ఏడాది కిందట ఏర్పాటైన కంపెనీకి వేల ఎకరాలా?
తక్కువ ఉద్యోగాలే ఇస్తామని చెప్పినా పచ్చ జెండా ఊపేశారు
లీజును కాస్తా యాజమాన్య హక్కులు కట్టబెట్టేయడం వెనక ఏమి ఉంది?
ఇండోసోల్ అనేది షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ ఎస్.పి.వి.
షిర్డీ సాయితో రాష్ట్ర పాలకుడికి ఉన్న బంధం ఏమిటో అందరికీ తెలుసు
న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ పేరుతో రెండుమూడు సంస్థలకే అనుచిత లబ్ధి
సోమశిల, సంగం, కనిగిరి రిజర్వాయర్లు… చుట్టుపక్కల చెరువులు ధారాదత్తం
ట్రాన్స్ కో వాళ్ళే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా సబ్ స్టేషన్ ఏర్పాటు
అన్ని ట్యాక్సులు… ఫీజులు… బిల్లులు ఎత్తివేత
నిబంధనలకు, చట్టాలకు పాతర వేసి మరీ కేబినెట్ లో ఆమోదం
పరిశ్రమల శాఖలో అతిపెద్ద స్కాండల్
రోజుకో వైసీపీ అవినీతి బాగోతం వెల్లడిలో భాగంగా మంగళగిరిలో మీడియాతో నాదెండ్ల మనోహర్
వైసీపీ ప్రభుత్వలోని (YCP Government) పరిశ్రమల శాఖలో (Industrial Department) జరుగుతున్న అక్రమాలపై, అవినీతి కుంభకోణాలపై (Big Scam) నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విరుచుకు పడ్డారు. ‘అడ్డగోలు వ్యవహారాలుఅడ్డదిడ్డమైన నిర్ణయాలతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. ప్రజాధనాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా తన అనుకున్న కంపెనీలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి బరి తెగించారు. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ కంపెనీకి చేసిన భూ కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరిగాయి. చట్టాలను, నిబంధనలను గాలికొదిలేసి మరీ ఆ కంపెనీకి లబ్ధి చేకూర్చడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉంది. కేవలం 1 సంవత్సరం 9 నెలలు 12 రోజుల కిందట పుట్టిన కంపెనీకి వేలాది ఎకరాల భూమిని అడ్డగోలుగా కట్టబెట్టడం ఒక ఎత్తయితే, దానికి వేల కోట్ల రూపాయల ప్రోత్సాహాకాలను ప్రభుత్వం చట్టాలను సవరించి మరీ కల్పించడం విస్తుగొల్పిస్తోంద’ని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ‘వైసీపీ పాలన – అవినీతి జమానా’ కార్యక్రమంలో భాగంగా రోజుకొక అవినీతి తంతును బయటపెట్టే క్రమంలో భాగంగా బుధవారం మనోహర్ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గరలో పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ద్వారా సాగిన భూ సంతర్పణను బయటపెట్టారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఇండోసోల్ కంపెనీ సంప్రదాయ, పునరుత్పాదక విద్యుత్ కంపెనీగా నమోదు అయింది. దీని మాతృ కంపెనీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్. ఈ సంస్థతో ముఖ్యమంత్రికి ఉన్న బంధం ఏమిటో అందరికీ తెలుసు. షిర్డీ సాయి కంపెనీ ఓ స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసి ఇండోసోల్ పేరుతో కంపెనీని నెలకొల్పారు. ఈ కంపెనీకి సంబంధించి పూర్తిస్థాయి కార్యకలాపాలు ఇంకా మొదలుకాలేదు. అంతలోనే నెల్లూరు జిల్లా రామయపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్ వాళ్ళకు 5,148 ఎకరాల భూమిని కేటాయించి లీజ్ అగ్రిమెంట్ చేశారు. దీని ద్వారా ఇండోసోల్ వాళ్ళు లీజుదారు స్థాయి నుంచి భూ యజమానిగా మారిపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో 3200 ఎకరాల భూమిని సేకరించుకొనేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం అందుకు ఫెసిలిటేటర్ గా ఉంటుందని చెప్పింది. ప్రభుత్వ అధికారులే దగ్గరుండి రైతులతో మాట్లాడి ఇండోసోల్ కి భూములు ఇప్పిస్తారు. అంటే రైతుల నుంచి నయానాభయానా భూములు లాక్కొనే వ్యవహారం చేస్తారన్నమాట. మొత్తంగా రామాయపట్నం దగ్గర ఇండోసోల్ కంపెనీకి 8,348 ఎకరాలు ధారాదత్తం చేశారు.
కంపెనీ కోసం ఏకంగా కొత్త విధానమే తెచ్చారు
ఈ కంపెనీకి అనుచిత లబ్ధి కల్పించేందుకు ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. ఏకంగా ఓ పారిశ్రామిక పాలసీని ప్రణాళిక ప్రకారం రూపొందించడం విశేషం. ఈ పాలసీ కేవలం ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన ఒకటి రెండు, కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా రూపొందించారు. న్యూ ఇండస్ట్రీయల్ ల్యాండ్ పాలసీ పేరుతో తీసుకొచ్చిన ఈ విధానం వల్ల పరిశ్రమలకు సులువుగా భూములు ఇవ్వడానికి, పరిశ్రమలు వేగవంతంగా నెలకొల్పడం కోసం, ఉపాధి అవకాశాలు పెంచడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే దీనివల్ల సాధారణ పారిశ్రామికవేత్తలకు ఏ మాత్రం ప్రయోజనం లేకుండా విధానాలను రూపొందించారు. 2022 నవంబరు 3వ తేదీన క్యాబినెట్ దీనిపై సంతకాలు చేసింది. కొత్త పాలసీ వల్ల ఎవరు లబ్ధి పొందారు.. ఏ పరిశ్రమలు వచ్చాయి.. పెట్టుబడులు ఎంత.. పరిశ్రమలు వచ్చాయా అంటే అదీ లేదు.. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న ఇద్దరికో, ముగ్గురికో ఉపయోగపడేలా పాలసీని తెచ్చారు. గతంలో ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్న వారికి ఉపయోగపడేలా దీన్ని రూపొందించడం విశేషం. ముందుగా ఎంవోయులు చేసుకున్న కంపెనీ అంటే అది ఇండోసోల్ కోసం అని చెప్పాలి. సీఎం సన్నిహితుల కోసమే పాలసీ తెచ్చారు.
ప్రధాన కార్యదర్శి ఏం చేశారు?
ప్రభుత్వంలో ఓ విధానం రూపొందాలి అంటే మొదట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఆయా శాఖల అత్యున్నత అధికారుల బృందం (ఎస్ ఐ ఎస్ ) చర్చించాలి. అనంతరం అది ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఎస్ ఐ పీ బీ (స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ బోర్డు) వద్దకు వస్తుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత క్యాబినెట్ ముందుకు వస్తుంది. ఈ ఇండోసోల్ కోసం అధికారులు, క్యాబినెట్ అంతా ముఖ్యమంత్రి కమిటీ చెప్పిన మాటకు తలాడించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పాలసీల వెనక ఏం ఉందో ఉన్నతాధికారులు పరిశీలించాలి కదా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం చేశారు? ఇండోసోల్ కంపెనీకి మొదట్లో నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో 5,148 ఎకరాల భూమిని 10 సంవత్సరాల లీజు అగ్రిమెంటుతో కేటాయించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ ఇండస్ట్రీయల్ ల్యాండ్ పాలసీ వల్ల ఇండోసోల్ కంపెనీ లీజుదారు కాకుండా ఏకంగా భూ యజమానిగా మారిపోయింది.
లీజుదారు కాస్త భూమికి ఓనర్ అయిపోయాడు. పాలసీలో ఏకంగా భూములపై ఔట్ రైట్ పర్చేజ్ చేసుకునేలా నిబంధనలున్నాయి. ప్రభుత్వం దీనికి కొనసాగింపుగా ఫెసిలిటేటర్ గా మారింది. మొదట కంపెనీకి ఇచ్చిన భూమితో పాటు మరో 3,200 ఎకరాలు ఇచ్చేలా స్వయంగా రైతులతో మాట్లాడి ప్రభుత్వమే ఆ కంపెనీకి భూ బదలాయింపు చేసింది. దీంతో మొత్తంగా 8,348 ఎకరాలు ఒక్క కంపెనీకి దక్కాయి. కేటాయించిన భూముల్లో చాలావరకు డీకే పట్టా భూములు, అసైన్ట్ భూములున్నాయి. ఆ ప్రాంతంలో ఒక్కో ఎకరా రూ.50 లక్షల నుంచి రూ.కోటి పలుకుతుంటే, కొందరు మధ్యవర్తులు బెదిరించి మరీ భూములు తీసుకోవడం చూస్తుంటే దీనివెనుక ఎవరున్నారో అర్ధం అవుతోంది.
నెల్లూరు జిల్లాలో అతి పెద్ద భూ యజమానిగా ఇండోసోల్
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూములపరంగా చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అతి పెద్ద ల్యాండ్ యజమానిగా ఇండోసోల్ మారిపోయింది. కృష్ణపట్నం పోర్టుకు విడతల వారీగా భూ కేటాయింపులు జరిగాయి. పోర్టు పెర్ఫామెన్స్, ఇతర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని 4,553 ఎకరాల భూమిని కేటాయించారు. అలాగే రామాయపట్నం పోర్టుకు కూడా ఒకేసారి కాకుండా అవసరాల మేరకు, పెరిగే సామర్థ్యం మేరకు 4,239 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇండోసోల్ కు మాత్రం జిల్లాలోనే అత్యధికంగా 8,348 ఎకరాలు రెండు విడతల్లో దక్కడం వెనుక వైసీపీ పెద్దల కుతంత్రం అర్ధం చేసుకోవచ్చు. ఇంత భారీ మొత్తంలో ఓ కంపెనీని జిల్లాలో అతిపెద్ద భూ యజమాని కింద ప్రభుత్వం మార్చడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
6 నెలల్లో 5 వేల ఉద్యోగాలు ఫట్
ఇండోసోల్ మాతృసంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఎక్కడ నుంచి వచ్చిందో… దాని వెనుక ఎవరున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు షిర్డీ సాయి వాళ్ళ ఎస్.పి.వి. అయిన ఇండోసోల్ కూడా ఎవరిదో ఇట్టే అర్ధం అవుతుంది. 2022 సెప్టెంబరు 5న ఇండోసోల్ కంపెనీ రాష్ట్రంలో 43,143 కోట్ల పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. 3 విడతల్లో ఈ సంస్థ 11,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, పరోక్షంగా మరో 11 వేల మందికి అవకాశం కల్పిస్తుందని ఎంవోయూ చేసుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో మరోసారి ఇదే సంస్థతో ఎంవోయూ చేసుకున్నారు. విశాఖలో ఒప్పందంలో ఇండోసోల్ కేవలం 6 వేల ఉద్యోగాలు ఇస్తుందని చెప్పారు. అంటే ఆరు నెలల కాలంలోనే 5 వేల ఉద్యోగాలు తగ్గిపోయాయి. కంపెనీకు కట్టబెట్టే భూమి పెరిగింది తప్పితే… ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఒక్క కంపెనీకే రాష్ట్రంలో ఇన్ని వేల ఎకరాలు కట్టబెడుతుంటే… పారిశ్రామికంగా అభివృద్ధి, ఆర్థికంగా పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి ఎలా వస్తుంది..? ఇండోసోల్ కంపెనీ పేరుతో వైసీపీ అతిపెద్ద స్కాంకు తెర లేపింది.
కంపెనీకి ఇచ్చే ప్రోత్సాహకాలు చూస్తే మతి పోవాల్సిందే
భూములు కేటాయించిన మాట అటుంచి… చేసుకున్న ఒప్పందాల మతలబులను దాటి వైసీపీ ప్రభుత్వం ఇండోసోల్ మీద కురిపిస్తున్న ఆవాజ్య ప్రోత్సాహకాల ప్రేమ చూస్తే మతి పోవాల్సిందే. ఏ కంపెనీకీ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష ప్రోత్సాహకం (ఫిస్కల్) మరొకటి పరోక్ష ప్రోత్సాహకం (నాన్ ఫిస్కల్). ఇండోసోల్ కు అదీఇదీ అని లేకుండా రెండింట్లోనూ ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. హద్దులు దాటి మరీ కంపెనీకి అనుచిత లబ్ధి చేకూర్చింది. దీనిపై ముఖ్యమంత్రి నేతృత్వంలోని స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) అన్ని శాఖలకు ప్రత్యేకంగా ఆదేశాలను జారీ చేస్తూ లేఖలు రాసింది.
– ఎస్ఐపీబీ నుంచి ఇంధన శాఖకు వెళ్లిన ఆదేశాల మేరకు కంపెనీకి కేటాయించిన భూములను ప్రత్యేక సబ్ కేటరిగి- 3 గా గుర్తించాలి. దాని మేరకు అక్కడ ఏర్పాట్లు తగిన విధంగా చేయాలి.
– ఇచ్చే భూముల్లో ట్రాన్స్ కో సొంత ఖర్చులతో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. దీని నిర్వహణ పూర్తిగా ట్రాన్స్ కో చూసుకోవాలి.
– ఎస్ఐపీబీ నుంచి జలవనరుల శాఖకు వచ్చిన ఆదేశాల మేరకు- సోమశిల, సంగం, కనిగిరి రిజర్వాయర్ల నుంచి రోజుకు 115 మిలియన్ లీటర్ల నీటిని కేటాయించాలి. దీంతో పాటు చుట్టపక్కలున్న చెరువులను కంపెనీకి ఇచ్చేయాలి.
– ఇక ఎస్ ఐ పీ బీ పరిశ్రమల శాఖకు సైతం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకమైన అధికారులతో ఓ ఫీల్డ్ ఆఫీసు ఏర్పాటు చేయాలని చెప్పారు.
– డవలప్మెంటు ఛార్జీలు.. యూజర్ ఛార్జీలు వీరికి వర్తించవు.
– కేటాయించిన భూముల్లో 20 కిలోమీటర్ల పరిధి వరకు ఎవరూ పైపులైను వేయకూడదు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు కూడా ఉండకూడదు.
– ఇక గనుల శాఖకు సైతం ముఖ్యమంత్రి నేతృత్వంలోని బోర్డు నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఆదేశాల్లో ఏకంగా చట్టాలను సవరించి మరీ కంపెనీకి లబ్ధి చేయాలని కోరడం విశేషం. 30 ఏళ్లు క్వార్జ్ మైనింగ్ చేయడానికి అనుమతులు ఇవ్వాలని కోరింది. చట్టాన్ని సవరించాలని, ప్రత్యేక రూల్స్ సవరించాలని కోరింది.
– ఇక ప్రత్యక్ష ప్రోత్సాహకాల్లో భాగంగా కంపెనీకి అన్నీ మినహాయింపులే. నో స్టాంప్ ఫీజు, నో రిజిస్ట్రేషన్ ఫీజు, నో ట్రాన్సఫర్ ఫీజు, నో సెక్యూరిటీ డిపాజిట్. అంతేనా మున్సిపాలిటీ పన్ను, పంచాయతీ పన్ను, ఆస్తి పన్ను అసలే లేదు. ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలు ఉండవు. కనీసం మైన్స్ సీనరేజీ కూడా తీసుకోవద్దని చెబుతూ అడ్డగోలుగా కంపెనీ మీద అవాజ్య ప్రేమను ప్రభుత్వం చూపింది. కేవలం ప్రోత్సాహకాల కోసం కంపెనీకి ప్రభుత్వం వెచ్చించిన సొమ్ము రూ.10 నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక భూమి ధరతో పోల్చుకుంటే ఇది ఎంత ఎక్కువనేది ఊహించుకోవచ్చు.
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అనంతం
జగన్ ప్రభుత్వంలో స్కాం అంటే లిక్కర్ లేదా ఇసుక అనేది కేవలం చిన్న విషయాలే. కళ్లకు కనిపించేవి మాత్రమే. దాదాపు అన్నీ శాఖల్లోనూ కనిపించని, వివరించలేనంత అవినీతి జరుగుతోంది. పేదలకు బటన్లు నొక్కుతున్నానని భ్రమ పరిచే ముఖ్యమంత్రి… వారికి తెలియకుండా వేలాది కోట్లను అన్యాక్రాంతం చేస్తున్నారు. 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినా సామాన్యుడి విద్యుత్ బిల్లు చెల్లింపు కోసం గడువు అడిగితే ఇవ్వని వైసీపీ ప్రభుత్వం ఎవరి కోసం ఇన్ని వేల కోట్లు హడావుడిగా కట్టబెడుతోందనేది సామాన్యులు అర్ధం చేసుకోవాలి. ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు చేస్తున్న తప్పిదాలు తర్వాత వారి మెడకే చుట్టుకుంటాయని గుర్తుంచుకోవాలి’’ అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ నేతలు పోతిన వెంకట మహేష్, నేరెళ్ల సురేష్, అక్కల రామ్మోహనరావు, డాక్టర్ పి.గౌతమ్ రాజ్, అమ్మిశెట్టి వాసు, బేతపూడి విజయ్ శేఖర్, బోని పార్వతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.