నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ (Kaikala satyanarayana) కన్నుమూశారు అనే వార్తతో తెలుగు సినిమా పరిశ్రమలో (Telugu Film Industry) విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు.
గత కొంతకాలంగా కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్ ఇలా అన్నీ రకాల ప్రాతలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. నవరస నటనాసార్వభౌముడు అంటే కైకాల సత్యనారాయణ. కైకాల సత్యనారాయణ అంటే నవరస నటనాసార్వభౌముడు. ఈయన స్థానాన్ని మరొక నటుడు భర్తీ చేయలేక పోవచ్చు అన్నట్లు కైకాల నటించేవారు.
కైకాల సత్యనారాయణ నిర్మాతగానూ కొన్ని సినిమాలు రూపొందించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల సత్యనారాయణ ఒకరు. కైకాల మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కైకాల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు కైకాల సత్యనారాయణ ఇంటికి తరలి వస్తున్నారు.
కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో1935 జులై 25న కైకాల సత్యనారాయణ జన్మించారు.
గుడివాడ కళాశాల నుంచి కైకాల పట్టభద్రుడైయ్యారు.
కైకాలకు 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది.
కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.
కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు.
కైకాల సత్యనారాయణ నటించిన చివరి చిత్రం: మహర్షి
నవరస నటనా సార్వభౌముడిగా పేరుగాంచిన కైకాల సత్యనారాయణ సుమారు 777 చిత్రాల్లో నటించారు.
మహోన్నత నటుడు కైకాల సత్యనారాయణ ఆత్మకి శాంతి కలగాలని యావత్తు తెలుగు ప్రజలు ప్రార్థిస్తున్నారు.