Pawan Kalyan on Republic dayPawan Kalyan on Republic day

పాలకుల దుర్నీతిని ఎండగట్టండి-జనసేనని ఎన్నుకోండి: సేనాని

రాష్ట్రంలో చిచ్చుపెట్టే వ్యక్తిని కాను… చక్కదిద్దేవాడిని
నా వెంట బలంగా నిలబడండి-పని చేయకుంటే నిలదీయండి
వైసీపీ అధినేతకి ఉన్నది అణగారిన కులాలపై ఆధిపత్యం, అహంకారం
స్వప్రయోజనాల కోసం రాష్ట్రం విడదీయాలని కోరితే సహించం
పోలీసులను కొట్టిన వ్యక్తి ఇప్పుడు శాంతిభద్రతలు కాపాడే నాయకుడు!
నేరరహిత ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యం
యువతను పూర్తిగా నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం
రాజకీయ స్థిరత్వం కోసం జనసేనకు అవకాశం ఇవ్వండి
జీవితమంతా ఆంధ్రప్రదేశ్ కోసం కూలీగా పని చేస్తా
మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమావేశంలో పవన్ కళ్యాణ్

 

‘కోనసీమలో నాలుగు కులాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకుందాం అనుకున్నారు. సొంత మంత్రి ఇంటిని తగులబెట్టించారు. కనీసం ఈ రోజు వరకు ఆయనను పరామర్శించింది లేదు. ఆ కేసు కూడా ఏమైందో తెలియదు. ఈ వైసీపీ నాయకుడికి అధికారం కోసం కింది కులాలను వాడుకోవాలి అనే తాపత్రయం. ఆధిపత్య ధోరణి తప్ప మరేం లేవు. వీరి కుటిల నీతిని యువత అర్థం చేసుకోవాలి. తెలంగాణ యువత మాదిరి కులాలకు అతీతంగా రాష్ట్ర యువత బయటకు వచ్చి ఈ పాలకుల కుతంత్రాలు పసిగట్టకపోతే రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలవుతుంది’ అని జనసేన అధ్యకులు పవన్ కళ్యాణ్ అన్నారు.

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం పార్టీ నేతలు, శ్రేణులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

ఇదీ వైసీపీ అధినాయకుడి నైజం

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “మొన్న రాజమహేంద్రవరానికి చెందిన ఓ వైసీపీ నాయకురాలు కులాలను కించపరిచేలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు అధికార పార్టీలో పదవి ఉంది. ఆ వ్యాఖ్యలు ఇతర కులాలను తీవ్రంగా కించపరిచే విధంగా ఉన్నాయి. కనీసం ఆ పార్టీ నాయకురాలి మీద, ఆమె వ్యాఖ్యల మీద వైసీపీ నాయకత్వం చర్యలు తీసుకున్నది లేదు. ఇదీ వైసీపీ అధినాయకుడి నైజం. ప్రతి కులానికి ఆత్మాభిమానం ఉంటుంది. దానిని కించపరిచే మాటలు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఆంధ్ర ప్రజలకు కులం మీద ఉన్న పిచ్చి ఆంధ్ర జాతి మీద లేదు. కులం తాలూకా అసమానతలు, వారి సామాజిక పరిస్థితులు అర్థం చేసుకున్న భారతీయుణ్ణి. కచ్చితంగా ప్రతి కులం సాధికారత, స్వాభిమానం కాపాడేలా చూస్తాం అని పవన్ కళ్యాణ్ వివరించారు.

పాలకుల దుర్నీతిని గ్రహించండి

కులాల మధ్య చిచ్చుపెట్టే పాలకుల దుర్నీతిని అర్ధం చేసికొనుడి. అర్ధం చేసుకోకపోతే అభివృద్ధి తమిళనాడు, గుజరాత్, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతుంది. ఆంధ్రప్రదేశ్’కు రాజకీయ స్థిరత్వం కావాలి. జనసేన పార్టీ వల్ల అది వస్తుంది అని ప్రజలు బలంగా నమ్మి నా వెంట నిలబడండి. కచ్చితంగా ఒక కూలీగా మారి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని మీకు కళ్లకు కట్టినట్టు చూపిస్తాను.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇచ్చిన విందుకు వెళ్ళినప్పుడు గద్దర్ కలిశారు. ఆయన ఒక మాట అన్నారు.. ఒక చేయి మన కులం కోసం అందిస్తే రెండో చెయ్యి అభ్యున్నతి సాధించాల్సిన కులాలకు అందించాలి అని… అది నిజంగా సత్యం అని జనసేనాని తెలిపారు.

మీ అవసరాల కోసం రాష్ట్రం ముక్కలు చేయాలా?

ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నాయకులు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతుంటే, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వంటి నేతలు రాయలసీమ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నారు. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు కదా.. రాయలసీమ ప్రాంతానికి చేసింది ఏమిటి..? ఇప్పుడు కొత్తగా మీరు చేసేది ఏంటి? మీకు పదవులు లేనపుడు, మీ సొంత ప్రయోజనాలు కోసం రాష్ట్రాలు విడదీయండి అంటే తోలు తీసి కూర్చోబెడతాం. ఇప్పటికే చాలా విసిగిపోయి ఉన్నాం. మీ డ్రామాలు ఆపండి.

ముందు కర్నూలులో వలసలు గురించి, సీమ సాగునీటి గురించి, కడప ఉక్కు పరిశ్రమ వంటి సమస్యల మీద మాట్లాడండి. అంతేగాని ఇష్టానుసారం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు పెడితే మాత్రం సహించేది లేదు. మా నేల.. మా భూమి అని డ్రామాలు చేయకండి. మేం కూడా ఇక్కడి వాళ్ళమే. భారతీయులమే. కాబట్టి మీ అవకాశవాద డిమాండ్లు ముందుకు తీసుకొచ్చి ప్రజలను మభ్య పెట్టకండి. నేను రాష్ట్ర యువతకు ఇదే కోరుతున్నాను. అవకాశవాద రాజకీయాలు చేసేవారి మాటలు వినకండి. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే వారిని జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది. వేర్పాటువాద ధోరణితో నాయకులు మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని చూడరు. అంత కోపంతో చెప్తున్నాను వినండి అంటూ పవన్ కళ్యాణ్ తన ఆవేదనని వెలిబుచ్చారు.

సెక్యులరిజం పేరుతో మనోభావాలు గాయపరచవద్దు

కొందరు హేతువాదం పేరుతో హిందువుల మనోభావాలను ఇటీవల గాయపరచడం బాధిస్తోంది. సెక్యులరిజం పేరుతో నోటికి వచ్చినట్లు హిందూ దేవతల మీద, ఆలయాల మీద మాట్లాడటం సహేతుకం కాదు. స్వామి అయ్యప్ప గురించి, సరస్వతీ దేవి గురించీ ఇష్టారీతిన మాట్లాడి భక్తులను బాధపెడుతున్నారు. కచ్చితంగా నేను సనాతన ధర్మాన్ని నమ్ముతాను. ఆచరిస్తాను. నేను సనాతన ధర్మాన్ని నమ్మి ఆచరించడం తప్పు కాదు.. వేరే మతాన్ని, దేవుళ్ళని కించపరిస్తే అది తప్పు అవుతుంది. అప్పుడు మాత్రమే నన్ను విమర్శించండి.

ఇష్టానుసారం హిందూ దేవతలను, హిందూ ఆచారాలను, సంప్రదాయాలను పనిగట్టుకుని విమర్శించడం మానుకోవాలి. నాస్తికత్వం పేరుతో ఇతర మతాల మీద మాట్లాడటానికి భయపడే వారు సైతం హిందు ధర్మాన్ని, దేవతల మీద ఇష్టానుసారం మాట్లాడుతూ గొప్పవారిగా ఫీల్ అవుతున్నారు. ఇది మారాలి. ఎవరి దేవుడు.. ఎవరి ధర్మం వారికీ గొప్పే అని జనసేనాని అన్నారు.

మీరు సెల్యూట్ చేసే నాయకుడికి మీ మీద నమ్మకం లేదు

రాష్ట్రంలో శాంతిభద్రతలు బలంగా ఉండాలి. గట్టిగా ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి పోవాలి. గతంలో మానవ హక్కుల వేదిక ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకప్పుడు పులివెందుల పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్.ఐ.లను కొట్టిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్రంలోని శాంతి భద్రతలను కాపాడే నాయకుడు. కోడి కత్తితో పొడిపించుకుని ఆంధ్ర పోలీసులపై నాకు నమ్మకం లేదని చెప్పారు. తెలంగాణ వచ్చి ఓ ప్రఖ్యాత డాక్టర్ను కలిసి చికిత్స చేయించు కున్నాడా వ్యక్తి.

ఆ రోజు వైద్యం చేసిన డాక్టర్’కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఛైర్మన్ పదవి ఇచ్చిన గొప్ప నాయకుడు ఇప్పుడు పాలకుడు. పోలీసులు సెల్యూట్ చేసే నాయకుడికి ఆంధ్ర పోలీస్ మీదనే నమ్మకం లేదు అని ప్రకటించిన వ్యక్తి అనేది పోలీసులు గుర్తుంచుకోవాలి. నేరరహిత ఆంధ్ర ప్రదేశ్ జనసేన లక్ష్యం. బాబాయిని చంపి గుండెపోటు అన్నారు. కోడి కత్తితో పొడిపించుకొని పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పే వ్యక్తిని కాదు. కచ్చితంగా శాంతి భద్రతలను కాపాడేందుకు బలంగా నిలబడతాం అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

యువతను మోసం చేసిన వైసీపీ నాయకులు సిగ్గుపడాలి.

యువతకు ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక వారిని నిలువునా మోసం చేసిన వైసీపీ నాయకులు సిగ్గుపడాలి. రూ.5 వేలు నెలకు వచ్చే ఉద్యోగాలు ఇచ్చి అవి మా గొప్పతనం అని చెప్పుకుంటున్న వైసీపీ పెద్దలు తలదించుకోవాలి. తండ్రి శవం ఇంట్లో ఉండగానే సీఎం కుర్చీ కోసం ఆరాటపడి, రాచరిక పద్ధతిలో దాన్ని సొంతం చేసుకోవాలి అని నియంత ధోరణితో ఆలోచించే వ్యక్తి నుంచి యువతకు ఇంకేం భరోసా లభిస్తుంది.

యువత అన్యాయం మీద తిరగబడకపోతే పుట్టబోయే తరాలు కూడా బానిసలుగా బతకడం ఖాయం. అలాగే రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు ఆవేదనకు, ఆర్ద్రత ఆక్రోశానికి జనసేన పార్టీ గళంలా పని చేస్తుంది. దివ్యాంగులు స్వయం శక్తితో, ఆర్థిక వృద్ధి సాధించేందుకు పటిష్టమైన ప్రణాళిక జనసేన పార్టీ చేస్తుంది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తే దివ్యాంగులకు తోడ్పడే ఆర్థిక పథకాలు తప్పనిసరిగా ఉంటాయి.

అలాగే వీర మహిళలు పారిశ్రామిక వృద్ధి సాధించేలా వారికి తగిన విధంగా తోడ్పాటు అందిస్తాం. యువత కు నేను చెప్పేది ఒక్కటే. ఎవరి మీదా వ్యక్తిగత ఆరాధన అధికంగా చేయకండి. తప్పు చేస్తే ముఖం మీద చెప్పండి కచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటాం. ఇటీవల నేను ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడినప్పుడు ఏ ఫిర్యాదు ఇచ్చారు.. ఏం మాట్లాడారు అని సకల శాఖ మంత్రి సజ్జల తెగ ఆరాటం చూపించారు. కచ్చితంగా ఈసారి మాత్రం ప్రధానిని కలిసినప్పుడు కచ్చితంగా రాష్ట్రంలో హిందూ ఆలయాలు ధ్వంసం గురించి ఫిర్యాదు చేస్తాను అని జనసేనాని హెచ్చరించారు.

ఏ వ్యూహం అయినా రాష్ట్రం కోసమే

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ఎలాంటి వ్యూహమైనా నాకు వదిలేయండి. కచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి, భవితకు సంబంధించిన వ్యూహాలు నేను రచిస్తాను. ఈ రాష్ట్రానికి ఏది మంచిదో అదే జరుగుతుంది. పార్టీ నిర్మాణం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. రాత్రి వేళ పెరుగు తోడు వేస్తే.. అది ఉదయం నాటికి పెరుగుగా మారుతుంది. ప్రతి దానికి సమయం కావాలి. అలాంటిది గొప్ప ఆశయంతో పెట్టిన పార్టీ నిర్మాణం అంత తేలిక కాదు.

ఒకే ఆశయంతో ఉన్న బలమైన వ్యక్తుల సమూహం కావాలి. లేడికి లేచిందే పరుగులా నేను ఇప్పటికి ఇప్పుడు ముఖ్య మంత్రి అయిపోవాలని పార్టీ పెట్టలేదు. ఒక్కోటి మెల్లగా జరుగుతుంది. మీరు మీ పని నిజాయతీగా చేసుకొని ముందుకు వెళ్ళండి. నా కుటుంబాన్ని వదిలేసి ప్రజలే కుటుంబంగా భావించి వచ్చాను. జీవితాంతం ప్రజల కోసం ఒక కూలీగా మారి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కచ్చితంగా అద్భుతంగా ఉంటుంది నాకు అండగా నిలబడండి.. ఎక్కడికి వెళ్ళం.. పెద్ద అపజయం వచ్చినా బలంగా నిలబడిన వాళ్ళం. ఇక్కడే ప్రజల్లోనే ప్రజల వెన్నంటే ఉంటాం. చాలామంది నన్ను చాలా రకాలుగా మాట్లాడుతారు.. ఒకసారి కమ్యూనిస్టు అంటాడు.. మరోసారి మార్క్సిస్టు అంటాడు. నాకు నిలకడ లేదు అని మాట్లాడిన వారు ఉన్నారు.

ముందుగా నేను మానవతావాదిని. నా ప్రజల అవసరాల కోసం మారే మధ్యస్థవాదిని. నాకు ప్రత్యేక అజెండాలు ఏమీ ఉండవు. ప్రజలే అజెండా వారికీ జరిగే మంచి మాత్రమే నా అజెండా. నాది 5 ఏళ్లకు ఒకసారి మారే ఎన్నికల ఐడియాలజీ కాదు. వచ్చే భావితరాల కోసం ఆలోచించే 25 ఏళ్ల ఐడియాలజీ. సంఖ్యా బలం లేని అణగారిన కులాలకు బలంగా నిలబడాలి అని భావించే ఆలోచన విధానం. పూర్తిస్థాయి అవగాహనతో మాట్లాడే నైజం. దీనిని రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడిన పెద్దగా దానిని పట్టించుకోను అని పవన్ కళ్యాణ్ అంన్నారు.

30 ఏళ్లకు ఒకసారి తరం ఆలోచన విధానం మారుతుంది.

ఆంత్రపాలజిస్టులు చెప్పిన మాటలు ప్రకారం ప్రతి 30 ఏళ్లకు ప్రజల ఆలోచన విధానం మారుతుంది. 1970 దశకం తర్వాత భారతీయ దొరతనం వచ్చింది. మేమే గొప్ప.. మాదే అధికారం అనే భావన వచ్చింది. అలాంటి పరిస్థితులు నేటికీ ఉన్నాయి. మళ్లీ తరం మారాలి. భవిష్యత్తు గురించి ఆలోచించే గొప్ప ఆలోచన విధానం ఉన్న భావితరం రావాలి. కాంగ్రెస్ పార్టీ మీద పోరాడిన లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, నాని ఫాల్కివాలా, స్వామి వివేకానందుడు, నారాయణ గురు వంటి గొప్ప వ్యక్తుల స్ఫూర్తి జనసేనకు మూలం.

చట్టాన్ని పూర్తిగా గౌరవించే వ్యక్తిని. మొన్నటి వరకు కొందరు వ్యక్తులు వారాహి ఎలా తిరుగుతుందో చూస్తాం చేస్తామంటూ పేట్రేగిపోయారు. వేలకోట్లు, ఎకరాలు దోచేసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేసిన మీకే అంత నోరు ఉంటే… చట్టాన్ని పూర్తిగా గౌరవించే వ్యక్తిగా నాతో గొడవ పెట్టుకో… నేను ఏంటో చూపిస్తా అని జనసేనాని హెచ్చరించారు.

మహా మనుషులకు పురస్కారాలు రావడం సంతోషం

కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలు వచ్చిన వారికీ నా తరపున, జనసేన తరఫున హృదయపూర్వక అభినందనలు. గొప్ప వ్యక్తులకు, పురస్కారాలు వచ్చాయి. సంకురాత్రి చంద్ర శేఖర్ గారి గొప్ప సేవకులను, పరిశోధకులను ఎంపిక చేశారు. గౌరవం దక్కాల్సిన వ్యక్తులకు వీటిని ఎంపిక చేసిన కేంద్ర పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన వ్యక్తులకు తగిన గౌరవం ఇవ్వడం, వారిని సన్మానించుకోవడం ముదావహం” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాక్షస సంహార శక్తి సిద్ధిరస్తు – అనుష్టుప్ యాత్రా ఫల సిద్ధిరస్తు!