Janasena meeting in VisakhapatnamJanasena meeting in Visakhapatnam

అధికారులు, వాలంటీర్లతో తప్పులు చేయించి… లబ్ధి పొందుతారు
ముఖ్యమంత్రికి డబ్బు సంపాదన పిచ్చిగా మారింది
పాలించమని అధికారం ఇస్తే పీడిస్తున్నారు.
అధికారులారా… మిమ్మల్ని అన్నా, అక్క అని పిలిస్తే మురిసిపోకండి
దాని వెనుక జగన్ మైండ్ గేమ్ దాగి ఉంటుంది
జగన్ నాయకుడు కాదు వ్యాపారి
ఉత్తరాంధ్రను పూర్తిగా నాశనం చేసే ప్లాన్ చేస్తున్నారు
ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయం చేశారు
జనసేన పాలనలో ఆంధ్రా యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తాం
విశాఖపట్నం వారాహి విజయయాత్ర సభలో పవన్ కళ్యాణ్

‘విశాఖలో ఆంధ్ర వీరప్పన్ (Andhra Veerappan) అవినీతి బాగోతం (Corruption in AP) అంటూ జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అప్ సీఎం జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) పై చెలరేగి మాట్లాడారు. జగన్ అనే వ్యక్తి నాయకుడు కాదు… అతనో వ్యాపారి మాత్రమే. కమీషన్లు తీసుకొనే తరహా. ఎవరైనా పరిశ్రమ స్థాపించాలని వస్తే ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు అని జగన్ అడగడు.. నాకేంటి అంటాడు. 30 శాతం ఇస్తావా 40 శాతం ఇస్తావా అని వాటాలు, కమీషన్లు అడిగే వ్యాపారి అతను’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గురువారం రాత్రి విశాఖపట్నం జగదాంబ జంక్షన్లో వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) సభను నిర్వహించారు. పోలీసులు పలు ఆంక్షలు విధించి, జనసేన శ్రేణులను, ప్రజలను సభా స్థలికి రాకుండా చేసారు. పోలీసులు అడ్డుకున్నా అశేష సంఖ్యలో జనం హాజరై పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు.

వారాహి నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ “గతంలో గంధపు చెక్కల దొంగ వీరప్పన్ ఉండేవాడు. గంధపు చెట్లను నరికించేందుకు కూలీలను సిద్ధం చేసుకొని, వారితో చెట్లను కొట్టించేవాడు. తను మాత్రం పైనుంచి అంతా పర్యవేక్షించేవాడు. వీరప్పన్ మాదిరిగా జగన్ తయారయ్యాడు. తప్పులను అధికారులతో, వాలంటీర్లతో, అనుచరులతో చేయిస్తూ పైన తన లబ్ధి పొందుతాడు. ఇదో జగన్ మార్కు పద్ధతి విధానం. జగన్ కి డబ్బు సంపాదన అనేది ఒక పిచ్చి. ఓ మనిషికి డబ్బు అనేది మొదట ఆశ. బాగా సంపాదించాలి… కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సాధ్యమైనంత పొదుపు చేసి, భవిష్యత్తు తరాలకు ఉంచాలి అనుకుంటారు. అది తర్వాత అలవాటుగా మారుతుంది. డబ్బు సంపాదించడం అలవాటుగా మారితే డబ్బు సంపాదించడమే వ్యాపకం అయిపోతుంది. అదే జీవితంగా మారుతుంది.. ఆ స్టేజీ కూడా దాటి డబ్బు సంపాదించడం వ్యసనంగా కింద మారితే మాత్రం ప్రమాదకరం. డబ్బు సంపాదన కోసం ఇతరుల్ని పీడించడం, వేధించడం మొదలు అవుతుంది. డబ్బు వస్తుంది అంటే దేనికైనా తెగించడానికి సిద్ధపడతారు.

జగన్ ఈ స్టేజీలన్నీ ఎప్పుడో దాటేశారు. జగన్ కు డబ్బు అంటే పిచ్చి. విపరీతమైన పిచ్చి. సంపాదించిన దాన్ని ఏం చేసుకుంటారో కూడా తెలియని పిచ్చి. కరెన్సీను తాలింపు వేసి అన్నంగా కలుపుకొని తింటాడేమో తెలియదు కానీ.. దాన్ని సంపాదించేందుకు తన, మన అనే బేధం కూడా చూడడు. ఇప్పుడు ఆ పిచ్చే ఆంధ్ర ప్రజలను పట్టి పీడిస్తోంది.

అన్న.. అక్క అంటూ ముంచేస్తాడు జాగ్రత్త

జగన్ అన్న, అక్క అనగానే అధికారులు ఉబ్బితబ్బిబ్బవ్వొద్దు. జగన్ ప్రతి పదం వెనుక అక్కడున్న పరిస్థితిని బట్టి అందరినీ అన్న, అక్క అని సంబోధించడం ఓ రకమైన మైండ్ గేమ్. జగన్ అన్న, అక్క అనగానే అధికారులు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమను అన్న అని పిలిచాడనో, అక్క అని అన్నాడనో ఆనందపడొద్దు. తర్వాత మీ దగ్గరకు ఓ కీలకమైన ఫైల్ పంపి ‘అన్న.. దాన్ని కాస్త సంతకం పెట్టన్నా’ అంటాడు. ఓ చట్ట వ్యతిరేకమైన పని చేయిస్తూ మనోళ్లదే కాస్త చేసి పెట్టన్నా అంటాడు. అది గమనించండి. జగన్ మాట్లాడే ప్రతి మాట వెనుక అతడి స్వార్థ ప్రయోజనాలు దాగుంటాయి. అతడు కలిపే ప్రతి వరుస వెనుక లోతైన అర్ధాలు ఉంటాయని మర్చిపోకండి. అన్న అని తప్పుడు పనులు చేయించడం, అక్క అని రాజ్యాంగ విరుద్ధమైన చర్యల్లోకి లాగడం జగన్ కు బాగా తెలుసు. గతంలోనూ అతడి బారిన పడిన ఎందరో ఉన్నతాధికారులు జైళ్లకు వెళ్ళి ఇప్పటికీ కేసుల్లో ఉన్నారన్న సంగతిని గుర్తు పెట్టుకోండి. జగన్ కలిపే వరుసల వలలో మాత్రం పడకండి. దీని వల్ల భారీ మూల్యం చెల్లించుకుంటారు.

వాలంటీర్లలో ప్రమాదకరమైన వ్యక్తులున్నారు

వాలంటీర్లు నా సోదరులు, సోదరీమణులు లాంటి వారు. సింహాచలం అప్పన్న సాక్షిగా చెబుతున్నాను.. నాకు వాలంటీర్ల మీద ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. ఉన్నత చదువులు చదివి కేవలం రూ.5 వేలకు పని చేస్తున్న వారికి అవసరం అయితే మరో రూ.5 వేలు ఇవ్వాలని భావించేవాడిని తప్ప పొట్ట కొట్టాలని అనుకునేవాడిని కాదు. అయితే జగన్ వాలంటీర్లతో చేయిస్తున్న తప్పుడు పనులు మీదనే నేను మాట్లాడాను. నేటి ఆధునిక కాలంలో వ్యక్తిగత సమాచారం అనేది ఎంత కీలకమో, దాన్ని జగన్ వాలంటీర్ల ద్వారా సేకరించి, దేనికి వాడుతున్నాడనే దానిపైనే నా అభ్యంతరం. వాలంటీర్ల మీద నేను ఎలాంటి సమాచారం లేకుండా మాట్లాడను. కేంద్రం నుంచి వచ్చిన సమాచారం, నివేదికలు ఆధారంగానే మాట్లాడుతాను. పెందుర్తిలో 70 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసి, బంగారు కాజేసిన వాలంటీరు ఒకరైతే… కొయ్యలగూడెంలో చదువురాని మహిళ అకౌంట్లోని రూ.1.50 లక్షలను ఫోర్జరీ చేసి డబ్బులు కాజేసిన వాలంటీరు మరొకరు. ఇలా రోజుకో వాలంటీరు నేరాలు బయటపడుతున్నాయి.

తిరుపతి ఎస్పీ ఏం సమాధానం చెబుతారు?

వాలంటీర్లలో అందరినీ నేను అనను. వారిలో ఉన్న కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది. సేకరిస్తున్న సమాచారం సైతం వాలంటీర్లకు ఎటు వెళ్తుందో తెలియడం లేదు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కీలకమైన ఆధార్ సమాచారంతో సహా అన్నీ సేకరిస్తున్నారు. ఇటీవల ప్రజల ఫోన్లకు వచ్చే అత్యంత గోప్యమైన ఓటీపీ నంబర్లను సైతం అడిగే పరిస్థితికి వాలంటీర్లు వెళ్లిపోయారు. చిత్తూరులో ఓ యువకుడు తనకు రేషన్ రాలేదని అడిగిన పాపానికి అతడి ఇంటిని వాలంటీర్లు తగులబెట్టారు. నేను ఇటీవల తిరుపతి ఎస్పీని కలిసేందుకు వెళితే, వాలంటీర్ల మీద అలా ఎలా మాట్లాడతారని ఆయన అడిగారు. మరీ రోజుకో నేరంలో బయటపడుతున్న వాలంటీర్ల గురించి తిరుపతి ఎస్పీ ఏమని సమాధానం
చెబుతారు..?

జగన్ అనే వ్యక్తి నాయకుడు కాదు ముమ్మాటికీ వ్యాపారి. కమీషన్ ఏజెంట్. ఎవరైనా పారిశ్రామికవేత్త పరిశ్రమ పెట్టాలని రాష్ట్రానికి వస్తే నాకేంటి అని అడుగుతాడు. వేలకోట్లు డబ్బులు దోచుకోని ఏం చేసుకుంటావు జగన్ ? డబ్బంతా ఒకరి దగ్గర పేరుకుపోతే ప్రజల్ని బానిసలుగా చూస్తారు. పనిపాట లేకుండా డబ్బు వచ్చి పడితే మనం ఎలా బతకాలో వాడు డిసైడ్ చేస్తాడు. ఇలాంటి వ్యక్తులపై ఒక కన్ను వేయకపోతే మనకు ముద్ద కూడా మిగలనివ్వరు. బొగ్గును ఎంత సర్ఫ్ పెట్టి తోమినా రంగు మారదు. జగన్ కూడా అంతే. ఆయన వేల, లక్షల కోట్లు సంపాదించిన డబ్బు పిచ్చి పోదు. ఇంకోసారి అని ఆయనకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఇక ఎవడూ కాపాడలేడు. రూ.60 ఉన్న క్వాటర్ ను రూ.160 చేశాడు. మద్యపాన నిషేదం అని చెప్పి మద్యం అమ్మకాలపై రూ.30వేల కోట్లు దోచేశాడు. ఆ డబ్బునే రేపు మీ ఓట్లు కొనడానికి ఉపయోగిస్తాడు. సారా నుంచి సిమెంట్ వరకు అన్ని ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఈసారి ఆయన అధికారంలోకి వస్తే ఇంటికి మామిడి తోరణాల బదులు జిల్లేడు తోరణాలు కట్టుకోవాలి.

నేరాలకు అడ్డాగా ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ను నేరాలకు అడ్డాగా మార్చారు. 30 వేల మంది ఆడపడుచులు కనిపించకుండా పోతే ఓ బాధ్యతగల ముఖ్యమంత్రి వారు ఏమయ్యారో తెలసుకునేందుకు కనీసం ఓ సమీక్ష నిర్వహించింది లేదు. పోలీసు వ్యవస్థతో మాట్లాడింది లేదు. గంజాయి రవాణాలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు. గంజాయి మత్తులో నేరాలు అధికం అయ్యాయి. గంజాయి నియంత్రణ కోసం పనిచేసి, వేలాది కిలోల గంజాయిని పట్టుకొని తగులబెట్టిన శ్రీ గౌతం సవాంగ్ వంటి ఐపీఎస్ అధికారిని అర్జంటుగా బదిలీ చేశారు. విశాఖ ఎంపీ కుటుంబాన్ని ఓ రౌడీషీటర్ బంధించే స్థాయికి పరిస్థితి వచ్చింది. ఆడబిడ్డల రక్షణకు భరోసా లేదు. నోబెల్ శాంతి బహుమతి పొందిన శ్రీ కైలాష్ సత్యర్థి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత చిన్నారుల అక్రమ రవాణా మరెక్కడా లేదని చెప్పడం అంతా గమనించాలి. ఎందుకు చిన్నారులు మాయం అవుతున్నారు..? వారెక్కడికి వెళ్తున్నారు అనేది గమనించాలి.

నేను ఆడపడుచుల అదృశ్యం మీద గొంతు ఎత్తితే, వైసీపీ నాయకులు నోరు వేసుకొని నా మీద బూతుపురాణంతో పడ్డారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఆడపడుచుల మిస్సింగ్ కేసుల మీద కేంద్రమే పార్లమెంటు సాక్షిగా వివరాలు వెల్లడించింది. వాటిలో నేను చెప్పిన కంటే లెక్కలు ఎక్కువగానే ఉన్నాయి.

జగన్ ఒక దొంగ… డెకాయిట్

జగన్ ఒక దొంగ, డెకాయిట్. లెక్కలు చూపించకుండా వేలకోట్లు దోచేశాడు. ఈ రోజుకి కాగ్ లెక్కలు చెప్పండి అని అడిగినా చెప్పడం లేదు. మన రాష్ట్రంలో దాదాపు చిన్నా, పెద్ద కలిపి 13,371 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలు స్వతంత్రంగా వ్యవహరించాలి. సొంత అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకూడదు. స్వావలంబన సాధించాలి. గ్రామాలు బావుంటేనే దేశం బాగుంటుంది. గ్రామ స్వరాజ్యం గురించి మహాత్మా గాంధీ చెప్పిన మాటలివి. గ్రామ స్వరాజం అంటే వాలంటీర్లతో నింపేయడం అనుకుంటున్నాడు జగన్. పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులను దాదాపు రూ.1,191 కోట్లు దారిమళ్లించి వాలంటీర్లకు జీతాలుగా ఇచ్చేశాడు. దీంతో గ్రామాల్లో బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేకుండా
చేశారు.

జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక పంచాయతీ రాజ్ వ్యవస్థకు పునర్జీవం పోస్తాం. పంచాయతీల నిధులు గ్రామాభివృద్ధికే ఖర్చు పెట్టేలా చూస్తాం. గ్రామ సభలను బలోపేతం చేసి స్థానిక వనరులపై సంపూర్ణ అధికారం ఉండేలా చేస్తాం. గ్రామాలకు ప్రథమ పౌరుడైన సర్పంచులను డమ్మీలు చేసి వాలంటీర్లు అనే సమాంతర వ్యవస్థను తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం. దానిపై సర్పంచులు న్యాయం పోరాటం చేస్తే జనసేన
వారికి అండగా నిలబడుతుంది.

విశాఖను దోపిడీ కేంద్రంగా మార్చిన వైసీపీ

వైసీపీ వచ్చాక విశాఖలో జరిగిన దోపిడీ మరెక్కడా జరగలేదు. నేను మరి మరీ ఎంతో మొత్తుకొని మరీ చెప్పాను. వైసీపీ ప్రభుత్వం వస్తే ప్రకృతి వనరులు మింగేస్తారని, కొండలను కొల్లగొడతారని చెవులకు ఇళ్లు కట్టుకొని మరీ చెప్పాను. నా మాట వినలేదు. వైసీపీ వచ్చిన తర్వాత విశాఖలో జరిగిన విధ్వంసం, దోపిడీ మరెక్కడా జరగలేదు. సముద్ర తీరానికి మణిహారంలాంటి రుషికొండను పూర్తిగా కొల్లగొట్టారు. శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లోనే కనిపించే ఎర్రమట్టి దిబ్బలను లేపేశారు. భూ అక్రమాలకు విశాఖను కేంద్రంగా చేసి, వేలాది ఎకరాలు మింగేయడానికి పన్నాగం పన్నుతూనే ఉన్నారు. ప్రశాంతతకు మారుపేరైన, మహిళల భద్రతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విశాఖను శాంతిభద్రతలకు విఘాత కేంద్రం చేశారు. ప్రకృతి అందాలకు నెలవైన విశాఖను భయం గుప్పటి బతికేలా మార్చారు.

ఆంధ్రా యూనివర్శిటీని జగన్ భ్రష్టు పట్టించాడు

సమాజానికి ఎంతో గొప్ప వ్యక్తులను అందించిన ఆంధ్ర యూనివర్సిటీని జగన్ భ్రష్టు పట్టించాడు. శ్రీ కట్టమంచి రామలింగా రెడ్డి, శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి మేధావులు ఉప కులపతులుగా ఆంధ్రా యూనివర్సిటీని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్లారు. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ర్యాంకింగ్స్ లో ఐదేళ్ల క్రితం 29వ స్థానంలో ఉన్న ఏయూ 76వ స్థానానికి పడిపోయింది. వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు ఇప్పటి వీసీ. వైసీపీ నాయకుల పుట్టిన రోజులను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. విద్యార్థులకు మందు, గంజాయ్ సులభంగా దొరుకుతోంది. వర్సిటీ భూములను ముక్కలుగా చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అధికారంలోకి వస్తే విద్యార్ధులకు అండగా ఉంటామని చెప్పి ఫీజులు పెంచేశారు. కీలకమైన డిపార్టుమెంట్లు తీసేశారు. ఖాళీగా ఉన్న ఆచార్యుల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేటికి దాదాపు వెయ్యి పోస్టులను ఖాళీగా ఉంచారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయించేలా చూడాలని కాలేజీ ప్రిన్సిపల్స్ కు వర్సిటీ వీసీ అడగడమేంటి? ఆయన పనిచేసేది విద్యార్థుల కోసమా? వైసీపీ నాయకుల కోసమా? వీసీ చర్యలపై కేంద్ర మానవ వనరుల శాఖకు ఫిర్యాదు చేస్తాం. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రయూనివర్సిటీని ప్రక్షాళన చేస్తాం.

ఓటమి తర్వాత రాజకీయ పునరుజ్జీవం పోసింది విశాఖ

2019లో గొప్ప ఆశయం కోసం ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టి, ఓటమిలో ఉన్న నాకు రాజకీయ పునరుజ్జీవం పోసింది విశాఖ నగరమే. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇసుక కొరత వల్ల తమ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని, తమ కోసం పోరాడేందుకు ముందుకు రావాలని భవన నిర్మాణ కార్మికులు ముగ్గురు మంగళగిరిలో నన్ను కలిసేందుకు వచ్చిన క్షణాలు నాకింకా గుర్తే. 32 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కన్నీరుమున్నీరయ్యారు. ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల కోసం నేను కదిలితే, నాకు లక్షలాదిగా ఎదురొచ్చి మద్దతు తెలియజేసింది విశాఖ నగరమే. మళ్లీ ప్రజల కోసమే నా పోరాటం అని తెలియజెప్పిన విశాఖ నగరం అంటే ఇప్పటికీ అమితమైన ఇష్టం. నన్ను గుండెల్లో పెట్టుకున్న ఇక్కడి ప్రజల చైతన్యం చాలా గొప్పది.

నాకు నటనలో పాఠాలు నేర్పి, మీ అందరికీ దగ్గర చేసిన విశాఖ నగరం నాకు అన్నం పెట్టిన నేల. జగదాంబ జంక్షన్ లో 25 ఏళ్ల క్రితం సుస్వాగతం సినిమా కోసం బస్సు మీద ఎక్కి డాన్స్ చేసినపుడు సిగ్గుతో ఉన్న నాకు, అదే జగదాంబ జంక్షన్ లో మళ్లీ లక్షలాది మంది జనం సాక్షిగా రాజకీయ ప్రసంగం ఇచ్చిన ప్రాంతం ఇది. ఉత్తరాంధ్ర మాండలీకం, సంస్కృతి మీద గౌరవం కలిగించిన విశాఖకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. విశాఖ నుంచి వైసీపీని పూర్తిగా విముక్తం చేసే వరకు మనం కలిసికట్టుగా పోరాడుతాం. మళ్లీ ప్రశాంత విశాఖను అంతే అందంగా సాధించుకుందాం.

ఏ ఫర్ ఆల్కహాల్… బీ ఫర్ బాంబ్.. సీ ఫర్ ఛీటింగ్

జగన్ మాట్లాడితే అమ్మఒడి అని అంటాడు. ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తామని చెప్పారు. తరువాత మాట మార్చి కుటుంబంలో ఒకరికే అని మెలిక పెట్టారు. ఇప్పుడు ఆ ఒక్కరికి ఇవ్వడానికి రకరకాల కారణాలతో అర్హులను జాబితా నుంచి తొలగిస్తున్నారు. ప్రచారం కోసం వేసిన అమ్మఒడి పోస్టర్ లో జగన్ పిల్లలతో ఏదో రాయిస్తున్నట్లు ఉంటుంది. రాష్ట్రంలో పరిస్థితి బట్టి ఆయన ఏ అంటే అల్కహాల్, బి అంటే బాంబ్, సి ఛీటింగ్ అని భవిష్యత్తు తరాలకు రాయిస్తున్నట్లు అనిపిస్తోంది. వైసీపీ హయాంలో దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు. 50 వేలు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాట్లాడితే మెగా డీఎస్సీ తీస్తామని గొప్పలు చెప్పే ఈ ప్రాంతం మంత్రి గారు నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు దానిని పూర్తి చేయలేక పోయారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం డబ్బులు విడుదల చేయని ఈ ప్రభుత్వం… బైజూస్ సంస్థకు మాత్రం రూ. 500 కోట్లు ఇస్తుంది.

విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు… రూ.25వేల కోట్లు అప్పు

కరెంటు బిల్లులతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. 8 రకాల అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు రూ. 253 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ. 513 పెరిగిపోయింది. వైసీపీకి ఓటు వేసిన పాపానికి చెత్త పన్ను కట్టాల్సి వస్తోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోల్ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి.. రూ. 25 వేల కోట్ల అప్పు తెచ్చుకునేందుకు వైజాగ్ నగరంలోని రూ. వేల కోట్ల విలువైన 128.70 ఎకరాల ప్రభుత్వ భూములు, భవనాలు, ఖాళీ స్థలాలను వివిధ బ్యాంకులకు తాకట్టు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను పెంచాల్సిన ముఖ్యమంత్రి …. వాటిని తాకట్టు పెట్టి వేలకోట్లు తీసుకొచ్చి దోచుకుంటున్నారు. ప్రకృతి వనరులు, ప్రజాధనం దోచుకుంటున్న ప్రతి వైసీపీ నాయకుడి చిట్టా కేంద్రం దగ్గర ఉంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరి బాగోతం బయటకు వస్తుంది. ప్రజాక్షేత్రంలో శిక్ష పడుతుంది.

పరిశ్రమల పేరు చెప్పి ఉత్తరాంధ్రను డంపింగ్ యార్డుగా మార్చేశారు. పారిశ్రామిక కాలుష్యంతో జీవితాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆడబిడ్డలకు గర్భ కోశ వ్యాధులు వస్తున్నాయి. పీల్చే గాలి కలుషితం అయిపోతే వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం ఉండదు. ప్రజాస్వామ్యంలో ఆలోచించి ఓటు వేయకపోతే మనమే నష్టపోతాం. విశాఖ సంఘ విద్రోహ శక్తులకు అడ్డగా మారిందని, ల్యాండ్, మైనింగ్, కల్తీ మందుల వ్యాపారం ఎక్కువైపోయాయని సాక్షాత్తూ దేశ హోంమంత్రి శ్రీ అమిత్ షా గారే చెప్పారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాన్ని బయటకు తీస్తాం. దోషులను ప్రజక్షేత్రంలో నిలబెట్టి తీరుతాం.

వ్యక్తికి కట్టుబడి పనిచేస్తున్నారు.

జగన్ కు పాలించమని అధికారం ఇస్తే ప్రజలను పీడిస్తున్నాడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలని మాటలు చెప్పి కీలకమైన పదవులను ఒకే కులంతో నింపేశాడు. పదవులన్ని ఒకే కులానికి కట్టబెడితే వాళ్లు రాజ్యాంగానికి కాకుండా వ్యక్తికి, కులానికి కట్టుబడి పనిచేస్తారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే కీలమైన పదవుల్లో అన్ని కులాలకు ప్రతినిధ్యం కల్పిస్తాం. చిన్న పాటి ప్రభుత్వం ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాలంటే పోలీసు కేసులు ఉన్నాయా? లేదా? అని చూస్తారు. జగన్ మీద 38 కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ప్రజలను, అవినీతి నిరోదక శాఖను నియంత్రిస్తున్నాడు. దోపిడీలు, దౌర్జన్యాలు, స్కాంలు చేసిన వారిని రాజ్యాధికారంలో కూర్చొబెట్టి తప్పు మనం చేశాం. రాష్ట్రం: కోసం బలిదానాలు చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి లాంటివారికి విగ్రహాలుపెట్టరుగానీ రాష్ట్రాన్ని దోచుకున్న వైఎస్సార్ లాంటివారికి ఊరూరా విగ్రహాలుపెట్టారు.

తెలంగాణ ప్రజల ఆక్రోశానికి జగన్ కూడా కారణం

తమ నేల, తమ ప్రాంతం, తమ ఉద్యోగాలు, తమ నీళ్లు, నిధులు కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్న అక్కడి యువత ఆవేశానికి జగన్ లాంటి వ్యక్తుల బహిరంగ దోపిడీ కూడా ఓ కారణమే. ప్రత్యక్షంగా జగన్ లాంటి వారి భూముల దోపిడీని చూసిన అక్కడి యువత, ఇలాంటి వారి వల్లే మనం వెనుకబడుతున్నాం.. మన వనరులు దోచుకుంటున్నారు అనే కోపంతో ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు. జగన్ లాంటి వారి దోపిడీని చూసి, ఆంధ్ర వ్యక్తులంతా దోపిడీదారులు అని అనుకోవడమే కాదు… అదే నినాదంగా ముందుకు వెళ్లారు. నేను మొదటి నుంచి జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని ఎందుకు చెబుతున్నాను అంటే.. తెలంగాణలో వీరు సాగించిన భూదందా, స్కాంలను చూసి విసిగిపోయాను. అదే పరిస్థితి ఆంధ్రాకు వస్తుందని భయపడ్డాను. నా భయం ఇప్పుడు ఆంధ్ర ప్రజలంతా ప్రత్యక్షంగా చూస్తున్నారు.. అనుభవిస్తున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో 5 సంవత్సరాలు చాలా కీలకం. ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం ఆలోచించకుండా మనం ఓటు వస్తే, 5 ఏళ్ల పాటు మన తలరాతల్ని రాసే అధికారం ఇచ్చినట్లే. అది ఎంతటి విపరిణామాలకు దారి తీస్తుందో, మనం ఎలా వెనుకబడతామో ఆంధ్ర ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలి.

ప్రకృతి వనరులు అనేవి జగన్ సొంత ఆస్తులు కావు.. అవి ఉమ్మడి ఆస్తులు. జగన్ తన సామ్రాజాన్ని పెంచుకునేందుకు దేనికైనా తెగిస్తాడు. ఆంధ్ర తన నేల అయినట్టు, ప్రజలంతా బానిసలుగానే అతడి ఆలోచనలు ఉంటాయి. పోలీసులు దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరినీ భయపెట్టి పాలన సాగించాలనే మనస్తత్వం ఉన్న వాడు జగన్. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయడం జగన్ కు తెలియని పని. నేను ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, హక్కుల కోసం పోరాడేవాడిని. 2014లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినా, తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో బయటకు వచ్చి టీడీపీని నిలదీశాను. శ్రీ నరేంద్ర మోదీ గారి వంటి పెద్దలతో సన్నిహిత పరిచయం ఉన్నప్పటికీ, ప్రత్యేక హోదా గురించి బీజేపీతోనూ విభేధించాను. నాకు ప్రజల సంక్షేమం మాత్రమే ప్రధాన ఏజెండా. వారి గురించి మాత్రమే నా ఆలోచన. ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెబుతున్నాను అంటే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే జరిగే దుష్పరిణామాలు మన ఊహకు కూడా అందని విధంగా ఉంటాయి. ఈ కారణంతోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెబుతున్నాను. మరోసారి వైసీపీ అధికారం చేపడితే ఆంధ్రాను ముక్కలుగా చేసి అమ్ముకుంటారు. ఇదీ అక్షర సత్యం” అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

గద్దర్ గళం నిప్పు రవ్వల సమర శంఖం