మీసాలు తిప్పి, తొడలు కొట్టారు తప్ప ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి చెప్పిన నిజాలు విని ఆశ్చర్యం కలిగింది
పోలవరం ఎత్తు తగ్గింపుకి జగన్ రెడ్డి ఒప్పుకొన్నది నిజం కాదా?
నాలుగేళ్లుగా తేదీలు మార్చిన మెమోరాండాలిస్తున్నారు
కేంద్రం రీఎంబర్స్ చేస్తామంటే ఎందుకు స్పందన లేదు?
ముఖ్యమంత్రికి పోలవరం పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి లేదు
నిధులు దారి మళ్లించారు-పునరావాస ప్యాకేజీ మింగేశారు.
త్వరలో పవన్ కళ్యాణ్ పోలవరం పర్యటన
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలసి ముందుకు వెళ్తాం
మంగళగిరిలో మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పూర్తి చేయని పాపం ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదేనని (AP CM Jagan) జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) ప్రజల్ని మభ్యపెట్టిన తీరుకు జగనన్న పాపం పథకం అని పేరు పెట్టాలన్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని చెప్పి ఇప్పుడు నెపం కేంద్రం మీద వేస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు మినహా ఈ ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ది లేదన్నారు. కేంద్రం నిధులు రీఎంబర్స్ చేస్తామంటే ఎందుకు స్పందించడం లేదు? 41.15 మీటర్ల ఎత్తుకు తగ్గించేందుకు ఒప్పుకొని ఎందుకు సంతకాలు చేశారో సమాధానం చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేసుల గురించి మాట్లాడుకోబట్టే కేంద్రం మీ విన్నపాలు ఖాతరు చేయడం లేదన్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ పోలవరంలో పర్యటించి క్షేత్ర స్థాయిలో సాగుతున్న పునరావాసం, నిర్మాణం పనుల గురించి అధ్యయనం చేయనున్నట్టు నాదెండ్ల తెలిపారు. మరింత స్పష్టంగా అక్కడ జరుగుతున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రయోజనాల కోసం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అంతా కలసి ముందుకు వెళ్తామని మనోహర్ తెలిపారు.
పార్టీ బలోపేతం దిశగా జిల్లాల వారీగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. జగనన్న పాపం పథకం పోలవరం ప్రాజెక్టు పాలిట శాపంగా మారిందని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో అనేక మంది జాతీయ స్థాయి నాయకులతో చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రజలకు మెరుగైన పాలన అందించే విధంగా ఎలా ముందుకు వెళ్లాలి. వైసీపీ పాలనలో ప్రజల ఇబ్బందులు ఏమిటి. పోలవరం ప్రాజెక్టు.. వైసీపీ దాష్టికాలు.. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న అంశాలపై కూలంకషంగా చర్చించాం. ముఖ్యంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్’తో సమావేశంలో పోలవరం గురించి పంచుకున్న అంశాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
పోలవరంపై చిత్తశుద్ధి లేదు
ఏడాదికి రెండుసార్లు పోలవరం పర్యటించి ముఖ్యమంత్రి చేసే ప్రకటనలు ఇతర పార్టీల మీద బురద చల్లేందుకు మినహా.. నిజాయితీగా పోలవరం పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి లేదని అర్ధం అయ్యింది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన ప్రకటన పోలవరం పూర్తి చేయాలన్న సంకల్పం ఈ ముఖ్యమంత్రికి లేదని అర్ధం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు ఏ విధంగా విస్మరించిందో కేంద్ర మంత్రి చెబితే అర్ధం అయ్యింది. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి వినియోగించుకుంటున్నారు.
రివర్స్ టెండరింగ్ అన్నారు. కాంట్రాక్టర్’ని మార్చారు. రూ.800 కోట్లు ఆదా చేశామని ప్రగల్భాలు పలికారు. 2019లో చేసిన ప్రకటనలో 2021 జూన్ కి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. 2020 డిసెంబర్ లో చేసిన ప్రకటనలో 2022 ఖరీఫ్’కి సాగునీరు ఇస్తామన్నారు. ఇదే ముఖ్యమంత్రి హెలీకాప్టర్లో వెళ్లి ప్రాజెక్టు అద్భుతంగా పూర్తయిపోతోందని మభ్యపెట్టేందుకు దుర్మార్గమైన ప్రయత్నం చేశారు. చివరికి 2022 సెప్టెంబర్’లో శాసనసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు. పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయడం లేదు అని ప్రకటించారు. మంత్రులు మారారు.. ఛాలెంజులు చేశారు.. తొడలు కొట్టారు.. ఎక్కడా చిత్తశుద్ది లేదు అని నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
జగన్ రెడ్డి పాపాలు చెప్పేందుకు ప్రత్యేక పథకం
మొన్న మార్చి 23న శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రస్తుతానికి 41.15 మీటర్లకు ప్రాజెక్టు పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నామని ప్రకటించారు. తర్వాత 47.7 మీటర్లు పూర్తి చేస్తామని చెబుతున్నారు. కేంద్రం వద్ద 41.15 మీటర్లకు ఒప్పుకుని సంతకాలు చేశారా లేదా? ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు మభ్యపెడుతున్నారు. నాలుగేళ్లుగా ఢిల్లీ వెళ్లి సీఎం ఏం సాధించారు. నాలుగేళ్లుగా మెమోరాండంలో డేట్లు మార్చి ఇచ్చిందే ఇచ్చి సమయం వృధా చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే సవరించిన అంచనాలకు ఆమోదం చేయించుకోవచ్చుగా. కేంద్ర నీటి సంఘం మీ పనితీరుని ఆక్షేపించిన మాట వాస్తవం కాదా? మూడు రాష్ట్రాల అధికారుల్ని పిలిపించి ఇప్పుడు బ్యాక్ వాటర్ సర్వే ఎందుకు చేయిస్తోంది? మీరు మార్చిన లెక్కల వల్ల కాదా? కేంద్రం రీ ఎంబర్స్ మెంట్ కింద రూ.2600 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? గతంలో ఇచ్చిన నిధులు ఇతర పథకాలకు మళ్లించేసుకున్నారు. ఇసుక తోడేసి అమ్ముకుంటున్నారు. డయాఫ్రం వాల్ డ్యామేజీకి రూ.1200 కోట్లు కావాలంటున్నారు. రీ ఎంబర్స్ చేస్తామంటే ఎందుకు ముందుకు వెళ్లడం లేదు.
కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో తెలిసిన అంశాలు బాధించాయి. కోసం.. రాజకీయ కోసం.. ఒకరి మీద ఒకరు బుదర జల్లుకోవడం కోసం మినహా ఈ ప్రభుత్వం రైతాంగం గురించి, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మీ కేసుల గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టే మీరిచ్చే విన్నపాలు కేంద్రం ఖాతరు చేయలేని పరిస్థితి. పోలవరం నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నారు కాబట్టి కేంద్రం మిమ్మల్ని నమ్మడం లేదు. కేంద్రం రీఎంబర్స్ చేస్తామని అంటే మీరు ఎందుకు నిలబెట్టు కోలేకపోయారు? ఈ పాపం జగన్ రెడ్డిది కాదా? మీ జగన్ రెడ్డి పాపాలు చెప్పేందుకు ఒక ప్రత్యేక పథకం పెడితే అందులో పోలవరాన్ని చేర్చాలి. నాలుగేళ్ల నుంచి ప్రకృతి సహకరించలేదు. ప్రజలు ఎన్నో కష్టాలకు గురవుతున్నారు. ప్రజలు పోలవరం పోయి చూసి రాలేరు కదా అని మీరు చూపిన ఫోటోలు చూసి ప్రాజెక్టు పూర్తవుతుందన్న నమ్మకంతో ఉన్నారు అని నాదెండ్ల మనోహర్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
వైసీపీ అసమర్ధ పాలన వల్లే ఈ దుస్థితి
పునరావాసం వ్యవహారంలో కేంద్రం ఇచ్చేది చాలదు. రాష్ట్రం మరికొంత కలిసి రూ.10 లక్షలు ఇస్తామన్నారు. నాలుగేళ్లలో మూడు శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా పోలవరం కోసమే అని చెబుతారు. మెమోరాండంలు మార్చడం మినహా ఏమీ చేయలేదు. కేంద్రం 20 వేల కోట్లు సాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వంలో నిజాయితీ లేదు. పోలవరం వ్యవహారంలో జనసేన ఎప్పుడూ రాజకీయ విమర్శలు చేయలేదు. పూర్తి చేయమని మాత్రమే అడుగుతున్నాం.
ప్రాజెక్టుని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన జనసేనకు లేదు. కేంద్ర మంత్రి సమావేశం తర్వాత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రమే ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరాము. పోలవరం వ్యవహరంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది చాలా పెద్ద మోసం. కాంట్రాక్టర్లను మార్చి.. డేట్లు మార్చి నీరిచ్చేస్తామని ప్రకటనలు చేసి మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంపై కేంద్రానికి పూర్తిగా నమ్మకం పోయింది. అసమర్ధ పాలన వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది.
పోలవరంలో పవన్ కళ్యాణ్ పర్యటించి స్వయంగా సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. నెల రోజుల్లోపే శ్రీ పవన్ కళ్యాణ్ పోలవరంలో పర్యటించి పునరావాసం, నిర్మాణం పనులపై అధ్యయనం చేస్తారు. మరింత స్పష్టంగా అన్ని విషయాలు ప్రజలకు తెలియచేస్తారు అని మనోహర్ తెలిపారు.
సుదీర్ఘ చర్చలు
ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చే విధంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఈ అంశం మీద కేంద్ర పెద్దలతో సుదీర్ఘంగా చర్చించాం. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ వైపు అంతా అడుగులు వేస్తారన్న నమ్మకం కలిగింది. రాబోయే రోజుల్లో సంస్థాగతంగా జనసేన బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అధ్యక్షుల వారి అదేశాల మేరకు జిల్లాల వారీగా కార్యక్రమాలు చేయబోతున్నాం.
ఒక ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తాం. ఈ ప్రభుత్వంలో మార్పు కోసం పనిచేస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, షేక్ రియాజ్, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్, కార్యక్రమాల నిర్వహణ విభాగం చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, అక్కల రామ్మోహన్ రావు, డాక్టర్ గౌతమ్ రాజ్, బండి రామకృష్ణ, సయ్యద్ జిలానీ, నయూబ్ కమాల్, బేతపూడి విజయ్ శేఖర్, నేరెళ్ల సురేష్, బి.వి.రావు తదితరులు పాల్గొన్నారు.