AP CM jaganAP CM jagan

త్వరలో ఏపి కేబినెట్ విస్తరణపై ప్రత్యేక కథనం

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) పై రాజకీయ వర్గాల్లో కాక రేపుతున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి వర్గ విస్తరణకి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సరిగ్గా రెండున్నరేళ్ల తరువాత మంత్రి వర్గ విస్తరణ చేపడతానని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చెప్పారు. చెప్పడమే కాదు మంత్రివర్గంలోకి తొలుత తీసుకున్న మంత్రులందరి వద్దా  మార్పులు, చేర్పులూ, కూర్పులకి కట్టుబడి ఉంటామనే విధంగా ప్రమాణ పత్రాలూ తీసుకొన్నారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది కూడా.

ప్రస్తుత కాబినెట్ పరిస్థితి?

ప్రస్తుతానికొస్తే పద్దెనిమిది మందికి పైగా మంత్రులకి ఉద్వాసన తప్పదని, క్రొత్తవారికి ఛాన్స్ ఇస్తారనీ అలాగే కొన్ని సామాజిక వర్గాలకి పెద్ద పీఠ వేస్తారని తెలుస్తోంది. తొలి దఫాలో తన స్వంత సామాజిక వర్గం నుండి నలుగురికి మాత్రమే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అయింది.

అప్పట్లో ముఖ్యమంత్రి కాకుండా రెడ్డి సామాజిక వర్గం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు), బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ( కర్నూలు)… మేకపాటి గౌతమ్‌రెడ్డి ( నెల్లూరు), బాలినేని శ్రీనివాస రెడ్డి ( ప్రకాశం) లకు మాత్రమే కేబినెట్ లో చోటు దక్కింది. గుంటూరు, అనంతపురం గెలుపొందిన రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఏవిధంగా సాగిలా పడినా జగన్ రెడ్డి కరుణించలేదు. నెక్ట్స్ టైమ్ అంటూ దాట వేశారు.

నూతన మంత్రివర్గాన్ని కొలువుదీర్చే పనిలో

దాదాపు ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య సామాజిక వర్గాలన్నీ కూడా కేబినెట్ లో వుండేలా జగన్ రెడ్డి జాగ్రత్త పడ్డారు. అయితే వందల సంఖ్యలో నామినేటెడ్ పోస్టులు అన్నీ జాతరలో పప్పూ బెల్లాలు పంచిన చందాన… రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించు కోవడాన్ని అన్ని మాధ్యనాల్లో తూర్పార బట్టారు. అయితే పుణ్య కాలం కాస్తా అయిపోయింది. తరుము కొస్తున్నట్టు
మంత్రి వర్గ విస్తరణ కు సమయం ఆసన్నమైంది.

ఖచ్చితంగా విజయదశమికి నూతన మంత్రివర్గాన్ని కొలువుదీర్చే పనిలో జగన్ రెడ్డి తన వంది మాగధులతో సమాలోచనలు జరుపు తున్నారు. అయితే ఈసారి కూర్పు అంత సులభం కాదు. ఎందుకంటే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కొందరికి సంతృప్తి, మరికొందరికి అసంతృప్తి తప్పనిసరి. ఈసారి కూడా అన్ని సామాజిక వర్గాల నడుమ సమతుల్యత సాధించాలనే తపన మాత్రం ముఖ్యమంత్రి లో స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రిమండలి లో చోటు దక్కించు కొనేవారి జాబితా, ఆశావహులు తదితర సామాజిక సమీకరణాలతో పాటు పదవి కోల్పోయే వారి జాబితా సైతం జిల్లాల వారీగా….

శ్రీకాకుళం జిల్లా:-

జిల్లా నుండి ధర్మాన కృష్ణ దాస్, సీదిరి అప్పల రాజులు ప్రస్తుత మంత్రి వర్గంలో వున్నారు. నర్సన్నపేట నియోజకవర్గం నుండి గెలుపొందిన ధర్మాన కృష్ణ దాస్ కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. పలాస నియోజకవర్గం నుండి గెలిచిన సీదిరి అప్పల రాజు అనూహ్యంగా మంత్రిమండలిలో చోటు దక్కించుకున్న వారు. గుంటూరు జిల్లా రేపల్లె లో వైకాపా అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణరావుకి… సామాజిక సమీకరణలో భాగంగా జగన్ కేబినెట్ లో చోటు దక్కింది.

మోపిదేవి ని ఆ మధ్య రాజ్యసభకు పంపడంతో ఏర్పడిన ఖాళీని అప్పల రాజుతో పూరించారు. ధర్మాన కృష్ణ దాస్ ను తొలగించి ధర్మాన సోదరుడు మాజీ మంత్రి అయిన శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలను కుంటున్నారని తెలుస్తోంది. ఒకే జిల్లాలో ఒకే కుటుంబం నుండి రెండున్నరేళ్లు సోదరులిద్దరికీ మంత్రి వర్గంలో అవకాశం కల్పించడం వల్ల పొరపొచ్చాలుండవని… అధినేత భావిస్తున్నారని, పైగా శ్రీకాకుళం జిల్లా మొత్తానికి కొప్పుల వెలమ సామాజిక వర్గం నుండి గెలిచింది ధర్మాన బ్రదర్స్ మాత్రమే.

తమ్మినేని సీతారాంకి మంత్రి పదవి

ఇక శాసనసభ స్పీకర్ గా వెలుగొందుతున్న ఒకనాటి మాజీ మంత్రి కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఆముదాల వలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. స్పీకర్ గా వైదొలిగి మంత్రి కావాలని ఉవ్విళ్లూరు తున్నారు. సిఎం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. జిల్లాలో కొప్పుల వెలమ, కాళింగ, తూర్పు కాపు, మత్స్య కారులు ప్రధానంగా అధిక సంఖ్యాకులు, వెనుకబడిన తరగతుల్లో ఈ కులాలు ఉంటున్నాయి.
తూర్పు కాపు సామాజిక వర్గం నుండి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి… మహిళా కోటాలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ లు మంత్రి పదవిని ఆశిస్తున్నా వీరిద్దురూ మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు కాబట్టి చాన్స్ లేనట్టే.

విజయనగరం జిల్లా:-

జిల్లాలోని చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మంత్రి మండలిలో కొనసాగుతారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఉపముఖ్యమంత్రి గా అలరారుతున్నారు. గిరిజన కోటాలో అత్యున్నత పదవి పొందిన పుష్పశ్రీవాణి పనితీరు బాగుందని టాక్. అయితే జిల్లాలో బొత్స శిష్యుడు వైశ్య సామాజిక వర్గానికి చెందిన విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస రావు ( కృష్ణా జిల్లా) ని మంత్రి మండలి నుండి తప్పిస్తే కానీ ఇది సాధ్యం కాదు.

పైగా ఆంధ్రప్రదేశ్ లో చిన్న జిల్లా అయిన విజయనగరం జిల్లా లో కేవలం తొమ్మిదే నియోజకవర్గాలు ఉన్న జిల్లా నుంచి మంత్రి వర్గంలో ముగ్గురికి చోటు కల్పించడం సమీకరణాల దృష్ట్యా సాధ్యం కాదు. జిల్లాలో తూర్పు కాపులు బలమైన సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం నుండి బొత్స సత్యనారాయణ తో పాటు బొత్స సోదరులు అప్పల నర్సయ్య, మేనల్లుడు బడుకొండ అప్పల నాయుడులు ఎమ్మెల్యేలు గా రాణిస్తున్నారు. పుష్పశ్రీవాణి ని మార్చాల్సి వస్తే జిల్లోని సాలూరు ఎమ్మెల్యే వరుసగా మూడు సార్లు గెలుపొందిన గిరిజనుడు పి. రాజన్నదొర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

విశాఖపట్నం:-

జిల్లా మొత్తం మీద ఒకే ఒక్కడిగా మంత్రిమండలి లో వెలుగొందుతున్న ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఎన్నికలకు ముందుగా వైకాపా లో చేరారు. అప్పటి వరకు తెదేపా ఎంపి గా అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించిన ముత్తం శెట్టి వైకాపాలో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి ఎకాఎకిన మంత్రి అయిపోవడం వైకాపా లోని చాలామంది సీనియర్ నేతలకే అంతుచిక్క లేదు. అయితే ముత్తం శెట్టి ని మార్చాల్సి వస్తే… ఇదే సామాజిక వర్గానికి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పేరు ప్రముఖంగా వినిపించడమే కాక జిల్లాలో అమరనాథ్ దూసు కెళుతున్నారు. దివంగత నేత, మాజీ మంత్రి గుడివాడ గురునాథ రావు కుమారుడిగా అమరనాథ్ విశేషాకర్షణని కలిగి ఉన్న యువనేత. మొత్తం శెట్టి శ్రీనివాస రావు… అవంతి కాలేజ్ లోనే అమరనాథ్ విద్యనభ్యసించారు.

ఇప్పుడు గురువు మీద పోటీకి శిష్యుడు సిద్దం అని విశాఖ వాసులు అంటున్నారు. తూర్పు కాపు (బిసి) సామాజిక వర్గం నుండి ఆ కోటాలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ… కొప్పుల వెలమ(బిసి)ల కోటాలో నర్సీపట్నం ఎమ్మెల్యే, సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు పి. ఉమా శంకర గణేష్ లు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమా శంకర్ గణేష్ అప్పటి మంత్రి, తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడ్ని భారీ ఆధిక్యతతో ఓడించడం… కలిసొచ్చే అంశం కాగా కొప్పుల వెలమల నుండి ధర్మాన బ్రదర్స్ లో ఒకరికి శ్రీకాకుళం జిల్లా నుండి ఛాన్స్ ఇచ్చినా మరొకరికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవ్వాల్సి వస్తే… తనకు అవకాశం ఇవ్వాలంటూ ఉమా శంకర గణేష్ ప్రయత్నాలు వేగిరం చేశారు. ఇందుకు సోదరుడు పూరీ జగన్నాధ్ కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గిరిజనుల నుంచి చెట్టి ఫల్గుణ (అరకు), కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి(పాడేరు) లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి అధిష్టానం చుట్టూ పడిగాపులు పడుతున్నారు.

తూర్పు గోదావరి:-

జిల్లా నుండి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్న బాబు, అమలాపురం ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, రామచంద్రాపురం నుండి చెల్లు బోయిన వేణు గోపాల కృష్ణ లు మంత్రి మండలి లో వున్నారు. కురసాల కన్నబాబు ని కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి వరించనుందని విస్తృత ప్రచారం జరుగుతోంది. తెలగ బలిజ సామాజిక వర్గానికి చెందిన కన్న బాబు కి ఈ హోదా వరించబోవడానికి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) మంత్రి వర్గంలో కొనసాగినా… ఉప ముఖ్యమంత్రి గా కొనసాగాలను కోవడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే అయిన ఆళ్ల నాని కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు.

ఇక తూర్పు గోదావరి జిల్లా నుండి తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా కూడా మంత్రి పదవి కోసం ఎప్పటినుంచో రేసులో ఉన్నా… ఇటీవలే శాసన మండలి కి ఎంపికైన తోట త్రిమూర్తులు కూడా అనూహ్యంగా పోటీ పడనుండటంతో పోరు రసవత్తరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో 19 నియోజకవర్గాల అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లా నుండి ఇదే సామాజిక వర్గం నుండి ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చినా నష్టమేమీ ఉండదు. అయితే తోట త్రిమూర్తుల్ని వైకాపా స్టార్ క్యాంపెయినర్ గా వినియోగించు కోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటింప జేయాలని అనుకుంటోంది.

ఆ దృష్ట్యా త్రిమూర్తులు ఆశల మీద ముందే నీళ్లు చల్లేస్తోంది. పైగా తోట త్రిమూర్తులుకి వరసకు వియ్యంకుడైన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్న నేపథ్యంలో… త్రిమూర్తులుకి చోటు లేనట్టే. త్రిమూర్తులు కుమారుడు తోట పృధ్వీ రాజ్ ని రాబోయే ఎన్నికలకు గాను మండపేట నియోజకవర్గం నుండి నిలబెట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్న నేపథ్యంలో… త్రిమూర్తులు ఆ దిశగా చాలా ప్రయాస పడాలి కాబట్టి ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న మంత్రి పదవి ఈ సారి కూడా కలగానే మిగిలిపోనుంది.

కల్లుగీత సామాజిక వర్గానికి చెందిన వేణు గోపాల కృష్ణ కూడా అనూహ్యంగా మంత్రి వర్గంలో చోటు దక్కించు కున్నవారే. మండపేట నుంచి ఎన్నికలలో ఓడిపోయినా పిల్లి సుభాస్ చంద్ర బోస్ కి మంత్రి వర్గంలో చోటు కల్పించడమే కాక… ఆ తర్వాత పిల్లి బోస్ ని రాజ్యసభ కి కూడా పంపారు ముఖ్యమంత్రి. అలా ఏర్పడిన ఖాళీని సామాజిక సమీకరణ లో భాగంగా ఇదే సామాజిక వర్గానికి చెందిన వేణుగోపాల కృష్ణ దక్కించు కున్నారు. ఈ జిల్లా నుండి దళితల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ ని మార్చబోవడం లేదు. శాఖ మారితే మారొచ్చు అంతే.

ముగ్గురిలో ఒకరికి అవకాశం…

విచిత్రమైన సమీకరణ ఏంటంటే జిల్లాలో కొత్తపేట నుంచి చిర్ల జగ్గి రెడ్డి, అనపర్తి నుంచి సత్తి సూర్యనారాయణ రెడ్డి లు వైకాపా నుండి గెలిచి వచ్చారు. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లా నుండి రెడ్డి కులస్తులెవ్వరూ మంత్రి పదవి చేపట్టింది లేదు. ఈ సమీకరణను ఆసరాగా చేసుకొని మంత్రి మండలి లో చోటు దక్కించు కోడానికి పై ముగ్గురిలో ఒకరికి అవకాశం ఇవ్వండంటూ ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేసుకున్నారని… ఎప్పటిలాగే ముఖ్యమంత్రి నర్మగర్భంగా చిరునవ్వులు చిందించారని తెలుస్తోంది.

ఈ జిల్లా లో కాపులుగా చలామణీ అయ్యే తెలగ బలిజ సామాజిక వర్గం నుండి కురసాల కన్నబాబు ని మినహాయిస్తే దాడిశెట్టి రాజా(తుని), పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ (ప్రత్తిపాడు), పెండెం దొరబాబు ( పిఠాపురం), జక్కంపూడి రాజ( రాజానగరం)… జ్యోతుల చంటిబాబు( జగ్గంపేట) మరియు తోట త్రిమూర్తులు ఒక్క ఛాన్స్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే కన్న బాబుని తప్ప వేరెవ్వరికీ ఈ సామాజిక వర్గం నుండి అవకాశం కల్పించక పోతే డిసిసిబి చైర్మెన్ అనంత బాబు అర్ధాంగి, గిరిజనురాలైన రంపచోడవరం ఎస్టీ రిజర్వుడు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికి… అవకాశం కల్పించ వచ్చని తెలుస్తోంది. అనంత బాబు, వరుపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ లకు స్వయానా మేనల్లుడు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన నాగులపల్లి ధనలక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంత బాబు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి బాగా ఇష్టుడు కూడా.

పశ్చిమ గోదావరి:-

జిల్లా నుండి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), ఆచంట ఎమ్మెల్యే సి.హెచ్. శ్రీరంగనాథ రాజు, కొవ్వూరు ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యే తానేటి వనిత లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఆళ్ల నాని కొనసాగ నుండగా రంగనాథ రాజు, తానేటి వనితల్ని తొలగించనున్నట్టు తెలుస్తోంది. 

క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రంగనాథ రాజు స్థానే ఇదే జిల్లా కు చెందిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుకి చోటు దక్కనుండగా యాదవ సామజిక వర్గం నుండి… తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ని మంత్రివర్గం నుండి తప్పించనున్నారన్న వార్త విస్తృతంగా ప్రచారంలో ఉండడంతో… కారుమూరి నాగేశ్వరరావు తన అదృష్టాన్ని పరీక్షంచుకోబోతున్నారు,

అయితే 2019 నాటి మంత్రివర్గ కూర్పు సమయంలో యాదవుల నుండి అనిల్ కుమార్ యాదవ్ కి అవకాశం ఇచ్చిన… సీఎమ్ జగన్ రెడ్డి కృష్ణా జిల్లా పెనమలూరు నుండి గెలిచి వచ్చిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి యాదవ్ ని కాదని అప్పట్లో పక్కన పెట్టినా… రెండున్నర ఏళ్ల తరువాత మంత్రి మండలిలో చోటు కల్పస్తానని బుజ్జగించారని…
ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి కారుమూరి నాగేశ్వరరావు కి అవకాశం ఇస్తే పార్థసారథికి అవకాశం లేనట్టేనని…, కానీ జగన్ రెడ్డి మాట ఇస్తే మాట మీద నిలబడతారని కృష్ణా జిల్లా నుండి యాదవ సామాజిక వర్గానికి చెందిన కలుసు పార్థసారథి యాదవ్ కే మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ఆయన అభిమానులు చెబుతున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఆళ్లనాని తెలగ బలిజ సామాజిక వర్గం వారు, ఆళ్లనాని సామాజిక వర్గానికి చెందిన భీమవరం ఎమ్మెల్యే సాక్షాత్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించిన గ్రంధి శ్రీనివాస్ ఈసారి
రేసులో ఉండగా,బొత్స సత్యనారాయణ కి వరుసకి వియ్యంకుడైన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, నిడదవోలు ఎమ్మెల్యే గడ్డం శ్రీనివాస నాయుడు (తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తితిదే మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి కి స్వయాన అల్లుడు, పిసిసి మాజీ అధ్యక్షులు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే గడ్డం సూర్య చంద్ర రావు కుమారుడు) లు కూడా తమవంతు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఈ సామాజిక వర్గం నుండి ఒకరికి అవకాశం కల్పిస్తే పశ్చిమ గోదావరిలో మరొకరికి చోటు కష్టం.ఒకవేళ తూర్పు లో అవకాశం లభించిక పోతే పశ్చిమలో ఒకరికి చాన్స్ గ్యారంటీ. ఎటొచ్చీ ఉభయ గోదావరి జిల్లాల నుండి కురసాల కన్నబాబు, ఆళ్లనాని కంటిన్యూ అవుతూనే ఈ సామాజిక వర్గానికి చెందిన మరొకరికి ఛాన్స్ ఇస్తారు, అయితే ఏ జిల్లా నుండి? ఆ లక్కీ ఎమ్మెల్యే ఎవరు?

కృష్ణా

కృష్ణా జిల్లా బందరు నుండి పేర్ని వెంకట్రామయ్య (నాని),గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని),విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మంత్రివర్గంలో ఉండగా తెలగకాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నానికి ఉద్వాసన కలిగించి ఇదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ
భానుకి చోటు కల్పించనున్నారు.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని కంటిన్యూ అవుతారు,ఇదే సామాజిక వర్గం నుండి మరొకరికి అవకాశం కల్పించదలిస్తే గుంటూరు జిల్లా చిలకలూరిపేటకి చెందిన మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన మర్రి రాజశేఖర్ కి అవకాశం లభించొచ్చు,ఆ విధంగా జగన్ మోహన్ రెడ్డి టికెట్ల కేటాయింపుల సమయంలో రాజశేఖర్ కి మాట కూడా ఇచ్చి ఉన్నారు.అప్పటి నియోజకవర్గ వైకాపా ఇన్ చార్జ్ గా ఉన్న మర్రి రాజశేఖర్ ని ప్రక్కన బెట్టి మరి బి.సి. చాకలి అయిన విడదల రజనికి వైకాపా నుండి పోటీ చేసే అవకాశాన్ని జగన్ రెడ్డి కల్పించారు. ఎమ్మెల్సీ అయిన మర్రి రాజశేఖర్ కి మంత్రి పదవి కేటాయిస్తారని అప్పట్లోనే గట్టిగా ప్రచారం జరిగినా, కమ్మ కులస్తుల నుండి ఇద్దరికి మంత్రి పదవి కేటాయించడానికి సమీకరణలు పొసగలేదు.

వైశ్యుల కోటాలో వెలంపల్లి

శ్రీనివాసరావు వెలంపల్లి వైశ్యుల కోటాలో ప్రస్తుతానికి నో ఫియర్ గానే ఉన్నా విజయనగరం నుండి వీరభద్ర స్వామి ప్రకాశం జిల్లా గిద్దలూరు నుండి అన్నా రాంబాబులు వైశ్య సామాజిక వర్గం నుండి తమ ప్రాధాన్యతని గుర్తించాల్సిందిగా గట్టిగానే పోరాడుతున్నా వెలంపల్లిని తప్పిస్తేనే మరొకరికి ఛాన్స్ దొరుకుతుంది. బ్రాహ్మణుల కోటాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం ఆశిస్తున్నారు.

పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థ సారథి యాదవ్, పెడవ ఎమ్మెల్యే జోగి రమేష్ గౌడ్ (కల్లుగీత) లు వెనుకబడిన తరగతుల కోటాలో మంత్రి పదవి ఆశిస్తుండగా వీరిలో ఒకరికి తప్పక అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే తానేటి వనితని తప్పించ నుండడంతో ఆ ఖాళీని కృష్ణా జిల్లా నుండి భర్తీ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. కొక్కిలి గడ్డ రక్షణ నిధి (తిరువూరు) కైలే అనిల్ కుమార్ యాదవ్ (పామర్రు) మొండితోక జగన్మోహన్ రావు(నందిగామ) లలో ఒకరికి అనుమానం ఉంది.

ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే అతిపెద్ద జిల్లాలు కావడంతో ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో మంత్రులు కొలువు తీరే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లా నుండి నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ముగ్గురు
గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి ఒక్కొక్క జిల్లా నుండి నలుగురికి తగ్గకుండా అవకాశం లభించనుంది.

గుంటూరు జిల్లా…

పత్తిపాడు(ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే ఎం.సుచరిత హోమ్ శాఖా మాత్యురాలిగా పదవిలో నుండగా,వెనుక బడిన తరగతుల నుండి మంత్రి పదవి పొందిన మోపిదేవి వెంకటరమణ రావు రాజ్యసభకు ఎంపికయ్యారు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి కోన రఘుపతి మంత్రి పదవి ఆశిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి తీవ్రమైన ఒత్తిడి ఈ జిల్లా నుండే అధిష్టానాన్ని తాకుతోంది.

వరుసగా నాలుగు సార్లు గెలిచిన మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వరుసగా రెండుసార్లు గెలిచిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి తప్పదనే ప్రచారం సచివాలయం సాక్షిగా సాగుతోంది, ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాల్లో ఉండగా ఎవరికి ఛాన్స్ ఇచ్చిన మిగిలిన వారు ఇబ్బంది పడకుండా చూసు కోవడం సిఎమ్ అండ్ టీమ్ కి తలనొప్పిలా మారింది.

ఆశావహులలో ప్రత్యేకించి పేర్కొన దగినవారు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, బి.సి. చాకలి సామాజిక వర్గానికి చెందిన చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని ఇరువురు కూడా సమీకరణలలో భాగంగా మంత్రి మండలిలో చోటు దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఇరువురు మహిళలు తెలగ బలిజ కులస్తుల్ని ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఈ ఇరువురు మహిళా ఎమ్మెల్యేలు విద్యాధికులే.ఇటీవల విడుదల రజిని ముఖ్యమంత్రిని కలసి ప్రత్యేకంగా చర్చించడం కూడా చర్చనీయాంశం అయ్యింది. చిలకలూరి పేటకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ కమ్మ కులస్తులైన మర్రి రాజశేఖర్ ని మంత్రి వర్గంలోకి తీసుకుంటే రజనికి ఛాన్స్ లేనట్టే, అందుకే విడదల రజని పెద్ద ఎత్తున తన అనుచరగణంతో సిఎమ్ నివాసానికి చేరుకుని సిఎమ్ తో భేటి అయ్యింది.

ముస్లిం మైనారిటీల నుండి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మంత్రి వర్గంలో చోటు దక్కించు కోవడానికి తహతహ లాడుతున్నారు, వరుసగా రెండు సార్లు వైకాపా అభ్యర్థి గా గెలిచి రావడం మహమ్మద్ ముస్తఫా కి కలిసొచ్చే అంశం. ఇక ఎన్నాళ్లో,ఎన్నేళ్లో తిరిగి ఎమ్మెల్యే కావడానికి తపస్సు చేసిన అంబటి రాంబాబు 1989 తర్వాత మళ్లీ 2019 ఎన్నికల్లో గెలిచి వచ్చారు.

తెలగ కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు సత్తెనపల్లి నుండి 2014 లో ఓడిపోయినా 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ రావు పై భారీ ఆధిక్యతతో గెలుపొంది మంత్రి పదవి ఆశించారు,భంగ పాటు తప్పలేదు ఇప్పుడు తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నా ప్రమాదం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రూపంలో పొంచి ఉంది. తాజాగా దాదాపు రాజకీయాల నుండి రిటైర్ మెంట్ ప్రకటించేసిన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తన అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యని తెరమీదకి తీసుకువచ్చారు.

తెదేపా లో హెవీవెయిట్ అయిన ధూళిపాళ నరేంద్రని ఓడించిన కిలారు రోశయ్య జిల్లాలో వైకాపాలో మరింతగా బలపడాలంటే మంత్రి కావడం ఒక్కటే తరువాయి. దీంతో అంబటి రాంబాబు పరిస్థితి ఎటూ పాలు పోకుండా ఉంది. ఆ మాటకొస్తే విడదల రజిని సైతం చిలకలూరిపేటలో ఓడించింది సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి అయిన ప్రత్తిపాటి పుల్లారావుని… అంబటి రాంబాబు, కిలారు వెంకట రోశయ్యని ఇద్దర్నీ ప్రక్కన పెట్టదలస్తే మధ్య మార్గంగా విడదల రజని మంత్రి పదవి ఎగరేసుకు పోవడం ఖాయంగా తోస్తోంది.

ప్రకాశం జిల్లా…..

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎర్రగొండ పాలెం (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ లు మంత్రులు గా కొనసాగుతారు, రెడ్డి సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యే ఎం.మహీధర్ రెడ్డి (కందుకూరు) కి అవకాశం ఉంది. వైశ్యుడైన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అన్నా రాంబాబు 78 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం ఒక కారణంగా చూపుతున్నారు.

నెల్లూరు జిల్లా….

ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్’ని (నెల్లూరు సిటీ)  మంత్రివర్గం నుండి తప్పించనుండగా, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి వర్గంలో కొనసాగుతారు. ఒకవేళ గౌతమ్ రెడ్డిని తప్పించాల్సివస్తే.. సీనియర్ అయిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కి బెర్త్ కంఫర్మ్ అవుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది.. అప్పుడు సీనియర్ అయిన కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కి బెర్త్ కన్ ఫర్మ్ అవుతుంది. లేకుంటే గౌతమ్ రెడ్డి కంటిన్యూ అవుతారు. సూళ్లూరుపేట (ఎస్సీ) రిజర్వుడ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేరు పరిశీలనలో ఉంది. అయితే చిత్తూరు జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి, గంగాధర నెల్లూరు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే కె.నారాయణ స్వామిని తప్పిస్తేనే కిలివేటి సంజీవయ్య కు ఛాన్స్ అని తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా….

పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి వర్గంలో
కంటిన్యూ అవుతారు. దళిత సామాజిక వర్గం నుండి చిత్తూరు జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తుంన్న కె.నారాయణ స్వామిని తప్పిస్తే నెల్లూరు జిల్లాలో కానీ అనంతపురం, కడప జిల్లాల నుండి కానీ దళితులకి అవకాశం కల్పిస్తారు. రెడ్డి సామాజిక వర్గం నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్.కె. రోజా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

కడప జిల్లా….

ఎమ్మెల్యే అంజాద్ బాషా (కడప) కొనసాగుతారు, ఈసారి ముస్లిం మైనారిటీల నుండి మరొకరికి కూడా అవకాశం కల్పించాలనే సమీకరణాలలో భాగంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్వంత జిల్లా కావడంతో మెజారిటీతో పాటు దళితులకి కూడా పెద్ద పీట వేయాలని అనుకున్నా… బద్వేలు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే జి.వెంకట సుబ్బయ్య మరణించడంతో రైల్వే కోడూరు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఒక్కరే మిగిలారు. వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొరముట్ల శ్రీనివాసులు మూడు సార్లు వైకాపా తరపున గెలిచి రావడం ఆయనకి బాగా కలిసి వస్తున్న అంశం. అయితే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మొత్తమ్మీద ఇద్దరు తక్కువ కాకుండా మంత్రుల్ని దళిత సామాజిక వర్గం నుండి ఎంపిక చేస్తున్నారు.

అనంతపురం

జిల్లా నుండి పెనుకొండ ఎమ్మెల్యే, కురబ(బిసి) సామాజిక వర్గానికి చెందిన
ఎమ్.శంకర్ నారాయణ ప్రస్తుత మంత్రి వర్గంలో ఉన్న ఏకైక మంత్రి కనీ వినీ ఎరుగని రీతిలో దాదాపు రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు పోటాపోటీగా మంత్రి పదవిని ఆశిస్తున్న జిల్లా అనంతపురం జిల్లా కావడం విశేషం.

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి,ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దు కుంట శ్రీధర్ రెడ్డి… గుంతకల్లు ఎమ్మెల్యే ఎల్లారెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరి స్థాయిలో వారు మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం కోసం రకరకాల కారణాలు చూపుతున్నా… పరిటాల సునీతమ్మ పై రెండు సార్లు ఓడిపోయి,పరిటాల శ్రీ రామ్ ని 2019 ఎన్నకల్లో ఓడించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితోపాటు… సీనియర్ నాయకులు, మాజీ ఎమ్.పి. కూడా అయిన అనంత వెంకటరామిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి, ఈ ఇద్దరిలో అంతిమ విజేత ఎవరో వేచిచూడాలి.

మంత్రి ఎమ్.శంకరనారాయణ సామాజిక వర్గానికే చెందిన కల్యాణదుర్గం ఎమ్మెల్యే కె.వి.ఉషశ్రీ చరణ్,శంకర నారాయణని తప్పిస్తే తనకి అవకాశం ఇవ్వాలంటూ అధినేతకి విజ్ఞప్తి చేసుకున్నారని తెలుస్తోంది. ఉషశ్రీ చరణ్ భర్త రెడ్డి కావడం ఆమెకి కలసి వచ్చే అంశం. ఈ జిల్లా నుండి రెడ్డి కులస్తులెవ్వరికీ అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే ఉషశ్రీ చరణ్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే,తను కురబ (బి.సి) సామాజిక వర్గం, భర్త రెడ్డి కావడంతో సమీకరణ సరిపోతుందని అనంతవాసుల ఉవాచ.

దళితుల కోటాలో శింగనమల

దళితుల కోటాలో శింగనమల (ఎస్సీ రిజర్వుడ్) నుండి జొన్నలగడ్డ పద్మావతి,
మడకశిర (ఎస్సీ రిజర్వుడ్) నుండి డాక్టర్. ఎమ్.తిప్పేస్వామి లు పోటీపడు తున్నారు.
డాక్టర్. ఎమ్.తిప్పేస్వామి సీనియర్ వరుసగా మూడుసార్లు ఇక్కడి నుండి గెలిచారు,అయితే డాక్టర్.తిప్పేస్వామి,ప్రస్తుత మంత్రివర్గం లో ఉన్న ఆదిమూలపు సురేష్ బావ మర్దులు.సురేష్ ని తప్పిస్తేనే తిప్పేస్వామికి అవకాశం లేకుంటే నో ఛాన్స్. జొన్నలగడ్డ పద్మావతి భర్త రెడ్డి కావడం కలిసి వచ్చే అంశం.

అయితే జిల్లా నుండి కె.వి. ఉషశ్రీ చరణ్ (బి.సి), జొన్నలగడ్డ పద్మావతి (ఎస్సీ) ఇద్దరి భర్తలు రెడ్డి సామాజిక వర్గం వారే. అయితే ఒకే జిల్లా నుండి ఇద్దరు మహిళలకి అవకాశం కూడా సాధ్యం కాదు కాబట్టి ఎమ్.శంకర నారాయణ ని (బి.సి) కొనసాగిస్తూ జొన్నలగడ్డ పద్మావతి (ఎస్సీ) అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

కర్నూలు

జిల్లా నుండి ఆలూరు ఎమ్మెల్యే బోయ(బి.సి) సామాజిక వర్గానికి చెందిన పి.జయరామ్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రి వర్గంలో అలరారుతున్నారు. పి.జయరామ్ ని కొనసాగిస్తుండగా కర్నూలు జిల్లా నుండి కూడా అత్యధిక సంఖ్యలో రెడ్డి సామాజిక వర్గం నుండి మంత్రి పదవి ని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు సచివాలయానికి… సి.ఎమ్. క్యాంపు కార్యాలయానికీ పోటెత్తుతున్నారు. తొలిసారి మంత్రి వర్గ సమయంలో ఒత్తిడికి గురైన వైకాపా అధినాకత్వం అప్పుడు తట్టుకోగలిగిన ఇప్పుడు తాకిడికి చిగురుటాకులా వణికి పోతోంది.

శ్రీశైలం నుండి శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల నుండి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తమలో ఒకరికి అవకాశం కల్పించాల్సిందేనని పట్టు బడుతుండగా, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి లు తమలో ఒకరికి అవకాశం కల్పించాలని దూకుడు పెంచడంతో మంత్రివర్గ కూర్పు ఈసారి అనుకున్నంత సులువు కానేకాదని తెలుస్తోంది.

అయితే కర్నూలు, అనంతపురం జిల్లాల నుండి రెడ్డి కులస్తులు అధిక సంఖ్యలో గెలిచి రావడం కూడా ఈసారి విస్తరణ సమయంలో ఎవరు ఏవిధంగా స్పందిస్తారో? ఎవరికి కేటాయించి ఎవరికి కేటాయించిక పోయినా దాని ప్రభావం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఉండి తీరుతుందనే గుబులు వైకాపా అధి నాయకత్వంలో ఉంది. ఏది ఏమైనా 2019 ఎన్నికల్లో గెలిచి కొందరిని సంతృప్తి పరిచి, మరికొందరిని రెండున్నర సంవత్సరాల తరువాత అని ఊరించడం వల్లే ఈ తిప్పలన్ని. ఈ సస్పెన్స్ వీడాలంటే విజయదశమి వరకూ ఎదురు చూడాల్సిందే మరి!!

–చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్, సామజిక రాజకీయ విశ్లేషకులు 

Spread the love