Pawan Kalyan with Balayya LokeshPawan Kalyan with Balayya Lokesh

ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగు కోసం, భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం
భారతీయ జనతా పార్టీ కచ్చితంగా కలిసి వస్తుందని నమ్మతున్నాం.
రాక్షస పాలనను అంతమొందించాలంటే సమష్టి పోరాటం తప్పదు
జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి కార్యాచరణ మొదలవుతుంది.
జగన్ ను నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే
జగన్ మహానుభావుడేమీ కాదు… అతనో ఆర్థిక నేరారోపణలు ఉన్న వ్యక్తి
అధికారులు దీనిని గుర్తుంచుకోండి
వచ్చే ప్రభుత్వంలో ఇప్పుడు జరిగే ప్రతి తప్పును బయటకు తీస్తాం
వైసీపీ గూండాలెవరినీ వదిలేది లేదు.
రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబుని పరామర్శించిన పవన్ కళ్యాణ్

జనసేన (Janasena), తెలుగు దేశం (Telugudesam) పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీ (YSRCP) వెన్నులో వణుకు పుట్టింది అని చెప్పాలి. ‘ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) భవిష్యత్తు కోసం… ప్రజల బాగు కోసం జనసేన, తెలుగుదేశం పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసే వెళ్తాయి. ఇది మా రెండు పార్టీల భవిష్యత్తు కోసమో, ఇతర అవసరాల కోసమో కాదు. నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ అరాచక పాలన సాగిస్తోంది. ఈ విద్వేష పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన పోవాలన్నదే మా ఆకాంక్ష’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి, నాకు మధ్య కొన్ని పాలనాపరమైన సైద్ధాంతిక బేధాలున్నప్పటికీ, గతంలో విడివిడిగా పోటీ చేసినప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, ఈ రాక్షస పాలనను తరిమికొట్టేందుకు సమష్టిగా పోరాడేందుకు నిర్ణయించుకున్నామన్నారు. ఈ పోరాటంలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తుందని బలంగా నమ్ముతున్నాను.. విశ్వసిస్తున్నాను.. అదే జరుగుతుంది అని అనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై బీజేపీ అగ్రనాయకులకు పూర్తి సమాచారం ఉందని తెలిపారు. జనసేన ఎన్టీఏ పక్షంలోనే కొనసాగుతున్నది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కలిసికట్టు పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని నమ్ముతున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడిని పరామర్శించేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం రాజమండ్రికి విచ్చేశారు.

చంద్రబాబు ములాఖత్ నిమిత్తం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలతో కలిసి వెళ్లారు. సుమారు 40 నిమిషాల పాటు ములాఖత్ అయిన అనంతరం పవన్ కళ్యాణ్ జైలు బయట మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినపుడు కనీసం రాజధాని కూడా లేని సమయంలో సాధించుకోవాల్సిన అంశాలను వదిలేశాం. యూపీఏ ప్రభుత్వం కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయలేదు. 2014లో శ్రీ నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలిపాను. ఆయన బలమైన నాయకత్వం దేశానికి అవసరం అని భావించాను. 2014లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడానికి కూడా అప్పటి విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నాను. పాలసీ పరంగా చంద్రబాబు గారితో విబేధాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా ఆయన ఆలోచన తీరును, స్థాయిని నేను ఎప్పుడూ తక్కువ చేయలేదు.

తప్పు జరిగితే సంబంధిత వ్యక్తులను బాధ్యులను చేయండి

ఓ బ్యాంకులో ఎక్కడో చిన్న తప్పు జరిగితే ఆ బ్యాంకు ఛైర్మన్ కు అంటగడతారా. అలాగే పాలనలో ప్రతి నిర్ణయానికి ముఖ్యమంత్రి సంతకం చేయడు… తీసుకోడు. 2013లో మొదలైన గుజరాత్ లో మొదలైన స్కిల్ డవలప్మెంట్ సంస్థ ఆంధ్రాకు మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చి ఉండొచ్చు. దానిలో రూ.317 కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారు. ఈ ప్రక్రియలో జరిగిన తప్పులకు బాధ్యులైన వారిని చట్టం శిక్షించాలి. సైబరాబాద్ లాంటి ఓ పెద్ద సిటీనే నిర్మించిన ఓ వ్యక్తిని రూ.317 కోట్ల అవినీతికి ముడిపెట్టి బలి పశువు చేయడం దారుణమైన విషయం. దీన్ని ఈడీ విచారించాలి కానీ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్సాహం ఎందుకు..? దీనిని నడిపిస్తున్న వ్యక్తే బలమైన ఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్న వ్యక్తి. చంద్రబాబు గారిపై అభియోగాలు మోపిన వ్యక్తి మహానుభావుడేమి కాదు. ఆర్ధిక నేరాల్లో కేసులు ఎదుర్కొంటూ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి కోర్టు అనుమతి తీసుకొని కాలు బయటపెట్టే వ్యక్తి. రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం లేకుండా, వ్యవస్థలను, ప్రజల్ని భయభ్రాంతులను చేసి నాశనం చేసి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.

బురదలో కూరుకుపోయి.. ఆ బురద అందరిపై జల్లుతున్నాడు

ఎన్నికల ముందు అధికార వ్యామోహంతో అడ్డగోలుగా హామీలు ఇచ్చిన వ్యక్తి తర్వాత వాటిని పూర్తిగా విస్మరించాడు. మద్యపాన నిషేధం అని, సీపీఎస్ రద్దు అని, 2 లక్షల 60 వేల ఉద్యోగాల భర్తీ అని మాటలు చెప్పిన వ్యక్తి ఆంధ్ర ప్రజల్ని నిలువునా మోసం చేశాడు. మద్యపాన నిషేధం అని చెప్పి కొత్త రకాల బ్రాండ్లతో, డిజిటల్ పేమెంట్లు లేకుండా చేసి వేల కోట్ల రూపాయాలు దోచుకున్నాడు. మద్యం అమ్మకాల్లో మూడోవంతు భాగం జేబులో వేసుకున్నాడు. ఇసుకను, సహజ వనరులను కాజేస్తూ సంక్షేమం అంటూ నాటకాలాడుతున్నాడు. అవినీతి, అక్రమాలతో రికార్డులు సృష్టించి పూర్తి స్థాయి బురదలో కూరుకుపోయిన వ్యక్తి… తనపై పడిన బురదను తీసి అందరిపై వేస్తున్నాడు. అందరికీ ఆ బురద అంటించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అడ్డగోలుగా సహజ సంపదనలు కొల్లగొట్టి రాష్ట్రాన్ని డొల్లగా మారుస్తున్నాడు.

శాంతిభద్రతలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది

వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రశ్నించే వారిపై కేసులు… నిరసన తెలిపే వారిపై వైసీపీ దాడులు అనేలా పరిస్థితి తయారైంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని గౌరవించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చింది. రాజ్యాంగంపై గౌరవం లేని వైసీపీ రాష్ట్రంలో ప్రాధమిక హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ జీ హుజూర్ అనాలంటే ఎలా..? ప్రజాదరణ నిండుగా ఉన్న నాలాంటి వాడినే రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి..?

అధికారులు కూడా దీనిపై ఆలోచించాలి. నిబంధనలు అమలు చేయాలి కానీ… ఎవరో చెప్పినట్లు తల ఆడించకూడదు. కారులో నుంచి బయటకు రాకూడదు… ప్రజలకు అభివాదం చేయకూడదు.. కనిపించకూడదు అనే వింత నిబంధనలు తీసుకురాకండి. 2020లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని నేను చెప్పిన దగ్గర నుంచి ముఖ్యమంత్రికి అభద్రతా భావం వచ్చేసింది. 30 సంవత్సరాలు పాలన చేయాలని కలలు గన్న ఆయనకు ఆ మాట చాలా భయపెట్టింది. పాలన చేతకాక, ఇష్టానుసారం తప్పులు చేస్తూ ముందుకెళ్తున్న వ్యక్తిని నిలువరించాలంటే కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని నేను భావించాను. రాక్షసంగా పాలిస్తున్న ఈ వ్యక్తి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే సమష్టిగా ముందుకు వెళ్లి పోరాడాలనే భావంతోనే ఆ మాట చెప్పాను. అడ్డగోలుగా రాష్ట్రం దోచేసి, నేరస్థులకు వత్తాసు పలుకుతున్న ఈ వైసీపీ పాలనపై విసుగొచ్చి మాత్రమే ఆ మాట చెప్పాను.

రూ.22వేల కోట్ల డ్రగ్స్ కేసు ఏమైంది?

గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీగా దొరికిన మాదకద్రవ్యాల కేసులో మూలాలు విజయవాడలోని సత్యనారాయణపురం కేంద్రంగా జరిగినట్లు తేలింది. సుమారు రూ.22 వేల కోట్లకు సంబంధించిన ఈ కేసులో పోలీసులు ఎవరినీ పట్టుకోలేకపోయారు. ఈ కేసును విచారణ చేయలేకపోయారు. ఈ కేసును వదిలేశారు. రాజకీయాలకు అతీతంగా పోలీసులు వ్యవహరించాలి. అధికార పార్టీకి ఒకలా… విపక్షాలకు మరోలా చట్టం వర్తించదు. ప్రస్తుతం శ్రీ చంద్రబాబు గారిపై జరిగే దాడి లాంటిదే రేపు మనకు జరగొచ్చు. వైసీపీకి ఎవరు అడ్డు వస్తే వారిని అడ్డు తొలగించుకోవడానికి వ్యవస్థలను వాడుకుంటుంది. వైసీపీ విధానాలను ప్రశ్నిస్తే ఇటీవల విశాఖలో వీర మహిళలపై పోలీసులు సెక్షన్ 307 కేసులు పెట్టారు. నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏమిటో అర్ధం కాలేదు. ఇప్పుడు చంద్రబాబు గారి కేసులో కూడా పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయండి. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. కచ్చితంగా చంద్రబాబు గారిపై మోసిన కేసు తీవ్రమైన రాజకీయ వేధింపుల కేసుగానే నేను భావిస్తున్నాను.

ఈ ములాఖత్ ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది

చంద్రబాబుతో ములాఖత్ అయి, సంఘీభావం తెలిపి నేను వెళ్లిపోవాలి అనుకోవడం లేదు. ఈ కలయిక కచ్చితంగా ఆంధ్ర ప్రజల భవిష్యత్తు బాగు కోసం ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో పోటీచేసినట్లుగా ఎన్టీఏ కూటమిలోని జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి వెళ్లాలని భావించాను. దీనిపై అనేకసార్లు బీజేపీ పెద్దలను కలిసి చెప్పాను. దీనిపై వారు తగు నిర్ణయం తీసుకుంటారు. ఈ దుష్ట పాలనను అంతమొందించాలంటే కచ్చితంగా సమష్టిగా పనిచేయాలి. ప్రజలు వైసీపీ పాలన పట్ల వేదనతో ఉన్నారు. వారి కోసం కచ్చితంగా ఈ పాలన చెర నుంచి ప్రజలను కాపాడాలంటే వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసే వెళ్తాయి. శ్రీ చంద్రబాబు గారు రాజకీయవేత్త అయితే జగన్ ఆర్థిక నేరస్థుడు.

వైసీపీ క్రిమినల్స్… గుర్తు పెట్టుకోండి

ఓ పార్టీ నడుపుతూ, రాష్ట్రంలో సమావేశం నిమిత్తం పార్టీ కార్యాలయానికి వస్తున్న నన్ను రాష్ట్ర సరిహద్దులో ఆపేయాలని ప్రయత్నించారు. వెనక్కు వెళ్లాలని ఆదేశించారు. వైసీపీ నాయకులు అనుకున్నది జరగాలి… రాజకీయ ప్రత్యర్థులను బెదిరించాలన్నదే జగన్ విపరీత మనస్తత్వానికి పరాకాష్ట. కోనసీమలో జరిగిన వారాహి విజయయాత్రలోనూ 2 వేల మంది క్రిమినల్ గ్యాంగులను దింపారు. అలజడి సృష్టించి భయపెట్టాలని భావించారు. పుంగనూరులో శ్రీ చంద్రబాబు గారి సభలో గాని, భీమవరంలో శ్రీ లోకేష్ గారి పాదయాత్రలో కానీ అలజడులు సృష్టించాలని ప్రయత్నించిని వైసీపీకి మద్దతు తెలుపుతున్న క్రిమినల్స్ ప్రతి ఒక్కరినీ బయటకు లాక్కోస్తాం. వచ్చే ప్రభుత్వంలో వెంటపడి మరీ పట్టుకుంటాం. ఏ ఒక్కరినీ వదిలేది లేదు.

హిట్లర్ నాజీ సైన్యాన్ని యూదులు ఎలా వెంటపడి మరీ పట్టుకొని, శాస్తి చేశారో మీకు అలాంటిదే జరుగుతుంది. ఇదే నా హెచ్చరిక. రాజకీయాల్లో పట్టు విడుపులు ఉంటాయని తెలుసుకోవాలి. జగన్ తీసుకొచ్చిన ఈ సంప్రదాయం అందరికీ వర్తిస్తుంది. రేపు పొద్దున్న జగన్ తీసుకొచ్చిన ఈ కొత్త సంప్రదాయం మాజీ డీజీపీలు, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, నాయకులు అందరికీ వర్తిస్తుంది. గతంలో ఎప్పుడో జరిగిన విషయాల మీద జగన్ తీసుకొచ్చిన ఈ ధోరణి మిగిలిన వారికి వర్తించదు అని గ్యారెంటీ లేదు. జగన్ రెడ్డిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే. దీనిని అధికార యంత్రాంగం అంతా గుర్తించాలి. సొంత బాబాయిని చంపేసిన వారికి వంత పాడుతూ… చెల్లికి కనీస సాయం చేయని ఈ వ్యక్తిని నమ్మి మీరు ముందుకు వెళితే మొత్తం మునిగిపోతారు జాగ్రత్త. ఈ వైసీపీ పాలనకు 6 నెలల సమయమే ఉంది. పోలీసుల మీద నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడను. కానీ పోలీసులు కూడా శ్రుతి మించి, వైసీపీ నాయకులు చెబుతున్నట్లుగా చట్టాన్ని అమలు చేస్తే మాత్రం మాట్లాడక తప్పదు. * నీకు యుద్ధం కావాలంటే చెప్పు జగన్… సిద్ధంగా ఉన్నాం.

రాష్ట్ర సరిహద్దులో సివిల్ వార్?

మొన్న రాష్ట్ర సరిహద్దులో నన్ను పోలీసులు నిలువరించాలని చూసిన సంఘటన సివిల్ వార్ ను తలపించింది. చట్టాలను అమలు చేసే పోలీసులు కూడా బానిసత్వంగా ఉంటే, వారి బాధ్యతలను ప్రజలే చేతుల్లోకి తీసుకుంటారు. చాలా బాధ్యత గల వ్యక్తిని కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను. జగన్ నీకున్న 6 నెలల సమయంలో తప్పులను సరి చేసుకోండి. వారి మద్దతుదారులు కూడా ఈ ఆరు నెలల సమయంలో మారండి. మీరు చట్ట అతిక్రమణ కాదు.. అంతకు మించి మొత్తం వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. అలా కాదు మాకు ప్రజా యుద్ధమే కావాలి… అనుకుంటే చెప్పండి. మీకు యుద్ధం కావాలంటే మీకు యుద్ధమే ఇస్తాం. వచ్చే ప్రభుత్వంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. ఇసుక దోపిడీదారులు, అడ్డగోలు మైనింగ్ చేసేవారు… బెల్టు షాపులు నిర్వహించే వారు అంతా జాగ్రత్తగా ఉండండి.

ఓ మాజీ ముఖ్యమంత్రిని జైలులో పెట్టారు. మీరెంత. జగన్ అనే వ్యక్తిని నమ్మి మొత్తం జీవితం నాశనం చేసుకోకండి. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన, తెలుగుదేశం కలిసి ముందుకు వెళ్లబోతున్నాయి. ములాఖత్ సమయంలో చంద్రబాబు ని మీ ఆరోగ్యం ఎలా ఉంది.. ఇలా జరగడం పట్ల నా విచారం వ్యక్తం చేశాను. ఆయన ఆరోగ్యాన్ని జైలు అధికారుల వద్ద వాకబు చేశాను.

నిన్నటి వరకు జనసేన, తెలుగుదేశం కలిసే విషయంలో నిర్ణయం తీసుకోలేదు. అయితే మీలాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి వచ్చినపుడు, రాష్ట్రం అధోగతి పాలవుతుంటే చూస్తూ ఊరుకోలేనని చెప్పాను. ఆ నిర్ణయాన్నే రాష్ట్ర ప్రజల సమక్షంలో వెల్లడించాను. రేపటి నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీ ల ఉమ్మడి కార్యాచరణను మొదలుపెడతాం. ఉమ్మడి ప్రణాళికతోపాటు రాష్ట్ర పరిస్థితిని కేంద్ర పెద్దలకు, గవర్నర్ కు తెలియజేస్తాం. రాజ్యాంగ ఉల్లంఘనలను వారి దృష్టికి తీసుకెళ్తాం. జైలులో శ్రీ చంద్రబాబు గారి భద్రతపై కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ కి, అమిత్ షా దృష్టి సారించాలని కోరుతాం” అని జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు.

పవన్ అన్నా సమయం మించిపోతున్నది: అక్షర సందేశం