Senani in Wargal campaignSenani in Wargal campaign

ఏ మార్పు కోసం బిడ్డలు బలిదానాలు చేశారో వాటిని సాధించి తీరుతాం
ఆంధ్రాలో పర్యటించినట్లే తెలంగాణలో పర్యటిస్తా
దళితుడ్ని సీఎంగా చూడలేకపోయాం.. బీసీనైనా ముఖ్యమంత్రిగా చూద్దాం
భారీ మెజార్టీతో బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించండి
హనుమకొండ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

ఆంధ్రలో రౌడీలు (Rowdy Darbar in Andhra Pradesh) రాజ్యమేలుతున్నారు అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan0 వంరగల్ లో ప్రసంగిస్తూ సంచలన ఆరోపణలు చేసారు. రౌడీలను (Rowdies), గూండాలను, ఫ్యాక్షనిస్టులను (Factionist) ఎదుర్కొని నిలబడి ఉన్నానంటే దానికి ముఖ్య కారణం తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తి. ధన బలం లేకపోయినా గుండె ధైర్యం, ఆశయ బలం ఉంటే ఏదైనా సాధించవచ్చునని ఈ నేల నేర్పింది. 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అవినీతి, కమీషన్ల తెలంగాణగా మారిపోవడం చూసి బాధ కలిగింద”ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని, ఇక్కడి యువత బంగారు భవిష్యత్తు కోసం నా వంతు కృషి, పోరాటం చేస్తానని చెప్పారు. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో … వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో అలాగే తిరుగుతానని తెలిపారు.

ఏ మార్పు కోరుతూ తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేశారో… అది సాధించి తీరుతామన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, జనసేన నాయకుల విజయాన్ని కాంక్షిస్తూ హనుమకొండలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల నుంచి శ్రీమతి రావు పద్మ, శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఎన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదురైనా దశాబ్ద కాలంగా జనసేన పార్టీని స్థిరంగా ముందుకు నడుపుతున్నామంటే దానికి కారణం తెలంగాణ నేల నేర్పిన పోరాట స్ఫూర్తి. ఈ వరంగల్ నేల ఎంత గొప్పదంటే “పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది” అని నినదించిన ప్రజా కవి కాళోజీ, “నా తెలంగాణ.. కోటి రత్నాల వీణ” అని రాసిన దాశరధి వంటి మహానుభావులకు జన్మనిచ్చిన నేల. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నరేంద్రమోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఆకాంక్షించి 2014లో ఈ నేల నుంచే మద్దతు తెలిపాను. ఆయన ప్రధాన మంత్రి అయ్యారు.

అమరుల త్యాగాల గౌరవార్ధమే గళం విప్పలేదు

తెలంగాణ రాష్ట్రం సాధించి దశాబ్ధ కాలం అవుతోంది. మొన్న జరిగిన ప్రధానమంత్రి మోడీ గారి మీటింగ్ లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేదని చాలా మంది అడిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 4 కోట్ల మంది ప్రజలు కొట్లాడారు. సకల జనుల సమ్మె జరిగింది. 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలి దానాలు చేశారు. వారందరి గౌరవార్ధం, తెలంగాణలో పుట్టిన పార్టీలే అధికారంలో ఉండాలని కోరుకొని దశాబ్ద కాలంపాటు గళం విప్పలేదు. అవినీతి రహిత తెలంగాణ, అందరినీ సమానంగా చూసే తెలంగాణ కావాలని మనం కోరుకుంటే… అది ఏ స్థాయిలో సాధ్యమయ్యిందో మనందరికి తెలుసు. తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు ఇక్కడ పోటీ చేస్తామని చెప్పాను.. మన నాయకులు కోరుకున్నారు అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డాం.

ఎంత ధైర్యం ఉంటే కమీషన్ల గురించి పబ్లిక్ గా మాట్లాడతారు

అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని అందరం కోరుకున్నాం. కానీ కమీషన్ల తెలంగాణగా రాష్ట్రంగా మారిపోవడం చూసి బాధ కలిగింది. ఈ మధ్య అధికార పార్టీ నాయకుడు ఒకరు ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రాజెక్టులలో కమీషన్లు ఎలా తీసుకుంటారో పబ్లిక్ గా టీవీల్లో మాట్లాడుతున్నారు. ఇది అవినీతి అలవాటు అయిన ఆంధ్రలో అయితే అంతగా ఆలోచించేవాడిని కాదు. 1200 మంది బలి దానాలతో ఏర్పాటైన తెలంగాణలో జరగడం మనసుకు బాధనిపించింది. అమరుల త్యాగాలతో వచ్చిన రాష్ట్రం ఇలా అవినీతి పాలవుతుందని కలలో కూడా అనుకోలేదు. 8 శాతం, 6 శాతం అని భయం లేకుండా మాట్లాడుతున్నారు. ఇందుకోసమేనా తెలంగాణ సాధించుకుంది. యువతలో నిజంగా పోరాట స్ఫూర్తి ఉంటే వాళ్లు అంత ధైర్యంగా మాట్లాడే వారు కాదు.

మా ఆశయం మోడీతో సాధ్యమవుతుందని నమ్ముతున్నాం

రాష్ట్రంలో 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారు. రాజ్యాధికారంలో వారికి ముఖ్య పాత్ర ఉండాలి అని 2009లో ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పారు. దానిలో భాగంగానే సామాజిక తెలంగాణ కావాలి, బీసీలకు న్యాయం జరగాలని ప్రయాణం మొదలు పెట్టాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా దానికి కట్టుబడే ముందుకు వెళ్లాం. గద్దరన్న పాట ఆగిపోయినా నేను ఆగిపోను. ఆయన స్పూర్తితో ప్రజల తరపున గళమెత్తుతూ ఉంటాను. మోడీ గారంటే నాకు అపారమైన గౌరవం. ఉగ్రవాదాన్ని అణచి వేసిన నాయకుడు. మోడీ గారు ప్రధాని కాక ముందు మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉండేది. ఆయన ప్రధాని అయ్యాక ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ మంది బీసీలే ముఖ్యమంత్రులు అయ్యారు. తెలంగాణలో కూడా బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ అధిష్టానం, ప్రధానమంత్రి గారు మాట ఇచ్చారు. మేము ఏ ఆశయంతో ఇన్నాళ్లు ముందుకు నడుస్తున్నామో ఆ ఆశయం ఇలా నెరవేరుతుండటం చూసి ఆనందం కలిగింది. అందుకే తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు. అది చూడలేకపోయాం. బీసీల నుంచి వచ్చిన నాయకుడిని అయినా ముఖ్యమంత్రిగా చూద్దాం. బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీల నుండి ముఖ్యమంత్రి కావాలి అని బలంగా కోరుకుంటున్నాను. బీజేపీతో కలిసి బలంగా తెలంగాణలో నిలబడతాం. తెలంగాణలో జనసేన ఎప్పటికీ ఉంటుంది అని మాటిస్తున్నాను.

భారీ మెజార్టీతో గెలిపించండి

దశాబ్ద కాలంగా తిరుగుతున్నా ఆంధ్ర ప్రదేశ్ లోనే అధికారం కోసం అర్రులు చాచలేదు. తెలంగాణలో అధికారం కోసం చూడటం లేదు. మార్పు కోసం వస్తున్నాను. బీసీని ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్న వారిలో నేనూ ఒకడిని. ఏ మార్పు కోసం అయితే 1200 మంది ఆత్మ బలిదానాలు చేశారో ఆ మార్పు సాధించి తీరుతాం. ఆంధ్రలో ఏ విధంగా అయితే తిరుగుతున్నానో వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో కూడా తిరుగుతాను. యువత బంగారు భవిష్యత్తు కోసం నా వంతు కృషి చేస్తాను. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి శ్రీమతి రావు పద్మ గారు, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీ ఎర్రబెల్లి పద్రీప్ రావు గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. సమయాభావం వలన ఎక్కువ నియోజకవర్గాలు తిరగలేకపోతున్నాను. ఎక్కడైతే బీజేపి అభ్యర్థులు ఉన్నారో అక్కడ జనసేన శ్రేణులు, జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట బీజేపీ శ్రేణులు మద్దతుగా నిలబడాలని పిలుపునిస్తున్నాన”ని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ధర్మరావు, వన్నాల శ్రీరాములు, జనసేన నాయకులు ఎర్రబెల్లి వినీల్ రావు, రాధారం రాజలింగం, ఇరుపార్టీల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సీఎం సన్నిహిత సంస్థ ఇండోసోల్’కి 8,348 ఎకరాల భూ సంతర్పణ!