TTD TempleTTD Temple

శిరిడీ సాయి సంస్థాన్ చూసి టీటీడీ ఎంతో నేర్చుకోవాలి
వెంకటేశ్వర స్వామిని ఆదాయ వనరుగా భావిస్తున్న సర్కార్?
అధికారికంగా బ్లాక్ టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టిన టీటీడీ?
ఏదో ఒక రకంగా భగవంతుడికి భక్తులకు దూరం చేసే కుట్ర?
ఉత్తరద్వారాన్ని 365 రోజులు తెరుచుకోండి…
సి ఆర్ పి సి, రాజ్యాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఎంతో … ఆగమ శాస్త్రానికి అంతే గౌరవం
అడ్డగోలుగా తిరుమలలో గదుల ధరలు పెంపు

తిరుమలలో భక్తులు విడిది చేసే గదుల బాడుగను అడ్డగోలుగా పెంచారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకన్నకు భక్తులను దూరం చేయాలని ఈ వైసీపీ ప్రభుత్వం భావిస్తోందా?. అందుకే ఈ అసంబద్ధమైన నిర్ణయాలను తీసుకున్నారా??

మద్యం ధరలను పెంచితే, మందుబాబులు వాటి జోలికి వెళ్లరని భావించి, మద్యం ధరలను విపరీతంగా పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విధానాన్ని, వెంకన్న భక్తుల విషయంలో కూడా అమలు చేస్తున్నారా? ఇదే నిజమైతే ఇది యాదృచ్చికమా లేక పక్కా ప్రణాళికలో భాగంగా చేస్తున్నదా?

తిరుమలలోని నారాయణ గిరి గెస్ట్ హౌస్’లో అద్దె గది బాడుగ ధర 100 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు 1700 రూపాయలుగా నిర్ణయించారు. గతంలో భక్తులు ఇచ్చిన విరాళాలతో నిర్మించిన ఈ గెస్ట్ హౌస్ నిర్మించడం జరిగింది. ఇప్పుడు అద్దె గదుల బాడుగ ధరలను అడ్డగోలుగా పెంచాల్సిన అవసరం ఏమిటి? ఇక కార్నర్ గదులకు గతంలో 150 రూపాయలు బాడుగ ఉండగా, ప్రస్తుతం 2200గా నిర్ణయించారు. స్పెషల్ టైప్ కాటేజీలకు గతంలో 750 రూపాయల బాడుగ ఉండగా, ప్రస్తుతం 2200 రూపాయలుగా నిర్ణయించారు. గదుల బాడుగ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ అదనంగా పేర్కొనడం జరిగింది.

పేద భక్తుల మాటేమిటి?

గతంలో సినిమా టికెట్ ను 100 రూపాయలు ఉన్నదాన్ని పది రూపాయలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తగ్గించిన విషయం తెలిసిందే. సినిమా టికెట్ ధరలను ఎందుకు తగ్గించారని ప్రశ్నించగా, జగన్ బాధా తప్త హృదయంతో పేదవాడు సినిమా చూడకూడదా? అని ప్రశ్నించారు. మరి ఇప్పుడు పేద భక్తుడు భగవంతుని దర్శనానికి పనికిరాడా?

పెత్తందారులకు, పేదలకు మధ్య పోరాటం అని చెబుతున్న జగన్, ఇక్కడ పెత్తందారులు అంటే టీటీడీ పాలకమండలి సభ్యులా? వారిపై పేద భక్తులు తమ హక్కుల కోసం పోరాడాలా?

జెరూసలేం వెళ్లే వారికి రాయితీలు. వెంకన్న భక్తులకు అడ్డగోలు బాదుడులా?

జెరూసలేం యాత్ర చేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను కల్పిస్తుంది. అదే వెంకన్న భక్తులను మాత్రం నిలువునా దోచు కుంటోంది!

వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఆదాయ వనరుగా ఎందుకు చూస్తున్నారు.

స్వామి స్వయంభుగా వెలసిన ప్రదేశం తిరుమల. తిరుమల కొండకు చేరిన భక్తులకు టోల్ ట్యాక్స్ రూపంలో బాదుడు ప్రారంభమవుతుంది. అద్దె గదిలో బాడుగను అడ్డగోలుగా పెంచి, భక్తులపై అదనపు భారం మోపారు. కాలినడకన కొండకు చేరే భక్తులకు గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా 300 రూపాయల క్యూలో ప్రవేశించే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని అందజేసేవారు. ఇప్పుడు ఆ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారు.

కళ్యాణంలోను అంతే…

గతంలో కల్యాణం టిక్కెట్ వెయ్యి రూపాయలకు తీసుకొంటే ఇద్దరికీ దర్శనంతో పాటు ప్రసాదం గా ఒక పెద్ద కల్యాణం లడ్డూ తో పాటు 4 చిన్న లడ్డూలు, ఒక అప్పం కూడా ఇచ్చే వారు.

ఇప్పుడు కల్యాణం పెద్ద లడ్డూ ఇవ్వడం లేదు. అదీకాక 4 చిన్న లడ్డులలో కూడా కోత విధించి 2 చిన్న లడ్డూలు మాత్రమే ఇస్తున్నారు. ఇక అప్పం ప్రసాదం కూడా ఎత్తి వేశారు.

పెద్ద లడ్డూ ప్రసాదం పరిమాణం తగ్గించి బహిరంగ మార్కెట్ లో 200/- ఒక కల్యాణం లడ్డూ ప్రసాదం అమ్ముతున్నారు. అలాగే ఆప్పం ప్రసాదం కూడా బహిరంగ మార్కెట్’లో అమ్ముతున్నారు.

తిరుమలను ఇప్పుడు పూర్తిగా వ్యాపారమయం చేశారు. దోచుకో దాచుకో అనే పద్ధతి లో… కానీ నేరుగా మనం భక్తులనే దోచుకుంటున్నాము.

ప్రతిరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు వస్తున్నది. ఆర్థిక స్తోమత కలిగిన భక్తులకు అద్దె గది బాడుగ 1500 రూపాయలు నిర్ణయిస్తే ఇబ్బంది లేదు.

అదే పేద భక్తుడైతే అద్దె గది బాడుగ చెల్లించడానికి దైవ దర్శనం మానుకోవలసి ఉంటుంది. క్యూలైన్లలో నిలబడిన భక్తులకు గత ప్రభుత్వ హయాంలో వేడివేడి పాలను అందజేసేవారు. కానీ భక్తులకు ఇప్పుడు అటువంటి సౌకర్యం కల్పించడం లేదు.

భక్తులకు దేవుడి ప్రసాదాన్ని అందజేయడం పాలకమండలి సభ్యుల బాధ్యత. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం సైజును కూడా తగ్గించి గోలి కాయంత చేశారు.

టీటీడీపీ ఆదాయంలో మిన్న సౌకర్యాల్లో సున్నా!

తిరుమల వెంకన్నకు ఇంత ఆదాయం వస్తుండగా, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, డబ్బులను ఏమి చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

శ్రీవాణి ట్రస్ట్ శ్రీవారి దర్శన టికెట్ 10,000/- పెట్టి తద్వారా దేవాలయ పునరుద్ధరణకు విరాళాల సేకరణ సాకు చూపిస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన శ్రీవాణి పథకం ద్వారా దేవాలయాల పునరుద్ధరణకు భక్తుల నుంచి విరాళాలను సేకరించేవారు. భక్తులు ఎవరైనా దేవాలయాల అభివృద్ధి కోసం ఏదైనా చేయాలి అనుకుంటే, శ్రీవాణి పథకం కింద విరాళాలను అందజేస్తే… ప్రభుత్వమే ముందుండి దేవాలయాల పునరుద్ధరణ తో పాటు, దీప దూప నైవేద్యాలకు ఆ డబ్బులు ఖర్చు చేస్తూ వచ్చింది.

శ్రీవాణి పథకాన్ని పథకాన్ని సద్వినియోగం చేసుకునే బదులు, దుర్వినియోగం ఎలా చేయాలో ఆచరణలో చేసి చూపించారు.

శ్రీవాణి టికెట్ల దర్శనం బ్లాక్ అవుతున్నాయని చెప్పి, పదివేల రూపాయల టికెట్లను అధికారికంగా బ్లాక్’లో విక్రయించే విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ధర్మారెడ్డికి దక్కుతుంది.

బ్లాక్ టికెట్ల కట్టడికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవలసిన టిటిడి, దొడ్డివారిని ఎంచుకుంది .

బ్లాక్ లో 10,000 రూపాయలకు విక్రయిస్తున్నారని, పదివేల టికెట్లను ప్రవేశపెట్టిన టీటీడీ బోర్డు, రేపు 20వేలకు వెళ్తుందని తెలిస్తే, 20,000గా నిర్ణయిస్తారా? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు .

ప్రతిరోజు ఈ టికెట్ల విక్రయం ద్వారా కోటి 50 లక్షల రూపాయల నిధులు వస్తున్నాయి.

ఈ నిధులను రాష్ట్రంలోని ఏ దేవాలయానికి ఎంత ఖర్చు చేశారో చెప్పాలి. దానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను ఏమైనా నిర్వహిస్తున్నారా అనేది టీటీడీ స్పష్టం చేయాలి.

రోప్ వే నిర్మాణం సరికాదు…

తిరుమలకు రోప్ వే ను నిర్మించాలని నిర్ణయించుకోవడం సరికాదు. . గతంలో రోప్ వే నిర్మించాలని నిర్ణయించుకున్న వారు దేవుడి ఆగ్రహానికి గురై, అడ్రస్ లేకుండా పోయారు.

ఇప్పుడు తిరిగి అదే తప్పిదాన్ని చేయవద్దు. తిరుమలకు రోప్ వే నిర్మాణం సరికాదని గతం లో ఈవోలు చెప్పారు. తిరిగి రోప్ వే నిర్మాణాన్ని చేపట్టాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి కోరడం హాస్యాస్పదంగా ఉంది.

వెంకటేశ్వర స్వామిపై భక్తి ఉంటే, ఇటువంటి నిర్ణయాలను మానుకోవాలి. లేకపోతే ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురిఅవుతారు. తిరుపతిలో అమ్యూజ్మెంట్ పార్క్, తిరుమలకు రోప్ వే అవసరమా అన్నది ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

ఇప్పటికే తిరుమలను వ్యాపారమయం చేశారు. ఇంకా ఇంకా వ్యాపారమయం చేయకండి.

హవ్వ… పది రోజులా?

వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారని ఉత్తర ద్వారాన్ని తెరవడం ఆలయ ఆరంభం నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ . వైకుంఠ ఏకాదశి నాడు

ఒక్కరోజే ఉత్తర ద్వారం తెరవడం ఎందుకనీ … పది రోజులపాటు ఉత్తర ద్వారాన్ని తెరువాలని నిర్ణయించడం విడ్డూరం. పది రోజులు మాత్రమే ఎందుకు?. 365 రోజులపాటు ఉత్తర ద్వారాన్ని తేర్చుకోండి. సి ఆర్ పి సి కి, రాజ్యాంగానికి ఎంతటి గౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో … మన ఆగమ శాస్త్రానికి ప్రభుత్వ పెద్దలు అంతే గౌరవాన్ని ఇస్తున్నారు.

బ్రహ్మోత్సవాలు కూడా సంవత్సరానికి ఒకసారి లేదంటే రెండు సార్లు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించ బడతాయి. బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు జరిగే గరుడ సేవకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. గరుడసేవను ఇప్పుడు ప్రతి నెల నిర్వహిస్తుండడం ఆగమ శాస్త్రానికి పూర్తి విరుద్ధం.

తిరుమలలో ఎన్ని రకాలుగా వ్యాపారమయం చేయవచ్చునో, అన్ని రకాలుగా వ్యాపారమయం చేశారు. రేపొద్దున తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి షేర్లను విక్రయిస్తారేమోనని భక్తుల ఆవేదన .

షిరిడి సంస్థాన్ సేవలు అద్భుతం

తిరుమల వెంకన్న కు భక్తుల ద్వారా లభించే ఆదాయం అంతా , ఆదాయం లభించకపోయినప్పటికీ భక్తులకు షిరిడి సాయి సంస్థాన్ కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. . షిరిడీలో డబ్బున్న భక్తులు ఇచ్చే విరాళాలతో పేద భక్తులకు కూడా మంచి సౌకర్యాలను కల్పిస్తున్నారు.

టీటీడీ పాలకమండలి మాత్రం… కేవలం ధనవంతులైన భక్తులకు మాత్రమే సౌకర్యాలను కల్పిస్తోంది.

షిరిడి సాయి సంస్థాన్ చేస్తున్న సేవలను చూసి, టిటిడి పాలకమండలి సభ్యులు బుద్ధి తెచ్చుకోవాలి. తిరుమల వెంకన్న ప్రపంచ దేశాల ప్రజలు ఆరాధించే దైవం. ముఖ్యంగా తెలుగు ప్రజలు నమ్ముకున్న ఏకైక దైవం. ఎన్నో కోట్ల మందికి శ్రీనివాసుడు ఇలవేల్పు. అటువంటి శ్రీవారి సన్నిధిని వ్యాపారమయం చేయవద్దు .

దేవదేవుని సన్నిధానాన్ని వ్యాపారమయం చేసి ఆయన ఆగ్రహానికి గురి కావొద్దని భక్తుల మనవి.

–మేడిశెట్టి కాలమ్ నుండి సేకరణ

మోడీ చేతుల మీదుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌19న ప్రారంభం

Spread the love