Kapu LeadersKapu Leaders

కాపులు వ్రతం చెడ్డా ఫలితం దక్కుతున్నదా?

ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) బడ్జెట్లో (Budget)కాపులకు (Kapu) 3306 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతున్నది. మరొక పక్కన  మాకు ఏమీ నిధులు కేటాయించడం లేదు అని కాపు యువత చెబుతున్నది. కానీ ఇప్పటి వరకు సుమారు 15000 కోట్లు ఖర్చు చేసాం. నేటి బడ్జెట్లో కూడా సుమారు 3306 కోట్లు కేటాయించాము అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నవి.

వాస్తవానికి ప్రభుత్వం పెడుతున్న ఈ ఖర్చు కాపు కార్పొరేషన్ లక్ష్యాల కోసం కాదు అని తెలుస్తున్నది. అందుకే ప్రభుత్వ వాస్తవ కేటాయింపులు సూన్యమనే చెప్పాలి. ఇది ఎలా అనేది ఒక్కసారి చూద్దాం.

నేటి బడ్జెట్ 2021-22లో  ప్రభుత్వ కేటాయింపులు (Allocations) ఎలా ఉన్నాయి!

కాపు కార్పొరేషన్ (Kapu Corporation) ద్వారా ఖర్చు చేస్తున్నాము అని చెబుతున్న లెక్కలు ఒక్కసారి చూద్దాం. (AP Budget 2021 – 22 ప్రకారం)

వైస్సార్ పెన్షన్ కానుకకి 1083 కోట్లు
వైస్సార్ ఆసరాకి 655 కోట్లు
అమ్మవడి పధకానికి 579 కోట్లు
వైస్సార్ కాపు నేస్తం 500 కోట్లు
జగనన్న వసతి దీవెన 178 కోట్లు
జగనన్న విద్య దీవెన 247 కోట్లు
వైస్సార్ వాహన మిత్ర 34 కోట్లు
వైస్సార్ జగనన్న చేదోడు 17 కోట్లు
వైస్సార్ నేతన్న నేస్తం 7 కోట్లు
ఇతర పథకాలకు 6 కోట్లు
Budget 2021-21లో మొత్తం కేటాయింపులు 3306 కోట్లు (ఈ 3306 కోట్ల కేటాయింపులు సాధారణ పథకాల్లో భాగమే గాని, కాపు కార్పొరేషన్ లక్ష్యాల కోసం కాదు అని అర్ధం అవుతున్నది.)

ఇంతకీ కాపు కార్పొరేషన్ లక్ష్యాలు (Aims of Kapu Corporation)!

అసలు కాపు కార్పొరేషన్’ని ఎనిమిది ప్రధాన లక్షణాలతో నాటి ప్రభుత్వం స్థాపించింది అని తెలుస్తున్నది.

1 . కాపు కార్పొరేషన్ ద్వారా కాపు యువతకి స్వయం ఉపాధి కల్పించడం

2 . చిన్న, మధ్య తరహా వ్యాపార ప్రారంభానికి కావలిసిన ఆర్ధిక సహాయం కాపు యువతకి కల్పించడం

3 . కాపు యువతికి విదేశీ విద్యకి కావలిసిన ఆర్ధిక సహాయం చేయడం.

4 . కాపు యువతకి విద్యోన్నతికి కావలిసిన ఆర్ధిక సహాయం కల్పించడం.

5 . పేద కాపు విద్యార్థిని, విద్యార్థులకు స్కాలర్ షిప్’లు ఇస్తూ వారి ఉన్నత చదువుకి, ఉద్యోగ ప్రయత్నాలకు చేయూత నివ్వడం.

6 . కాపు యువతలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి అవసరమైన వసతులు కల్పించడానికి అవసరమైన ఆర్ధిక సహాయాన్ని ఇవ్వడం.

7 . కాపులకు అవసరమైన కాపు భవనాలు లాంటివి ఏర్పరచడానికి అవసరమైన ఆర్ధిక సహాయాన్ని ఇవ్వడం.

8 . కాపు వెల్ఫేర్ ఫండని ఏర్పరిచి వారికి అవసరమైన సమయాల్లో ఉపయోగపడేటట్లు చూడడం.

అగ్ర వర్ణాలతో పోటీపడలేని కాపు యువతికి కొన్ని ప్రత్యేక వసతులు, ఆర్ధిక సహాయం కాపు కార్పొరేషన్ ద్వారా కల్పించడం వల్ల వారు ఆర్ధికంగా నిలదొక్కుకొంటారు. ఆవిథంగా చేయడం వల్ల కొన్ని సంవత్సరాల తరువాత కాపుల్లో అభివృద్ధి వస్తుంది. అప్పుడు కాపుల్లో ఉన్న వెనుకబాటు తనం పోతుంది అనే లక్ష్యాలతో ప్రారంభించిన కాపు కార్పొరేషన్ నేడు చేస్తున్నది ఏమిటి?

నాటి నుండి నేటి వరకు కేటాయింపుల చరిత్ర (Kapu History):

2015 నుండి 2019 వరకు 4000 వేల కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేశారు అని కాపు కార్పొరేషన్ ఎండీ జులై 16 , 2019 న ప్రకటించారు. (జులై 17 , 2019 న టైమ్స్ అఫ్ ఇండియాలో వచ్చిన స్టేటుమెంట్ ఆధారంగా). 2019 – 20 లో మరో 2800 కోట్లకు పైగా, 2020 -21 బడ్జెట్లో 3090 కోట్లు అలానే 2021 – 22 బడ్జెట్లో 3306 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా పంచినట్లు నేటి బడ్జెట్’లో చెప్పారు. అంటే ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్ ద్వారా కాపు యువతకి సుమారు 15000 వేల కోట్లకి పైగా పంచినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ప్రభుత్వం పంచిన ఈ కోట్లలో ఎంత మంది కాపు యువత ప్రయోజనం పొందారు? ఎంత మంది కాపు యువత వ్యాపార వేత్తలుగా మారారు? ఎంత మంది విదేశీ విద్య పొంద గలిగారు? ఎంత మంది కాపు తదితర కుటుంబాలు ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ప్రయోజనం పొందారు? ఎన్ని కాపు భవనాలు కట్ట గలిగారు. కాపులకి ఎంత కార్పస్ ఫండ్ ఏర్పరిచారు అనేది నేటికీ ప్రస్నార్ధముగానే మిగిలింది. 

అంతరం/తేడా ఎక్కడ ఉన్నది?

కాపు కార్పొరేషన్’కి కేయాయించిన ప్రతీ పైసా కాపు కార్పొరేష లక్ష్యాల కోసమే ఖర్చు చేసినప్పుడు నిజమైన ప్రయోజనం ఉంటుంది. కానీ ప్రభుత్వాలు సాధారణ పధకాలను కాపు కార్పొరేషన్’లో చూపడంతోనే అసలు సమస్య మొదలు అవుతున్నది. అందుకే కాపు కార్పొరేషన్ స్థాపించడం వెనుక ఉన్న లక్ష్యం పక్కదారి పడుతున్నది అనే అనుమానాలు కాపుల్లో కలుగుతున్నది?

కాపు కార్పొరేషన్ లక్ష్యాలు అనేవి కాపు యువతని తన కాళ్లపై తాము నిలదొక్కుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ నేటి పధకాలు కాపులను నిరంతం పరాన్నజీవులుగా ఉంచడానికి మాత్రమే ఉపకరిస్తాయి అని యువత భావిస్తున్నది. 

కాపు కార్పొరేషన్ లేకపోతే అమ్మవడి (Ammavadi) కాపులకి ఇవ్వరా? కాపు కార్పొరేషన్ లేక పోతే ఆసరా పధకం కాపులకు వర్తించదా అని అడిగే కాపు నాయకుడు నేడు లేక పోయాడా అని కాపు యువత ఆవేదన చెందుతున్నది.

ఇంతకీ కాపు కార్పొరేషన్’కి నిధులు ఇవ్వడం లేదు అనే కాపు యువత ఆరోపణలు తప్పా లేక ఇప్పటి వరకు సుమారు 15000 కోట్ల రూపాయిలు ఖర్చు చేసాము అని చెప్పే ప్రభుత్వాలది తప్పా? ఈ మొత్తం విషయాలపై నిజా నిజాలు తెలియాలి అంటే కాపు ఉద్యమ నాయకులు, కాపు మేధావులు, మీడియా వివరించి చెప్పాలి. కానీ వీరిలో ఎవ్వరు నోరు విప్పి నిజానిజాలు చెప్పడం లేదు. అందుకే కారణాలు ఏమిటో ప్రజలకి తెలియడం లేదు.

పరిస్కారం ఏమిటి?

కాపుల వ్రతం చెడ్డా ఫలితం కాపులకి దక్కిందా? చివరికి కాపులకి మిగిలేది ఏమిటి అనే అనుమానాలు కాపు యువతలో ఉన్నవి. కావున కాపు ఉద్యమ నాయకులు, కుల సంఘాల నాయకులు, ప్రభుత్వ పెద్దలు కూడా స్పందించి వీరి అనుమానాలు నివృత్తి చేయాలి. వివరణ ఇవ్వాలి.

ప్రభుత్వం ఇచ్చే సాధారణ పధకాలు కూడా కాపు కార్పొరేషన్’లో వేసి చూపడం తప్పా ఒప్పా అని కాపు నాయకులు/మేధావులు నోరి విప్పి మాట్లాడకపోవడంతో గందరగోళం మరింత పెరుగుతుంది. కాపు కార్పొరేషన్ ఏ లక్ష్యాలతో స్థాపించారో ఆ లక్ష్యాలతో నేడు పనిచేస్తున్నదా? లేకపోతే అందుకు కారణం ఏమిటి? అనే విషయాలను తమ యువతకి కాపు నాయకులు చెప్పగలగాలి. లేకపోతే కాపు యువతలో అసహనం, అనుమానాలు మరింత పెరుగుతాయి. తద్వారా ఈ జాతులకు, ప్రభుత్వాల మధ్య అంతరం మరింత పెరుగుతుందేమో?

కాపులు మంచాలు దిగేసి కంచాలు కొట్టి సాధించిన కాపు కార్పొరేషన్ నేడు చేస్తున్నది ఏమిటి? కాపు నేస్తం కోసమేనా కాపులు కాపు ఉద్యమాలు చేశారు. అమ్మ వడి కోసమేనా కాపులు వినాశకారులు అనే ముద్ర వేసికొన్నారు. చంద్రబాబు 500 కోట్లు ఇవ్వలేదు అని ఉద్యమాలు చేసిన కాపు ఉద్యమకారులు నేడు ఏమి చేస్తున్నారు? కాపు కార్పొరేషన్ ఉందా లేదా అనే అనుమానాలు నివృత్తి చేయడానికి కూడా కాపు కులసంఘాలు గాని, కాపు ఉద్యమ సంఘాలు గాని, కాపు నాయకులూ గాని, కాపుల నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కానీ నేడు ఎందుకు నోరెత్తడం లేదు. కాపు యువత లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పడం లేదు? ఆలోచించండి.

*****

(కాపు యువతకి, నాయకులకి, ప్రభుత్వాలకు మధ్య అపోహలు పోయి, అంతరం తగ్గాలన్నదే మా వ్యాఖ్యానం వెనుక అంతరార్ధం అని తెలిసికోగలరు.)

వైయస్సార్ క్రౌర్య కౌగిలిలో కాపులు: కరణం భాస్కర్

Spread the love