Pawan Kalyan Gajuwaka meetingPawan Kalyan Gajuwaka meeting

జగన్ కి అదృష్టం అందలం ఎక్కిస్తే… బుద్ధి బురదలో ఉంది
ఎన్ని వేషాలు వేసినా జగన్ ఓటమి తధ్యం
ప్రజలు చైతన్య కెరటమై వస్తున్నారు.. సింహాసనం ఖాళీ చెయ్ జగన్
కొండలపై ఉండాల్సింది దేవుళ్లు… క్రిమినల్స్ కాదు
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై మాట్లాడలేని అసమర్థడు జగన్
పార్లమెంటులో ప్ల కార్డులు కూడా పట్టుకోలేని దైన్యంలో ఎంపీలు
నాకు మద్దతుగా నిలవండి… కేంద్ర పెద్దలను ఒప్పించి తీరుతా
రౌడీ ఎంపీ అడ్డగోలు నిర్మాణాలను ప్రభుత్వం మారగానే కూల్చేస్తాం…
బ్యాంకులు, కొనుగోలుదార్లు రిస్క్ చేయవద్దు
ప్రజా సమస్యల సాధనకే నా మొదటి ప్రాధాన్యం
జనసేన ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల బలోపేతం
గాజువాక వారాహి విజయయాత్ర బహిరంగసభలో పవన్ కళ్యాణ్

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గాజువాక బహిరంగ సభలో (Gajuwaka Public meeting) జరిగిన ప్రసంగం సామాన్యులనుండి మేధావుల వరకు ఆకట్టుకుంది. సుమారు 25 సమస్యలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో జనసేనాని చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. ‘ఎన్నికల ముందు బుగ్గలు నిమురుతుంటే, కనిపించిన వారిందరికీ ముద్దులు పెడుతుంటే దేవుడొచ్చాడనుకున్నారు. జగన్ రెడ్డిని (Jagan Reddy) నమ్మారు. 151 సీట్లను ఇచ్చి దేవుడుకి దణ్ణం పెట్టారు. జగన్ పాలన మొదలయ్యాక ప్రజలకు అర్ధం అయింది.. ఈయన దేవుడు కాదు.. దెయ్యమై (Jagan Reddy is devil) భుజాల మీదకెక్కాడు అని తెలుకున్నారు. జగన్ కు అదృష్టం అందలం ఎక్కిస్తే… బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది. జగన్ ను ప్రజలు మరో ఆరో నెలలు భరించక తప్పదు. జగన్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు చూస్తూ ఉండక తప్పదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం మనసులో ఆ దెయ్యం మీద ఉన్న కోపాన్ని ఓట్ల రూపంలో వేసి తరిమికొట్టండి’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వారాహి విజయయాత్రలో భాగంగా ఆదివారం గాజువాకలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ సమస్య మీద జగన్ కేంద్ర పెద్దలతో మాట్లాడలేడు. వారి వద్దకు వెళ్లి సొంత గనులు కేటాయించమని అడగలేడు. ఎందుకంటే భయం. విపరీతమైన భయం. చుట్టూ అవినీతి కేసులు… హత్యలు చేయించిన చరిత్రలు… భూములు కాజేసిన ఘనతలు ఉన్న వాడికి భయం కాక ఇంకేం ఉంటుంది..? కానీ నేను కేంద్ర పెద్దలతో మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశం తెరపైకి రాగానే, ఢిల్లీ వెళ్లి నాకున్న పరిచయాలతో కేంద్ర పెద్దలను కలిశాను. స్టీల్ ప్లాంటు అనేది కేవలం ఓ పరిశ్రమ కాదని, 32 మంది ప్రాణ త్యాగాలతో ముడిపడి ఉన్న భావోద్వేగ అంశమని కేంద్ర పెద్దలకు తెలియజేశాను. ఈయనకు 22 మంది ఎంపీలను ఇచ్చినా ఒక్కసారి కూడా కనీసం పార్లమెంటులో తన సభ్యుల చేత ప్ల కార్డులు పట్టించలేకపోయాడు.

విశాఖ స్టీల్ ప్లాంటు మనకు ఎంత అవసరమో చెప్పలేకపోయాడు. 1970ల నుంచి మూడు తరాలుగా విశాఖ ఉక్కు- ఆంధ్రా హక్కు అనే నినాదాన్ని ఇప్పటికీ మన గుండెల్లో ఉండిపోయింది. దాన్ని కనీసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి అంటే.. చట్టసభల్లో మాట్లాడాలి అంటే తగిన ఎంపీల బలం నాకు లేకపోయింది. శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ, హోం మంత్రి శ్రీ అమిత్ షా గారు కాని నేను చెప్పిన మాట వింటారు.. ఆలకిస్తారు. అయితే చట్టసభల్లో ఈ అంశాలపై మాట్లాడే అవకాశం జనసేనకు లేకపోయింది.

విశాఖ స్టీల్ ప్లాంటు సమస్యపై ప్రాధేయపడటానికైనా సిద్ధం

ప్రజలు నెత్తిన పెట్టుకున్న వైసీపీ ఎంపీలు మాత్రం పార్లమెంటులో నోరు ఎత్తరు… కనీసం మాట్లాడరు. చివరకు నన్ను మాట్లాడమని సలహా ఇస్తారు. నేను కచ్చితంగా ప్రజలకు సంబంధించిన సమస్య కోసం ఎవరినైనా కలిసి మాట్లాడతాను. అవసరం అయితే ప్రాధేయపడతాను… చివరికి అదీ కాకుంటే కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని అయినా విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా నా శక్తి మేరకు కృషి చేస్తాను. జగన్ తన కేసుల కోసం, తన పనుల కోసం, కుటుంబసభ్యుల కోసం, కాంట్రాక్టుల కోసం కాళ్లు పట్టుకుంటారే తప్ప… జనం సమస్య మీద కాదు. నేను జనం కోసం పని చేస్తాను. వారికి సమస్య వస్తే దేనికైనా సిద్ధంగా ఉంటాను. 2019లో సైతం నేను ఎంతగానో అభిమానించే నరేంద్ర మోదీ నే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో విబేధించిన వాడిని… అలాగే అప్పటి ప్రభుత్వం చేసిన కొన్ని ప్రజా పాలసీలను వ్యతిరేకించి బయటకు వచ్చిన వాడిని. నాకు ప్రజలే మొదటి ప్రాధాన్యం.

వారి సమస్యలే మొదటి అంజెండా. కేంద్ర పెద్దలు సైతం ఏదైనా ప్రజలకు సంబంధించిన సమస్యలు చెబితే కూలంకషంగా వింటారు. ప్రధానమంత్రి గారు కానీ, హోంమత్రి గారు, ఇతర పెద్దలు సైతం ప్రజల సమస్యలపై మాట్లాడితే కచ్చితంగా స్పందిస్తారు. వ్యక్తిగత, స్వలాభం సమస్యల మీద మాట్లాడితేనే వారు దగ్గరకు రానివ్వరు. వైసీపీ నాయకుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రజల సమస్యల మీద మాట్లాడితే కదా… అక్కడున్న వారికి తెలుస్తుంది. ఎప్పుడైనా విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడారా?

రాష్ట్ర ఎంపీలు మన పరువు తీస్తున్నారు

ఏ ఒక్క రోజు ప్రజా సమస్యల మీద, రాష్ట్ర ప్రయోజనాల మీద పల్లెత్తు మాట మాట్లాడని రాష్ట్ర ఎంపీలు అంటే ఢిల్లీ వర్గాల్లో ఓ రకమైన భావన ఉంది. ఎంపీలంతా వ్యాపారులు, పైరవీకారులే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోరని ఢిల్లీ పెద్దలు భావిస్తారు. ప్రజా పాలసీలు, విధానాలు మన ఎంపీలకు పట్టవని అనుకుంటారు. తమిళనాడులోని సేలం ఉక్కు పరిశ్రమను రక్షించుకోవడానికి తమిళనాడులో రాజకీయ పక్షాలన్నీ ఏకమై జరిపిన పోరాటం విజయం సాధించింది. ఒడిశా ప్రజాప్రతినిధుల ఐక్యతతో అక్కడికి నిధులు సాధించుకుంటున్నారు. మన ఎంపీలు మాత్రం కనీసం ప్రజలకు అవసరం అయిన సమస్య మీద కూడా మాట్లాడిన పాపన పోవడం లేదు. సొంత గనులు కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్లాంటు కచ్చితంగా లాభాల్లోకి వస్తుంది.

ప్రైవేటు స్టీలు కంపెనీలకే ఐరన్ ఓర్ గనులు కేటాయిస్తుంటే, లక్షలాది మందికి దారి చూపే విశాఖ ఉక్కుకు సొంత గనులు ఎందుకు కేటాయించరో మన ఎంపీలు ఒక్కసారి కూడా అడగలేదు. అసమర్థులు, అవినీతి పరులు చట్టసభల్లోకి వెళితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. గతంలో నేను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అంశం వచ్చినపుడు మాట్లాడితే కేంద్రం పెద్దలు నేను చెప్పింది విన్నారు. దానిని కాపాడుకోగలిగాం. ఇప్పుడు కూడా నిజాయతీగా పనిచేసే నాయకులను ఎన్నుకొని విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకుందాం. ఈ సారి నోట్లకు ఓట్లు వేయొద్దు… మీ భవిష్యత్తు కోసం బలంగా నిలబడేవారి పక్షాన నిలబడండి.

వైఎస్సార్ విగ్రహం చూస్తే.. తుపాకీ గుళ్ళకు బలైన మత్స్యకారుడు గుర్తొస్తాడు

ఓ మత్స్యకారుడ్ని బలి తీసుకొని నిర్మించిన గంగవరం పోర్టులో ఇప్పటి వరకు మత్స్యకారులకు న్యాయం జరిగింది లేదు. గంగవరం పోర్టుకి నిరసనగా మత్స్యకారుల పోరాటాన్ని అణచింది జగన్ తండ్రి వైఎస్సార్. ఆయన విగ్రహం చూస్తే గంగవరం పోర్టుపై నిరసన తెలుపుతూ తుపాకీ గుళ్ళకు బలైన మత్స్యకారుడు గుర్తొస్తాడు. పోర్టులో ప్రభుత్వ వాటాగా ఉన్న 10 శాతం వాటాను ఈ ముఖ్యమంత్రి అమ్మేశాడు. పోర్టులో వాటా అమ్మకానికి ఉన్న ఆత్రుత 40 రోజులుగా పోర్టు ఉద్యోగులు కనీస వేతనాల కోసం చేస్తున్న నిరసన మీద లేదు. రెండు మత్స్యకార గ్రామాలను నేలమట్టం చేసి పోర్టు నిర్మించినా, అక్కడ మత్స్యకారులకు ఇప్పటికీ కనీస వేతనం దక్కని దుస్థితి ఉంది.

మత్స్యకారులకు బతుకు లేకుండా చేసి.. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పేరుతో అరకొర జీతాలు చెల్లిస్తున్నారు. విశాఖలో కీలకమైన గంగవరం పోర్టులో మత్స్యకారుల సమస్య తీర్చవు కానీ.. విశాఖను రాజధాని చేస్తావు అంటావు. రూ.796 కోట్ల లాభాల్లో ఉన్న గంగవరం పోర్టులో కార్మికులను, ఉద్యోగులకు న్యాయం జరగాలి. ప్రజలను కనీసం పట్టించుకోని, పలకరించని జగన్ కోసం రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల విలువైన కాలం వృథా చేశారు. అర్ధదశాబ్ధ విలువైన కాలంలో వెనక్కు వెళ్లిపోయాం. మత్స్యకారుల న్యాయమైన హక్కుల కోసం జనసేన అండగా నిలుస్తుంది.

జగన్ కు దోపిడీ తప్ప ఏం పట్టవు

జగన్ అనే వ్యక్తికి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏం పట్టదు. ఆంధ్రప్రదేశ్ డవలప్ మెంటు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు ఇష్టానుసారం అప్పులు చేస్తున్నాడు. రూ.25 వేల కోట్ల అప్పులు తెచ్చాడు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రభుత్వ భూముల దోపిడీ భారీగా జరుగుతోంది. ఎయిడెడ్ పాఠశాలల ఆస్తులను దోచుకోవడానికి పన్నాగం పన్నారు. ఉత్తరాంధ్రకు సిరులు నింపే సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు లేదు. వైసీపీ ప్రభుత్వ వచ్చాక రూపాయి పెట్టుబడి లేదు. విశాఖ నీటి అవసరాలు తీర్చలేదు. విశాఖలో దసపల్లా, సిరిపురం, రుషికొండ లాంటి విలువైన భూములను కళ్లెదుటే దోచేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని విలువైన భూముల మీద వైసీపీ కన్ను పడింది. మొదటిగా విశాఖను దోచుకొని తర్వాత మిగిలిన ప్రాంతాలను దోచేస్తారు.

ఉత్తరాంధ్రలో కీలకమైన బీసీ కులాలను తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగిస్తే, ఆ ముఖ్యమంత్రితో కనీసం మాట్లాడలేకపోయిన జగన్ ఉత్తరాంధ్ర మీద చూపిస్తున్న కపట ప్రేమను ప్రజలు అర్ధం చేసుకోండి. తెలంగాణలోని జగన్ కు ఉన్న రూ.300 కోట్ల సొంత ఆస్తుల రక్షించుకోవడం కోసం, రెండు రాష్ట్రాల మధ్య మిగిలిపోయిన రూ.లక్ష కోట్ల ఆస్తుల పంపకాన్ని కనీసం అడగని వ్యక్తి జగన్. నేను ఏమైనా మాట్లాడితే నా మీద నోరు వేసుకొని పడిపోవడం వైసీపీ నేతలకు తెలుసు. నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని, నా తల్లిని, పిల్లలను తిట్టించినా నేనేమీ భయపడి పారిపోయేవాడిని కాదు. ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో, ప్రజాక్షేత్రంలో మీ అసలు రంగు బయటపెట్టడంలో నేను మొండివాడిని. దేనికి అసలు తలవంచేవాడిని కాదు.

విశాఖను నా రెండో ఇంటిగా చేసుకుంటాను

విశాఖపట్నం వేదికగా వైసీపీ చేస్తున్న అక్రమాలు చూస్తుంటే భయంగా ఉంది. నేను ఇప్పటికీ రాష్ట్రంలోనే ఉండాలని, ప్రజల్లోనే గడపాలనే ఆలోచనతో మంగళగిరినే నివాస ప్రాంతంగా చేసుకున్నాను. ఇక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు, ప్రజలతో ఉండి నిరంతరం విశాఖ అక్రమాలపై చైతన్యం నింపేందుకు విశాఖను నా రెండో ఇంటిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సిరిపురం జంక్షన్లో సాంఘిక సంక్షేమ వసతిగృహం తాలుకా భూములపై వైసీపీ కన్ను పడితే దాన్ని బలంగా జనసేన పార్టీ నాయకులు అడ్డుకున్నారు. టీడీఆర్ బాండ్ల పంపిణీలోనూ అంతులేని అవినీతి జరుగుతోంది. పెద్ద జాలరి పేటలో రూ.2 వేల కోట్ల టీడీఆర్ బాండ్ల అవినీతి లొసుగులు జరుగుతున్నాయి. దీనిపైనా స్పందించాలి.

పోలీసులకు పంగనామాలు పెట్టిన జగన్

పోలీసులకు సొంత ఆలోచనకు అవకాశం ఉండదు. పాలకులు చెప్పిన దాన్ని వారు పాటించాలి. పై నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయాలి. అందుకే పోలీసులపై జనసేన ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది. అలాంటి పోలీసులకు సైతం జగన్ పంగనామాలు పెట్టాడు. పోలీసులకు సరైన టీఏ, డీఏలు ఇవ్వడం లేదు. సరెంటర్ లీవుల సొమ్ము సకాలంలో చెల్లించడం లేదు. ఇటీవల యాంటీ నక్సల్ అలవెన్సు, సైకిల్ అలవెన్సులను తీసేశారు. ప్రభుత్వం తీస్తామన్న 6100 కానిస్టేబుల్ పోస్టుల్లో హోంగార్డులకు 1082 పోస్టులు రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటే, కటాఫ్ మార్కులు, ఇతర కారణాలతో వారికి కేవలం 342 పోస్టుల మాత్రమే ఇచ్చారు. హోంగార్డులకు తీరని అన్యాయం చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాకా దాదాపు 30వేల మంది మహిళలు అదృశ్యమైపోయారు అని నేను ఏలూరులో మాట్లాడితే నా మీద వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా నేను చెప్పింది నిజమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పారు. ప్రజల ప్రైవేటు డేటాను ఎలా సేకరిస్తారని 2019 ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. ఇప్పుడు నేను అడుగుతున్నది అదే కదా..? వాలంటీర్ వ్యవస్థపై నేను మొదటి నుంచి అడుగుతున్నది మూడే మూడు ప్రశ్నలు. వాలంటీర్ల వ్యవస్థకు బాస్ ఎవరు? వాలంటీర్లు సేకరిస్తున్న డేటా ఎక్కడికి వెళ్తుంది? వారికి జీతాలు ఏ అకౌంట్స్ నుంచి ఇస్తున్నారు? వీటికి సమాధానం చెప్పమంటే వీటికి తప్ప మిగతా అన్ని విషయాలపై వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు.

ఎన్ని వేలకోట్లు ఉన్నా నిజాయతీపరుల ముందు మోకరిల్లాల్సిందే

తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై, కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరులో ఐ.టి. రంగం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్లు అయినా మన రాష్ట్రంలో ఐ.టి రంగాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఐ.టి. పరిశ్రమలు స్థాపించి యువతకు ఎందుకు ఉద్యోగాలు కల్పించలేకపోయారు? మన యువత ఇప్పటికీ పక్క రాష్ట్రాలకు వలసలు పోయి జాబ్ చేయాల్సిన ఖర్మ ఎందుకొచ్చింది? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. విశాఖను ఐ.టి. హబ్ మారుస్తాం. మూడేళ్లలో అద్భుతంగా తీర్చిదిద్ది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. విశాఖకు మెట్రో కలగా మిగిలిపోయింది. రైల్వే జోన్ అనౌన్స్ చేశారు తప్ప పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు.

విశాఖ పారిశ్రామిక కాలుష్యం గురించి ఈ ముఖ్యమంత్రి ఏరోజైనా మాట్లాడాడా? ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి తనపై, తన కుటుంబ సభ్యులపై ఉన్న కేసుల గురించి మాట్లాడతాడు తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం ఏనాడు జగన్ మాట్లాడలేదు. జగన్ ముఖ్యమంత్రి కాదు వ్యాపారి. పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి వస్తే నాకేంటి అని అడుగుతాడు. ఈ దేశానికి కావాల్సింది ప్రధాని మోదీ గారు వంటి నిజాయతీపరులు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందంటే ఆయన నిజాయతీపరుడు. అలాంటి నిజాయతీపరులకు లక్షల కోట్లు ఉన్న జగన్ సైతం మోకరిల్పాల్సిందే. నిజాయితీకి ఉన్న పవర్ అది. ఒక అసమర్ధుడు, దోపిడీదారుడు, క్రిమినల్ ను ఎన్నుకొని పరిశ్రమలు రావాలంటే ఎక్కడ నుంచి వస్తాయి..?

కొండల మీద దేవుళ్లు ఉంటారు క్రిమినల్స్ కాదు

తుపాన్లు, ప్రకృతి విపత్తుల నుంచి వైజాగ్ కు రక్షణ కల్పిస్తున్న రుషికొండను నిబంధనలకు విరుద్ధంగా నాశనం చేస్తున్నారని మనం మాట్లాడితే… వైసీపీ నాయకులు దానిపై అడ్డగోలుగా వాదిస్తారు. రుషికొండ ఎదురుగా ఉన్న కొండపై దేవుడు లేడా? అని మాట్లాడతారు. రుషికొండ ప్రజల ఆస్తి. అయినా వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సింది కొండల మీద దేవుడు ఉంటాడు క్రిమినల్ కాదు. మర్డర్లు, దోపిడీలు, మానభంగాలు చేసిన వాళ్లకు మద్దతు పలికేవాడు ఉండటానికి జనసేన వ్యతిరేకం. అలాంటి వారు ప్రకృతి వనరులను దోచేస్తే కచ్చితంగా జనసేన అడ్డుకుంటుంది. మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని గొప్పులు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక రాయలసీమ కవి ‘సేద్యం జూదమైంది… అమ్మ మెడలో పుస్తులు పసుపు కొమ్ములయ్యాయి… చెల్లి చెవిలో కమ్మలు జొన్న బెండులయ్యాయి… తమ్ముడు ఇటుక బట్టిలో కాలిన ఇటుకగా మారాడు… నువ్వు హాటల్ లో ఎంగిలాకువు అయ్యావు.

దేశానికి పట్టెడు అన్నం పెట్టిన మీ తాత బస్టాండులో బిచ్చగాడు అయ్యాడు’ అని ఓ కవితలో చెబుతారు. అచ్చుగుద్దినట్లు రాష్ట్రంలో రైతు కుటుంబాల పరిస్థితి అలానే ఉంది. స్టీల్ ప్లాంట్ కోసం పచ్చని భూములు త్యాగాలు చేసిన రైతు కుటుంబాలు ఇప్పుడు దేవాలయాలలో ప్రసాదం తింటూ కడుపునింపుకుంటున్నారు. రైతు కుటుంబాల పరిస్థితి ఇలా ఉంటే కౌలు రైతుల కుటుంబాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో దాదాపు మూడువేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దాన్ని జనసేన పార్టీయే బయటకు తీసుకొచ్చింది. పార్టీ తరఫున వేలాది మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాం. వారి కుటుంబంలో ఉన్న పిల్లలకు చదువులకు అయ్యే ఖర్చులు భరిస్తున్నాం. అధికారం లేకపోయినా మేము ఇంత చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు. దురదృష్టవశాత్తు మరణించిన వ్యక్తికి వచ్చిన నష్టపరిహారంలో కూడా వాటాల కోసం బెదిరిస్తున్నారు. వైసీపీ నాయకులకు ఆస్తులు సంపాదించడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు.

గ్రామసభలు బలంగా నిర్వహించాలి

మన రాష్ట్రంలో 13,371 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలు స్వతంత్రంగా వ్యవహరించాలి. సొంత అవసరాలకోసం ఇతరులపై ఆధారపడకూడదు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్ములని నమ్మి కేంద్రం పంచాయతీలకు నిధులు ఇస్తే ఆ నిధులను జగన్ తన పథకాల కోసం మళ్లించాడు. నగర పాలక సంస్థలు, పంచాయతీలను నిర్వీర్యం చేశాడు. గ్రామ సభలు కచ్చితంగా జరిగితే, అక్కడ తీసుకున్న నిర్ణయాలు అమలు అయితే పరిస్థితి వేరుగా ఉండేది. ఈ రోజు రుషికొండకు గుండుకొట్టేవారు కాదు. జనసేన పార్టీకి అధికారం ఇస్తే పంచాయతీ రాజ్ వ్యవస్థకు జీవం పోస్తాం. గ్రామ సభలను బలోపేతం చేసి స్థానిక వనరులపై సంపూర్ణ అధికారం ఉండేలా చేస్తాం. కేంద్రం నుంచి వచ్చిన నిధులు పూర్తిగా గ్రామ పంచాయతీల అకౌంట్లోనే వేస్తాం.

పచ్చగా ఉంటే చూడలేని ముఖ్యమంత్రి

ఆంధ్రయూనివర్సిటీ 600 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో దాదాపు 70 ఎకరాల మేర అడవి. ఈ అటవి ప్రాంతమే నగరానికి ఊపిరితిత్తులు లాంటివి. ఇలాంటి ప్రాంతంలోని అడవులను, గెడ్డలు, వాగులను నాశనం చేస్తున్నారు. పర్యవరణాన్ని విధ్వంసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లిన అక్కడ చెట్లు నరికేస్తున్నారు. ఆయన పై నుంచి హెలికాప్టర్ లో వెళ్లినా కిందనున్న చెట్లను నిస్సిగ్గుగా నరికేస్తున్నారు. జనసేన పార్టీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఏయూలో దాదాపు వెయ్యి అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీసీగారు 200 పోస్టులు ఖాళీ అంటున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్లును అనుబంధ ప్రొఫెసర్లుగా, గౌరవ ప్రొఫెసర్లుగా నెలకు రూ.80 వేలు ఇస్తామని కాంట్రాక్టు విధానం మీద తీసుకొచ్చారు. వాళ్ళకు కనీసం రూమ్స్ లేవు. కాంట్రాక్టు బెసిక్ మీద తీసుకొచ్చిన ప్రొఫెసర్లకు నెలలుగా జీతాలు లేవు. ఇదేంటి అని అడిగితే విద్యాశాఖ మిమ్మల్ని ఇంకా గుర్తించలేదని చెప్పాడు వీసీ. తర్వాత వారిని తీసేశారు. శ్రమ దోపిడీ చేస్తున్న వీసీ ఎవరు? అతనో జగన్ మద్దతుదారుడు. ఆంధ్రయూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలపై యువత ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే మన హక్కులను వీళ్లు హరిస్తారు.

ఆ భవనాలను భవిష్యత్తులో కూల్చేస్తాం

విశాఖ ఎంపీ గతంలో ఓ రౌడీషీటర్. సిరిపురంలో క్రిస్టియన్ మిషనరీస్ కు చెందిన ఆస్తులను కబ్జా చేశాడు. అక్కడ నాలుగు ప్లోర్లకు పర్మిషన్ తీసుకొని 26 ప్లోర్లకు వ్యాపారం చేస్తున్నాడు. ఈ భూమిపై సుప్రీం కోర్టులో కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రి మా వెనకున్నాడు. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అహంతో ఇప్పుడు రెచ్చిపోవచ్చు. కానీ దేశంలో కోర్టులు బలంగా పనిచేస్తున్నాయి. అన్యాయంపై కొరఢా ఝులిపించే న్యాయమూర్తులు ఉన్నారు. గుర్గావ్ లో టవర్స్ కూల్చేసినట్లు… భవిష్యత్తులో ఈ రౌడీషీటర్ అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్స్ ను సైతం ప్రభుత్వం మారగానే కూల్చేస్తాం. ప్రజలు ఎవరూ ఈ ఆస్తులను కొనుగోలు చేయొద్దు. ఎవరైనా బిల్డర్ ఆస్తిని డవలప్ చేస్తే 30 శాతం ఓనర్ కు, 70 శాతం బిల్డర్ కు వెళ్లేలా అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎంపీ మాత్రం కూర్మన్నపాలెంలో 10 ఎకరాలు భూమిని తీసుకొని 99 శాతం ఈయనకు, 1 శాతం భూ యజమానికి రాశాడు. రౌడీషీటర్ కాబట్టి ఇలా అన్యాయంగా దోచుకుంటున్నాడు. ఈయన ఇలానే దోపిడీలకు పాల్పడితే వచ్చే ప్రభుత్వంలో మళ్లీ రౌడీషీటర్ ఓపెన్ చేయడం ఖాయం.

హిరణ్యకశిపుడు జగన్ రూపంలో బతికే ఉన్నాడు

గాజువాక నుంచి చెబుతున్నాను జగన్ నువ్వు ఎక్కిన గద్దె దిగిపో. ప్రజలు వస్తున్నారు సింహాసనం ఖాళీ చేయ్. జగన్ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఓట్లు చీలకూడదని ఎందుకు మాట్లాడతాను అంటే జగన్ ఒక దుర్మార్గుడు. ప్రకృతి వనరులను దోచుకుంటాడు. అందినకాడికి అక్రమాలు చేస్తూ రాక్షస పాలనను తలపిస్తోన్న జగన్ లో హిరణ్యకశిపుడు, హిరణ్యకుడు వంటి రాక్షసులు బతికే ఉన్నారని అనిపిస్తోంది. నేను ముఖ్యమంత్రిని కావాలి అనుకుంటే అవ్వను. ప్రజల ఆశీర్వాదం కావాలి. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. అది ఉన్నత స్థానం ఇస్తుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. పదేళ్లు ఏ పదవీ ఆశించకుండా ప్రజల కోసమే పనిచేశాను. ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వమైనా, సంకీర్ణ ప్రభుత్వమైనా కచ్చితంగా రావాలి. జగన్ లేని పాలన చూడాలి. ఎవడూ వందేళ్లే బతికేది. దానికోసం ఎందుకు ఇన్ని వందల కోట్లు దోచుకుంటున్నారు. ఐపీఎస్ స్థాయి వ్యక్తుల ఆస్తులను సైతం దోచుకుంటున్నారు. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షించుకోవాలంటే, జగన్ వంటి వ్యక్తులను ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఆక్రమణదారులకు స్వాగతాలు – ప్రశించేవాడికి ఆంక్షల కంచెలు!

Spread the love