Karanam MalleswariKaranam Malleswari

ఢిల్లీ క్రీడా విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్’గా ( వీసీ) కరణం మల్లీశ్వరి (Karanam Malleswari) నియమితులయ్యారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ (Kejriwal)ను  కరణం మల్లీశ్వరి  ఈ సందర్భంగా కలిసి వివిధ విషయాలు చర్చించారు. కరణం మల్లీశ్వరితో ఈ రోజు సమావేశమై, పలు అంశాలపై చర్చించినట్టు కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ (Delhi Sports University) త్వరలో ప్రారంభం కానుంది. మా పెద్ద కల సాకారం కాబోతున్నది. ఒలింపిక్స్‌లో (Olympics) పతకం సాధించిన కరణం మల్లీశ్వరి తొలి వీసీ కావడం మాకు ఎంతో గర్వకారణం అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) కూడా పాల్గొన్నారు.

శ్రీకాకుళం (Srikakulam) జిల్లాకు చెందిన మల్లీశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే.

పవన్‌ శుభాకాంక్షలు

దేశం గర్వించదగ్గ మన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి ఢిల్లీ క్రీడా వర్సిటీకి వీసీగా నియమితులు అవ్వడం గర్వించదగిన విషయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒక ప్రకటనలో అన్నారు. దేశంలో క్రీడా రంగం అభ్యున్నతికి దోహదపడే విశ్వవిద్యాలయానికి తొలి వీసీగా బాధ్యతలు ఆమె చేపట్టనున్నారు. అందుకుగాను మల్లీశ్వరికి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేసారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి సిడ్నీ ఒలింపిక్స్‌ వరకు మల్లీశ్వరి సాగించిన ప్రస్థానం ఎంతో విలువైనదని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతోమంది యువతులకు మల్లేశ్వరి స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడు ఈ కీలక బాధ్యతల్లోనూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తారనే విశ్వాసం తనకు ఉందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా యూనివర్సిటీ ద్వారా దేశం గర్వించదగ్గ ఛాంపియన్లను మల్లేశ్వరి అందించాలని పవన్ అన్నారు. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను ఆమె తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ సూచించారు.