సేనానిని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు
జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్’ని (Pawan Kalyan) అనుమానాస్పద వ్యక్తులు ఈ మధ్య ఎక్కువగా అనుసరిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ సంఘటన తరువాత పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు తచ్చాడు తున్నారు అని జనసేన ప్రకటన జారీచేసింది.
పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారు. కారులోని వ్యక్తులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుసరిస్తున్నవారు అభిమానులు ఎంత మాత్రం కాదని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది చెబుతున్నారు. వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు అంటే.. బుధవారం కారులోనూ, మంగళవారం నాడు ద్విచక్రవాహనాలపై అనుసరించారు అని జనసేన జారీచేసిన ప్రకటన తెలుపుతున్నది.
కాగా సోమవారం అర్దరాత్రి ముగ్గురు వ్యక్తులు (Unidentified persons) పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారు. ఇంటికి ఎదురుగా వారు కారు ఆపారు. సెక్యూరిటీ సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ, పవన్ కళ్యాణ్’ని దుర్భాషలాడుతూ గొడవ చేశారు. సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఆయినా సంయమనం పాటించిన సిబ్బంది.. ఈ సంఘటనను వీడియో తీసి జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్’కి అందించగా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు పిర్యాదు చేసినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.