విద్యాసామగ్రి ఎందుకు తీసుకొచ్చారు..? అసలు దీని వెనుక ఉన్నది ఎవరో కూడా ప్రజలకు తెలియాలి. చాలామంది విద్యార్థులకు బూట్లు సరిపోలేదు. బ్యాగులు చిరిగిపోయాయి. ఇంతటి నాసిరకం సామగ్రిని అంత దూరం నుంచి ఎందుకు తీసుకొచ్చారో బయటపెట్టాలి. పేద విద్యార్థుల పేరు చెప్పుకొని ఇంత దారుణమైన అవినీతి చేయడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లింది. పైగా ముఖ్యమంత్రి మాట్లాడితే క్లాస్ వార్ చేస్తున్నా అంటారు. పేద పిల్లలకు ఇచ్చే కానుకలో కోట్లు దోచేయడమేనా క్లాస్ వార్?

పెద్దల్లో వైరుధ్యాలు… పథకానికి తూట్లు

రూ.400 కోట్ల వ్యయంతో 32 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐ.ఎఫ్.పి.) సరఫరా చేయబోతున్నామని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ రోజుకీ సరఫరా చేయలేదు. ప్రతి పాఠశాలలో దీని ద్వారా ఆధునిక విద్యావిధానం అందుబాటులోకి వస్తుందని, ప్యానెల్స్ లో సులభంగా చెప్పిన పాఠం అర్ధం అవుతుందని చెప్పారు. నేటికీ ఆ ప్యానెల్స్ ఏమయ్యాయో కూడా తెలీదు. ప్రభుత్వంలోని కొందరు పెద్దల మధ్య ప్యానెల్స్ టెండరు విషయంలో వచ్చిన వైరుధ్యాల కారణంగానే ఇది ఆగిపోయింది. ఎందుకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ సరఫరా ముందుకు కదల్లేదు. దాని వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా ప్రజలకు తెలియజేయాలి.

పేరు మామయ్యది… ఖర్చు కేంద్రానిది

ప్రభుత్వ బడుల ముఖచిత్రం మారిపోతోందని, నాడు-నేడు మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కార్పొరేట్ పాఠశాలలు అయిపోయాయని జగన్ మామయ్య పదేపదే ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తుంటారు. అయితే ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందేమీ లేదు. పాఠశాలల ముఖ చిత్రం మారిపోయింది… అవార్డులు వస్తున్నాయి అంటున్నారు. అయితే ఈ పథకం అమలు వాస్తవంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులనే వైసీపీ ప్రభుత్వం తన ఘనకార్యంగా చెప్పుకోవడం కనిపిస్తోంది. కేంద్రం అందిస్తున్న ప్రతి పైసా మీద భాజపా నాయకులు లెక్క అడగాల్సిన అవసరం ఉంది.
– నాడు-నేడు పథకంలో పాఠశాలల నిర్మాణానికి గాను కేంద్రం రూ.2,500 కోట్లు, నాబార్డు రుణం రూ.1800 కోట్లు, ప్రపంచబ్యాంకు నుంచి రూ.700 కోట్లు, సమగ్ర శిక్ష నుంచి రూ.1000 కోట్లు మొత్తంగా రూ.6 వేల కోట్లు రాష్ట్రానికి అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ఖర్చు చేసింది సున్నా.

– నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడానికి వచ్చిన నిధులు రూ.6 వేలు కోట్లు అయితే… పథకంలో పనులు చేసిన వారికి రూ. 3,850 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి మిగిలిన 2,150 కోట్లు ఎక్కడికి వెళ్లాయి..? దేనికి దారి మళ్లించారు. పథకంలో భాగంగా పనులు పూర్తి చేశాం మా బిల్లులు మాకు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు మొత్తుకొంటున్నారు. వారికి రూ.1350 కోట్లు ఇవ్వాలి. పెండింగ్ బిల్లులు అలాగే ఉండిపోయాయి. బడ్జెట్ లో మీరు ఇస్తామన్న నిధులు ఏం అయ్యాయి…?

– రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకానికి గాను బడ్జెట్ లో చూపించిన నిధుల్లో రూపాయి కూడా కేటాయించలేదు. బడ్జెట్ కేటాయింపులకు వాస్తవంగా విడుదల చేసిన నిధులకు ఎక్కడా పొంతన కూడా కనిపించడం లేదు.
– ముఖ్యమంత్రి నాడు-నేడు పథకాన్ని రెండో విడత ప్రారంభించే సమయంలో 2021, ఆగస్టు 16న నాడు – నేడు రెండో విడతలో భాగంగా 13,520 పాఠశాలల్లో సమగ్ర మార్పులు తీసుకొస్తాం అన్నారు.

8022 ఇంగ్లీష్ ల్యాబ్స్ అన్నారు… నిర్మాణం సున్నా

దానిలో భాగంగా ఇప్పటి వరకు పాఠశాలలకు ప్రహరీలు 6,001 పూర్తి చేయాల్సి వస్తే… 1000 మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి. మధ్యాహ్న భోజనం కింద 9,226 వంటగదుల నిర్మాణం చేయాల్సి ఉండగా, 400 నిర్మాణం చేశారు. ఇంగ్లీషు ల్యాబులను నిర్మిస్తామని, పిల్లలకు మేలు చేస్తామని చెప్పి 8,022 ల్యాబ్స్ కోసం ప్రతిపాదనలు తీసుకొని, ఒక్క ల్యాబు కూడా ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. అదనపు పాఠశాలల గదులు 19,974 నిర్మిస్తామని చెప్పి, కేవలం 6,000 మాత్రమే పూర్తి చేశారు.

మేం ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం… ముఖ్యమంత్రి స్పందించాలి

మేం ప్రభుత్వం మీద బురద జల్లేందుకో, విమర్శల కోసమో మాట్లాడటం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతి తతంగాన్ని లెక్కలతో, ఆధారాలతో బయటపెడుతున్నాం. దాదాపు అన్ని శాఖల్లోనూ ఆకాశమంత అవినీతి దాగుంది. పాల వెల్లువ, ఐబీ విధానం, టోఫెల్ మీద మేం మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లి మరీ జరుగుతున్న అవినీతి బాగోతాన్ని బయటపెడతామని సవాల్ కూడా చేశాం. మంత్రులు ఏదో తూతూమంత్రంగా స్పందించి, రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోతే ఫలితం లేదు. జరుగుతున్న అవినీతి తంతును మేం పక్కా ఆధారాలతో చెబుతున్నాం. పారదర్శకతలో వైసీపీ ప్రభుత్వం ముందు ఉంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి దీనిపై స్పందించి, విచారణకు ఆదేశించాలి. మా వద్ద ఉన్న ఆధారాలను అందించి, మేం కూడా విచారణకు సహకరిస్తాం. అలా కాదు అనుకుంటే క్షేత్రస్థాయిలోకి వెళ్లి అవినీతిని ప్రత్యక్షంగా చూపించమన్నా మేం సిద్ధంగానే ఉన్నాం. పేద పిల్లలకు మామయ్య పేరుతో కళ్లకు గంతలు కట్టి, చేస్తున్న అవినీతి తతంగాలను ప్రజలకు వివరించాలన్నదే మా ఉద్దేశ్యం. కచ్చితంగా జనసేన కార్యాలయం సాక్షిగా రోజుకో అవినీతి బండారం బయటపెడతాం. వైసీపీ ముఖ్యమంత్రిలో చిత్తశుద్ధి ఉంటే, కచ్చితంగా మేం లేవనెత్తిన ప్రతి అంశానికి సమాధానం చెప్పాల్సిందే’’ అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బండ్రెడ్డి రామకృష్ణ, విజయవాడ, గుంటూరు నగరాల అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, నేరెళ్ల సురేశ్, పార్టీ నేతలు చిల్లపల్లి శ్రీనివాసరావు, డి.వరప్రసాద్, అక్కల రామ్మోహన రావు, అమ్మిశెట్టి వాసు, వడ్రాణం మార్కండేయబాబు, బేతపూడి విజయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

జగనన్న పాల వెల్లువ పథకంలో పొంగి పొర్లుతున్న అవినీతి!