Vivekananda ReddyVivekananda Reddy

హత్య చేస్తే రూ.40 కోట్లు వస్తాయన్నారు?

వాంగ్మూలంలో వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి??

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్య కేసులో (Murder Case) పెద్దల పాత్ర వెలుగులోకి వచ్చినట్లు వార్తా కధనాలు వస్తున్నాయి. సమీప బంధువు, ఒక ఎంపీ (MP), ఆయన తండ్రి మద్దతు తమకు ఉన్నదని సహ నిందితులు చెప్పినట్టు వివేకా మాజీ డ్రైవర్‌ (Driver) కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.

ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగిన ఈ హత్యలో రూ.40కోట్ల మేరకు సుపారీ చేతులు మారినట్లు, పథకం ప్రకారం అంతమొందించినట్లు తెలుస్తున్నది. తనతో సహా మొత్తం నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ హత్యోదంతంపై వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి (Dastagiri) ప్రొద్దుటూరు కోర్టులో (Proddutur Court) ఇచ్చిన నేర అంగీకార పత్రం శనివారం ఇతర నిందితులకు అందింది అని వార్తా కధనాలు వస్తున్నాయి.

2019 మార్చి 15వ తేదీ పులివెందులలోని (Pulivendula) తన నివాసంలో వివేకానందరెడ్డి అత్యంత దారుణహత్యకు (Murder) గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఇప్పటివరకు నలుగురి పాత్రను సీబీఐ (CBI) అధికారులు వెలికితీశారు. ఈ నిందితుల్లో దస్తగిరి ఒకడు. గతంలో అతడు వివేకాకు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. వివేకా అనుచరుడు, అతని స్నేహితుడు, వివేకా మాజీ అనుచరుడు గంగరెడ్డి (Gangi Reddy) ఈ కేసులో మిగతా నిందితులు అని ఆరోపణలు వస్తున్నాయి. వీరందరిపై ఇటీవల సీబీఐ చార్జిషీటు కూడా దాఖలు చేసింది.

సీబీఐ దర్యాప్తులో భాగంగా 161 సీఆర్పీసీ కింద దస్తగిరి వాంగ్మూలాన్ని ప్రొద్దుటూరు కోర్టులో ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన సీబీఐ అధికారులు నమోదు చేయించారు. ఇతర నిందుతులతో కలిసి తాను గొడ్డలితో నరికి వివేకాను అంతమొందించినట్టు దస్తగిరి ఈ వాంగ్మూలంలో అంగీకరించాడు అని తెలుస్తున్నది.

దీనిపై పూర్తి నిజా నిజాలు ఇంకా వెల్లడి కావలిసి ఉన్నది. విచారణ పూర్తి అయితే తప్ప పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావు. వస్తున్న ఆరోపణలు నిజమా అబద్ధమా అనేది తెలియాలి అంటే విచారణ పూర్తి అయ్యి, నిరూపితం కావలిసి ఉంది.

Amaravathi Rythula Maha Padayatra