NagababuNagababu

వైసీపీ నాయకులకు డబ్బు తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదు
ఏ రాష్ట్రంలోనూ జరగని అవినీతి ఆంధ్రాలో జరుగుతోంది
ల్యాండ్, సాండ్, మైన్స్ ఇలా దేన్ని వదలడం లేదు
ప్రతి వైసీపీ నాయకుడు వందల కోట్లు దోచుకున్నాడు
లంచాలు ఇవ్వలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు
అధికారం కోసం ముఖ్యమంత్రి ఎంతకైనా తెగిస్తారు.
ఆయనది క్రిమినల్, ఫ్యాక్షనిస్టు మైండ్ సెట్
2024లో జనసేన ప్రభుత్వం వచ్చి తీరుతుంది-పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు
మ్యూనిచ్ లో జరిగిన జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో కొణిదెల నాగబాబు

2024 జరిగే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం (Janasena Government) అధికారంలోకి వచ్చి తీరుతుంది. జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్ర రాష్ట్రానికి (Andhra Pradesh) సీఎం (AP CM) అవుతారు. పాలనలో మార్పు తెస్తారు అని కొణిదెల నాగబాబు (Konidela Nagababu) స్పష్టం చేసారు. ‘వైసీపీ నాయకులకు డబ్బు సంపాదించాలనే ధ్యాస తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష లేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ రాష్ట్రంలో జరగనంత అవినీతి ఆంధ్రాలో జరుగుతోంది. ప్రకృతి వనరులు దోచుకుంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లకు పడగలెత్తుతున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పేర్కొన్నారు.

వైసీపీ నాయకులు ప్రజలను మనుషులుగా చూడటం మానేసి ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, కులం, మతం, ప్రాంతాలుగా విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజకీయం ఉండాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారని తెలిపారు. సోమవారం జర్మనీ దేశంలోని మ్యూనిచ్ నగరంలో ఎన్ఆర్ఎ జనసైనికులు, వీరమహిళలతో నాగబాబు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… “దేశం దాటి వచ్చిన వారికే మాతృభూమి విలువ తెలుస్తుంది. సముద్రాలు దాటి వచ్చినా మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగి స్తున్నందుకు అభినందనలు. గత పది రోజులుగా ఐరోపాలోని వివిధ దేశాల్లో పర్యటించాను. వేలాది మంది జనసేన సానుభూతిపరులను కలిశాను. ఎంతగానో ఆదరించిన మీ అందరికి కృతజ్ఞతలు అని కొణిదెల నాగబాబు అన్నారు.

షేర్లు, లాభాల్లో వాటాలు అడుగుతున్నారు

రాజకీయాలను సేవా మార్గంగా చూడాలి. వ్యాపారంగా చూస్తే అభివృద్ధి మందగిస్తుంది. మన రాష్ట్రంలో రాజకీయం వ్యాపారంగా మారిపోవడంతో అభివృద్ధి కుంటి పడిపోయింది. పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు వణికిపోతున్నారు. వైసీపీ నాయకులకు లంచాలు ఇవ్వలేక చాలా కంపెనీలు రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. రాష్ట్రంలో ఒక పరిశ్రమ పెట్టాలంటే కంపెనీలో షేర్లు అడుగుతున్నారు. లాభాల్లో వాటాలు అడుగుతున్నారు. ఇవ్వకపోతే రకరకాల కారణాలతో వేధిస్తున్నారు. ల్యాండ్, సాండ్, మైన్స్.. ఇలా అందినకాడికి ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. భవిష్యత్తు తరాలకు వాటి ఆనవాళ్లను కూడా మిగల్చడం లేదు. రుషికొండకు బోడి గుండు కొట్టేశారు. జగనన్న కాలనీల పేరుతో వేలకోట్లు దోచేశారు. మనకెందుకులే అని మనం రాజకీయాలను పట్టించుకోకపోయినా… రాజకీయాలు మనల్ని పట్టుకొనే ఉంటాయని గుర్తించాలి. అని నాగబాబు తెలిపారు.

ముఖ్యమంత్రిది నియంత పోకడ

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. జనసేన పార్టీలో ఎవరైనా కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదగవచ్చు. ఇతర పార్టీల్లో ఇలాంటివి ఉండవు. మన ముఖ్యమంత్రినే తీసుకుంటే ఆయనది నియంత పోకడలు. వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా తానే ఉండాలని ఏకగ్రీవంగా తన పార్టీ నాయకులతో ఎన్నుకునేలా చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటివి చెల్లవని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షుడు ఏంటి? జగన్ ది క్రిమినల్ మైండ్, ఫ్యాక్షనిస్ట్ మైండ్. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఆయన పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తోలుబొమ్మలే. ఆయన ఆడమన్నట్లు ఆడాలి. పాడమన్నట్లు పాడాలి అని నాగబాబు తీవ్ర ఆవేదనతో అన్నారు.

మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. ప్రజలకు ఏం చేద్దాం అనే ఆలోచనతోనే ఉంటారు. అందుకే వాలంటీర్ వ్యవస్థలోని లోపాలు, బైజూస్ కుంభకోణంపై మాట్లాడారు. వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. ఆయనకు ప్రజల కోసం పోరాటం చేయడమే తెలుసు. ప్రయత్న లోపం లేకుండా పోరాటం చేసినోడు ఓడిపోయినట్లు చరిత్రలో లేదు. 2024లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయి తీరుతారు. నియంతలు ప్రజల చేతిలో కుక్క చావు చస్తారు.

అభిప్రాయం ధైర్యంగా చెప్పండి చాలు

తెలివికి తగ్గ ఉపాధి అవకాలు లేక సముద్రాలు దాటి కుటుంబాలను వదిలి ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నారు. ఎన్నో కష్ట, నష్టాలకు ఓర్చి కన్నీళ్లు దిగమింగి ఇక్కడ నివాసం ఉంటున్నారు. మన పిల్లలు మన రాష్ట్రంలోనే అన్ని సౌకర్యాలతో జీవించాలంటే అది జనసేన ప్రభుత్వంతోనే సాధ్యం. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనకు చమరగీతం పాడాలంటే ప్రవాస భారతీయులు తమ అభిప్రాయం సోషల్ మీడియాలో ధైర్యంగా షేర్ చేస్తే చాలు. ఇతర పార్టీలు కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో పెయిడ్ వార్తలు రాయిస్తున్నాయి. వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటుంది జన సైనికులు, వీరమహిళలే.

అధికార పార్టీ నుంచి ఎన్ని బెదిరింపులు ఎదురైనా లెక్క చేయకుండా పోరాడుతున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలు చూసి ప్రజల్లో మార్పు మొదలైంది. ప్రతి ఒక్కరు ఆలోచించడం మొదలుపెట్టారు. అలాంటి వ్యక్తి శాసనసభలోకి అడుగుపెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆయన సంధించే ప్రశ్నలు, లేవనెత్తే అంశాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. మామను చూసి అల్లుడికి ఓటు వేశారు. తండ్రిని చూసి కొడుక్కి ఓటు వేశారు. మీ పిల్లలను చూసి పవన్ కళ్యాణ్ కు ఓటు వేయండి అనే మెసెజ్ మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శశిధర్ కొలికొండ పాల్గొన్నారు.

సమాజ శ్రేయస్సు కోసం ఎన్ఆర్ఐలు చేస్తున్న కృషి అమోఘం: నాగబాబు