Janasena Malikipuram meetingJanasena Malikipuram meeting

నేరాలు చేసే వారికే వైసీపీ నాయకుల మద్దతు
పులివెందుల రౌడీయిజం, ఫ్యాక్షనిజాలకు పవన్ కళ్యాణ్ భయపడడు
కోనసీమ నుంచే జనసేన అభివృద్ధి ప్రస్థానం
ఉభయ గోదావరి జిల్లాలను ఆధ్యాత్మిక పర్యటక సర్క్యూట్ గా మారుస్తాం
కేరళ తరహాలో నాణ్యమైన విద్య అందిస్తాం
కనీస అవసరాలు తీర్చకుండా బటన్లు నొక్కితే సరిపోదు
టీటీడీ శ్రీవాణి ట్రస్టు విరాళాలపై జనసేన ప్రభుత్వంలో విచారణ
వారాహి విజయయాత్రలో భాగంగా మలికిపురం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్

Janasena Malikipuram meeting: ‘పాము ఆకలి వేస్తే ఎక్కడపడితే అక్కడ ఉన్న గుడ్లు తినేస్తుంది.. అప్పటికీ ఆకలి తీరకపోతే తన సొంత గుడ్లను సైతం తినేస్తుంది. తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము (anakonda) లాంటి వాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి (AP CM Jagan) అని జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విమర్శలు గుప్పించారు. ఈయన తన సొంత చిన్నాయననే మింగేశాడు. దళితులకు మేనమామ అని గొప్పలు చెప్పుకొంటూ వారికి చెందిన 23 పథకాలను రద్దు చేశాడు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా పథకం అని పెట్టాడు. ఈ ముఖ్య మంత్రి అంబేద్కర్ (Ambedkar) కంటే గొప్పవాడా? అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.

నాకు జెడ్ క్యాటగిరీ, పై క్యాటగిరీ సెక్యూరిటీ లేదు. ప్రభుత్వం ఇచ్చిన గన్ మ్యాన్ లేరు. నాకు రక్షణగా ఉన్నదల్లా వారాహి రథం, నా అన్నదమ్ములు, ఆడపడుచులు దీవెనలు మాత్రమే. నా మీద కానీ, జనసైనికుల మీద గానీ చిన్న చేయి పడ్డా, రాయి పడ్డా.. క్రిమినల్స్, బ్లేడ్, కత్తి బ్యాచ్ లకు ఒకటే చెబుతున్నాను జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు ఎక్కడున్నా వెతికి మరి బయటకు తీసుకొచ్చి మీ పని పడతాం. మాతో గొడవ పెట్టుకోవాలంటే 25 ఏళ్ల యుద్ధానికి సిద్ధమై మాత్రమే రండి’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నాయకులకు హెచ్చరికలు పంపారు. వారాహి విజయ యాత్రలో భాగంగా రాజోలు నియోజకవర్గం, మలికిపురంలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాజకీయం అంటే ఓ బాధ్యత. లక్షలాది మంది ఓటర్ల ఆకాంక్ష. కేవలం రాజకీయ స్వలాభం కోసం ఓ పార్టీ తరఫున గెలిచి, వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఇతర పార్టీల్లోకి వెళ్లే రాజకీయం సరికాదు. అందరి నిర్ణయం మీద గెలిచిన వ్యక్తి చివరి వరకు దానికి కట్టుబడి పనిచేయాలి. గెలిచిన ఒక్కడి నిర్ణయం పని చేయదు. ప్రజలు వేసిన ఓటును బోటుగా చేసుకొని ఎన్నికల సముద్రం దాటిన వ్యక్తి అవసరం తీరాక, ఆ తెప్ప తగలేస్తామంటే ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. కచ్చితంగా అలాంటి నాయకులను నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి. రీకాల్ చేసే అధికారం ప్రజలకు చెందాలి.

మన పార్టీ ఎదుగుదలలో ప్రజల ఆకాంక్ష ఉంది

జనసేన పార్టీ ఎదుగుదలలో అంతులేని ఆవేదనలు, గళమెత్తే గొంతులు, లక్షలాది జవాబులేని ప్రశ్నలు, అధికార దర్పం చూపిన అవమానాలు, న్యాయం దక్కని ఆక్రందనలు దాగున్నాయి. కేవలం 150 మందితో మొదలైన జనసేన ప్రస్థానం ఈ రోజు కేవలం రాజోలు నియోజకవర్గంలోనే 10,274 మంది క్రియాశీలక సభ్యుల సమూహంగా మారింది. బలమైన ప్రజా సిద్ధాంతం, సమస్యలపై రాజీలేని పోరాట భావజాలం అందరినీ కలిపింది. ఇదే జనసేన ఎదుగుదలలో ప్రత్యేక భూమిక పోషిస్తోంది. జనసేన పార్టీ ఏ అంశం మీద అయినా పోరాటానికి సిద్ధం అయితే ప్రభుత్వానికి ఎందుకు అంత భయం అంటే నిజాయతీనే నమ్ముకున్న వ్యక్తుల సమూహం రోడ్డు ఎక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇదే జనసేన పార్టీ బలం. ఓ గొప్ప మార్పు కోసం మొదలుపెట్టిన ప్రయాణంలో రాజోలు విజయం గత ఎన్నికల్లో ఎడారిలో ఒయాసిస్సు అయింది. ఈ గడ్డకు నేను రుణగ్రస్థుడ్ని.

నీడనిచ్చే జనసేన చెట్టును కాపాడుకుందాం

ప్రతి పార్టీలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలు సహజం. కొందరు వ్యక్తుల సమూహాన్ని నడిపించగలిగే వ్యక్తుల మధ్య పోటీ అనేది సాధారణం. అయితే జనసేన పార్టీ అంతర్గతంగానూ ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్మిన పార్టీ. ఎక్కువమంది ఆమోదం ఎవరికి ఉంటుందో, అందరి మన్ననలు పొందగలిగే వారికే ప్రాధాన్యం ఉంటుంది. జనసేన పార్టీ తన అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అనుసరించి నాయకులను ఎంపిక చేసినా, మిగిలిన వారికి సైతం అదే ప్రాధాన్యం ఇస్తుంది. మీలో మీరు ఎన్ని అనుకున్నా, మిమ్మల్ని నమ్మకున్న ప్రజలను మాత్రం నట్టేట ముంచకండి. అలాగే ఆశయాల కోసం ఎదుగుతున్న జనసేన పార్టీ అనే చెట్టు నీడను కాపాడుకుంటూ ప్రయాణం చేద్దాం. ఏ వైసీపీ నాయకుడికి భయపడాల్సిన పని లేదు. పూర్తిస్థాయిలో మీకు నేను అందుబాటులో ఉంటా. అవసరం అయితే నేనే వచ్చి మీ కోసం పోరాటం చేస్తాను.

ఏ హామీనీ నెరవేర్చని ముఖ్యమంత్రి

పదవి కాంక్షతో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేవలం బటన్లను నొక్కుతూ కాలక్షేపం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు వంటి కనీస అవసరాలను వైసీపీ ప్రభుత్వం తీర్చలేకపోతోంది. కొత్తతరం ఈ తీరును ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మలికిపురంలో కనీసం శ్మశానవాటిక కూడా లేదు. ఇలాంటి స్థానిక సమస్యలపై యువత చొరవ తీసుకొని నాయకులను ప్రశ్నించాలి. నాయకులకు కేవలం ఎన్నికల్లో ఓట్లే ప్రధానం కాదు.. అవి అయిపోయాక బాధ్యత లేకుండా మొఖం చాటేయడం సరికాదు. అభివృద్ధిని ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొదలుపెట్టాలి.

ప్రజలు కూడా ఇష్టానుసారం హామీలు ఇచ్చి తర్వాత మొహం చూపించని వారిని నమ్మకుండా, ఎవరు సంపూర్ణంగా మన కోసం చివరి వరకు నిలబడతారో అనేది ఆలోచించాలి. విద్యా, వైద్యం, ఉపాధి ఎవరు చూపగలరో, కట్టుబడగలరో అర్ధం చేసుకొని జనసేనకు అండగా నిలబడండి.

నేను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను. మనసులో ఏముంటుందో అదే చెబుతాను. నేను పదేపదే సినిమా హీరోల అభిమానులంతా నాకు ఇష్టం అని చెబుతున్నాను అంటే అది మనసులో నుంచి వచ్చిన మాట. ఓ సినిమా హీరో వల్లనే సినీ పరిశ్రమ బతకదు. అందరి కలయిక, కష్టం దానిలో ఉంది. ఒక్క సినిమా మొదలుపెడితే రోజూ 500 మందికి ఉపాధి దొరుకుతుంది. పన్నులు కట్టి నిజాయతీగా సంపాదించే హీరోలు వచ్చిన డబ్బులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అందరి హీరోల సినిమాలు లాభాల బాట పడితే పరిశ్రమ బాగుంటుంది. ఎందరికో ఉపాధి దొరుకుతుంది. అందుకే నాకు అందరికీ ఉపాధి చూపే హీరోలంటే గౌరవం. ఇష్టం.

15 రోజుల్లో రోడ్డు వేయండి.. లేదంటే శ్రమదానం చేస్తాం

మా పార్టీలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేకు స్థానిక సమస్యలు పట్టవు. రాజోలు బైపాస్ రోడ్డు అధ్వానంగా ఉంది. గర్భీణీలు, వృద్ధులు ఆ దారిలో వస్తే చాలా ప్రమాదం. పెద్ద గుంతలతో అత్యంత అధ్వానంగా ఉన్న ఆ రోడ్డును ప్రభుత్వం వెంటనే స్పందించి బాగు చేయించాలి. 15 రోజుల్లో రోడ్డు వేయాలి. లేకుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రమదానం చేసి రోడ్డు నిర్మించుకుంటాం. మళ్లీ చెబుతున్నాం… 15 రోజుల సమయం ఇస్తున్నాం.

హవ్వా…. రూ.700 కోట్ల ప్రతిపాదనకు రూ. కోటి మంజూరా..?

ఈ ముఖ్యమంత్రి ఏమైనా అంటే బటన్లు నొక్కానని చెబుతారు. సఖినేటిపల్లి నుంచి నరసాపురం వెళ్లాలంటే ప్రమాదకరంగా పంటు మీదనే దాటాలి. అక్కడ బ్రిడ్జి కావాలనేది స్థానికుల 40 ఏళ్ల నాటి కల. ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపనలు చేసినా, నేటికి పూర్తి కాలేదు. కనీస అవసరం అయిన బ్రిడ్జిలు వేయకుండా నేను బటన్లు నొక్కుతున్నాను అంటే ఎవరికి ప్రయోజనం..? గోదావరి వరద తాకిడికి గురై ఏటి గట్లు కోతకు గురయ్యాయి. గత వరదల్లో జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ రెడ్డి గోదావరి గట్ల పటిష్టం చేస్తామన్నారు. దీని కోసం రూ.700 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటి వరకు రూ.కోటి మాత్రమే విడుదల అయింది. మరోసారి గోదావరికి భారీ వరద వస్తే గట్లు తెగి, కొన్ని గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అంతర్వేదితో పాటు చుట్టుపక్కల గ్రామాలు గంగలో కలిసిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

వరదల్లో కడుపు నింపిన వారికి బిల్లులు ఇవ్వని దుర్మార్గపు ప్రభుత్వం

ఇటీవల గోదావరి వరదల్లో అప్పటికప్పుడు ఆహారం వండి, సరఫరా చేసిన హోటల్, చిన్నపాటి క్యాటరింగ్ నిర్వాహకులకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదు. పి.గన్నవరంలో ఓ హోటల్ యజమానికి రూ.7 లక్షలు, మరో క్యాటరింగ్ నిర్వహకుడికి రూ.50 వేలు, మరో కాకా హోటల్ నిర్వహణ చేసుకునే వ్యక్తికి రూ.10 వేలు కూడా ఇవ్వలేకపోయింది. ఆపత్కాలంలో అడ్వాన్సులు కూడా అడగకుండా అధికారులు చెప్పిన వెంటనే ఆహార పొట్లాలు పంపిణీ చేసిన వారికి బిల్లులు ఎగ్గొట్టే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి..? మా డబ్బులు మాకు ఇవ్వమని ధర్నా చేస్తే, కేసులు పెట్టి వేధించే పాలకులను ఏ పేరుతో పిలవాలి..?
‘మీ స్టిక్కర్లు ఎవడికి కావాలి? మాట్లాడితే ఇంటింటికీ స్టిక్కర్లు వేస్తున్నాం అంటారు… దానికి ప్రజాధనం ఖర్చు చేస్తారు. మీ స్టిక్కర్లు ఎవడికి కావాలి..? విపత్తు సమయంలో స్పందించిన వారికి బిల్లులు ఇవ్వండి. ఈ ప్రభుత్వాన్ని దేని మీద ప్రశ్నించకూడదు.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు. ఏం చేసినా కేసులు పెట్టి వేధిస్తారు.. హింసిస్తారు.

మీ రౌడీ గ్యాంగులు పులివెందులలో పెట్టుకోండి

అమలాపురం నుంచి దిండికి వస్తుండగా మార్గమధ్యంలో నలుగురు ఆగంతకులు రాళ్లతో దాడి చేయడానికి సిద్ధమై మా సెక్యూరిటీకి కనిపించారు. వెంటనే అప్రమత్తమై వారిని పోలీసులకు అప్పగించాం. ఇలాంటి నీచమైన తెలివితేటలు వైసీపీ రౌడీ గ్యాంగులు పెట్టుకుంటే ఊరుకునేది లేదు. మీ ఫాక్షన్, యాక్షన్ పులివెందులలో చూపించుకోండి. గోదావరి జిల్లాల్లోకి దాన్ని తీసుకొస్తే తన్ని తగలేస్తాం. ఓ పక్క కనీస గిట్టుబాటు ధర లేక రైతు ఏడుస్తుంటే, వారి దిగుబడిలో ప్రతి బస్తాలో రూ.100 ద్వారంపూడి ఖాతాలోకి వెళ్తుంది. ఇలాంటి వాటిని బయట పెట్టాననే కోపంతో క్రిమినల్ గ్యాంగులను దించితే నేనేంటో చూపిస్తా. ఇప్పటి వరకు వైసీపీ నాయకులు రాజకీయ నాయకులను చూసి ఉంటారు.. కాస్త బెదిరిస్తే బెదిరిపోయి సలాం చేసే వారిని కలిసి ఉంటారు.

నేను అలాంటి రాజకీయ నాయకుడిని కాదు.. నేనో విప్లవ వీరత్వం నింపుకున్న రాజకీయాలు చేయడానికి వచ్చిన వాడిని. రౌడీలకు, గూండాలకు, ఫాక్షన్ చేసే వారికి భయపడేవాడిని అసలు కాదు. జగన్ రెడ్డి అన్నా, వైసీపీ అన్నా నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. పాలనలో, పద్ధతిలో నేనే సర్వధికారిని అని.. ప్రజలంతా నా కట్టుబానిసలు అనుకునే మీ నాయకుడి మనస్తత్వం, మీ పార్టీ విధానాల మీదనే నా ద్వేషం. ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయకూడదు.. మమ్మల్ని ఎవరూ ఎదురించకూడదు అన్న మీ తీరుతోనే నా పోరాటం.

నేరాలు చేసే వారికి వైసీపీ వంత పాడుతోంది

అంతర్వేది రథం ఓ పిచ్చోడు చర్య వల్ల కాలిపోయింది అని చెప్పారు. తర్వాత ఆ పిచ్చోడు విశాఖ ఆస్పత్రిలో మృతి చెందాడు. అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి ఆలయ నిర్వాహణకు శ్రీ కొప్పనాతి కృష్ణమ్మ గారు ఇచ్చిన 1800 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయింది. అంతర్వేది రథం దగ్ధంతోపాటు వరుసగా రాష్ట్రంలోని 219 ఆలయాల మీద దాడులు జరిగినా పోలీసుల్లో చలనం లేదు. 15 ఏళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా పెట్రోలు పోసి తగులబెడితే వైసీపీ నాయకుడు రాజీకి వెళ్తాడు… ఓ బాలిక మీద అత్యాచారం జరిగితే సాక్షాత్తూ హోం మంత్రి పిల్లల పెంపకం బాగాలేదని చెబుతారు. ఇలా ప్రతి విషయంలోనూ నేరస్తులను వెనకేసుకొచ్చేలా వైసీపీ పాలన ఉండటంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత ఘోరంగా మారుతున్నాయి.

జనసేన ప్రభుత్వంలో ఆడపిల్ల మీద నేరం చేయాలంటే భయపడే చట్టాలు తీసుకొస్తాం. కోనసీమలో గల్ఫ్ బాధితులు అధికం. ఏజెంట్లను నమ్మి గల్ఫ్ వెళ్లి అక్కడ పడరాని పాట్లు పడుతున్నారు. జనసేన ప్రభుత్వంలో గల్ఫ్ బాధితులకు అండగా ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖతో అనుసంధానం చేసే ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తాం. కచ్చితంగా బాధితులకు తోడుగా నిలుస్తాం.

ముస్లింలకు ఉర్దూ మీడియం తీసుకొస్తాం

బీసీల కోసమంటూ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా ప్రభుత్వం… వాటికి నిధులు కేటాయించడం మరచిపోయింది. రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికే ప్రాధాన్యత ఇచ్చింది. గోదావరి జిల్లాల్లో కులాల మధ్య ఘర్షణలు నివారిస్తే తప్ప అభివృద్ధి జరగదు. అంతర్వేది రథం దగ్ధం, రామతీర్ధాల్లో రాముడు తల నరికేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆనాడు నేను నిరసన తెలిపితే నాకు మద్దతుగా ముస్లిం సమాజం అండగా నిలిచింది. ధర్మ సంరక్షణ కోసం అండగా నిలబడిన ముస్లిం సమాజానికి మాట ఇస్తున్నాను. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పిల్లలకు ఉర్దూ మీడియాలో విద్యను అందించే ఏర్పాటు చేస్తాం. షాదీఖానాలు నిర్మిస్తాం. శ్మశానవాటికలు నిర్మిస్తాం.

వ్యక్తుల తప్పులు కులాలకు అంటుకుంటున్నాయి

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన పాత కార్ డ్రైవర్ ను చంపేసి డోర్ డెలివరీ చేశాడు. పోలీస్ వ్యవస్థ ఎమ్మెల్సీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలి. కానీ అలా జరగలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ క్రిమినల్ సిండికేట్ ద్వారంపూడి ఆశ్రయం కల్పించాడు. చంపిన ఎమ్మెల్సీ కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. చంపబడిన వ్యక్తి దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.

ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయనకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మద్దతు బలంగా ఉంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోతే సమాజంలో కుల ఘర్షణలు మొదలవుతాయి. మా దళితుడిని కాపులు చంపేస్తే రెడ్లు మద్దతు ఇచ్చారని మాట్లాడుకుంటారు. వ్యక్తులు చేసిన తప్పులు కులాలకు అంటుకుంటాయి. అనంతబాబు ఏ కులం వాడైనా ఆయన చేసింది తప్పే… ఆయనకు శిక్ష పడాల్సిందే. వ్యక్తులు చేసిన తప్పులను పూర్తిగా కులానికి ఆపాదించి చూడకండి. ఇలా అయితే సమాజం కులాల వారీగా విడిపోతుంది.

యువతను గంజాయి మత్తులో ముంచుతున్నారు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ద్వారంపూడి శాసిస్తున్నాడు. నాన్న పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్, తమ్ముడు రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు, ఎగుమతులు చేసే కంపెనీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఇలా కుటుంబం మొత్తం మూకమ్మడిగా దోచేస్తున్నారు. జిల్లాలో ఏ మూల అన్యాయం జరిగినా దాని మూలాలు, వేళ్లు ద్వారంపూడి వైపు చూపిస్తున్నాయి. రాజోలులో రోడ్లు లేవు కానీ.. గంజాయి సరఫరాలో మాత్రం దూసుకుపోతోంది. విద్యా, వైద్యం, ఉద్యోగ అవకాశాలపై ప్రశ్నించకుండా వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయి మత్తులో ముంచుతోంది. ప్రధాన మంత్రిని విశాఖలో కలిసినప్పుడు వైసీపీ దౌర్జన్యాల గురించి చెబుదాం అనుకున్నాను. ఫిర్యాదు చేయడం చిరాకు అనిపించి చేయలేదు. నా నేల కోసం నా యుద్ధం నేనే చేయాలని వైసీపీపై ఫిర్యాదు చేయలేదు.

శ్రీవాణి ట్రస్ట్ అవకతవకాలపై విచారణ జరిపిస్తాం

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదని శ్వేతపత్రం విడుదల చేశారు. ఒక తెల్లకాగితం చూపించి సుబ్బారెడ్డి చెప్పిన మాటలు ఎలా నమ్ముతాం..? వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటు అని చెప్పిన కుటుంబం మీది. అలాంటిది మీరు విడుదల చేసే శ్వేత పత్రం నమ్ముతామా..? జనసేన ప్రభుత్వం వచ్చాక నిపుణులతో కమిటీ వేసి శ్రీవాణి ట్రస్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తాం. అవినీతికి పాల్పడిన అందరికీ శిక్ష పడేలా చేస్తాం. అలాగే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది పురోహితులు ఉన్నారు. వారిలో చాలా మందికి పూట గడవడం కష్టంగా ఉంది. దేవాదాయ శాఖ సొమ్ముతో ఎక్కడో పక్క రాష్ట్రాల్లో దేవాలయాలు నిర్మిస్తున్నాం అని గొప్పగా చెబుతున్నారు. హిందూ సమాజం నుంచి వచ్చిన సొమ్మును అర్చక సమాజానికి అందించి వారిని ఆదుకోండి.

మీ దోపిడిని అడ్డుకోకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలవదు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకుండా నేను చూసుకుంటాను. ఇది నా కర్తవ్యం, ధర్మం. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో కులాల మధ్య చిచ్చు పెట్టారు. రైతులకు మద్దతు ధర లేకుండా చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని దూరం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు. ఈ ప్రాంతంలో ఇసుకను దోచేయడం తప్ప ఈ ప్రాంతానికి ఏం చేశారు? జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆర్థికంగా అండగా నిలిచినందుకు బహుమతిగా ఇసుక వ్యవహారం మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కట్టబెట్టారు. ప్రభుత్వంలో ఉన్న ఫ్యాక్షనిస్టులు, క్రిమినల్ గ్యాంగ్స్ ఒకటే చెబుతున్నాను… మీ దౌర్జన్యాలను, దోపిడీలను అడ్డుకోకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాలంటే మాస్టర్ ప్లాన్ ఉండాలి. జనసేన అధికారంలోకి వస్తే ముందుగా రహదారులు, వంతెనలు, రైల్వేలైన్లను పూర్తి చేస్తాం. ఓర్టీసీ, గెయిల్, రిలయన్స్, వేందాత వంటి ఆయిల్ కంపెనీల్లో 70 శాతం యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేస్తోంది. అలాగే ఆ ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్ డెవలప్ చేయడానికి విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తాం. కేరళ తరహాలో క్వాలిటీ విద్యను అందిస్తాం. ఇంగ్లీషు మీడియంతో పాటు తల్లిలాంటి మాతృభాషలో విద్యను అందించే ఏర్పాట్లు చేస్తాం. పచ్చని కోనసీమ జిల్లాను పర్యాటక కేంద్రంగా, ఉభయగోదావరి జిల్లాలను ఆధ్యాత్మిక పర్యటక సర్క్యూట్ గా తీర్చిదిద్దుతాం. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల హెల్త్ ఇన్సురెన్స్ చేయిస్తాం. దీనికి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేలా ఆలోచన చేస్తున్నాం.

షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 500 మంది చొప్పున యువతను, దామాషా పద్ధతి ప్రకారం ఎంపిక చేసి రూ. 10 లక్షలు ఆర్థికసాయం అందించి వారిని పారిశ్రామిక వేత్తలుగా మార్చడంతో పాటు పదిమందికి ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దుతాం.

ఈ ముఖ్యమంత్రి విజయవాడ నుంచి తాడేపల్లికి సైతం హెలికాప్టర్ లో తిరుగుతాడు. కిందనున్న పచ్చటి చెట్లను కొట్టించిస్తాడు. ఇలాంటి వ్యక్తికి సాధారణ ప్రజలు పడుతున్న బాధలు అర్ధం కావు. అధికారుల అవినీతిని అడ్డుకోవడానికి ఏసీబీ ఉంది. అలాగే నాయకుల అవినీతిని అడ్డుకోవడానికి ప్రజలే ప్రత్యేకంగా పీపుల్స్ ఏసీబీలా తయారవ్వాలి. ప్రజల కష్టాలు, కన్నీళ్లు, ఆవేదన తీర్చేందుకు ప్రత్యేకంగా దేవుడు రాడు. మన కష్టాలను మనమే తీర్చుకోవాలి. దైవం మానుష రూపేణా అన్నది మనమంతా బలంగా నమ్మి.. ఈ రాక్షస పాలనను అంతమొందించేందుకు ఒక్కటి కావాలి” అని జనసేనాని పవన్ kalyan తెలిపారు.

అవకాశవాది ముద్రగడ పద్మనాభంతో కాపుల్లోముసలం!

Spread the love