రంగన్న వాంగ్మూలం అంటూ గుప్పుమన్న ప్రచారం?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. వివేకా (Viveka) ఇంటి వద్ద కాపలాదారుగా పనిచేసిన భడవాండ్ల రంగన్న అలియాస్ రంగయ్య (Rangaiah) (65) న్యాయమూర్తి ఎదుట శుక్రవారం వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తున్నది. జమ్మలమడుగు (Jammalamadugu) జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బాబా ఫకృద్దీన్ దాన్ని నమోదు చేసికొన్నట్లు వార్తలు వస్తున్నాయి. సీబీఐ కేసు (CBI case) దర్యాప్తులో భాగంగా రంగన్నను పలుమార్లు ప్రశ్నించింది. ఆయన తెలిపిన వివరాలపై వాంగ్మూలం తీసుకునేందుకు వీలుగా సీబీఐ అధికారులు రంగన్నను న్యాయమూర్తి ఎదుట శుక్రవారం హాజరు పరిచారు. ఉదయం 11.30 గంటలకు మొదలైన వాంగ్మూలం నమోదు 12.45 వరకూ కొనసాగినట్లు తెలుస్తున్నది. ఆ సమయంలో న్యాయమూర్తి, రంగన్న మాత్రమే లోపల ఉన్నారు. ఇతరులను అనుమతించలేదు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రంగన్న సీబీఐ (CBI) అధికారులతో కలిసి వెళ్లిన పిదప. రాత్రి 8.30 సమయంలో రంగన్నను పులివెందుల బస్టాండు వద్ద విడిచిపెట్టినట్లు తెలుస్తున్నది. రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు ఉన్నాయని టీవీ ఛానెళ్లు, సామాజిక మాధ్యమాల్లో (Social Media) విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.