హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
తాడిత పీడిత బాధిత వర్గాల నుండి ఎదిగి, ఎంతో ఆణుకువతో ఒదిగి ఉంటూ అందరికీ చేదోడు, వాదోడుగా సత్య ప్రభ కుటుంబం (Satya Prabha) ఉంటూ వస్తోంది. అటువంటి మంచి మనిషి సత్యప్రభ ఇకలేరు అనే వార్త తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాడిత పీడిత బాధిత వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.
డీకే ఆదికేశవులు నాయుడి (Adikesavulu Naidu) ధర్మపత్నీ, చిత్తూరు (Chittoor) మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ (Telugudesam) జాతీయ నాయకురాలు డీకే సత్యప్రభ అంత్యక్రియలు (Funeral) అశ్రునయనాల మధ్య బెంగళూరులో (Bangalore) జరిగాయి. ఆమె కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ శరీరంలో వివిధ అవయవాలు పనిచేయక పోవడంతో బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. చివరి చూపు కోసం శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆమె పార్థీవ దేహాన్ని ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉంచారు. అనంతరం వైదేహి ఆసుపత్రి ప్రాంగణంలోనే సత్యప్రభ భర్త, మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు సమాధి పక్కన హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించారు.
రామ్‌చరణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు
ప్రముఖ హీరో చిరంజీవికి, ఆదికేశవుల నాయుడు కుటుంబానికి బంధుత్వం ఉండడంతో ఆయన తరఫున తనయుడు రామ్‌చరణ్ తేజ్ విచ్చేసి సత్యప్రభ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కర్ణాటక రెవెన్యూశాఖ మంత్రి ఆర్ అశోక్, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.