వైసీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన రైతులు
జనసేన ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది.
ఈ నెల 18న సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
గుంటూరు జిల్లాలో 280 మందికిపైగా రైతులు ఆత్మహత్య
జిందాల్ సంస్థకు కడప స్టీల్స్ ఇవ్వడంలో లబ్ధి ఎవరికి?
రూ.5 వేల కోట్ల రాయితీ వెనక మతలబు తెలియాలి
మంగళగిరిలో మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్
వైసీపీ ప్రభుత్వ (YCP Government) విధానాలతో అష్టకష్టాలు పడుతున్న ఉభయ గోదావరి జిల్లాల రైతులు క్రాప్ హాలిడే (Crop Holiday) ఇస్తున్నారు. రైతులు వైసీపీకి హాలిడే (Holiday for YCP) డిక్లేర్ చేసిన రోజున రైతులతో పాటు, అందరి జీవితాలు బాగుపడతాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ అస్థవ్యవస్థ విధానాలతో రైతులు విసిగిపోయారన్నారు. పాదయాత్రలో కౌలు రైతులకు న్యాయం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఎవరికీ పనికిరాని చట్టం తీసుకువచ్చి వారికి తీవ్ర అన్యాయం చేశారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఎవరూ తొందరపడి క్రాప్ హాలిడేలు ప్రకటించవద్దని.. ధైర్యంగా ముందుకు వెళ్లాలని నాదెండ్ల కోరారు. జనసేన పార్టీ (Janasena Party) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల్లో భరోసా నింపే ప్రణాళికలు తీసుకువచ్చి రైతాంగాన్ని కాపాడుకుటుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. కౌలు రైతులకు అండగా జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ నెల 18న ఉమ్మడి గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర (Kaulu Rythu Bharosa Yatra) నిర్వహించనున్నట్టు అయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొని ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందచేయనున్నట్టు అయన స్పష్టం చేశారు.
బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
“రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలు, వారి దుస్థితి, ప్రభుత్వ విధానాల కారణంగా వారు ఎంత నష్టపోతున్నారు అన్న అంశాలపై జనసేన పార్టీ పోరాటం చేస్తున్న విషయం విదితమే. స్పందించే మనస్థత్వం లేని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు మార్చేసి రైతులకు రావాల్సిన గుర్తింపు రాకుండా చేసింది. గతంలో కౌలు రైతులకు కల్పించిన హక్కుల ద్వారా కనీసం ఎరువులు, విత్తనాల మీద సబ్సిడీలు, విపత్తుల సమయంలో సహాయం అందేవి. గ్రామ సభలో తీర్మానం చేసి పలాన సర్వే నంబర్ తో వ్యవసాయం చేస్తున్నారని చెబితే ప్రభుత్వం నుంచి సాయం అందేది.
కౌలు రైతులకు ఆధార్ కార్డులు, భూస్వామి నుంచి పత్రాలు
జగన్ రెడ్డి పాదయాత్రలో కౌలు రైతులకు న్యాయం చేస్తానని.. తన దగ్గర ఉన్న సమాచారం ఎవరి వద్ద లేదని చెప్పి రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా చట్టం తీసుకువచ్చారు. కౌలు రైతులకు ఆధార్ కార్డులు, భూస్వామి నుంచి పత్రాలు తేవాలని ఆంక్షలు పెట్టడంతో పాటు వారి మరణాలపై దొంగ లెక్కలు చెప్పింది ఈ ప్రభుత్వం. గత వారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ లో గడచిన మూడేళ్లలో 1673 మంది రైతు ఆత్మహత్యలు జరిగాయని ప్రకటించింది. ఇది అధికారిక లెక్క అయినా లెక్కల్లోకి రానికి చాలా ఉన్నాయి. జనసేన పార్టీ, రైతు స్వరాజ్య వేదిక సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి, ఆర్టీఐ ద్వారా సమాచారం తెప్పించుకుంటే ఆ లెక్కలు చూసి ఆశ్చర్యం కలిగింది.
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలసుకున్న వెంటనే అందరికంటే ముందు చలించి స్పందించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి రూ. లక్ష ఆర్ధిక సాయం అందించడంతో పాటు ఆ కుటుంబాలకు భరోసా నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి స్వయంగా రూ. 5 కోట్ల విరాళం ఇచ్చారు అని నాదెండ్ల మనోహర్ వివరించారు.
వారంలోపు సాయం చేస్తామని ముఖం చాటేశారు
వాళ్లు తీసుకువచ్చిన చట్టంలో త్రిసభ్య కమిటీ వేశారు. వీరి ముగ్గురి నుంచి సమాచారం రాగానే వారం లోపు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ. ఏడు లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని ప్రకటించారు. తూతూ మంత్రంగా కొన్ని జిల్లాల్లో ఇచ్చారు. జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర మొదలు పెట్టాక కొన్ని జిల్లాల్లో రూ. లక్ష చొప్పున, కొంత మందికి రూ. ఏడు లక్షలు వేశారు. ఇంకొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ మీటింగ్ కి వెళ్లొద్దని చెప్పి రూపాయి అకౌంట్లో వేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. జనసేన పార్టీ ఆరు జిల్లాల్లో రైతు భరోసా యాత్ర నిర్వహించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సొంత నియోజకవర్గం పులివెందులలో 46 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రతి కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందచేశామని నాదెండ్ల మనోహర్ అన్నారు.
మూడు పంటలు పండే గుంటూరులోనూ రైతుకి భరోసా లేదు
గుంటూరు జిల్లాలో నాలుగు నెలలుగా సర్వే చేస్తున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 268 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్తగా మరో 13 కుటుంబాలు వచ్చాయి. చాలా మంది వారి కుటుంబాలతో వచ్చి వినతిపత్రాలు అందిస్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. మూడు పంటలు పండించే గుంటూరు జిల్లాలో 280 మందికి పైన కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగాయంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది. బటన్లు నొక్కుతూ వారి కార్యక్రమానికి వారే చప్పట్లు కొట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే జనసేన నిర్వహించే సత్తెనపల్లి సభకు స్వయంగా వచ్చి చూడాలి. జనసేన సభకు వెళ్ళే వారు రైతులే కాదు, కౌలు రైతులు కాదన్నారు. సత్తెనపల్లి సభకు వచ్చి వాస్తవాలు చూడండి. ప్రతి కుటుంబాన్ని పరిశీలించి వారి వివరాలు సేకరించి ఎందుకు ప్రభుత్వం వారికి రూ.7 లక్షలు ఇవ్వలేకపోయిందో పరిశీలించాం. పల్నాడు ప్రాంతంలో రైతాంగానికి భరోసా నింపే ప్రజాప్రతినిధులు లేరు. దేని కోసం వారు పదవులు పొందారో అ కావడం లేదు. స్థానికంగా రైతులకు ఒక్క నాయకుడు కూడా భరోసా కల్పించలేకపోయారు. ప్రభుత్వం నుంచి భరోసా లేకే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని నాదెండ్ల మనోహర్ వివరించారు.
జనసేన పార్టీ గుంటూరు జిల్లా నాయకత్వం 18వ తేదీ జరిగే రైతు భరోసా సభకు అద్భుతంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర నాయకత్వం మొత్తాన్ని ఆహ్వానించి జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది అన్న ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాం. రైతు కుటుంబాలను ఆదుకోవడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 12 గంటల ప్రాంతంలో సత్తెనపల్లికి చేరి ఒంటి గంటకు సభను ప్రారంభిస్తారు. సాయంత్రానికల్లా పూర్తి చేస్తారని అయన అన్నారు.
జనసేన ఏ పని చేసినా చట్టానికి లోబడే చేస్తుంది
వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయిపోయింది. జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా చట్టానికి లోబడే చేస్తుంది. ఎక్కడా పొరపాటు చేయం. పాలన చేతకాక అనవసర విమర్శలతో వైసీపీ నాయకత్వం సమయాన్ని వృధా చేస్తోంది. మేము ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. వారాహి జనసేన పార్టీ ప్రచార రథం. ఎన్నికలకు సిద్ధమయ్య తరుణంలో మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకుంటూ ప్రజలకు మరింత చేరువయ్యే క్రమంలో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. దీనిపై అనవసర విమర్శలు
అవసరం లేదని నాదెండ్ల మనోహర్ వివరించారు.
జిందాల్ వాళ్ళకి వైఎస్ మన్యంలో బాక్సెట్ ఇస్తే.. జగన్ సీమలో స్టీల్
కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో జెఎస్ డబ్ల్యూ మూడో కృష్ణుడు. మొదట లిబర్టి ఎస్సార్ ని తెచ్చారు. మూడున్నరేళ్లలో 26 వేల ఉద్యోగాలిస్తామన్నారు. ఆ స్టీల్ కార్పోరేషన్ ఈ రోజు ఎక్కడుంది. తర్వాత స్విట్జర్లాండ్ నుంచి ఐఎఆర్ మెటల్ తెచ్చారు. 17 వేల కోట్ల పెట్టుబడులు అన్నారు. ఇప్పుడు జిందాల్ సంస్థ.. జె.ఎస్. డబ్ల్యూ, దీనిలో ఎవరు లబ్ధి పొందుతున్నారు.
రూ.5 వేల కోట్ల మేర సబ్సిడీలు ప్రకటించింది. పెట్టుబడి రూ.8 వేల కోట్లు ఆయితే సబ్సిడీలు రూ.5 వేల కోట్లు ఇవ్వడంలో మతలబు ఏమిటి? దావోస్ లో తెరవెనుక జరిగిన అగ్రిమెంట్లు ఏంటి అనేది ప్రజలకు తెలియాల్సి ఉంది. తండ్రి వైఎస్ పాలనలో జిందాల్ వాళ్ళకి మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారు.. ఇప్పుడు జగన్ రెడ్డి జిందాల్ సంస్థకు కడప స్టీల్స్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అని నాదెండ్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు?
ముఖ్యమంత్రి సొంత రాయలసీమ జిల్లాల వాసులనే మోసం చేస్తున్నారు. యువతలో భరోసా నింపేందుకు ఉత్తరాంధ్రలో జనవరి 12వ తేదీన యువశక్తి పేరిట బహిరంగ సభ నిర్వహించి జనసేన పార్టీ యువత కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించిందో తెలియచేయనున్నామని నాదెండ్ల మనోహర్ అన్నారు.
మీడియా సమావేశంలో పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంటేశ్వరరావు, బండ్రెడ్డి రామకృష్ణ, పోతిన మహేష్, చిల్లపల్లి శ్రీనివాస్, కళ్యాణం శివశ్రీనివాస్, సయ్యద్ జిలానీ, నయూబ్ కమాల్, అమ్మిశెట్టి వాసు, బోడపాటి శివదత్, నేరెళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.