కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం జగన్ వినతి
కేంద్రం మమ్ములను పెద్ద మనస్సుతో ఆదుకోవాలి. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మూడు రాజధానులకు, పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) సత్వర నిర్మాణం తదితర పెండింగ్ సమస్యల పరిస్కారానికి సహకరించండి అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Amit Sha) కి విజ్ఞప్తి చేసారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సమతౌల్యంతో కూడిన అభివృద్ధికి మూడు రాజధానుల చట్టం తీసుకొచ్చాం. ఈ మా నిర్ణయానికి మాకు సహకరించండి’ అని కేంద్ర హోం మంత్రి (Home Minister) అమిత్ షాకు ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని అమిత్ షా గృహంలో గురువారం రాత్రి ఆయనను ముఖ్యమంత్రి (CM) జగన్ రెడ్డి కలుసు కున్నారు. వారి మధ్య సుమారు 90 నిమిషాలు భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను హోంమంత్రి దృష్టికి జగన్ తీసుకెళ్లారని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఒక నోట్ విడుదల చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ 2020 ఆగస్టులో చట్టం తీసుకొచ్చాం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికల సమయంలో భాజపా మేనిఫెస్టోలో పెట్టారు. హైకోర్టును కర్నూలులో పెడుతూ రీనోటిఫికేషన్ జారీ చేయాలి. విభజన అనంతరం రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులకు గురైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్లు వచ్చి రాష్ట్రంపై ఆర్థికభారం తగ్గే అవకాశం ఉంది. భారీ పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక హోదా అవసరం. కావున రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించండి’ అని కోరారు అని సీఎంఓ నుండి విడుదలైన ప్రకటనలో తెలిపారు.
కుడిగి, వల్లూరు థర్మల్ ప్లాంట్ల నుంచి అధిక ధరలకు విద్యుత్తు కొనుగోలుకు చేసుకున్న ఒప్పందాలను సరెండర్ చేసేందుకు సహకరించాలని కూడా కేంద్ర హోమ్ మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి రావల్సిన రూ.5,541.88 కోట్ల బకాయిలను ఇప్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విద్యుత్తు రంగం రూ.50 వేల కోట్ల రుణాల్లో ఉన్నందున వాటిని పునర్నిర్మాణం చేయాలని కోరారు. విశాఖ జిల్లా అప్పర్ సీలేరులో రివర్స్ పంప్ స్టోరేజీ విద్యుత్తు ప్రాజెక్టుకు రూ.10,445 కోట్ల ఖర్చు అవుతుంది. అందులో 30% నిధులు సమకూర్చాలని కూడా కోరారు.
చౌక బియ్యం రాయితీ కింద కేంద్ర పౌరసరఫరాల సంస్థ నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులను, ఉపాధిహామీ పథకంలో రావల్సిన నిధులను, స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం కింద రావల్సిన నిధులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం కింద రావల్సిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్ర హోమ్ మంత్రిని సీఎం జగన్ రెడ్డి కోరారు. ఉపాధి పని దినాలను 150కి పెంచాలని కూడా విజ్ఞప్తి చేశారు.